మత ప్రాతిపదికన దేశ విభజన, చరిత్రలోనే చీకటి అధ్యాయమని కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా అన్నారు. దానికి దేశం భారీ మూల్యమే చెల్లించాల్సి వచ్చిందన్న ఆయన.. 1947 నాటి భయానక అనుభవాలు ఎంతో మందిని ఇంకా వెంటాడుతూనే ఉన్నాయని చెప్పారు. దేశ విభజన సమయంలో ప్రాణాలు కోల్పోయిన వారికి అమిత్ షా నివాళులు అర్పించారు.
‘1947లో మతం ప్రాతిపదికన దేశాన్ని విభజించడం చరిత్రలోనే చీకటి అధ్యాయం. అప్పటి పరిణామాల వల్ల చెలరేగిన హింసలో లక్షల మంది ప్రాణాలు కోల్పోవడంతోపాటు కోట్ల మంది నిర్వాసితులుగా మారారు. దేశం భారీగా మూల్యం చెల్లించుకోవాల్సి వచ్చింది. నాటి భయానక అనుభవాలు ఇప్పటికీ వెంటాడుతూనే ఉన్నాయి. విభజన కారణంగా ప్రాణాలు కోల్పోయిన వారికి నివావాళులు అర్పిస్తున్నా’ అని కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా పేర్కొన్నారు. విభజన గాయాల సంస్మరణ దినం సందర్భంగా ఆయన ఢిల్లీలో మాట్లాడారు.