వ్యవస్థల మధ్య సమన్వయం సరిగా లేక, సమాచారం సరిగా అందక, ఓ కేసు కోర్టులో అదనంగా ఆరేళ్ళ పాటు సాగిన కథ ఇది. కింది కోర్టు తీర్పుతో జైల్లో శిక్ష అనుభవిస్తున్న వ్యక్తి, నిర్దోషి అని పైకోర్టులో తేలింది. అప్పటికి ఆరేళ్ళ క్రితమే ఆ వ్యక్తి జైల్లో చనిపోయిన సంగతి, పైకోర్టు తీర్పు తర్వాత బైటపడింది.
తెలంగాణ సిద్దిపేట జిల్లా దుబ్బాక మండలం పెద్దగుండవెల్లి గ్రామానికి చెందిన గుండెల పోచయ్య, తన తల్లిని చంపాడన్న నేరానికి 2013 ఫిబ్రవరి 1న అరెస్ట్ అయ్యాడు. సిద్దిపేట న్యాయస్థానం అతనికి 2015 జనవరి 12న యావజ్జీవ కారాగార శిక్ష విధించింది. పోచయ్యను చర్లపల్లి జైలుకు తరలించారు.
కొన్నాళ్ళకు పోచయ్య చిన్నకొడుకు తన తండ్రి నిర్దోషి అంటూ తెలంగాణ హైకోర్టులో అప్పీలు దాఖలు చేసారు. అప్పటినుంచీ కేసు విచారణ నడుస్తోంది. బెయిల్ కోసం ప్రయత్నించినా రాలేదు. ఎట్టకేలకు 2024 జులై 25న హైకోర్టు అతన్ని నిర్దోషిగా ప్రకటించి, జైలు నుంచి విడుదల చేయాలని ఆదేశించింది.
అప్పుడే అసలు విషయం బైటపడింది. పోచయ్య చర్లపల్లి ఓపెన్ జైలులో ఉన్నప్పుడే 2018 ఆగస్టు 15న సుస్తీ చేసింది. అతన్ని గాంధీ ఆస్పత్రికి తరలించారు. ఆగస్టు 16న పోచయ్య కుటుంబసభ్యులు జైలుకు వెళ్ళారు. అప్పటికే ఆయన మరణించాడని జైలు అధికారులు తెలియజేసారు.
సాధారణంగా జైల్లో ఎవరైనా ఖైదీ చనిపోతే ఆ విషయాన్ని న్యాయస్థానానికి తెలియజేస్తారు. ఖైదీ అప్పీలు ఏదైనా పెండింగ్లో ఉంటే అతని మృతి విషయాన్ని హైకోర్టుకు తెలియజేయాలి. అప్పుడు హైకోర్టు ఆ కేసు మూసివేస్తుంది, పోచయ్య విషయంలో అలా జరగలేదు. అతని మరణానంతరం కుటుంబసభ్యులు కేసు గురించి పట్టించుకోవడం మానేసారు. కొన్నాళ్ళకే వారిచ తరఫు న్యాయవాదీ చనిపోయారు. దాంతో హైకోర్టు పీపీ కార్యాలయానికి ఆయన మృతి గురించి ఏ వార్తా తెలియలేదు. దాంతో కేసు కొనసాగింది. తీర్పు వచ్చాకే అసలు విషయం బైటపడింది.
జైల్లో మరణించిన ఖైదీల కేసుల వివరాలు జైలు అధికారుల /దగ్గర కూడా ఉంటాయి. కాబట్టి వారు ఖైదీ మరణించిన సమాచారాన్ని పీపీ కార్యాలయానికి తెలియజేయవచ్చు. అలాంటప్పుడు ఇటువంటి పొరపాట్లకు ఆస్కారముండదని నిపుణులు సూచిస్తున్నారు.