బంగ్లాదేశ్ నుంచి భారత్లోకి అక్రమంగా చొరబడిన మరో 12మంది బంగ్లాదేశీయులను ఆదివారం (ఆగస్టు 4న) అరెస్ట్ చేసారు. పశ్చిమ త్రిపుర జిల్లాలోకి అక్రమంగా చొరబడిన ఆ 12మందిలో ముగ్గురు మహిళలు కూడా ఉన్నారు.
త్రిపుర రాజధాని అగర్తలాకు కొద్దిదూరంలోని లంకమురా, షన్మురా ప్రాంతాలు బంగ్లాదేశ్ సరిహద్దుకు దగ్గరే ఉన్నాయి. ఆ అంతర్జాతీయ సరిహద్దు సమీపంలోనే చొరబాటుదార్లు పట్టుబడ్డారు. వారిని స్థానిక న్యాయస్థానంలో ప్రవేశపెట్టారు. కోర్టు వారికి పోలీస్ కస్టడీ విధించింది. తదుపరి దర్యాప్తు కోసం వారిని కస్టడీలోకి తీసుకున్నట్లు వెస్ట్ అగర్తలా పోలీస్ స్టేషన్ ఇనస్పెక్టర్ ఎస్కె బర్ధన్ వెల్లడించారు.
అంతకు ఒకరోజు ముందే అంటే ఆగస్టు 3న అగర్తలా రైల్వేస్టేషన్ దగ్గర ఆరుగురు బంగ్లాదేశీయులు, ఇద్దరు భారతీయ దళారీలను పోలీసులు అరెస్ట్ చేసారు. వారు కోల్కతా, చెన్నై నగరాలకు వెళ్ళడానికి వేర్వేరు రైళ్ళు ఎక్కడానికి రైల్వే స్టేషన్లో ఉండగా పట్టుబడ్డారు. ఆ మరుసటిరోజే మరో డజను మంది దొరికారు.
గత రెండు నెలల్లో భారతదేశంలోకి అక్రమంగా చొరబడడానికి ప్రయత్నిస్తున్న 200మందికి పైగా బంగ్లాదేశీయులు, 32మంది రోహింగ్యాలను త్రిపురలో పట్టుకున్నారు. అగర్తలా రైల్వేస్టేషన్, చంద్రాపూర్ ఇంటర్-స్టేట్ బస్ టెర్మినస్, మహారాజా వీర్ విక్రమ్ ఎయిర్పోర్ట్ తదితర ప్రదేశాల్లో గవర్నమెంట్ రైల్వే పోలీస్, బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్, స్థానిక పోలీసులు వీరిని బంధించారు.