అంతర్జాతీయ మార్కెట్ల ప్రభావంతో ఇవాళ ఉదయం భారీ నష్టాలతో ప్రారంభమైన స్టాక్ మార్కెట్లు కోలుకున్నాయి. ఒక సమయంలో గరిష్ఠంగా 580 పాయింట్లు నష్టపోయిన సెన్సెక్స్ చివరకు 79 పాయింట్ల లాభంతో 65,401 పాయింట్ల వద్ద ముగిసింది. నిఫ్టీ 6.25 పాయింట్లు లాభపడి 19,434 వద్ద ముగిసింది. మధ్యాహ్నం వరకు నష్టాల్లో కదలాడిన సూచీలు ఆ తరవాత లాభాల బాట పట్టాయి. హిందుస్థాన్ యూనిలీవర్, రిలయన్స్ ఇండస్ట్రీస్ షేర్లు లాభాల్లో ట్రేడ్ అవ్వడంతో సూచీలు నష్టాల నుంచి కోలుకున్నాయి.
ఇక బ్యాకింగ్ షేర్లు నష్టాలను చవిచూశాయి. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, ఏషియన్ పెయింట్స్, మహీంద్రా అండ్ మహీంద్రా, వేదాంత, టాటా కన్సల్టెన్సీ, మారుతి, భారతి
ఎయిర్టెల్, ఇండస్ ఇండ్ బ్యాంక్, ఐసీఐసీఐ బ్యాంకు, బజాజ్ ఫైనాన్స్, యాక్సిస్ బ్యాంకు షేర్లు నష్టాలను చవిచూశాయి.
రిటైల్ ద్రవ్యోల్బణం ఆందోళన కలిగిస్తోందని ఆర్బీఐ ప్రకటించింది. 2022 మే నెల తరవాత మొదటిసారిగా జులై నెల రిటైల్ ద్రవ్యోల్బణం 7.44 శాతానికి చేరింది. నిత్యావసర వస్తువుల ధరలు భారీగా పెరగడంతో రిటైల్ ద్రవ్యోల్బణం ఏడాది కాలంలో గరిష్ఠ స్థాయికి ఎగబాకింది.