1947 ఆగష్టు 15న మన దేశానికి
స్వాతంత్య్రం వచ్చింది. అది సంతోషకర వార్తే. కాని మరోపక్క మనమంతా విని ఎరుగని ఒక
మహా విషాదం కూడా జరిగింది. ఒకవంక యావద్దేశం సంపూర్ణ ఉత్సాహోద్వేగంతో స్వాతంత్య్ర
భానూదయ సంబరాలను జరుపుకుంటుండగా పాకిస్తాన్ ఆక్రమిత సింధు, పంజాబ్, బెంగాల్‌లలోని ప్రతీ
వీధీ అగ్నిజ్వాలల్లో చిక్కుకుపోయింది. హిందువుల దుకాణాలు, ఇళ్ళు బహిరంగ లూటీకి
గురయ్యాయి. మన మాతృ మూర్తులు, అక్కచెల్లెళ్ళు వర్ణించనలవికాని అత్యాచారాలకు గురయ్యారు. ఆస్తిపాస్తులను
మాత్రమే గాక ప్రియతములను సైతం కోల్పోయి శోకభారంతో శరణార్థులు వెల్లువగా భారత
దేశానికి రాసాగారు. అంతులేని వారి బాధలు వర్ణనాతీతం.
ఏది ఏమైనా సరే ఈ
దేశాన్ని ముక్కలు కానిచ్చేది లేదంటూ సోదర దేశీయులకు ఎప్పుడూ భరోసా ఇస్తూ వచ్చిన
అప్పటి మన నాయకులు స్వాతంత్య్రం వల్ల లభించే సుఖాల కోసం ఆశపడి, భారతదేశ విభజనకు తలలు
ఆడించడంతో అలాంటి సంక్షోభం దేశానికి దాపురించింది. తమ బూటకపు హామీలతో మన నాయకులు
ప్రజలను భ్రమల్లో ఉంచారు. కనుకనే ప్రజానీకం దేశ విభజన వల్ల తలఎత్తే విషాద
పరిస్థితిని ఎదుర్కోడానికి ఏ మాత్రం సిద్ధం కాలేకపోయింది.
దేశం విభజనకు గురైంది.
నూతనంగా సృష్టించ బడిన పాకిస్తాన్లో హిందువుల దుకాణాలు, ఇళ్ళు, వ్యవసాయ క్షేత్రాలకు
మాత్రమే గాక వారి ప్రాణాలకే ముప్పు వచ్చింది.
ప్రకృతి వలనగాని, మానవుల వల్ల గాని ఈ
దేశానికి ఎదురైన ప్రతి సంక్షోభ సమయంలోను ఆదుకునేందుకు ఆర్.ఎస్.ఎస్.
స్వయంసేవకులెప్పుడూ తక్షణమే రంగంలోకి దిగుతూంటారు. దేశ విభజన సమయంలో జరిగిన విషాద
సంఘటనల సమయంలో కూడా స్వయంసేవకులు సమాజ రక్షణ కోసం, దేశ రక్షణ కోసం నిస్వార్థ సేవాభావంతో ముందుకు
కదిలారు. తమ ప్రాణాలను సైతం పణంగా పెట్టి ప్రజానీకాన్ని కష్టనష్టాల నుంచి
గట్టెక్కించే ప్రయత్నం ముమ్మరంగా చేశారు.
అన్నిటికంటె ముందుగా
హిందువులను సురక్షిత ప్రదేశాలకు తరలించి, వారి జీవనావసరాలు చూసి ఆ పైన వారు భారతదేశానికి
వచ్చిన మీదట పునరావాసం కల్పించాలి. స్వయంసేవకులు స్వీయప్రాణాల గురించి లెక్కచేయక ఈ
పనులన్నింటినీ ధైర్యసాహసాలతో దృఢవిశ్వాసంతో సాధించారు. హిందువుల సంరక్షణ కోసం
చేయవలసిందంతా చేశారు.
పంజాబ్
దోపిడీకి, విధ్వంసానికి గురై
పశ్చిమ పంజాబ్ నుంచి వస్తున్న శరణార్థులకు సాయపడటానికి ఒక కమిటీ ఏర్పాటయింది.
కమిటీలో కాంగ్రెస్ సభ్యులు, స్వయంసేవకులు కూడా ఉన్నారు. కాని ఇందులో మొదటి నుంచీ
సమస్యలు చెలరేగుతూ వచ్చాయి. కాంగ్రెసు సభ్యులు కేవలం ప్రకటనలు జారీ చేయడానికే
పరిమితం కావటం మాత్రమేగాక బాధితులకు ధనరూపేణ, వస్తురూపేణ అందినవాటిని సిగ్గులేకుండా స్వాహా
చేస్తుండేవారు. స్వయంసేవకులు నిశ్చితబుద్ధితో, విశ్వసనీయతతో తమ కర్తవ్యాలు నిర్వర్తించారు.
అయినప్పటికీ స్వయంసేవకులు అందిస్తున్న నిస్వార్థ సేవలకు కాంగ్రెసు వారు అవరోధాలు
కల్పిస్తుండేవారు. దానితో స్వయం సేవకులు ‘పంజాబ్ సహాయ సమితి’ని ఏర్పాటుచేసి
వేరుగా పనిచేయసాగారు.
దిక్కులేనివారైన
శరణార్థులు తమ విలువైన ఆస్తిపాస్తులన్నీ వదులుకొని ఇళ్లు వదిలి రావలసి వచ్చినందున
వారిని అనేక విధాలుగా ఆదుకోవలసి ఉంది. వారిలో అత్యధికులు కట్టుబట్టలతో కొంపగోడు
వదలివేసి వచ్చినవారు. సంఘం ఇచ్చిన పిలుపుతో సిక్కులందరు సహాయ కార్యక్రమాలకు అన్ని
విధాలా చేయూతనిచ్చారు. స్వయంసేవకులు ఎక్కడకు వెళ్ళినా ఆశించిన దానికంటే ఎక్కువ
సహకారమే లభించింది. ప్రజలు నూతన వస్త్రాలందించారు. సంఘం నిర్వహించిన సహాయ
శిబిరాల్లో దుస్తులకు, మందులకు, ఆహారధాన్యాలకు కొరత
అనేది లేదు. స్వయంసేవకులు సహాయం కోరుతూ ఒక దుప్పటిని జోలెగా పట్టుకు వెళ్తే
కొద్దిసేపట్లోనే ప్రజలు అందించిన డబ్బుతో అది నిండిపోతుండేది. స్వయం సేవకులకు తాము
ఇచ్చే విరాళాలు ఏ మాత్రం దుర్వినియోగం కాకుండా చేరవలసినవారికి చేరుతాయనే పరిపూర్ణ
విశ్వాసం ప్రజల్లో ఉన్నందువల్లనే ఇంతటి ఉధృతమైన మద్దతు లభించింది.
మొదట్లో సంఘ కార్యాలయం
లాహోర్ ప్రాంతంలో రతన్‌బాగ్‌లోని దివాన్ కృష్ణ కిశోర్ ఠాకూర్‌గారి భవంతిలో
ప్రారంభమైంది. స్టేషన్‌కు ఎదురుగా ఒకటి, అరోరా వంశ్ హాల్లో మరొకటి – రెండు సహాయ శిబిరాలు
నెలకొల్పారు. పని పెరిగిపోవడంతో మాంట్‌గోమరీ రోడ్డులోని డా|| గోపీచంద్ నారంగ్‌గారి
భవంతికి కార్యాలయాన్ని మార్చారు. ఆ భవంతిలో ఒక పెద్ద నేలమాళిగ ఉండేది. ఆది
సహాయార్థం వచ్చిన సామగ్రితో నిండిపోయి వుండేది. అవసరాలు అనేక రెట్లు పెరిగిపోవడంతో
క్రమంగా కమిటీ పరిధి కూడా పెరిగింది. ఇళ్లు కోల్పోయినవారికి పునరావాసంతో బాటు
కమిటీ మరెన్నో పనులు చేపట్టవలసి వచ్చింది. ఉదాహరణకు అల్లర్లు జరిగేటపుడు పిల్లలను, మహిళలను, వృద్ధులను, సురక్షిత ప్రదేశాలకు
తోడ్కొనిపోవాలి; అల్లర్ల
మధ్య హిందువులను రక్షించాలి; దాడులకు పాల్పడేవారిపై తగినవిధంగా ఎదరుదెబ్బ తీయాలి; గాయపడినవారిని
ఆసుపత్రులకు తీసుకువెళ్ళి చికిత్సకు ఏర్పాట్లు చేయాలి. అంత్యక్రియలకు, మంటలు, ఆర్పడానికి, సైన్యం సాయంతో మహిళలను
కాపాడటానికి ఏర్పాట్లు చేయాలి. ఇళ్ళు కోల్పోయి ఊళ్ళు వదలి వచ్చిన వారు నలుమూలల
నుండి వస్తూండటంతో శరణార్థుల సంఖ్య రోజురోజుకు పెరిగిపోతూ వచ్చింది. త్వరలోనే
కమిటీ శాఖలు పట్టణాల్లో, గ్రామాల్లో
వెలిశాయి. లాహోరులో మాదిరిగానే కమిటీకి ప్రతిచోటా చక్కని మద్దతు లభించింది.
పాకిస్తాన్
ఏర్పడటానికి ముందు పంజాబ్ సహాయ సమితి ప్రజా సహకారంతో డి.ఏ.వి. శిబిరం విషయం
చూస్తుండేది. కాని పాకిస్తాన్ ఏర్పడిన తర్వాత భారత ప్రభుత్వమే ఆ శిబిర బాధ్యతను
స్వీకరించింది. అప్పటి నుంచి సమితిలో జీతాలతో పనిచేసేవారే అత్యధికంగా వున్నారు.
అయినా 100
మంది స్వయంసేవకులు సేవలు అందించారు. అల్లర్లు చెలరేగిన ప్రాంతాల్లో చిక్కుకుపోయిన
హిందువులను, అపహరించబడిన
స్త్రీలను వెనక్కు తీసుకువచ్చే బాధ్యత వీరిదే.
కాంగ్రెసువారి కమిటీ
అమృతసర్‌లో ఒక శరణార్థుల శిబిరాన్ని నెలకొల్పింది.కాని కమిటీవారి తీరుకు
విసుగుచెందిన ప్రజానీకం వారి ముఖాలు చూడదలుచు కోలేదు. స్వయంసేవకులు లాహోరులో
మాదిరిగానే ఇతర చోట్ల కూడా నిర్వాసితుల కోసం సహాయ శిబిరాలను ప్రారంభించారు. డేరా
బాబానానక్‌లో 5,000
మందికి, మాధవపూర్‌లో
10,000 మందికి, సుజన్‌పూర్‌లో 3,500 మందికి, గురుదాస్‌పూర్‌లో 4,000 మందికి, బటాలాలో 7,000 మందికి, ధర్మవాల్‌లో 1000 మందికి ఏర్పాట్లు
చేశారు. అబోహర్లో 65,000
మందికి 15
రోజులపాటు భోజనం పెట్టడంతోపాటు 25,000 మందికి వంటపాత్ర లిచ్చారు.
స్వయంసేవకుల ఆదర్శం
త్రొక్కిసలాటలు
జరగకుండా చూడాలని, ప్రశాంతంగా
ఉంటూ ప్రజల మనస్థైర్యాన్ని పెంపొందించాలని స్వయంసేవకులకు సూచనలున్నాయి. ఈ విషయంలో
వారు చేయగలిగినదంతా చేసినా ప్రజలు భయంతో అమృతసర్ వంటి ప్రదేశాలకు హడావిడిగా
వెళ్ళిపోవలసిన పరిస్థితులు వచ్చాయి. అయినప్పటికీ స్వయంసేవకులు తమ హృదయంలో
నిలుపుకున్న ఆదర్శాల కనుగుణంగా ప్రేరణదాయక మైన ఉదాహరణలుగా నిలిచారు. తమ
ఆస్తిపాస్తులు మూటగట్టుకొని తూర్పు పంజాబ్‌కో లేక ఢిల్లీకో వెళ్ళిపోవటానికి కావలసినన్ని
అవకాశాలు వారికున్నాయి. కాని స్వయంసేవకులు, వారి కుటుంబ సభ్యులు అలాంటి పలాయనవాద మార్గాన్ని
స్వీకరించలేదు.
భాయి పరమానంద్ ఒక
ప్రసిద్ధ హిందూ నాయకుడు. ఆయన కుమారుడు మహావీర్ లాహోర్‌లో చైతన్యశీలురైన, కష్టించి పనిచేసే
కార్యకర్తల్లో ఒకరు. ముంచుకు వస్తున్న సంక్షోభం దృష్ట్యా పరమానందగారి ఉద్యోగుల్లో
ఒకాయన వారి మేనత్తతో ‘మీ విలువైన వస్తువులన్నీ నాకు అందజేయండి. వాటిని నేను
సురక్షితంగా లూథియానాకు చేరుస్తాను. ఒకవేళ మీరు లాహోరు విడిచి రావలసిన అవసరం
లేకుంటే మీ వస్తువులన్నీ మీకు తిరిగి వస్తాయి’ అని చెప్పాడు. ఆమె తమ ఇంటిలోని
వస్తువులనన్నింటినీ రెండు ట్రక్కులలో నింపింది. ఈ విషయం పరమానంద్‌కు తెలియగానే
‘ఎవరినీ లాహోరు వదిలి వెళ్ళవద్దని మనం నచ్చచెబుతున్నాం. అలాంటి మనమే మన
వస్తుసామాగ్రి అంతా వెంటేసుకొనిపోతే ప్రజల మన స్థైర్యం చెదిరిపోయి అయోమయానికి
దారితీస్తుంది’ అంటూ వ్యతిరేకించాడు. ఆయన ట్రక్కులను వెళ్ళిపోనివ్వలేదు. ఫలితంగా
దేశవిభజన తదుపరి ఆయన లాహోరు విడిచి రావలసినపుడు వట్టి చేతులతోనే రావలసి వచ్చింది.
ఇలాంటి ఉదాహరణలు చాలా ఉన్నాయి.
వీర సోదరులు
19474 ఆగష్టు 17న సరిహద్దు గుర్తింపు
కమిషన్ ఝాంగ్ పట్టణం పాకిస్తాన్‌కు వెళుతుందని ప్రకటించగానే షాహ్‌జెవానా
పట్టణానికి చెందిన బలవంతులైన ముస్లింలీగ్ నాయకులు సయ్యద్ హుసేన్, అబీద్ హుస్సేన్
ప్రోద్బలంతో పరిసర ప్రాంతాలలోని ముస్లింలు ఝాంగ్ మీద దాడిచేశారు. సంఘానికి ఝాంగ్లో
బలమైన శాఖ ఉండేది. అందులో అంకితభావం గల ఇద్దరు కార్యకర్తలు కిషన్‌చంద్ నారంగ్, బాలకృష్ణ నారంగ్ ఆ
దాడి ప్రారంభ బిందువైన నూర్‌షాగేట్‌కు సమీపంలో ఉండేవారు. ఆ ప్రదేశం దగ్గర-ముస్లిం
రౌడీ మూకలను అదుపు చేయకుంటే పట్టణంలోని వేలాదిమంది హిందువులు పాశవికంగా నరమేధానికి
బలి అవుతారని ఆ సోదరులిద్దరూ భావించారు.
ముందుకు పోవాలంటే వారి
ఇంటి ఎదురుగా వున్న ఇరుకు సందులో నుంచి వెళ్ళాలి. వారిద్దరూ ఖడ్గహస్తులై రౌడీలను
ఎదుర్కొన్నారు. దాడి చేయటానికి వచ్చినవారు ఇంత తీవ్రమైన ప్రతిఘటన వస్తుందని
ఊహించలేదు. వారు ఆ సోదరుల ఇంటికి నిప్పు అంటించి వారి స్త్రీలను హింసించసాగారు.
అయినా ఆ సోదరులు పోరాటం సాగిస్తూనే ఉన్నారు. కొంతసేపటికి శత్రువుల చేతిలోని ఖడ్గం
బాలకృష్ణ చేతిని నరికింది. కాని అతను ఏ మాత్రం వెనక్కు తగ్గలేదు. తమ చివరిశ్వాస
వరకు ఆ సోదరులిద్దరూ రౌడీలను నగరంలోకి అడుగు పెట్టనివ్వలేదు. వారు ముందుగా తమ
కుటుంబాలను రక్షించుకునే విషయం ఆలోచించి ఉండవచ్చు, కాని నగర ప్రజల కోసం తమ ప్రాణాలను బలిపెట్టారు. వారి
త్యాగం వల్ల వేలాదిమంది హిందువులు సురక్షిత ప్రాంతాలకు పయనించగలిగారు.
ప్రజల విశ్వాసం
ఉన్మాద మూకలు అప్పటికే
ప్రజల జీవితాలను నరకప్రాయంగా చేశారు. ఆలయాలను, గురుద్వారాలను అగ్నికి ఆహుతి చేయడం వారికొక వికృతమైన
అలవాటైంది. సిక్కులకు వారు పరమ శత్రువులయ్యారు. తామింక ముల్తాన్‌లో ఉండటం
అసాధ్యమని గ్రహించిన సిక్కులు చాలామంది తమ పవిత్ర గ్రంథం గురుగ్రంథ సాహబ్‌ను
తీసుకొని సంఘ కార్యాలయానికి వచ్చారు. అనంతర కాలంలో శాసనసభ్యుడైన కృష్ణలాల్ శర్మ
అక్కడ ప్రచారక్‌గా ఉన్నారు. తాము ముల్తాన్ వీడివెళ్ళవలసిన అగత్యం ఏర్పడినందున తమవారసత్వ గ్రంథాన్ని
భద్రంగా ఉంచవలసిందిగా సిక్కులు సంఘ అధికారులను అభ్యర్థించారు. స్వయంసేవకుల సమర్పణ
భావం పట్ల ప్రజలకున్న విశ్వాసం అలాంటిది.
గురుదాస్‌పూర్
పరిరక్షణ
గురుదాస్‌పూర్ జిల్లా
పాకిస్తాన్లో భాగమవు తుందనే విషయం దాదాపుగా ఖాయమైంది. అదే జరిగితే కాశ్మీర్‌ను
భారత్‌తో అనుసంధానించే ప్రదేశమంటూ ఉండక కాశ్మీర్‌తో భారత్‌కు నేరుగా ఉన్న సంబంధం
పోయినట్లే. ఆగష్టు 15
దాకా గురుదాస్‌పూర్‌లో భారత్, పాకిస్తాన్ జెండాలు రెండూ ఎగురుతుండేవి. ముస్లింలకు
ఎక్కడలేని ధైర్యం వచ్చేసింది. హిందువుల్లో నిరుత్సాహం ప్రబలింది. ఆ రోజుల్లో రేషన్‌కార్డులమీద
‘హిందూ’ లేక ‘ముస్లిం’ అనే పదంతోపాటు కుటుంబ సభ్యుల వివరాలు రాసి వుండేవి.
స్వయంసేవకులు ఒక పథకం వేసుకొని ఫుడ్ ఇన్స్పెక్టర్ల వేషంలో ఇంటింటికీ వెళ్ళి
రేషన్ కార్డులు పరిశీలించారు. వారు అవసరమైన సమాచారం సేకరించి సరిహద్దు గుర్తింపు
కమీషన్‌కు పంపి వారి నిర్ణయం మార్చుకునేలా చేశారు. అలా సేకరించిన సమాచారం వల్ల
హిందూ ప్రాబల్యం కలిగిన గురుదాస్‌పూర్ పాకిస్తాన్లో భాగం కాకుండా రక్షించబడింది.
హిందువుల ఊచకోత ఆగిపోయింది.
– శ్రీధర్ పరాద్కర్, భారతీయ సాహిత్య పరిషత్
జాతీయ సంఘటనా కార్యదర్శి, (జాగృతి
సౌజన్యంతో)