లవ్ జిహాద్ కేసుల్లో నేరస్తులుగా నిరూపణ అయినవారికి విధించే శిక్షలను కఠినతరం చేయాలని అస్సాం ప్రభుత్వం నిర్ణయించింది. యావజ్జీవ కారాగార శిక్ష వరకూ శిక్షలను పెంచేందుకు రాష్ట్ర శాసనసభలో చట్టం చేస్తామని ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మ పేర్కొన్నారు.
ఎక్స్ సామాజిక మాధ్యమంలో వరుస ట్వీట్ల ద్వారా అస్సాం ముఖ్యమంత్రి ఆదివారం సాయంత్రం పలు విషయాలు చెప్పుకొచ్చారు. ‘‘లాండ్ జిహాద్, లవ్ జిహాద్‌లను నియంత్రించడానికి అస్సాం ప్రభుత్వం రెండు చట్టాలు చేస్తుంది. ఒక ముస్లిం వ్యక్తి తోటి హిందువు భూమిని, లేక ఒక హిందూవ్యక్తి తోటి ముస్లిం భూమిని కొనాలని భావిస్తే ఆ వ్యక్తి ప్రభుత్వం అనుమతి తీసుకోవాలి…. లవ్ జిహాద్‌ను అనుసరించి అమలు చేసేవారికి జీవితాంతం జైలుశిక్షే’’ అని హిమంత బిశ్వ శర్మ స్పష్టం చేసారు.
లవ్ జిహాద్ కేసులను విచారించి ఒక స్టాండింగ్ ఆపరేటింగ్ ప్రొసీజర్ (ఎస్ఒపి – సాప్)ను అభివృద్ధి చేయాలని హిమంత ఆదేశించారు. హిందూ యువతులను మోసంచేసి ప్రేమముగ్గులోకి దించడం, తర్వాత బలవంతంగా మతం మారుస్తున్న సంఘటనలు రోజురోజుకూ పెరుగుతున్నాయని ఆవేదన వ్యక్తం చేసారు.
అలాగే ల్యాండ్ జిహాద్‌ను కట్టడి చేయడం కూడా తమ ప్రభుత్వం ప్రదాన విధి అని హిమంత చెప్పారు. వేర్వేరు మతాలకు చెందిన వ్యక్తుల భూమి అమ్మకాలు లేదా కొనుగోళ్ళ వ్యవహారాలకు ప్రభుత్వ అనుమతిని తప్పనిసరి చేస్తామని హిమంత చెప్పుకొచ్చారు. జనాభా సమస్య గురించి కూడా సీఎం ఆందోళన వ్యక్తం చేసారు. అస్సాంలో స్థానిక దేశీయ తెగల వారి జనాభాను రక్షించాల్సిన అవసరం ఉందన్నారు.
‘‘తేయాకు తోటల కాలనీ భూముల మీద హక్కులను తేయాకు తోటల కార్మికులకు ఇస్తాం. ప్రభుత్వోద్యోగాల్లో అస్సాంలో పుట్టినవారిని మాత్రమే నియమించేలా డొమిసైల్ పాలసీ తీసుకొస్తాం’’ అని హిమంత చెప్పుకొచ్చారు.
జగన్‌రెడ్డి ఏపీ పరువు తీశాడు : షర్మిల…ప్రభాస్ ఎవరో నాకు తెలియదు