Sunday, April 14, 2024

Logo
Loading...
upload upload upload

international news

ఆలస్యంగా వెలుగు చూసిన ఉగ్రవాది హర్‌ప్రీత్ నిజ్జర్ హత్య వీడియో

కెనడాలో హత్యకు గురైన ఉగ్రవాది హర్‌ప్రీత్ నిజ్జర్‌ వీడియో ఒకటి తాజాగా వెలుగు చూసింది. కొందరు దుండగులు ఆయన్ని కాల్చి చంపడం ఆ వీడియోలో కనిపించింది. ఈ విషయాన్ని కెనడాకు చెందిన సీబీసీ న్యూస్ ఛానల్ వెలుగులోకి తీసుకురావడం సంచలనంగా మారింది.జాతీయ దర్యాప్తు సంస్థ నిజ్జర్‌ను 2020లో ఉగ్రవాదిగా ప్రకటించింది.తరువాత నిజ్జర్ దేశం వదిలి కెనడాకు పారిపోయాడు. గత ఏడాది జూన్ 18న కెనడాలోని ఓ గురుద్వారా వద్ద దుండగులు జరిపిన కాల్పుల్లో నిజ్జర్ చనిపోయిన సంగతి తెలిసిందే.


రెండు వాహనాల్లో వచ్చిన ఆరుగురు దుండగులు నిజ్జర్‌పై అతి సమీపం నుంచి కాల్పులు జరిపినట్లు వీడియో ద్వారా తెలుస్తోందని సీబీసీ న్యూస్ ప్రసారం చేసింది. ఈ హత్య పక్కా ప్రణాళిక ప్రకారం జరిపినట్లు ఉందంటూ సీబీసీ ప్రసారం చేసింది. గురుద్వారా పార్కింగ్ ప్రదేశం నుంచి వెళుతోన్న నిజ్జర్‌పై ఆరుగురు దుండగుల్లో ఇద్దరు అతి సమీపం నుంచి కాల్పులు జరిపినట్లు వీడియోలో స్పష్టంగా కనిపించింది. ఆ తరువాత వారు ఓ వాహనంలో పరారయ్యారు. అక్కడే పక్కనే మరో ఇద్దరు సాకర్ ఆడుతూ వీడియోలో కనిపించారు.నిజ్జర్ హత్య వెనుక భారత హస్తముందని కెనడా ప్రధాని ట్రూడో చేసి వ్యాఖ్యలు పెద్ద దుమారం రేపిన సంగతి తెలిసిందే. ట్రూడో ఆరోపణలను భారత్ తీవ్రంగా ఖండించింది. నిజ్జర్ హత్య తరవాత ఇరు దేశాల మధ్య దౌత్య సంబంధాలు కూడా దారుణంగా దెబ్బతిన్నాయి.

K Venkateswara Rao | 10:15 AM, Sat Mar 09, 2024

రష్యా యుద్ధంలోకి భారతీయులు : జాగ్రత్తగా ఉండాలని కేంద్రం హెచ్చరిక

రష్యా ఉక్రెయిన్ మధ్య జరుగుతోన్న యుద్ధంలోకి వంద మందికిపైగా భారత్‌కు చెందిన యువకులను అక్రమంగా తరలించారనే వార్తలు సంచలనంగా మారాయి. రష్యాలో యుద్ధం చేసే సైనికులకు సహాయకులుగా ఉండేందుకు కొందరు భారతీయ యువకులు సంతకాలు చేశారని విదేశాంగ శాఖ ప్రతినిధి రణధీర్ జైస్వాల్ తెలిపారు. దీనిపై రష్యాతో సంప్రదింపులు జరుపుతున్నట్లు ఆయన చెప్పారు. అక్కడ పనిచేస్తున్న వారిని విడిపించే ప్రయత్నాలు ప్రారంభించినట్లు జైస్వాల్ స్పష్టం చేశారు.ఎంఐఎం ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ కూడా ఇదే అంశాన్ని విదేశాంగ వ్యవహారాల శాఖ అధికారుల దృష్టికి తీసుకెళ్లారు. 12 మంది యువకులు దళారుల మాటలు నమ్మి రష్యా వెళ్లారని ఆయన బుధవారం మీడియాకు తెలిపారు. తెలంగాణ నుంచి ఇద్దరు, కర్ణాటక, గుజరాత్, కశ్మీర్, యూపీల నుంచి మరికొందరున్నారని ఓవైసీ ఆందోళన వ్యక్తం చేశారు.


బాధిత కుటుంబాలకు చెందిన వారు విషయం చెప్పడంతో విదేంశాఖ శాఖ మంత్రి జైశంకర్‌కు లేఖ రాసినట్లు చెప్పారు. కేంద్రం చొరప చూపి బాధితులను స్వస్థలాలకు తీసుకురావాలన్నారు. జాతీయ మీడియా కూడా రష్యాకు భారత యువకుల అక్రమ రవాణాపై కథనాలు ప్రచురించాయి. ఇప్పటికే కొందరు భారతీయ యువకులు యుద్ధంలో గాయపడినట్లు వార్తలు వస్తున్నాయి. నేపాల్ నుంచి కూడా అక్రమంగా 200 మంది రష్యాకు వెళ్లారనే సమాచారం సంచలనంగా మారింది.

K Venkateswara Rao | 16:56 PM, Fri Feb 23, 2024

గాజాపై ఇజ్రాయెల్ భీకర దాడులు : 29 వేలు దాటిన మృతులు

హమాస్ తీవ్రవాదులను పూర్తిగా తుడిచివేసేందుకు ఇజ్రాయెల్ సైన్యం భీకరదాడులు (hamas israel war) కొనసాగిస్తోంది. సోమవారం ఒక్క రోజే 107 మంది చనిపోయారు. గత ఏడాది అక్టోబరు 7న హమాస్ ఉగ్రవాదులు ఇజ్రాయెల్‌పై మెరుపుదాడికి దిగినప్పటి నుంచి నేటి వరకు జరిగిన పోరులో మొత్తం 29092 మంది చనిపోయారు. 69 వేల మందికిపైగా గాయపడ్డారు. పది వేల మంది హమాస్ ఉగ్రవాదులను హతమార్చామని ఇజ్రాయెల్ ప్రకటించింది. 236 మంది సైనికులు ప్రాణాలు కోల్పోయారని ఐడీఎఫ్ తెలిపింది.మరోవైపు ఎర్రసముద్రంలో హౌతీలు రెచ్చిపోతున్నారు. తాజాగా సరకు రవాణా నౌకపై దాడికి దిగడంతో అందులోని సిబ్బంది పరారయ్యారు. బాబ్ ఎల్ మండేప్ ప్రాంతంలో సరకు రవాణా నౌకపై దాడి చేయడంతో తీవ్ర నష్టం వాటిల్లింది. గల్ఫ్ ఆఫ్ ఎడెన్‌లోనూ మరో నౌకపై హౌతీలు దాడిచేశారు.హౌతీ దాడులను అమెరికా తీవ్రంగా ఖండించింది. ప్రతిదాడులుంటాయని హెచ్చరించింది.

K Venkateswara Rao | 10:54 AM, Tue Feb 20, 2024

భారీ అవినీతిలో అమెరికా మాజీ అధ్యక్షుడు ట్రంప్

అమెరికా మాజీ అధ్యక్షుడు ట్రంప్ భారీ అవినీతిలో కూరుకుపోయారు. మరోసారి అమెరికా అధ్యక్షుడు కావాలని తీవ్ర ప్రయత్నం చేస్తున్న ట్రంప్‌నకు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. పలు కేసులను ఎదుర్కొంటోన్న ట్రంప్‌‌నకు న్యూయార్క్ కోర్టు షాకిచ్చింది. బ్యాంకులను, బీమా సంస్థలను మోసం చేసిన కేసులో ట్రంప్‌‌నకు రూ.3 వేల కోట్ల జరిమానా విధించింది.అమెరికా అధ్యక్షుడు కాక ముందు ట్రంప్ (donald trump) అనేక వ్యాపారాలు నిర్వహించారు. ఆస్తుల విలువను వాస్తవిక వాల్యూకంటే అనేక రెట్లు అధికంగా చూపి బ్యాంకు రుణాలు పొంది మోసం చేశాడనే ఆరోపణలు రుజువయ్యాయి. తాజాగా న్యూయార్క్ అటార్నీ జనరల్, డెమోక్రాట్ నాయకుడు లెటిటియా జేమ్స్ వేసిన కేసుపై కోర్టు తీర్పు వెలువరించింది. ట్రంప్ తీవ్ర అవకతవకలకు పాల్పడ్డాడని కోర్టు గుర్తించింది, రూ.3 వేల కోట్ల జరిమానా విధించింది.రెండోసారి అమెరికా అధ్యక్షుడు కావడానికి ప్రచారంలో దూసుకుపోతోన్న ట్రంప్‌నకు కోర్టు తీర్పు గొడ్డలి పెట్టులా మారింది. ఇటీవల లైంగిక ఆరోపణల కేసులో కూడా అదనపు పరిహారం చెల్లించాలని మాన్‌హటన్ కోర్టు ఆదేశించింది. లైంగిక ఆరోపణల కేసులో ట్రంప్‌నకు కోర్టు రూ.40 కోట్ల జరిమానా విధించింది.

K Venkateswara Rao | 11:55 AM, Sat Feb 17, 2024

ముంబైలో ఇద్దరు బంగ్లాదేశ్ పౌరుల అరెస్ట్

భారత్‌లో అక్రమంగా నివశిస్తోన్న ఇద్దరు బంగ్లాదేశ్ పౌరులను మహారాష్ట్ర రాజధాని ముంబైలో పోలీసులు అరెస్ట్ చేశారు. నవీ ముంబైలోని ఓ కాలనీలో అనుమానాస్పదంగా తిరుగుతోన్న ఇద్దరు బంగ్లాదేశ్ పౌరులను పోలీస్ యాంటీ టెర్రరిస్ట్ స్క్వాడ్ (ఏటీఎస్) అధికారులు ఆదివారం అరెస్ట్ చేశారు.వారిని పన్వెల్‌లోని నద్వే వద్ద అదుపులోకి తీసుకున్నారు. ఖిదుక్‌పాడలో తనిఖీలు నిర్వహించిన ఏటీఎస్ అధికారులు ఇద్దరు బంగ్లాదేశీలను అరెస్ట్ చేశారు.దేశంలోకి అక్రమంగా ప్రవేశించడంతోపాటు ఆధార్, వోటర్ ఐడీ కార్డులు, డ్రైవింగ్ లైసెన్స్ కూడా పొందారని అధికారులు తెలిపారు. పాస్‌పోర్ట్ నిబంధనలు 1950, విదేశీయుల చట్టం కింద వీరిపై కేసులు నమోదు చేశారు. అక్రమ వలసలతో సంబంధాలు కలిగిన వారిపై ఏటీఎస్ విచారణ చేస్తోంది.

K Venkateswara Rao | 12:42 PM, Sun Feb 11, 2024

ఇజ్రాయెల్ దాడుల్లో హమాస్ అగ్రనేత కుమారుడి మృతి

హమాస్ ఉగ్రవాదులు కాల్పుల విరమణ కోసం చేస్తున్న ప్రయత్నాలు ఫలించేలా కనిపించడం లేదు. తాజాగా ఇజ్రాయెల్ సైన్యం జరిపిన దాడుల్లో హమాస్ అగ్రనేత ఇస్మాయిల్ హనియే కుమారుడు హజెం హనియే చనిపోయినట్లు స్థానిక వార్తా కథనాల ద్వారా తెలుస్తోంది. దక్షిణ గాజాలో శనివారం ఇజ్రాయెల్ సైన్యం జరిపిన వైమానిక దాడుల్లో హజెం హనియో చనిపోయినట్లు భావిస్తున్నారు.గాజాలోని రఫాలో ఇజ్రాయెల్ సైన్యం వైమానిక దాడులతో విరుచుకుపడింది. ఈ దాడుల్లో కనీసం 44 మంది పాలస్తీనావాసులు చనిపోయారు. గాజాను ఖాళీ చేయాలని ఇజ్రాయెల్ అధ్యక్షుడు నెతన్యాహు ప్రకటించిన కాసేపటికే దాడులు మొదలయ్యాయి. ఆ తరవాత లక్షలాది మంది ఆ ప్రాంతాన్ని ఖాళీ చేశారు.
తాజాగా ఇజ్రాయెల్ రఫాపై చేస్తున్న దాడులను పలు దేశాలు ఖండించాయి. రాఫాను ఆక్రమించుకోవాలని ఇజ్రాయెల్ చూస్తోందంటూ అమెరికా ఆరోపించింది. గాజాలోని సగం జనాభా రఫాలో నివశిస్తోంది. ఇలాగే దాడులు కొనసాగిస్తే వేలాది మంది ప్రాణాలు కోల్పోయే ప్రమాదముందని పలు దేశాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి.

K Venkateswara Rao | 11:34 AM, Sun Feb 11, 2024

ఖైదీకి క్షమాభిక్ష..పెల్లుబికిన నిరసనలు...హంగేరి అధ్యక్షురాలు రాజీనామా

పిల్లలపై లైగింక వేధింపుల కేసులో దోషిగా రుజువైన వ్యక్తికి క్షమాభిక్ష ప్రసాదించడంతో హంగేరీ అధ్యక్షురాలు కేటలిన్ నోవక్ పదవికి రాజీనామా చేయాల్సి వచ్చింది. పిల్లలపై లైంగిక దాడికి పాల్పడ్డ వ్యక్తికి హంగేరీ అధ్యక్షురాలు కేటలిన్ క్షమాభిక్ష ప్రసాదించారు. దీనిపై దేశ వ్యాప్తంగా భారీ నిరసనలు వ్యక్తం అయ్యారు. దీంతో ఆమె పదవికి రాజీనామా చేయాల్సి వచ్చింది. ఖైదీకి క్షమాభిక్ష పెట్టి తప్పుచేశానని, ఈ వ్యవహారంలో ఆవేదనకు గురైన వారు తనను క్షమించాలంటూ కేటలిన్ జాతి నుద్దేశించి చేసిన ప్రసంగంలో కోరారు.బాలికల సంరక్షణ కేంద్రం నిర్వహిస్తోన్న ఓ వ్యక్తి పిల్లలపై లైంగిక చర్యలకు పాల్పడుతున్నాడనే కేసు రుజువైంది. దీనిపై హంగేరీ అధ్యక్షురాలు నోవక్ క్షమాభిక్ష పెట్టారు. ఇటీవల ఈ విషయం వెలుగులోకి రావడంతో దేశంలోని ప్రతిపక్ష పార్టీలు భారీ నిరసనకు దిగాయి. దీంతో ఆమె రాజీనామా చేయాల్సి వచ్చింది.శుక్రవారం నుంచి ప్రతిపక్షాలు హంగేరీ అధ్యక్షురాలి ఇంటి ముందు నిరసనకు దిగాయి. ఖతార్ పర్యటనలో ఉన్న నోవాక్ (internationanews) హుటాహుటిన హంగేరీ చేరుకున్నారు. వెంటనే రాజీనామా చేశారు. క్షమాభిక్ష సరైన నిర్ణయం కాదని ఆమె క్షమాపణలు చెప్పారు. బాధితుల పక్షాన నిలుస్తున్నట్లు ప్రకటించారు.

K Venkateswara Rao | 10:47 AM, Sun Feb 11, 2024

యూఏఈలో హిందూ ఆలయం ప్రారంభించనున్న ప్రధాని మోదీ

ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ రెండు రోజుల విదేశీ పర్యటన ఖరారైంది. ఈ నెల 13, 14 తేదీల్లో యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్‌లో ప్రధాని పర్యటించనున్నారు. యూఏఈ అధ్యక్షుడు షేక్ మొహమ్మద్ బిన్ జాయేద్ అల్ నహ్యాన్‌తో సమావేశం కానున్నారు. రాజధాని అబుధాబిలో నిర్మించిన హిందూ ఆలయాన్ని మోదీ ప్రారంభించనున్నారు. ఆ తరువాత ప్రధాని మోదీ ప్రవాస భారతీయులను ఉద్దేశించి ప్రసంగించనున్నారు.యూఏఈకి ప్రధాని మోదీ వెళ్లడం ఇది ఏడోసారి కావడం గమనార్హం. మోదీ, నహ్యాన్ రెండు దేశాల వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని విస్తరించడంపై చర్చించనున్నారు. ప్రాంతీయ, అంతర్జాతీయ అంశాలు కూడా చర్చకు రానున్నాయని తెలుస్తోంది. దుబాయ్‌లో జరగనున్న వరల్డ్ గవర్నమెంట్ సమ్మిట్ 2024కు గౌరవ అతిథిగా ప్రధాని మోదీ హాజరు కానున్నారు.

K Venkateswara Rao | 09:47 AM, Sun Feb 11, 2024

పాక్ సరిహద్దులో చైనా తయారీ డ్రోన్ కూల్చివేత

పాకిస్థాన్ సరిహద్దుల్లో భారత సైన్యం ఓ డ్రోన్‌ను కూల్చివేసింది. పంజాబ్ పాక్ సరిహద్దుల్లో ఈ ఘటన చోటుచేసుకుంది. సైన్యం కూల్చివేసిన డ్రోన్, చైనాలో తయారైందని తెలుస్తోంది. క్వాడ్ కాప్టర్ డ్రోన్ సరిహద్దు దాటి భారత్‌లోకి ప్రవేశించడంతో బీఎస్ఎఫ్ దళాలు కూల్చివేశాయి.డ్రోన్ గుర్తించిన వెంటనే బీఎస్ఎఫ్ దళాలు కాల్పులు జరిపి కూల్చివేశాయి. పంజాబ్‌లోని గురుదాస్‌పూర్ జిల్లా రోసీ గ్రామ పొలాల్లో డ్రోన్ కూలిపోయింది. పాక్షికంగా దెబ్బతిన్న డ్రోన్‌ను సైన్యం స్వాధీనం చేసుకుంది. కూలిపోయిన డీజేఐ మావిక్ 3 క్లాసిక్ డ్రోన్ చైనాలో తయారైందనిగా సైన్యం గుర్తించింది. డ్రోన్ల ద్వారా మాదకద్రవ్యాల అక్రమ రవాణా సాగుతోంది. డ్రోన్లను కూల్చి వేయడం ఇటీవల కాలంలో ఇది రెండోసారని అధికారులు ప్రకటించారు.

K Venkateswara Rao | 16:46 PM, Sat Feb 10, 2024

న్యూయార్క్ కోర్టు జడ్జిగా భారతీయుడు

భారత సంతత వ్యక్తి మరో ఘనత సాధించారు. అమెరికాలోని న్యూయార్క్ తూర్పు జిల్లా కోర్టు జడ్జిగా భారత సంతతికి చెందిన వ్యక్తి జయేశ్ బల్సారాను నియమిస్తున్నట్లు వైట్‌హౌస్ ప్రకటించింది.ఇదే కోర్టులో బల్సారా 2017 నుంచి పనిచేస్తున్నారు. ఈ తరహా పదవిని చేపట్టిన దక్షిణాసియా దేశాలకు చెందిన మొదటి వ్యక్తిగా జయేశ్ చరిత్ర సృష్టించారు.


భారత్ నుంచి ఐదు దశాబ్దాల కిందట జయేశ్ కుటుంబం అమెరికాకు వలస వెళ్లింది. అలా వలస వెళ్లిన దంపతుల కుమారుడే బల్సారా. దివాలా, కాంట్రాక్టులు, సెక్యూరిటీలు, నియంత్రణ న్యాయ వ్యవహారాల్లో జస్టిస్ జయేశ్ నిపుణుడు. బల్సారా తండ్రి న్యూయార్క్ సిటీ కార్పొరేషన్లో ఇంజనీరుగా పనిచేశారు. తల్లి నర్సుగా సేవలందించారు.

K Venkateswara Rao | 09:28 AM, Sat Feb 10, 2024

మయన్మార్ సరిహద్దులో ఇష్టం వచ్చినట్లు కుదరదు

భారత్ మయన్మార్ సరిహద్దుల్లో కంచె నిర్మాణం చేయనున్నట్లు కేంద్ర హోం మంత్రి అమిత్ షా (home minister amit sha) ప్రకటించారు. మయన్మార్ దేశంలో కల్లోలం నెలకొనడంతో తిరుగుబాటుదారులతో పోరాడలేక అక్కడి సైన్యం భారత్‌లోకి ప్రవేశిస్తోంది. దీంతో కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. రెండు దేశాల మధ్య విచ్చలవిడిగా రాకపోకలను నిలిపేసింది.మయన్మార్ సరిహద్దును కంచె నిర్మాణం ద్వారా కట్టుదిట్టుం చేయనున్నట్లు అమిత్ షా ఎక్స్ వేదికగా ప్రకటించారు. దేశ భద్రతతోపాటు ఈశాన్య రాష్ట్రాల్లో సమతుల్యత కోసం ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆయన తెలిపారు. ఇరు దేశాల మధ్య స్వేచ్ఛాయుత రాకపోకలు రద్దు చేసుకుంటున్నట్లు కేంద్రం ప్రకటించింది.మిజోరం, మణిపుర్, నాగాలాండ్, అరుణాచల్‌ప్రదేశ్ రాష్ట్రాలు మయన్మార్‌తో సరిహద్దు కలిగిఉన్నాయి. రెండు దేశాల మధ్య ఎలాంటి వీసా లేకుండానే ప్రజలు తిరుగుతున్నారు. ఇటీవల చొరబాట్లు పెరగడంతో భారత్ అప్రమత్తమైంది. రెండు దేశాల మధ్య 1643 కి.మీ కంచె నిర్మాణం చేయాలని నిర్ణయించారు. మణిపూర్ మోరేలో ఇప్పటికే 10 కి.మీ మేర కంచె నిర్మాణం పూర్తి చేశారు.

K Venkateswara Rao | 14:31 PM, Thu Feb 08, 2024

హౌతీల దాడులపై అమెరికా అధ్యక్షుడు సీరియస్

ఎర్ర సముద్రంలో రవాణా నౌకలపై హౌతీల దాడుల నేపథ్యంలో పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు చోటు చేసుకుంటున్నాయి. ఇటీవల హౌతీ తిరుగుబాటుదారుల దాడుల్లో ముగ్గురు అమెరికా సైనికులు చనిపోయిన సంగతి తెలిసిందే. దీనిపై యూఎస్ అధ్యక్షుడు బైడెన్ స్పందించారు. సైనికుల మరణానికి కారణమైన వారిపై ప్రతీకారం ఎలా తీర్చుకోవాలో తమకు తెలుసని హెచ్చరించారు. అయితే పశ్చిమాసియాలో యుద్ధాన్ని విస్తరించే ఉద్దేశం తమకు లేదని బైడెన్ తేల్చిచెప్పారు.అమెరికా సైనికులపై దాడులు చేసింది ఏ ఉగ్ర సంస్థో స్పష్టంగా తెలియాల్సి ఉందని అమెరికా రక్షణ శాఖ అధికారులు చెప్పారు. ఇప్పటికే ప్రతిదాడులకు సిద్దం అవుతున్నట్లు తెలిపారు. దశల వారీగా దాడులు చేసే అవకాశముందన్నారు. ఉగ్రవాదుల దాడుల్లో చనిపోయిన అమెరికా సైనికుల కుటుంబాలను బైడెన్ పరామర్శించారు.ఇటీవల జోర్డాన్‌లోని అమెరికా సైనికుల శిబిరాలపై జరిగిన దాడిలో ముగ్గురు చనిపోయారు. ఇజ్రాయెల్, హమాస్ ఉగ్రవాదుల మధ్య యుద్ధం మొదలయ్యాక ఆ ప్రాంతంలో అమెరికా సైనికులు చనిపోవడం ఇదే మొదటిసారి కావడం గమనార్హం. తమదేశంపై దాడులకు దిగితే ప్రతిదాడులు తప్పవని ఇరాన్ హెచ్చరించింది. అమెరికా సైనిక శిబిరాలపై దాడులు చేసిన ఉగ్రసంస్థలకు ఇరాన్ సహకారం అందిస్తోందని అమెరికా ఆరోపిస్తోంది.

K Venkateswara Rao | 11:57 AM, Thu Feb 01, 2024
upload
upload