పబ్జీ ద్వారా పరిచయమైన భారతీయుడు సచిన్ మీనాతో కలసి జీవిస్తోన్న పాకిస్థాన్‌కు చెందిన సీమా హైదర్ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా జాతీయ జెండా ఎగురవేశారు. పాక్‌లోని సింధ్ ప్రావిన్స్‌కు చెందిన సీమా, నొయిడాలోని తన లాయర్ ఏపీ సింగ్‌తో కలసి హర్ ఘర్ తిరంగ వేడుకల్లో పొల్గాన్నారు. సీమాకు ఇటీవల బాలీవుడ్ మూవీలో నటించే అవకాశం వచ్చిన సంగతి తెలిసిందే. సీమా హైదర్ సినిమాల్లో నటిస్తే తీవ్ర చర్యలు ఉంటాయంటూ మహారాష్ట్రకు చెందిన నవనిర్మాణ సేన పార్టీ నేతలు హెచ్చరికలు జారీ చేసిన నేపథ్యంలో ఆమె స్పందించారు. సినిమాల్లో నటించడం లేదంటూ సీమాసచిన్ ప్రకటించారు.
నొయిడాలో త్రివర్ణ పతాకం ఎగురవేసిన సీమా సచిన్ భారత్ మాతాకీ జై, హిందూస్థాన్ జిందాబాద్ అంటూ నినాదాలు చేశారు. నొయిడాలోని రబుపురాలో నివాసం ఉంటోన్న సచిన్‌తో , పబ్జీ గేమ్ ఆడుతూ సీమా ప్రేమలో పడింది. సచిన్‌తో కలసి జీవించేందుకు పాకిస్థాన్‌లో తనకున్న కొద్దిపాటి భూమిని విక్రయించి, తన నలుగురు పిల్లలతో సహా నేపాల్ మీదుగా భారత్ చేరుకుంది. అప్పటి నుంచి సీమా సచిన్‌తో కలసి నొయిడాలో నివశిస్తోంది. సీమాను పాకిస్థాన్ గూఢచారిగా పంపిందనే ఆరోపణల నేపథ్యంలో ఉత్తరప్రదేశ్ యాంటీ టెర్రర్ స్క్వాడ్, ఇంటెలిజెన్స్ బ్యూరో దర్యాప్తు చేస్తున్నాయి. సీమా కదలికలపై కూడా నిఘా ఉంచినట్టు తెలుస్తోంది.