ఉత్తరాఖండ్ రాష్ట్రాన్ని వరదలు మరోసారి ముంచెత్తాయి. పది రోజులుగా అక్కడ కురుస్తోన్న భారీ వర్షాలకు నదులు పొంగిప్రవహిస్తున్నాయి. జనజీవనం అస్తవ్యస్తమైంది. రవాణా స్థంభించిపోయింది. అనేక ప్రాంతాల్లో కొండ చరియలు విరిగి పడటంతో జాతీయ రహదారులపై కూడా రవాణా నిలిచిపోయింది. చార్ధామ్ వెళ్లే మార్గాల్లో కొండచరియలు విరిగి పడటంతో దారులు మూసుకుపోయాయి. రెండు రోజుల పాటు అంటే ఆగష్టు 14, 15వ తేదీల్లో చార్ధామ్ యాత్ర నిలిపివేస్తున్నట్టు అధికారులు ప్రకటించారు. ఆరు జిల్లాల్లో అత్యంత భారీ వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ రెడ్ అలర్ట్ జారీ చేసింది. డెహ్రాడూన్, పౌరి, టెహ్రి, నైనిటాల్, చంపావత్, ఉధంసింగ్‌నగర్ జిల్లాల్లో అతి భారీ వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది.
ఉత్తరాఖండ్‌లో ఈ ఏడాది వరదల కారణంగా ఇప్పటికే 60 మంది మరణించారు. 17 మంది గల్లంతయ్యారు. రుద్రప్రయాగ్, దేవ్‌ప్రయాగ్, గంగా, మందాకిని, అలక్‌నంద నదులు ప్రమాదకరస్థాయిని దాటి ప్రవహిస్తున్నాయి. రాష్ట్రంలో అనేక చోట్ల కొండ చరియలు విరిగి పడటంతో జాతీయ రహదారులపై కూడా రవాణా నిలిచిపోయింది.