Thursday, April 18, 2024

Logo
Loading...
upload upload upload

andhratodaynews

శిరోముండనం కేసులో వైసీపీ ఎమ్మెల్సీకి జైలు శిక్ష

శిరోముండనం కేసులో విశాఖ కోర్టు తీర్పు చెప్పింది. 1996లో సంచలనం రేపిన శిరోముండనం కేసు 28 సంవత్సరాలుగా విచారణ సాగుతూనే ఉంది. ఇందులో ప్రధాన నిందితుడు వైసీపీ ప్రస్తుత ఎమ్మెల్సీ, మండపేట వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి తోట త్రిమూర్తులు, మరో ఐదుగురికి విశాఖ కోర్టు 18 నెలల జైలు శిక్ష విధించింది. రూ.2.50 లక్షల జరిమానా కూడా విధించింది.

1996 డిసెంబర్ 29 రామచంద్రాపురం మండలంలోని వెంకటాయపాలెంలో శిరోముండనం ఘటన చోటుచేసుకుంది. దళితులను హింసించడంతోపాటు ఇద్దరికి శిరోముండనం చేశారు. తోట త్రిమూర్తులతోపాటు చాలా మందిపై కేసు నమోదైంది. 28 సంవత్సరాల విచారణ అనంతరం విశాఖ కోర్టు న్యాయమూర్తి తీర్పు వెలువరించారు. తీర్పు పట్ల దళిత సంఘాలు హర్షం వ్యక్తం చేశాయి.

K Venkateswara Rao | 14:04 PM, Tue Apr 16, 2024

కుక్కల దాడి : ప్రాణాలు కోల్పోయిన చిన్నారి

కుక్కల దాడితో హైదరాబాద్ నగర వాసులు బెంబేలెత్తిపోతున్నారు. తాజాగా జరిగిన ఘటనలో ఓ చిన్నారి ప్రాణాలు కోల్పోయారు. హైదరాబాద్ నగరంలోని పేట్‌బషీరాబాద్ పరిధిలో రెండున్నరేళ్ల బాలికపై వీధి కుక్కలు దాడి చేసి చంపేశాయి. చిన్నారి తల్లిదండ్రులు సమీపంలోని భవన నిర్మాణ సంస్థలో కూలీలుగా చేస్తున్నారు. కుటుంబంతో కలసి అక్కడే రేకుల షెడ్డులో నివాసం ఉంటున్నారు.


చిన్నారి దీప్‌కుమారి వారు నివాసం ఉండే షెడ్డు వద్ద ఆడుకుంటుండగా కుక్కలన్నీ ఒకేసారి దాడిచేశాయి. రెండు కుక్కలు దాడికి దిగడంతో చిన్నారి తీవ్రంగా గాయపడింది. చిన్నారిని కుక్కలు కొంచెం దూరం లాక్కెళ్లాయి. తల్లిదండ్రులు గుర్తించి కుక్కలను తరిమి, చిన్నారిని ఆసుపత్రికి తరలించినా ప్రాణాలు తక్కలేదు. చికిత్స మొదలు పెట్టక ముందే చనిపోయినట్లు నిలోఫర్ ఆసుపత్రి డాక్టర్లు వెల్లడించారు.

K Venkateswara Rao | 12:03 PM, Sun Apr 14, 2024

ఇజ్రాయెల్‌పై డ్రోన్లతో విరుచుకుపడిన ఇరాన్

అగ్రరాజ్యం అమెరికా హెచ్చరికలు నిజమయ్యారు. ఇజ్రాయెల్ నగరాలపై ఇరాన్ డ్రోన్లతో దాడులు మొదలుపెట్టింది. గత వారం ఇజ్రాయెల్ సైన్యం జరిపిన దాడిలో సిరియాకు చెందిన కీలక కమాండర్లు చనిపోయారు. సిరియాలోని ఎంబసీ వద్ద జరిగిన దాడితో ఇరాన్ రగిలిపోతోంది. ఇజ్రాయెల్‌ను ఇరాన్ పలుమార్లు హెచ్చరించింది. శనివారం డజన్ల కొద్దీ డ్రోన్లు దూసుకెళుతున్నట్లు స్థానిక మీడియా ద్వారా తెలుస్తోంది. చాలా డ్రోన్లను ఇజ్రాయెల్ కూల్చివేసిందని ఇప్పటికే సరిహద్దులను ఇజ్రాయెల్ మూసివేసింది. సిరియా, జోర్డాన్ కూడా తమ దళాలను అప్రమత్తం చేశాయి.సిరియాలోని ఇరాన్ ఎంబసీపై దాడి ఘటన తరవాత ఇజ్రాయెల్ తీరుపై పశ్చిమదేశాలు గుర్రుగా ఉన్నాయి. ఎంబసీపై జరిగిన దాడిలో సీనియర్ కమాండర్లు చనిపోయారు. ఇజ్రాయెల్‌కు తగిన గుణపాఠం చెబుతామని ఇరాన్ హెచ్చరించింది. ఇరుదేశాల మధ్య నెలకొన్న ఉద్రిక్తతలను గమనిస్తోన్న అమెరికా, శుక్రవారం నాడు హెచ్చరికలు జారీ చేసింది. ఇరాన్ దాడులతో అమెరికా హెచ్చరికలు నిజమయ్యాయి.ఇజ్రాయెల్‌కు అన్ని రకాల సాయం అందిస్తామంటూ అమెరికా అధ్యక్షుడు బైడెన్ హామీ ఇచ్చారు.

K Venkateswara Rao | 10:56 AM, Sun Apr 14, 2024

అమెరికాలో హిందూ వ్యతిరేక మతోన్మాదాన్ని ఖండిస్తూ కాంగ్రెస్‌లో తీర్మానం

అమెరికాలో ఇటీవల హిందూ వ్యతిరేక శక్తులు రెచ్చిపోతున్నాయి. హిందూ మతంపై ఫోబియా, ద్వేషం, అసహనాలను ఖండిస్తూ భారతీయ అమెరికన్ కాంగ్రెస్ సభ్యుడు ఒకరు సభలో తీర్మానం ప్రవేశ పెట్టారు. శ్రీ ధనేదార్ అనే సభ్యుడు ప్రతినిధుల సభలో ప్రవేశపెట్టిన తీర్మానం ద్వారా పర్యవేక్షణ, జవాబుదారీతనంపై హౌస్ కమిటీకి సిఫార్సు చేశారు.అమెరికా అభివృద్ధిలో హిందువులు కీలకంగా, నమ్మకంగా వ్యవహరిస్తున్నారు. వారి వారసత్వం, చిహ్నాలపై కొందరు కావాలనే అసత్య ప్రచారాలు చేస్తున్నారు. ఇక పాఠశాలలు, కాలేజీల్లో వేధింపులు తప్పడం లేదు. వివక్షను ఎదుర్కోవాల్సి వస్తోందని తీర్మానంలో పేర్కొన్నారు.కొందరు కావాలనే హిందూమతంపై విధ్వేషపూరిత ప్రసంగాలు చేయడం ద్వారా నేరాలు పెరుగుతున్నాయన్నారు. వివక్షతో దాడులు జరుగుతున్నాయన్నారు.గడచిన 124 సంవత్సరాల్లో అమెరికా 40 లక్షల మంది హిందువులను తమ దేశంలోకి అనుమతించిందని, వారి సహకారం మరవలేనిదని కూడా తీర్మానంలో గుర్తుచేశారు.

K Venkateswara Rao | 10:02 AM, Sat Apr 13, 2024

గాజాలో కాల్పుల విరమణకు ఐరాస చొరవ : మద్దతు పలికిన భారత్

ఇజ్రాయెల్ హమాస్ తీవ్రవాదుల యుద్ధంతో గాజా తీవ్రంగా నష్టపోయింది. ఇప్పటికే యుద్ధం మొదలై ఆరు నెలలు గడచిపోయింది. ఈ కాలంలో 30 వేల మంది ప్రాణాలు కోల్పోయారని ఐక్యరాజ్యసమితి తెలిపింది. గాజాలో మానవతా సంక్షోభం నెలకొందని, దాన్ని అంగీకరించలేమని ఐరాస తెలిపింది. అక్కడ వెంటనే కాల్పుల విరమణకు ముందుకు రావాలంటూ భద్రతామండలిలో తీర్మానం ప్రవేశపెట్టారు. దీనికి భారత్ మద్దతు పలికింది. గాజాలో మానవతా సంక్షోభం ఇక ఏ మాత్రం ఆమోదయోగ్యం కాదని భారత్ తెలిపింది.గాజాలో సంక్షోభం కొనసాగడం ఏ మాత్రం క్షేమంకాదని ఐక్యరాజ్య సమితిలో భారత శాశ్వత ప్రతినిధి రుచిరా కాంబోజ్ అభిప్రాయపడ్డారు. మశ్చిమాసియాలో తలెత్తిన సంక్షోభ ప్రభావం ఇతర ప్రాంతాలపై కూడా ప్రభావం చూపుతోందన్నారు. ఇజ్రాయెల్ హమాస్ తీవ్రవాదుల మధ్య నెలకొన్న యుద్ధం వల్ల సామాన్యులు వేల సంఖ్యలో ప్రాణాలు కోల్పోయారని భారత్ ఆందోళన వ్యక్తం చేసింది.గాజాలో పరిస్థితులు మరింత దిగజారకుండా చర్యలు తీసుకోవాలని కూడా భారత్ ఐరాసను కోరింది. పాలస్తీనా ప్రజలకు సురక్షితమైన ప్రాంతం సూచిస్తూ తీసుకునే పరిష్కార మార్గానికి భారత్ కట్టుబడి ఉందంటూ తెలిపింది. ఆ దిశగా అర్థవంతమైన చర్చలు జరగాలని కోరుకుంది. గాజాలో ఐరాస కాల్పుల విరమణకు 14 దేశాలు మద్దతు పలికాయి. అమెరికా ఓటింగ్‌లో పాల్గొనలేదు.

K Venkateswara Rao | 11:28 AM, Tue Apr 09, 2024

ప్రధాని మోదీకి భూటాన్ అత్యున్నత పౌర పురస్కారం

ప్రధాని మోదీకి అరుదైన ఘనత దక్కింది. భూటాన్ ప్రభుత్వం ప్రధాని మోదీకి అత్యున్నత పౌర పురస్కారం ఆర్డర్ ఆఫ్ ది డ్రూక్ గ్యాల్పోను అందించింది. భూటాన్ రాజు, ప్రధాని మోదీకి ఈ పురస్కారం ప్రధానం చేశారు. విదేశాల్లో భూటాన్‌కు చెందిన ఈ అత్యున్నత పురస్కారం అందుకున్న మొదటి వ్యక్తిగా ప్రధాని మోదీ నిలిచారు.2021లోనే ప్రధాని మోదీకి భూటాన్ ఆర్డర్ ఆఫ్ ది డ్రూక్ గ్యాల్పోను ప్రకటించింది. కరోనా సమయంలో భారత్ భూటాన్‌కు 5 లక్షల టీకాలు అందించింది. ఈ అవార్డును 140 కోట్ల భారతీయులకు అంకితం చేస్తున్నట్లు ప్రధాని మోదీ ట్వీట్ చేశారు.
ప్రధాని మోదీ భూటాన్ పర్యటనలో ఆ దేశ ప్రధాని దాషో షెరింగ్ తోబ్గేతో చర్చలు జరుపుతున్నారు. వ్యవసాయం, పర్యావరణం, పర్యాటకం, పునరుత్పాదక ఇంధన వనరుల వినియోగంపై ప్రధానంగా పలు ఒప్పందాలు చేసుకునే అవకాశముంది. ప్రధానిగా మోదీ బాధ్యతలు చేపట్టిన తరవాత భూటాన్‌లో పర్యటించడం ఇది మూడోసారి కావడం గమనార్హం.

K Venkateswara Rao | 17:49 PM, Fri Mar 22, 2024

బెజవాడ కనకదుర్గమ్మ గుడిలో అరాచకం

విజయవాడ ఇంద్రకీలాద్రిపై వెలసిన దుర్గమ్మగుడిలో అరాచకాలకు అడ్డే లేకుండా పోతోంది. అమ్మవారి దర్శనం కోసం భక్తులకు అమ్ముతోన్న టికెట్లను రీసైక్లింగ్ చేస్తూ కొందరు ఉద్యోగులు లక్షలు కొల్లగొడుతున్నారు. పాలకమండలి అండదండలతోనే రూ.500 టికెట్లు రీసైక్లింగ్ చేస్తున్నారనే ఆరోపణలు వస్తున్నాయి. పాలకమండలి అనుచరులు, బంధువులు వందలాది మంది ఉచితంగా అంతరాయ దర్శనాలకు తరలి వెళుతున్నా, అధికారులు నోరు మెదపడం లేదు.
కొందరు పాలకమండలికి చెందిన వారి బంధువులు ఇటీవల రూ.500 క్యూలైనులోకి చొచ్చుకెళ్లారు. సిబ్బంది ప్రశ్నించగా పాలకమండలి సభ్యుడి బంధువులమంటూ కేకలు వేశారు. దీంతో సిబ్బంది ఈవోకు ఫిర్యాదు చేయడంతో రూ.500 టికెట్ల రీసైక్లింగ్ మాఫియా కూడా వెలుగులోకి వచ్చింది. అమ్మిన టికెట్లకు, దర్శనానికి వచ్చిన వారి సంఖ్యకు పొంతన లేకపోవడంతో అక్రమాలు వెలుగులోకి వచ్చాయి.ఇటీవల కొందరు భక్తులు అధికార లాంఛనాలతో దర్శనం కల్పిచాలంటూ బెదిరింపులకు దిగారు. తాము పాలకమండలి సభ్యుల బంధువులమంటూ చెప్పారు. అయినా అక్కడున్న ఏఈవో అంగీకరించలేదు. కేవలం పాలకమండలి సభ్యులకు మాత్రమే అధికార లాంఛనాలతో దర్శనాలుంటాయని చెప్పాడు. దీంతో వారు సిబ్బందిపై వాగ్వాదానికి దిగారు. ఇలాంటి అరాచకాలు ఎన్ని జరుగుతున్నా, పాలకమండలి మాత్రం పట్టించుకోవడం లేదనే విమర్శలు వస్తున్నాయి.

K Venkateswara Rao | 10:03 AM, Sun Mar 17, 2024

నిజ్జర్ హత్యపై కాంట్రాక్ట్ టు కిల్ డాక్యుమెంటరీ.. నిషేధించిన భారత్‌

నిషేధిత ఖలిస్థానీ ఉగ్రవాది నిజ్జర్ హత్యపై కెనడాకు చెందిన మీడియా సంస్థ రూపొందించిన కాంట్రాక్ట్ టు కిల్ డాక్యుమెంటరీని భారత్ నిషేధించింది. ఖలీస్థాన్‌ ఉగ్ర సంస్థను భారత్ నిషేధించిన సంగతి తెలిసిందే. గత ఏడాది కెనాడాలోని ఓ గురుద్వారా సమీపంలో ఖలిస్థాన్ ఉగ్రవాది నిజ్జర్ హత్యకు గురయ్యారు. ఇతని హత్య వెనుక భారత హస్తముందని కెనాడా ప్రధాని ట్రూడో తీవ్ర ఆరోపణలు చేశారు. ఆ తరవాత ఇరుదేశాల మధ్య దౌత్యసంబంధాలు తీవ్రంగా దెబ్బతిన్నాయి.కెనడా సహకారంతో సీబీసీ వార్తా సంస్థ నిజ్జర్ హత్యపై కాంట్రాక్ట్ టు కిల్ అనే డాక్యుమెంటరీ రూపొందించింది. 45 నిమిషాల ఈ డాక్యుమెంటరీలో హత్య సమయంలోని రికార్డైన సీసీటీవీ ఫుటేజీ కూడా చొప్పించారు. డాక్యుమెంటరీ వివాదంగా మారడంతో దీని ప్రసారాన్ని భారత్ నిషేధించింది.నిజ్జర్ హత్యపై డాక్యుమెంటరీని ఏకపక్షంగా రూపొందించడంపై కేంద్ర సమాచార శాఖ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. కాంట్రాక్ట్ టు కిల్ డాక్యుమెంటరీపై నిషేధం విధించింది.కేంద్రం ఆదేశాలతో యూజర్లు చూడకుండా యూట్యూబ్, ఎక్స్ సంస్థలు పరిమితులు విధించాయి.

K Venkateswara Rao | 17:42 PM, Thu Mar 14, 2024

ఉద్యోగులకు గుడ్‌న్యూస్

ప్రభుత్వ ఉద్యోగులకు కేంద్రం గుడ్‌న్యూస్ అందించింది. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు 4 శాతం డీఏ(డీఆర్‌)ని పెంచింది. 2024 జనవరి నుంచి అమల్లోకి వస్తుందని ప్రకటించారు. ప్రధాని మోదీ నాయకత్వంలో గురువారం జరిగిన కేంద్ర క్యాబినెట్ భేటీలో ఈ నిర్ణయం తీసుకున్నారు. 50 లక్షల మంది కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, 68 లక్షల మంది పింఛనుదారులకు ప్రయోజనం కలగనుంది. ఈ ఏడాది వారికి అదనంగా రూ.12869 కోట్లు చెల్లిస్తారు.ఉద్యోగుల మూల వేతనంలో 46 శాతం ఉన్న డీఏ 4 శాతం పెరగడంలో అది 50 శాతానికి చేరింది. అద్దె భత్యం 27, 18, 9 శాతం నుంచి 30, 20, 10 శాతానికి పెంచినట్లు కేంద్ర మంత్రి పియూష్ గోయల్ ప్రకటించారు. గ్రాట్యుటీ పరిమితి రూ.20 లక్షల నుంచి రూ.25 లక్షలకు పెంచారు. ఉద్యోగులకు దక్కే ప్రయోజనాలు 25 శాతం పెరగనున్నాయి. ఈ నిర్ణయాల వల్ల కేంద్రంపై ఈ ఆర్థిక సంవత్సరంలో రూ.15 వేల కోట్ల భారం పడనుంది.

K Venkateswara Rao | 10:07 AM, Fri Mar 08, 2024

పాక్ అనుకూల నినాదాలు కేసులో నిందితులకు మూడు రోజుల కస్టడీ

కర్ణాటక అసెంబ్లీ ఆవరణలో పాక్ అనుకూల నినాదాలు చేసిన ముగ్గురు నిందితులను మూడు రోజుల కస్టడీకి బెంగళూరు కోర్టు అనుమతించింది. పాక్ అనుకూల నినాదాలు చేసిన కేసులో ముగ్గురు అనుమానితులను బెంగళూరు పోలీసులు సోమవారం అరెస్ట్ చేశారు. రాజ్యసభ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థులు గెలిచిన తరవాత, పాకిస్తాన్ జిందాబాద్ అంటూ, అసెంబ్లీ ఆవరణలో కొందరు నినాదాలు చేయడం వివాదానికి దారితీసిన సంగతి తెలిసిందే.పాకిస్తాన్ అనుకూల నినాదాలపై ఇప్పటికే కేసు నమోదైంది. దీనిపై విచారణ జరిపిన పోలీసులు ఎఫ్‌ఎస్‌ఎల్ నివేదిక ఆధారంగా ముగ్గురు అనుమానితులను అదుపులోకి తీసుకున్నారు. అన్నీ ఆధారాలు సేకరించిన తరవాతే ముగ్గురిని అరెస్ట్ చేసినట్లు డిప్యూటీ పోలీస్ కమిషనర్ హెచ్.టి.శేఖర్ వెల్లడించారు.ఆ ముగ్గురిపై న్యాయపరమైన చర్యలుంటాయని ఆయన చెప్పారు.అరెస్టైన వారిలో ఢిల్లీకి చెందిన ఇల్టాజ్, బెంగళూరుకు చెందిన మునావర్, బ్యాడిగి ప్రాంతానికి చెందిన మహ్మద్ షఫీగా గుర్తించారు. రాజ్యసభ సభ్యుడు నసీర్ హుసేన్ విజయం సాధించినట్లు ప్రకటించగానే ఆ ముగ్గురూ పాక్ అనుకూల నినాదాలు చేసినట్లు ఎఫ్‌ఎస్‌ఎల్ రిపోర్టు ద్వారా బయటపడిందని కర్ణాటక హోం మంత్రి పరమేశ్వర తెలిపారు.

K Venkateswara Rao | 11:55 AM, Tue Mar 05, 2024

సికింద్రాబాద్ మహంకాళి అమ్మవారిని దర్శించుకున్న ప్రధాని మోదీ

ప్రధాని నరేంద్ర మోదీ ఇవాళ సికింద్రాబాద్‌లోని మహంకాళి అమ్మవారిని దర్శించుకున్నారు. సోమవారం ఆదిలాబాద్ పర్యటన తరవాత హైదరాబాద్‌లోని రాజ్‌భవన్‌లో రాత్రి బస చేసిన ప్రధాని మోదీ, ఇవాళ ఉదయం మహంకాళి అమ్మవారిని దర్శించుకున్నారు. ఆలయ అధికారులు ప్రధాని మోదీకి అమ్మవారి చిత్రపటం బహుకరించారు.


ప్రధాని మోదీ పర్యటన నేపథ్యంలో జంట నగరాల్లో పోలీసులు అలెర్ట్ అయ్యారు. మహంకాళి అమ్మవారి దర్శనం అనంతరం ప్రధాని మోదీ సంగారెడ్డిలో జరగనున్న విజయ సంకల్ప యాత్రలో పాల్గొనేందుకు వెళ్లారు. బేగంపేట విమానాశ్రయం నుంచి హెలికాఫ్టర్‌లో బీజేపీ సంగారెడ్డిలో చేపట్టిన విజయ సంకల్ప యాత్రలో ప్రధాని పాల్గొంటారు.

K Venkateswara Rao | 11:14 AM, Tue Mar 05, 2024

సార్వత్రిక ఎన్నికల్లో 400 సీట్లు లక్ష్యంగా ప్రధాని విజయ సంకల్ప యాత్ర

వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీ 400 సీట్లు గెలుచుకుంటుందని ప్రధాని మోదీ, ఆదిలాబాద్‌లో నిర్వహించిన విజయ సంకల్ప యాత్రలో ఆశాభావం వ్యక్తం చేశారు. ఇది ఎన్నికల ప్రచారం కాదని, వికసిత్ భారత్ కోసం బీజేపీ ప్రభుత్వం కృషి చేస్తోందని ప్రధాని గుర్తు చేశారు. కాళేశ్వరం ప్రాజెక్టులో బీఆర్‌ఎస్ అవినీతికి పాల్పడిందని, ప్రస్తుత కాంగ్రెస్ వారితో కుమ్మక్కైందని ప్రధాన మోదీ విమర్శించారు.ఇది ఎన్నికల సభ కాదు. అభివృద్ధి ఉత్సవమన్న ప్రధాని మోదీ, 15 రోజుల్లో 5 ఎయిమ్స్ ప్రారంభించినట్లు గుర్తుచేశారు. ఓ ఆదివాసీ మహిళను బీజేపీ రాష్ట్రపతిని చేసిందన్నారు. నాడు బీఆర్ఎస్, నేడు కాంగ్రెస్ పార్టీలు రాష్ట్రాన్ని దోచుకుంటున్నాయన్నారు. గిరిజనుల కోసం యూనివర్సిటీని ఏర్పాటు చేసినట్టు తెలిపారు. తెలంగాణకు మెగాటెక్స్‌టైల్ పార్క్ కేటాయించారు. దీని ద్వారా వేలాది మందికి ఉద్యోగాలు లభించనున్నాయి.

K Venkateswara Rao | 14:36 PM, Mon Mar 04, 2024

మార్చి 12 తరవాత ఈడీ ముందు హాజరుకు కేజ్రీవాల్ అంగీకారం

ఢిల్లీ లిక్కర్ స్కాంలో తమ కార్యాలయంలో విచారణకు హాజరు కావాలంటూ ఈడీ అధికారులు ఎనిమిది సార్లు సమన్లు ఇచ్చిన తరవాత సీఎం కేజ్రీవాల్ ఎట్టకేలకు దిగివచ్చారు. మార్చి 12 తరవాత ఈడీ అధికారుల ముందు హాజరవుతానని ఆయన సమాధానం పంపారు. మార్చి 4లోపు హాజరు కావాల్సి ఉండగా, ఈడీ అన్యాయంగా తనను విచారణకు పిలుస్తున్నారంటూ అరవింద్ కేజ్రీవాల్ ఆరోపిస్తున్నారు. మార్చి 12లోపు హాజరు కాగలనని తాజాగా సమాధానం ఇచ్చారు.ఢిల్లీ మద్యం పాలసీ 2021-22 తయారీలో ఆప్ నేతలు వారికి అనుకూలంగా తయారు చేసుకున్నారంటూ ఈడీ కేసు నమోదు చేసిన సంగతి తెలిసిందే. ఈ కేసులో హాజరు కావాలంటూ గత ఏడాది డిసెంబరు 22 నుంచి ఇప్పటి వరకు ఈడీ ఎనిమిది సార్లు సమన్లు జారీ చేసింది. అయినా ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ ఒకసారి మినహా హాజరు కాలేదు.ఢిల్లీ మద్యం కుంభకోణంలో అరెస్టైన ఆప్ సీనియర్ నేతలు మనీష్ సిసోడియా, సంజయ్ సింగ్ తిహార్ జైలులో ఉన్నారు. గత ఏడాది అక్టోబరులో అప్పటి ఢిల్లీ మాజీ సీఎం సిసోడియాను ఈడీ అధికారులు అరెస్ట్ చేశారు. ఆ తరవాత ఆప్ రాజ్యసభ సభ్యుడు సంజయ్ సింగ్‌ను అరెస్ట్ చేసి జైలుకు పంపారు.

K Venkateswara Rao | 10:36 AM, Mon Mar 04, 2024

అరాచకం : ఎర్రచందనం స్మగ్లర్ వీరప్పన్‌కు స్మారక స్తూపం

ఎర్రచందనం స్మగ్లర్ వీరప్పన్‌ స్మారక స్తూపాన్ని చిత్తూరు జిల్లా వైసీపీ అధ్యక్షుడు భరత్ ఆవిష్కరించారు. మూడు రాష్ట్రాల పోలీసు బలగాలను గడగడలాడించిన స్మగ్లర్ వీరప్పన్ అభిమానిగా ముద్రపడ్డ భరత్, ప్రస్తుతం చిత్తూరు జిల్లా వైసీపీ అధ్యక్షుడిగా, ఎమ్మెల్సీ పదవుల్లో ఉన్నారు. ఓ స్మగ్లర్ స్మారక స్తూపం ప్రారంభించడంపై సోషల్ మీడియాలో నెటిజన్లు తీవ్ర విమర్శలు గుప్పిస్తున్నారు.చిత్తూరు జిల్లా కుప్పం నియోజకవర్గం శాంతిపురం మండలంలోని కాకర్లవంకలో కొందరు ఇటీవల వీరప్పన్ స్మారక స్తూపం నిర్మించారు. స్మారక స్తూపం, దానికి ఏర్పాటు చేసిన జెండాను వైసీపీ ఎమ్మెల్సీ భరత్ ప్రారంభించడం చర్చకు దారితీసింది. వీర్పన్ స్మారక స్తూపం ఆవిష్కరణ కార్యక్రమంలో పలువురు వైసీపీ సీనియర్ నేతలు కూడా పాల్గొనడం వివాదాస్పదంగా మారింది.

K Venkateswara Rao | 10:12 AM, Mon Mar 04, 2024

రైతుల ఉద్యమం మరింత ఉద్ధృతం

తమ డిమాండ్ల సాధనకు ఉత్తరాది రాష్ట్రాల రైతులు చేపట్టిన ఛలో ఢిల్లీ నిరసన కార్యక్రమాన్ని ఉద్ధృతం చేయాలని రైతు సంఘాల నేతలు నిర్ణయించారు. ఈ నెల ఆరో తేదీ నుంచి కార్యాచరణ ప్రకటించారు. మార్చి 6న ఛలో ఢిల్లీ నిరసన కార్యక్రమంలో పాల్గొనాలని, 10న రైల్‌రోకో నిర్వహించాలని నిర్ణయించారు.ఛలో ఢిల్లీ కార్యక్రమంలో ఇటీవల చనిపోయిన రైతు శుభకరణ్ సింగ్ కుటుంబాన్ని సంఘం నేతలు పరామర్శించారు. ఢిల్లీలో నిరసన మరింత ఉద్ధృతం చేస్తామని ప్రకటించారు.పంటల మద్దతు ధరకు చట్టబద్దత కల్పించడంతోపాటు, తమ డిమాండ్లు పరిష్కరించే వరకు నిరసన విరమించేది లేదని తేల్చి చెప్పారు. శంభు, ఖానౌరీ సరిహద్దుల వద్ద ఇప్పటికే రైతులు నిరసన తెలుపుతున్నారు. మార్చి 6వ తేదీ చేపట్టబోయే నిరసనల్లో రైతులు, రైతు కూలీలు పెద్ద ఎత్తున తరలి రావాలని పిలుపునిచ్చారు.

K Venkateswara Rao | 09:55 AM, Mon Mar 04, 2024

ప్రధాని మోదీ ఆదిలాబాద్ పర్యటన లైవ్

pm modi adilabad tour live speech

K Venkateswara Rao | 09:37 AM, Mon Mar 04, 2024

సైకిలెక్కిన వైసీపీ ఎంపీ

వైసీపీకి మరో ఎంపీ రాజీనామా చేశారు. నెల్లూరు జిల్లాకు చెందిన వైసీపీ రాజ్యసభ ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డి, ఆయన సతీమణి ప్రశాంతి రెడ్డి టీడీపీలో చేరారు. టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు సమక్షంలో నెల్లూరులో జరిగిన కార్యకర్తల సమావేశంలో వారు సైకిలెక్కారు.వైసీపీ ఎంపీ వేమిరెడ్డితోపాటు నెల్లూరుకు చెందిన పలువురు కార్పొరేటర్లు, పదుల సంఖ్యలో సర్పంచులు టీడీపీ కండువా కప్పుకున్నారు. నెల్లూరులోని పీవీఆర్ కన్వెన్షన్‌లో టీడీపీ జనసేన కార్యకర్తల సమావేశంలో పలువురు నాయకులు టీడీపీలో చేరారు.వైసీపీలో ప్రజాస్వామ్యం లేదని, నిరంకుశ పాలన సాగుతోందని ఎంపీ వేమిరెడ్డి విమర్శించారు. ఆత్మగౌరవం లేని చోట తాను ఉండలేనన్నారు. జగన్‌రెడ్డి పాలనలో నెల్లూరు ప్రజలకు చిన్న చిన్న పనులు కూడా చేసిపెట్టలేకపోయామని వేమిరెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. అభివృద్ధి మచ్చుకైనా కనిపించడం లేదని వేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డి తీవ్ర విమర్శలు చేశారు. వేలాది మంది కార్యకర్తలు ఆయన వెంటవచ్చి టీడీపీలో చేరారు.

K Venkateswara Rao | 14:51 PM, Sat Mar 02, 2024

కోటి ఇళ్లకు ఉచిత సౌర విద్యుత్ : కేంద్ర క్యాబినెట్ ఆమోదం

ప్రధాని నరేంద్ర మోదీ ప్రతిష్ఠాత్మకంగా ప్రకటించిన పీఎం సూర్య ఘర్ పథకానికి కేంద్ర క్యాబినెట్ ఆమోదం తెలిపింది. ఈ పథకం కింద దేశంలో కోటి ఇళ్లకు రాయితీపై సోలార్ విద్యుత్ పరికరాలు అందించనున్నారు. నెలకు కనీసం 300 యూనిట్ల విద్యుత్ వినియోగించుకునే వారికి ఈ పథకం వర్తిస్తుంది. రూ.75,021 కోట్లతో ఈ పథకాన్ని కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తోంది. ఫిబ్రవరి 13న ప్రధాని మోదీ ఈ పథకాన్ని ప్రారంభించారు.ఈ పథకం ద్వారా సోలార్ పరికరాల తయారీ పరిశ్రమకు, దాని అనుబంధ పరిశ్రమలకు ఊతం లభిస్తుందని, తద్వారా 17 లక్షల మందికి ఉపాధి లభిస్తుందని క్యాబినెట్ సమావేశం అనంతరం సమాచార శాఖ మంత్రి అనురాగ్ ఠాకూర్ మీడియాకు వెల్లడించారు. మూడు కిలో వాట్ల వరకు కేంద్రం రాయితీ (pm solar ghar) అందిస్తుంది. ఒక్కో కిలోవాట్‌కు 30 వేల చొప్పున, మొదటి 2 కిలోవాట్లకు రూ.60 వేల రాయితీ అందిస్తారు. 3 కిలోవాట్ల యూనిట్లకు రూ.78వేల రాయితీ అందిస్తున్నట్లు మంత్రి తెలిపారు.ఈ పథకం కింద వినియోగదారులకు దాదాపు 50 శాతం రాయితీ అందుతుంది. మిగిలిన మొత్తాన్ని బ్యాంకుల ద్వారా కనీస వడ్డీ రేటుకు అంటే కేవలం 7 శాతం వడ్డీకి రుణం మంజూరు చేస్తారు. ప్రతి జిల్లాలో ఒక మోడల్ సోలార్ గ్రామాన్ని కూడా అభివృద్ది చేయనున్నట్లు మంత్రి తెలిపారు.ఇంటిపై ఏర్పాటు చేసుకునే సోలార్ ప్యానెళ్ల ద్వారా 30 వేల మెగావాట్ల విద్యుత్ అందుబాటులోకి రానుంది.వినియోగదారులు తమకు అవసరమైన విద్యుత్ వాడుకుని మిగిలింది గ్రిడ్‌కు ఇవ్వడం ద్వారా కొంత ఆదాయం పొందవచ్చు. ఈ పథకం పూర్తైతే ఏటా 720 మిలియన్ టన్నుల కాలుష్యం తగ్గనుందని అంచనా.
K Venkateswara Rao | 16:27 PM, Thu Feb 29, 2024

ముంబై రైళ్లలో బాంబుపేలుళ్ల సూత్రధారి నిర్ధోషిగా విడుదల

మూడు దశాబ్దాల కిందట ముంబై రైళ్లలో జరిగిన బాంబుపేలుళ్ల కేసులో ప్రధాన ముద్దాయిగా ఉన్న లష్కర్ ఏ తయ్యబా ఉగ్రవాది అబ్దుల్ కరీం తుండాను రాజస్థాన్‌లోని ప్రత్యేక కోర్టు నిర్దోషిగా ప్రకటించింది. 1992లో బాబ్రి మసీదు కూల్చివేత జరిగిన ఏడాది పూర్తైన సందర్భంగా 1993లో ముంబై రైళ్లలో బాంబు పేలుళ్లకు పాల్పడినట్లు లష్కర్ ఏ తయ్యబా ప్రకటించిన సంగతి తెలిసిందే.


రైళ్లలో బాంబు పేలుళ్లకు పాల్పడిన కేసులో తుండాపై సరైన సాక్ష్యాలు లేకపోవడంతో నిర్ధోషిగా ప్రకటించింది. ఇదే కేసులో అమీనుద్దీన్, ఇర్ఫాన్‌లను రాజస్థాన్‌లోని ప్రత్యేక కోర్టు దోషులుగా తేల్చింది. వీరిద్దరికీ న్యాయమూర్తి జీవిత ఖైదు విధించారు. 84 సంవత్సరాల తుండా అనేక బాంబు పేలుళ్ల కేసుల్లో నిందితుడిగా ఉన్నారు. అండర్ వరల్డ్ డాన్ దావూద్ ఇబ్రహీంతోనూ సంబంధాలున్నాయనే ఆరోపణలున్నాయి. బాంబులు తయారు చేయడంతో ఇతను దిట్ట.ముంబై రైళ్లలో బాంబు పేలుళ్లు అప్పట్లో దేశాన్ని కుదిపేశాయి. ఆ తరవాత కోటా, కాన్పూర్, సికింద్రాబాద్, సూరత్‌లలో కూడా రైళ్లలో పేలుళ్లు చోటుచేసుకున్నాయి. ఈ కేసులను ప్రత్యేక న్యాయస్థానం విచారణ జరిపింది.

K Venkateswara Rao | 13:40 PM, Thu Feb 29, 2024

ఆరుగురు కాంగ్రెస్ ఎమ్మెల్యేలపై వేటు

హిమాచల్‌ప్రదేశ్‌లో ఆరుగురు కాంగ్రెస్ ఎమ్మెల్యేలపై వేటు పడింది. ఇటీవల జరిగిన రాజ్యసభ ఎన్నికల్లో క్రాస్ ఓటింగ్‌నకు పాల్పడి, బీజేపీ అభ్యర్థికి ఓటు
వేశారనే అనుమానంతో ఆరుగురు కాంగ్రెస్ ఎమ్మెల్యేలపై అసెంబ్లీ స్పీకర్ వేటు వేశారు. ఆరుగురు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ధైర్యసాహసాలు ప్రదర్శించారంటూ బీజేపీ ఎమ్మెల్యేలు చప్పట్లు కొడుతూ వారిని సభకు ఆహ్వానించారు. దీంతో వారంతా క్రాస్‌ఓటింగునకు పాల్పడ్డారని కాంగ్రెస్ భావించింది. అనర్హత వేటు పడిన కాంగ్రెస్ ఎమ్మెల్యేల్లో రాజిందర్ రానా, సుధీర్ శర్మ, ఇందర్ దత్ లఖ‌న్‌పాల్, దేవిందర్ కుమార్ భుట్టో, రవి ఠాకూర్, చైతన్య శర్మ ఉన్నారు.ఆర్ధిక బిల్లుకు వ్యతిరేకంగా ఆరుగురు సభ్యులు, పార్టీ విప్ ఉల్లంఘించారని, అందుకే వారిపై వేటు వేస్తున్నట్లు అసెంబ్లీ స్పీకర్ కుల్దీప్‌సింగ్ పఠానియా ఇవాళ ఉదయం ప్రకటించారు. 15 మంది బీజేపీ ఎమ్మెల్యేలను సభ నుంచి సస్పెండ్ చేశారు. ఆ తరవాత బడ్జెట్‌కు ఆమోదం లభించింది. ఆరుగురు కాంగ్రెస్ సభ్యులపై వేటు వేయడంతో, హిమాచల్‌ప్రదేశ్‌లో మరలా బీజేపీ అధికారంలోకి రాబోతోందనే వార్తలకు ముగింపు పలికినట్టైంది.

K Venkateswara Rao | 12:16 PM, Thu Feb 29, 2024

కర్ణాటక అసెంబ్లీ ఆవరణలో పాక్ అనుకూల నినాదాలపై సభలో తీవ్ర గందరగోళం

కర్ణాటక అసెంబ్లీ ఆవరణలో కొందరు పాకిస్థాన్ జిందాబాద్ అంటూ నినాదాలు చేశారంటూ బీజేపీ ఎమ్మెల్యేలు విధానసభలో నిరసనకు దిగారు. బాధ్యులపై చర్యలు తీసుకోవాలంటూ బీజేపీ ఎమ్మెల్యేలు పట్టుపట్టారు. పాకిస్థాన్ జిందాబాద్ అంటూ అసెంబ్లీ ఆవరణలో నినాదాలు చేసి 24 గంటలు గడచిపోయినా ఇంత వరకు ఎవరినీ అరెస్ట్ చేయకపోవడంపై బీజేపీ ఎమ్మెల్యేలు తీవ్ర నిరసనకు దిగారు.


ఎఫ్‌ఎస్‌ఎల్ నివేదిక రాగానే బాధ్యులపై కఠిన చర్యలుంటాయని సీఎం సిద్దరామయ్య ప్రకటించారు. ఇంకా నివేదిక అందాల్సి ఉందని, అది వచ్చాక చర్యలు తీసుకుంటామని సీఎం హామీ ఇచ్చినా..బీజేపీ ఎమ్మెల్యేలు ఆందోళన విరమించలేదు.


మేము స్వాతంత్ర్యం కోసం పోరాటం చేశాం. మీరు బీజేపీ, ఆర్‌ఎస్‌ఎస్ కోసం పోరాటం చేస్తున్నారు. మీరు అసలు స్వాతంత్ర్యం కోసం ఏనాడూ పోరాడలేదంటూ సీఎం సిద్దరామయ్యా చురకలు వేశారు. ఏనాడూ ప్రజాస్వామ్యం, రాజ్యాంగాన్ని కాపాడని వ్యక్తులు నేడు రాజ్యాంగం మార్చాలంటూ డిమాండ్ చేస్తున్నారని ఆయన ఎద్దేవా చేశారు.కర్ణాటక రాజ్యసభ ఎన్నికల్లో ఓడిపోవడంతో బీజేపీ ఎమ్మెల్యేలు అయోమయంలో ఉన్నారంటూ కాంగ్రెస్ నేతలు విమర్శించారు.విధాన సభ ఆవరణలో ఎవరూ కూడా పాకిస్థాన్ జిందాబాద్ అని నినాదాలు చేయలేదని కాంగ్రెస్ నేత హుస్సేన్ చెప్పారు. తాను స్వాంతంత్ర్య సమరయోధుల కుటుంబం నుంచి వచ్చానని పార్టీని, దేశాన్ని గౌరవిస్తానని ఆయన అన్నారు.

K Venkateswara Rao | 11:42 AM, Thu Feb 29, 2024

సందేశ్‌ఖాలీ దురాగతాల నిందితుడు షాజహాన్ అరెస్ట్

పశ్చిమబెంగాల్‌లోని సందేశ్‌ఖాలీలో మహిళలపై లైంగిక దాడులు, భూ కబ్జాల ఆరోపణలు ఎదుర్కొంటోన్న షాజహాన్ షేక్‌ను అరెస్ట్ చేసినట్లు పోలీసులు ప్రకటించారు. పశ్చిమబెంగాల్‌కు చెందిన ప్రత్యేక పోలీసు బృందం నార్త్ 24 పరగణాల జిల్లాలో షాజహాన్‌ను అర్థరాత్రి అరెస్ట్ చేసినట్లు ఇవాళ ఉదయం చెప్పారు. గడచిన 55 రోజులుగా షాజహాన్ షేక్ పరారీలో ఉన్నాడు. అరెస్ట్ అనంతరం అతన్ని బసిర్‌హత్ కోర్టుకు తరలించారు.షాజహాన్‌ను అరెస్ట్ చేయలని కలకత్తా కోర్టు ఆదేశించిన మూడు రోజుల తరవాత ఎట్టకేలకు పోలీసులు ఆ పని పూర్తి చేశారు. ఈ నెల 26న షాజ్‌హాన్‌ అరెస్టును అడ్డుకోవడం లేదని కలకత్తా హైకోర్టు తేల్చి చెప్పింది.సందేశ్‌ఖాలీ కేసుపై ఎలాంటి స్టే లేదని కూడా ధర్మాసనం స్పష్టం చేసిన సంగతి తెలిసిందే.


కోర్టుల వల్లే షాజహాన్‌ను అరెస్ట్ చేయడం సాధ్యం కావడం లేదంటూ తృణమూల్ నేతలు చెప్పుకుంటూ వచ్చారు. కలకత్తా హైకోర్టుతోపాటు, గవర్నర్ కూడా ఆగ్రహం వ్యక్తం చేయడంతో షాజహాన్ అరెస్ట్ చూపారు. గత కొంత కాలంగా షాజహాన్ పోలీసుల అదుపులోనే ఉన్నాడని పశ్చిమబెంగాల్ బీజేపీ నేతలు ఆరోపిస్తున్నారు.

K Venkateswara Rao | 10:43 AM, Thu Feb 29, 2024

ఎనిమిది మంది ఎమ్మెల్యేలపై అనర్హత వేటు

ఏపీలో 8 మంది ఎమ్మెల్యేలపై వేటు పడింది. పార్టీ ఫిరాయింపుల చట్టం కింద వారిపై వేటు వేసినట్లు అసెంబ్లీ స్పీకర్ తమ్మినేని సీతారం ప్రకటించారు. శాసనసభలో 8 స్థానాలు ఖాళీ అయినట్లు స్పీకర్, ఈసీకి లేఖ రాశారు. ఇవాళ దీనిపై గెజిట్ విడుదల కానుంది. రెండు వారాల్లో సార్వత్రిక ఎన్నికల షెడ్యూల్ విడుదల కాబోతున్న నేపథ్యంలో స్పీకర్ తమ్మినేని నిర్ణయం చర్చనీయాంశంగా మారింది.వేటు పడిన ఎమ్మెల్యేల్లో వైసీపీకి చెందిన ఆనం రాంనారాయణరెడ్డి, మేకపాటి చంద్రశేఖర్‌రెడ్డి, ఉండవల్లి శ్రీదేవి, కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి ఉన్నారు. ఇక తెలుగుదేశం పార్టీ నుంచి గెలిచి వైసీపీలో చేరిపోయిన కరణం బలరాం, మద్దాలి గిరిధర్, వల్లభనేని వంశీ, వాసుపల్లి గణేష్‌లు ఉన్నారు. రాష్ట్ర విభజన తరవాత ఇంత పెద్ద మొత్తంలో ఎమ్మెల్యేలపై వేటు వేయడం ఇదే మొదటిసారి కావడం గమనార్హం.

K Venkateswara Rao | 09:56 AM, Tue Feb 27, 2024

అతడిని అరెస్ట్ చేయండి : కలకత్తా హైకోర్టు ఆదేశం

పశ్చిమబెంగాల్‌లోని సందేశ్‌ఖాలీలో ఓ వర్గం మహిళలపై కొందరు అరాచకవాదులు లైంగికదాడులకు దిగారనే ఆరోపణలపై కలకత్తా హైకోర్టు విచారణ జరిపింది. కేసును సుమోటాగా స్వీకరించిన హైకోర్టు, ప్రధాన నిందితుడైన షాజహాన్ షేక్‌ను అరెస్ట్ చేయకుండా ఎలాంటి ఉత్తర్వులు జారీ చేయలేదని చెప్పింది. అతన్ని వెంటనే అరెస్ట్ చేయాలని అధికారులను ఆదేశించింది.


ప్రధాన నిందితుడు అరెస్ట్ కాకుండా కోర్టులు, పోలీసుల చేతులు కట్టిపడేశాయంటూ స్థానిక టీఎంసీ ఎంపీ అభిషేక్ బెనర్జీ చేసిన వ్యాఖ్యలను న్యాయవాది హైకోర్టు దృష్టికి తీసుకెళ్లారు. షాజహాన్ అరెస్ట్‌ను నిలుపుదల చేయలేదని కోర్టు స్పష్టం చేసింది. షాజహాన్ అరెస్ట్‌పై స్టే ఇవ్వలేదని తెలిపింది.అనేక నేరాల్లో షాజహాన్ షేక్ నిందితుడిగా ఉన్నాడని, అరెస్ట్ చేయాల్సిందేనని ధర్మాసనం అభిప్రాయపడింది. ఈ కేసులో ఈడీ, సీబీఐ, పశ్చిమ బెంగాల్ హోం కార్యదర్శిని కూడా ఇంప్లీడ్ చేస్తున్నట్లు కోర్టు తెలిపింది. తదుపరి విచారణను మార్చి 4కు వాయిదా వేసింది.

K Venkateswara Rao | 15:45 PM, Mon Feb 26, 2024

సింహాలకు అక్బర్, సీత పేర్లు పెట్టిన అధికారిపై వేటు

పశ్చిమబెంగాల్ సిలిగురి జూ పార్కులో సింహాలకు అక్బర్, సీత పేర్లు పెట్టి ఓకే ఎన్‌క్లోజర్‌లో ఉంచడంపై దేశ వ్యాప్తంగా తీవ్ర దుమారం చెలరేగిన సంగతి తెలిసిందే. మగ సింహానికి అక్బర్, ఆడ సింహానికి సీత పేర్లు పెట్టడంపై కొన్ని హిందూ సంఘాలు కలకత్తా హైకోర్టును ఆశ్రయించాయి. ఇలాంటి పేర్లు పెట్టడాన్ని కోర్టు తప్పుపట్టింది.
ఈ వ్యవహారం తీవ్ర నిరసనలకు దారితీయడంతో సింహాలకు పేర్లు పెట్టి, పశ్చిమబెంగాల్‌కు పంపిన త్రిపుర ప్రభుత్వం దిద్దుబాటు చర్యలకు దిగింది. సింహాలకు అక్బర్, సీత పేర్లు పెట్టిన త్రిపుర అటవీ శాఖ ప్రిన్సిపల్ చీఫ్ కన్జర్వేటర్ ప్రబిన్ లాల్ అగర్వాల్‌పై వేటు పడింది.


పలు రాష్ట్రాలు జంతువుల మార్పిడిలో భాగంగా పశ్చిమబెంగాల్ అధికారులు, త్రిపురలోని సిఫాహీజలా జంతు ప్రదర్శనశాల నుంచి రెండు సింహాలను సిలిగురి తీసుకువచ్చారు. సింహాలకు వివాదాస్పదంగా పేర్లు పెట్టడంతోపాటు, ఆ రెండు సింహాలను సిలిగురి జూ అధికారులు ఒకే ఎన్‌క్లోజర్‌లో ఉంచడం ఆ వివాదానికి ఆజ్యం పోసింది.ఈ ఘటనపై విచారణ జరిపిన కలకత్తా హైకోర్టు, సింహాలకు వివాదాస్పద పేర్లు పెట్టడాన్ని తీవ్రంగా తప్పుపట్టింది.లేని వివాదాలను ఎందుకు సృష్టిస్తారంటూ కోర్టు ప్రశ్నించింది.వెంటనే పేర్లు మార్చాలని ఆదేశించింది. త్రిపుర నుంచి సింహాలను తెచ్చే సమయానికే వాటికి ఆ పేర్లు ఉన్నాయని పశ్చిమబెంగాల్ ప్రభుత్వం చెప్పుకొచ్చింది. వాటిని వెంటనే మారుస్తామని కోర్టుకు వివరించింది.

K Venkateswara Rao | 11:58 AM, Mon Feb 26, 2024

జ్ఞానవాపి‌లో పూజలు చేసుకోవచ్చు : అలహాబాద్ హైకోర్టు సంచలన తీర్పు

ఉత్తరప్రదేశ్‌లోని జ్ఞానవాపి మసీదు సెల్లార్‌లో హిందువులు పూజలు చేసుకోవచ్చంటూ వారణాసి జిల్లా కోర్టు తీర్పును, అలహాబాద్ హైకోర్టు సమర్థించింది. వారణాసి జిల్లా కోర్టు తీర్పును సవాల్ చేస్తూ, కొందరు అలహాబాద్ హైకోర్టులో రివ్యూ పిటీషన్ వేశారు. దీనిపై విచారించిన కోర్టు జ్ఞానవాపి మసీదు సెల్లార్‌లో హిందువులు పూజలు చేసుకోవచ్చని సంచలన తీర్పు వెలువరించింది.


కోర్టు ఆదేశాల మేరకు సర్వే చేసిన ఏఎస్ఐ, జ్ఞానవాపి మసీదులో హిందూ దేవాలయాలకు చెందిన ఆధారాలు లభించాయని భారత ఆర్కియాలజీ సర్వే తేల్చి చెప్పింది. ఔరంగజేబు పరిపాలనా సమయంలో హిందూ దేవాలయంలో మసీదు నిర్మించారని ఏఎస్ఐ సర్వేలో తేలింది. ఆర్కియాలజీ సర్వే ఆధారంగా విచారణ జరిపిన వారణాసి కోర్టు, మసీదు సెల్లార్‌లో పూజలకు హిందువులను అనుమతించింది. దీనిపై కొందరు అలహాబాద్ హైకోర్టులో సవాల్ చేశారు. వారి పిటీషన్‌ను అలహాబాద్ హైకోర్టు కోట్టివేసింది.

K Venkateswara Rao | 11:18 AM, Mon Feb 26, 2024

ఏడోసారి : ఈడీ విచారణకు సీఎం కేజ్రీవాల్ గైర్హాజరు

ఢిల్లీ లిక్కర్ స్కాంలో సీఎం కేజ్రీవాల్ ఈడీ విచారణకు మరోసారి డుమ్మా కొట్టారు. ఇవాళ ఢిల్లీలోని ఈడీ కార్యాలయంలో హాజరుకావాలంటూ రెండు రోజుల కిందటే ఈడీ అధికారులు కేజ్రీవాల్‌కు నోటీసులు జారీ చేశారు. సోమవారం ఈడీ విచారణకు హాజరు కావాల్సి ఉంది. అయితే ఇవాళ తాను హాజరు కావడం లేదంటూ కేజ్రీవాల్ ఈడీ అధికారులకు సమాచారం అందించారు. కేజ్రీవాల్ విచారణకు హాజరుకాకపోవడం ఇది ఏడోసారి కావడం గమనార్హం.

ఈడీ విచారణ అంశం కోర్టులో ఉంది. మార్చి 16న విచారణకు రానుంది. అప్పటి వరకు ఆగాలని, న్యాయ వ్యవస్థను గౌరవించాలంటూ ఆప్ నేతలు చెబుతున్నారు. హాజరుకావాలంటూ పదేపదే నోటీసులు జారీ చేయడం సరికాదని వారు హితవు చెబుతున్నారు.

ఢిల్లీ లిక్కర్ స్కాంలో (delhi licquor scam) సీఎం కేజ్రీవాల్‌ను సీబీఐ ఇప్పటికే విచారించింది.సీబీఐ అధికారులు 2023 ఏప్రిల్ 9న 8 గంటల పాటు విచారించారు. విదేశాలకు నగదు తరలింపు వ్యవహారంలో ఈడీ కేసు నమోదు చేసింది. పలుమార్లు సమన్లు జారీ చేశారు. మద్యం కేసులోనే ఢిల్లీ మాజీ ఉప ముఖ్యమంత్రి మనీశ్ సిసోదియా, ఆప్ ఎంపీ సంజయ్‌సింగ్‌‌ను జైల్లో పెట్టారు.

K Venkateswara Rao | 10:28 AM, Mon Feb 26, 2024

మంగళగిరి ఎయిమ్స్‌ను జాతికి అంకితం చేసిన ప్రధాని

గుంటూరు జిల్లా మంగళగిరిలో 183 ఎకరాల సువిశాల విస్తీర్ణంలో కేంద్ర ప్రభుత్వం నిర్మించిన ఎయిమ్స్ ఆసుపత్రిని ప్రధాని మోదీ జాతికి అంకితం చేశారు. అధునాతన ఆసుపత్రితోపాటు, మెడికల్ కళాశాల నిర్మాణం కోసం గడచిన అయిదేళ్లలో కేంద్ర ప్రభుత్వం రూ.1618 కోట్లు ఖర్చు చేసింది. రాష్ట్ర ప్రభుత్వం స్థలం సమకూర్చింది. 2015 డిసెంబరు 19న ఎయిమ్స్‌కు శంకుస్థాపన చేశారు. 2019 మార్చి నాటికి కొన్ని భవనాలు పూర్తి చేశారు. అప్పటి నుంచే ఓపీ సేవలు ప్రారంభించారు.


2020 నుంచి ఇన్ పేషెంట్ సేవలు ప్రారంభించారు. ఇప్పటి వరకు దాదాపు లక్ష మందికి ఎయిమ్స్‌లో వైద్య సేవలు అందించారు. 15 పడకల ఈ ఆసుపత్రి పేదలకు అన్ని రకాల సేవలను అతి తక్కువ ఫీజులతో అందించనుంది. ప్రధాని మోదీ గుజరాత్‌లోని రాజ్‌కోట్, బటిండా ఆసుపత్రులను కూడా ప్రారంభించారు. ప్రధాని మోదీ ఆన్‌లైన్ ద్వారా ప్రారంభోత్సవం చేశారు. ఈ కార్యక్రమంలో ఏపీ గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్, రాష్ట్ర వైద్య, ఆరోగ్య మంత్రి విడదల రజని, పలువురు సీనియర్ అధికారులు పాల్గొన్నారు. ఎయిమ్స్‌లో 41 విభాగాలు పూర్తి స్థాయిలో సేవలందించనున్నాయి.

K Venkateswara Rao | 16:46 PM, Sun Feb 25, 2024

ఆరువారాల కాల్పుల విరమణ దిశగా ఇజ్రాయెల్

ఇజ్రాయెల్ హమాస్ ఉగ్రవాదుల మధ్య ఆరు వారాల కాల్పుల విరమణకు పారిస్ వేదికగా చర్చలు జరుగుతున్నాయి.కాల్పుల విరమణపై ఇప్పటికే ఒక ఒప్పందం కుదిరినట్లు తెలుస్తోంది. 300 మంది పాలస్తీనా ఖైదీల విడుదలకు బదులుగా, 40 మంది ఇజ్రాయెల్ బందీలను విడుదల చేసేందుకు ఇరువర్గాలు అంగీకరించినట్లు తెలుస్తోంది. అయితే దీనిపై ఇంకా అధికారిక ప్రకటన విడుదల చేయాల్సి ఉంది.పారిస్‌లో జరిగిన చర్చలపై వార్ కేబినెట్‌లో మరోసారి చర్చించి తుది నిర్ణయం తీసుకుంటామని ఇజ్రాయెల్ రాయబారులు ప్రకటించారు. ఇజ్రాయెల్ చేస్తోంది నరమేధమంటూ బ్రెజిల్ అధ్యక్షుడు లూలా ద సిల్వ తీవ్ర విమర్శలు చేశారు. చిన్నారులను,మహిళలను దారుణంగా హతమారుస్తున్నారని ఎక్స్‌లో పోస్ట్ చేశారు. ఇజ్రాయెల్ నరమేధానికి తలపడతోందంటూ దక్షిణాఫ్రికా అంతర్జాతీయ న్యాయస్థానంలో ఫిర్యాదు చేసింది. గాజాలోని వెస్ట్‌బ్యాంక్‌లో 3500 ఇళ్లు నిర్మిస్తామంటూ ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు చేసిన వ్యాఖ్యలపై అమెరికా అధ్యక్షుడు బైడెన్ తీవ్ర విమర్శలు చేశారు. ఇజ్రాయెల్ చర్యలను తప్పుపట్టారు.

K Venkateswara Rao | 09:55 AM, Sun Feb 25, 2024

కొత్త క్రిమినల్ చట్టాలు జులై 1 నుంచి అమల్లోకి

కేంద్ర ప్రభుత్వం కొత్తగా తెచ్చిన మూడు చట్టాలు జులై 1 నుంచి అమల్లోకి వస్తాయని ప్రకటించింది. బ్రిటిష్ కాలం నాటి చట్టాల స్థానంలో కేంద్రం ఇటీవల భారతీయ న్యాయ సంహిత, భారతీయ నాగరిక్ సురక్ష (bharatiya nyaya suraksha)  భారతీయ సాక్ష్య బిల్లు తీసుకు వచ్చిన సంగతి తెలిసిందే.1860నాటి భారతీయ శిక్షాస్మృతి, క్రిమినల్ ప్రొసీజర్ కోడ్, 1872నాటి ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్ స్థానంలో కేంద్ర ప్రభుత్వం కొత్త చట్టాలకు రూపకల్పన చేసింది. భారతీయ న్యాయ సంహిత, భారతీయ నాగరిక్ సురక్ష, సంహిత, భారతీయ సాక్ష్య బిల్లులకు పార్లమెంటు ఆమోదం తెలిపింది. గత డిసెంబరులో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము కూడా ఆమోద ముద్ర వేశారు.


కొత్త చట్టాలు రాజ్యాంగాన్ని కాపాడుతాయని, ప్రజల శ్రేయస్సుకు ప్రాధాన్యతనిస్తాయని కేంద్ర హూం మంత్రి అమిత్ షా గత ఏడాది పార్లమెంటులో బిల్లులు ప్రవేశపెడుతూ చెప్పారు. ఈ మూడు చట్టాలు అమల్లోకి వస్తే భారత న్యాయ వ్యవస్థ ప్రపంచంలోనే అత్యంత అధునాతనంగా తయారవుతుందని అమిత్ షా అభిప్రాయపడ్డారు.

K Venkateswara Rao | 15:44 PM, Sat Feb 24, 2024

కాసేపట్లో టీడీపీ జనసేన అసెంబ్లీ అభ్యర్థుల ప్రకటన

టీడీపీ జనసేన అసెంబ్లీ అభ్యర్థుల ప్రకటన

K Venkateswara Rao | 11:08 AM, Sat Feb 24, 2024

కర్ణాటక కాంగ్రెస్ ప్రభుత్వానికి ఎదురుదెబ్బ

ఏటా కోటి కంటే ఎక్కువ ఆదాయం వచ్చే దేవాలయాలపై పది శాతం పన్ను తప్పనిసరి చేస్తూ కర్ణాటక ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం బెడిసికొట్టింది. దీనిపై శాసనమండలిలో పెట్టిన బిల్లు వీగిపోయింది. అసెంబ్లీలో బిల్లు ఆమోదం పొందిన రెండు రోజుల తరవాత, మండలిలో బిల్లు ప్రవేశపెట్టారు. కర్ణాటకలో కాంగ్రెస్ పార్టీ హిందూ వ్యతిరేక విధానాలు అవలభిస్తోందని ఈ బిల్లుపై పెద్ద దుమారం రేగింది.కర్ణాటక శాసనమండలిలో ఎన్డీయేకు ఎక్కువ సంఖ్యా బలం ఉంది. మండలిలో కాంగ్రెస్ సభ్యులు 30 మంది ఉండగా, బీజేపీకి 35, జేడీ(ఎస్)కు 8 మంది ఎమ్మెల్సీలున్నారు. ఒకరు ఇండిపెండెంట్ ఉన్నారు. ఒక స్థానం ఖాళీగా ఉంది.కోటికన్నా ఎక్కువ ఆదాయంపై పది శాతం, 10 లక్షల నుంచి 90 లక్షల ఆదాయం ఉన్న దేవాలయాలపై 5 శాతం పన్ను వేయాలని కర్ణాటక అసెంబ్లీ తీర్మానించింది. ఇందుకు సంబంధించిన మత సంస్థలు, ధార్మిక ధర్మాదాయ సవరణ బిల్లు 2024ను అసెంబ్లీ ఆమోదించింది.

K Venkateswara Rao | 10:04 AM, Sat Feb 24, 2024

రష్యా యుద్ధంలోకి భారతీయులు : జాగ్రత్తగా ఉండాలని కేంద్రం హెచ్చరిక

రష్యా ఉక్రెయిన్ మధ్య జరుగుతోన్న యుద్ధంలోకి వంద మందికిపైగా భారత్‌కు చెందిన యువకులను అక్రమంగా తరలించారనే వార్తలు సంచలనంగా మారాయి. రష్యాలో యుద్ధం చేసే సైనికులకు సహాయకులుగా ఉండేందుకు కొందరు భారతీయ యువకులు సంతకాలు చేశారని విదేశాంగ శాఖ ప్రతినిధి రణధీర్ జైస్వాల్ తెలిపారు. దీనిపై రష్యాతో సంప్రదింపులు జరుపుతున్నట్లు ఆయన చెప్పారు. అక్కడ పనిచేస్తున్న వారిని విడిపించే ప్రయత్నాలు ప్రారంభించినట్లు జైస్వాల్ స్పష్టం చేశారు.ఎంఐఎం ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ కూడా ఇదే అంశాన్ని విదేశాంగ వ్యవహారాల శాఖ అధికారుల దృష్టికి తీసుకెళ్లారు. 12 మంది యువకులు దళారుల మాటలు నమ్మి రష్యా వెళ్లారని ఆయన బుధవారం మీడియాకు తెలిపారు. తెలంగాణ నుంచి ఇద్దరు, కర్ణాటక, గుజరాత్, కశ్మీర్, యూపీల నుంచి మరికొందరున్నారని ఓవైసీ ఆందోళన వ్యక్తం చేశారు.


బాధిత కుటుంబాలకు చెందిన వారు విషయం చెప్పడంతో విదేంశాఖ శాఖ మంత్రి జైశంకర్‌కు లేఖ రాసినట్లు చెప్పారు. కేంద్రం చొరప చూపి బాధితులను స్వస్థలాలకు తీసుకురావాలన్నారు. జాతీయ మీడియా కూడా రష్యాకు భారత యువకుల అక్రమ రవాణాపై కథనాలు ప్రచురించాయి. ఇప్పటికే కొందరు భారతీయ యువకులు యుద్ధంలో గాయపడినట్లు వార్తలు వస్తున్నాయి. నేపాల్ నుంచి కూడా అక్రమంగా 200 మంది రష్యాకు వెళ్లారనే సమాచారం సంచలనంగా మారింది.

K Venkateswara Rao | 16:56 PM, Fri Feb 23, 2024

మాజీ సీఎం మనోహర్ జోషి కన్నుమూత

మహారాష్ట్ర మాజీ సీఎం మనోహర్ జోషి కన్నుమూశారు. 86 సంవత్సరాల జోషి రెండు రోజుల కిందట గుండెపోటుతో ఆసుపత్రిలో చేరారు. ఇవాళ తెల్లవారుజామున చనిపోయినట్లు హిందుజా ఆసుపత్రి డాక్టర్లు ప్రకటించారు. శుక్రవారం మధ్యాహ్నం మనోహర్ జోషి అంత్యక్రియలు ముంబయిలో జరగనున్నాయి. మెదడులో రక్తం గడ్డకట్టడంతో చికిత్సకు స్పందించలేదని డాక్టర్లు తెలిపారు.శివసేనలో కీలక నేతగా గుర్తింపు పొందిన జోషి 1995 నుంచి నాలుగేళ్లపాటు ముఖ్యమంత్రిగా పనిచేశారు. వాజ్‌పేయి ప్రధానిగా ఉన్న సమయంలో 2002 నుంచి రెండేళ్లపాటు లోక్‌సభ స్పీకర్‌గాను సేవలందించారు. 1937 డిసెంబరు 2న మహారాష్ట్రలోని నాంద్వీలో జోషి జన్మించారు. ముంబయిలో చదువు పూర్తి చేశారు. ఆయనకు భార్య ఇద్దరు కుమార్తెలు, ఓ కుమారుడు ఉన్నారు. ఉపాధ్యాయ వృత్తితో జీవితం ప్రారంభించిన జోషి 1967లో రాజకీయాల్లోకి ప్రవేశించి అంచలంచెలుగా ఎదిగారు.

K Venkateswara Rao | 10:27 AM, Fri Feb 23, 2024

బైజూస్ సీఈవోకు లుక్‌అవుట్ నోటీసులు

ఎడ్ టెక్ సంస్థ బైజూస్ వ్యవస్థాపకుడు రవీంద్రన్‌‌కు ఈడీ లుక్ అవుట్ నోటీసులు (lookout notice to byjus ceo) జారీ చేసింది. ఇటీవల ఈ సంస్థ తీవ్ర ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోయిన సంగతి తెలిసిందే. రవీంద్రన్ దేశం విడిచి వెళ్లకుండా చూడాలంటూ సంబంధిన వర్గాలను ఈడీ ఆదేశించింది. గత ఏడాది కాలంలో బైజూస్ తీవ్ర ఆర్థిక సంక్షోభంలోకి దిగజారిపోయింది.ఇప్పటికే ఈడీ అధికారులు బెంగళూరులోని బైజూస్ ప్రధాన కార్యాలయంతోపాటు, రవీంద్రన్ ఇంట్లో కూడా సోదాలు నిర్వహించారు. రవీంద్రన్‌పై ఆన్ ఇంటిమేషన్ లుక్‌అవుట్ సర్క్యులర్ అమల్లో ఉంది. విదేశాలకు వెళ్లేప్పుడు ఈడీకి ముందుగా సమాచారం అందించాల్సి ఉంది. తాజా నిర్ణయంతో రవీంద్రన్ విదేశాలకు వెళ్లే అవకాశం ఉండదు.


బైజూస్ సీఈవో పదవి నుంచి రవీంద్రన్‌ను తొలగించేందుకు వాటాదారులు బోర్డు సమావేశానికి పిలుపునిచ్చారు. కొత్త బోర్డును ఎన్నుకునే అవకాశముంది. రేపు బోర్డు సమావేశం జరగనుంది. వాటాదారుల నిర్ణయాన్ని సవాల్ చేస్తూ బైజూస్ కర్ణాటక హైకోర్టును ఆశ్రయించింది.

K Venkateswara Rao | 13:15 PM, Thu Feb 22, 2024

ఢిల్లీ చలో రైతుల ఎక్స్ ఖాతాల నిలిపివేత

రైతులు చేపట్టిన ఢిల్లీ చలో కార్యక్రమం బుధవారంనాడు హింసాత్మకంగా మారడంతో కేంద్రం ముందస్తు చర్యలకు ఉపక్రమించింది. చలో ఢిల్లీ కార్యక్రమంలో పాల్గొంటోన్న 177 మంది రైతుల ఎక్స్ ఖాతాలు నిలిపేయాలని ఆ సంస్థను కేంద్ర ప్రభుత్వం ఆదేశించింది. కేంద్రం ఆదేశాల మేరకు వారి ఖాతాలు నిలిపేసినట్లు ఎక్స్ ప్రకటించింది. అయితే తమ వేదికపై అందరికీ భావప్రకటనా స్వేచ్ఛ ఉండాలని కోరుకుంటున్నట్లు తెలిపింది.తమ పాలసీని వ్యతిరేకంగా కేంద్ర నిర్ణయం ఉండటంపై ఎక్స్ రిట్ అప్పీలు దాఖలు చేసినట్లు ప్రకటించారు.దానిపై నిర్ణయం వెలువడాల్సి ఉంది. ఖాతాలు నిలిపివేసిన ఖాతాదారులకు నోటీసులు కూడా అందించినట్లు ఎక్స్ తెలిపింది. కొన్ని చట్టాల వల్ల ప్రభుత్వ ఆదేశాలు బహిర్గతం చేయలేమని ఎక్స్ వెల్లడించింది.ఢిల్లీ చలో కార్యక్రమం బుధవారంనాడు ఖనౌరీ వద్ద హింసాత్మకంగా మారిన విషయం తెలిసిందే. రైతులు పెద్ద ఎత్తున రాళ్లు రువ్వడంతో 12 మంది పోలీసులు కూడా గాయపడ్డారు. ఓ రైతు చనిపోయాడు. ఢిల్లీ చలో కార్యక్రమంలో పాల్గొంటున్న రైతులకు చెందిన 177 ఎక్స్ ఖాతాలు నిలిపేయాలని కేంద్ర ఐటీ శాఖ ఎక్స్‌ను కోరింది. ఆ మేరకు వారి ఖాతాలు నిలిపేసినట్లు ఎక్స్ ప్రకటించింది.

K Venkateswara Rao | 11:37 AM, Thu Feb 22, 2024

కందుల జాహ్నవి కేసును నీరుగార్చిన అమెరికా పోలీసులు

ఉన్నత విద్య కోసం అమెరికా వెళ్లి, రోడ్డు ప్రమాదంలో చనిపోయిన కందుల జాహ్నవి కేసును అక్కడి పోలీసులు నీరుకార్చారు. జాహ్నవి మృతిని (jahnavi kandula) అవహేళన చేస్తూ మాట్లాడిన అమెరికా పోలీసు అధికారి కెవిన్ డవేపై నేరాభియోగాలు మోపడం లేదని అధికారులు ప్రకటించారు. అతనిపై నేరాభియోగాలు మోపడానికి సరైన సాక్ష్యాలు లేవని కింగ్ కౌంటీ ప్రాసిక్యూటింగ్ కార్యాలయం తెలిపింది. సీనియర్ అటార్నీ విచారణ తరవాతే ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించారు.రోడ్డు ప్రమాదంలో చనిపోయిన కందుల జాహ్నవి ప్రమాదాన్ని అవహేళన చేస్తూ మాట్లాడి, ఆడియోలో అడ్డంగా దొరికిపోయినా,డవే మాత్రం ఆ సమయంలో అక్కడ లేరంటూ కింగ్ కౌంటీ ప్రాసిక్యూటింగ్ అటార్నీ తెలిపారు. అడెరెరె వ్యాఖ్యలు మాత్రం అమోదయోగ్యం కాదన్నారు. అడెరెరె వ్యాఖ్యలు పోలీసులపై ప్రజల నమ్మకాన్ని తగ్గించేవిగా ఉన్నాయన్నారు.

K Venkateswara Rao | 09:53 AM, Thu Feb 22, 2024

ఐఐటీ, ఐఐఎం, ఐసర్ ప్రత్యేకతలెన్నో.

రాష్ట్ర విభజన హామీలను కేంద్ర ప్రభుత్వం నెరవేర్చింది. కేంద్ర ప్రభుత్వం తిరుపతి సమీపంలో ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన ఐఐటీ, ఐసర్ భవనాలను సిద్దం చేసింది. 2017లో ఐఐటీ, ఐసర్ పనులు ప్రారంభం కాగా, నేడు తుదిరూపుదిద్దుకున్నాయి. తిరుపతి సమీపంలోని శ్రీనివాసపురంలో 255 ఎకరాల విస్తీర్ణంలో, రూ.2117 కోట్ల వ్యయంతో ఐసర్ భవనాలు నిర్మించారు. తిరుపతి సమీపంలోని ఓ ప్రైవేటు ఇంజనీరింగ్ కాలేజీలో ఇప్పటి వరకు తాత్కాలికంగా ఐసర్ విద్యార్థులకు తరగతులు నిర్వహించారు. ఈ ఏడాది నుంచి కొత్త భవనంలో 1500 మంది విద్యార్ధులు చదువు కొనసాగించనున్నారు.ఐఐటిటి ప్రత్యేకతలు

దేశంలో అత్యంత ప్రతిష్ఠాత్మక సంస్థ ఐఐటీ. ఐఐటీలో సీటు సాధించాలని లక్షలాది విద్యార్థులు కలలుకంటూ ఉంటారు. ఏపీలోనే ఐఐటీ సంస్థలో చదువుకునే అవకాశం తెలుగు విద్యార్థులకు అందుబాటులోకి వచ్చింది. తిరుపతి సమీపంలో ఏర్పేడు నందికొండలకు ఆనుకుని 578 ఎకరాల్లో ఐఐటీ భవనాలు సిద్దం చేశారు. సాంకేతిక విద్యను అందించడంలో ఐఐటీలకు తిరుగేలేదు. ఏర్పేడు ఐఐటీలో ఈ ఏడాది నుంచి 1550 మంది విద్యార్థులు చదువుకోనున్నారు.విశాఖ సిగలో ఐఐఎం మణిహారం

విశాఖ నగరానికి సమీపంలో మరో విద్యాసంస్థ ప్రారంభమైంది. కేంద్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా నిర్మించిన ఐఐఎంను ప్రధాని మోదీ ప్రారంభించారు. రాష్ట్ర విభజన హామీల్లో భాగంగా ఐఐఎం నిర్మించారు. 2016 నుంచి ఆంధ్రా యూనివర్శిటీలో తాత్కాలికంగా తరగతులు నిర్వహిస్తున్నారు. విశాఖ జిల్లా ఆనందపురం సమీపంలోని గంభీరలో 436 ఎకరాల్లో ఐఐఎం క్యాంపస్ పర్యావరణహిత భవనాలతో సిద్దమైంది.ప్రత్యేకతలెన్నో...

ఐఐఎం క్యాంపస్ అంటే కేవలం భవనాలే కాదు. అక్కడ పర్యావరణహితంగా నిర్మించిన ఎకో భవనాలు నిర్మాణరంగంలో మైలురాయిగా నిలవనున్నాయి. రూ.445 కోట్ల వ్యయంతో ఐఐఎం పర్యావరణహిత క్యాంపస్‌ను సౌర విద్యుత్ సదుపాయాలతో సిద్దం చేశారు. ఫ్యాకల్టీ భవన్, అడ్మిన్ బ్లాక్, తరగతి గదులు, విద్యార్థుల వసతి గృహాలను తీర్చి దిద్దారు. క్యాంపస్‌లో 7200 జాతుల ఫల, పుష్ప మొక్కలను నాటారు.

K Venkateswara Rao | 12:31 PM, Tue Feb 20, 2024

ప్రధాని చేతుల మీదుగా ఐఐఎం, ఐఐటీ, ఐసర్ ప్రారంభం

విభజన హామీల్లో భాగంగా కేంద్ర ప్రభుత్వం చిత్తూరు జిల్లాలో చేపట్టిన ఐఐటీ, ఐసర్ విద్యాసంస్థలను ప్రధాని మోదీ (pm modi) విర్చువల్‌గా నేడు జాతికి అంకితం చేయనున్నారు. 2017లో ఈ రెండు సంస్థలకు శంకుస్థాపన చేశారు. నేడు పూర్తి స్థాయిలో సిద్దమయ్యాయి. ఐఐటీ, ఐసర్ భవనాలను ప్రధాని ఆన్‌లైన్ ద్వారా ప్రారంభం చేయనుండగా, ఉప ముఖ్యమంత్రి నారాయణ స్వామి, తిరుపతి ఎంపీ మద్దెల గురుమూర్తి, శ్రీకాళహస్తి ఎమ్మెల్యే బియ్యపు మధుసూధన్‌రెడ్డి, ఐఐటీ డైరెక్టర్ కె.ఎన్.సత్యనారాయణ పాల్గోనున్నారు.


విశాఖలో ప్రతిష్ఠాత్మక విద్యాసంస్థ ఐఐఎం సిద్దమైంది. 436 ఎకరాల్లో రూ.445 కోట్ల వ్యయంతో విశాఖ జిల్లా ఆనందపురం మండలం, గంభీరం వద్ద నిర్మించిన ఐఐఎం భవనాలను ప్రధాని మోదీ ఇవాళ ఆన్‌లైన్ ద్వారా ప్రారంభించనున్నారు. ఐఐఎం భవనాలను పర్యావరణహితంగా తీర్చిదిద్దారు. ఇప్పటికే ఆచార్యుల భవనాలు, పరిపాలన భవనంతోపాటు, విద్యార్థుల వసతి గృహాలను పూర్తి చేశారు. అత్యాధునిక హంగులతో విశాఖ ఐఐఎం క్యాంపస్‌ను తీర్చిదిద్దారు.

K Venkateswara Rao | 11:12 AM, Tue Feb 20, 2024

గాజాపై ఇజ్రాయెల్ భీకర దాడులు : 29 వేలు దాటిన మృతులు

హమాస్ తీవ్రవాదులను పూర్తిగా తుడిచివేసేందుకు ఇజ్రాయెల్ సైన్యం భీకరదాడులు (hamas israel war) కొనసాగిస్తోంది. సోమవారం ఒక్క రోజే 107 మంది చనిపోయారు. గత ఏడాది అక్టోబరు 7న హమాస్ ఉగ్రవాదులు ఇజ్రాయెల్‌పై మెరుపుదాడికి దిగినప్పటి నుంచి నేటి వరకు జరిగిన పోరులో మొత్తం 29092 మంది చనిపోయారు. 69 వేల మందికిపైగా గాయపడ్డారు. పది వేల మంది హమాస్ ఉగ్రవాదులను హతమార్చామని ఇజ్రాయెల్ ప్రకటించింది. 236 మంది సైనికులు ప్రాణాలు కోల్పోయారని ఐడీఎఫ్ తెలిపింది.మరోవైపు ఎర్రసముద్రంలో హౌతీలు రెచ్చిపోతున్నారు. తాజాగా సరకు రవాణా నౌకపై దాడికి దిగడంతో అందులోని సిబ్బంది పరారయ్యారు. బాబ్ ఎల్ మండేప్ ప్రాంతంలో సరకు రవాణా నౌకపై దాడి చేయడంతో తీవ్ర నష్టం వాటిల్లింది. గల్ఫ్ ఆఫ్ ఎడెన్‌లోనూ మరో నౌకపై హౌతీలు దాడిచేశారు.హౌతీ దాడులను అమెరికా తీవ్రంగా ఖండించింది. ప్రతిదాడులుంటాయని హెచ్చరించింది.

K Venkateswara Rao | 10:54 AM, Tue Feb 20, 2024

జార్జియా సెనేట్‌కు యువ భారతీయ అమెరికన్ అశ్విన్ రామస్వామి పోటీ

అధ్యక్ష ఎన్నికలకు సిద్దమవుతున్న వేళ,అమెరికా ఎన్నికల్లో జార్జియా నుంచి యువ భారతీయ అమెరికన్ అశ్విన్ రామస్వామి సెనేటర్‌గా బరిలో నిలుస్తున్నారు. జెన్ జెడ్‌గా వ్యవహరించే 1997 నుంచి 2012 మధ్య జన్మించిన రామస్వామి వయసు కేవలం 24 సంవత్సరాలే కావడం గమనార్హం. ఇంత చిన్న వయసులో సెనెట్‌కు పోటీ చేస్తున్న భారతీయ అమెరికన్‌గా అశ్విన్ రామస్వామి చరిత్రలో నిలిచారు.


నా సమాజానికి తిరిగి ఇవ్వడానికే రిపబ్లికన్ పార్టీ నుంచి జార్జియా స్టేట్ సెనేట్‌కు పోటీ చేస్తున్నానని అశ్విన్ రామస్వామి (ashwin ramaswamy) మీడియాకు వివరించారు. అందరికీ అవకాశాలు కల్పించడమే లక్ష్యంగా బరిలో దిగుతున్నట్లు ఆయన చెప్పారు.

యువత రాజకీయాల్లో తమ సత్తా చాటడంతోపాటు, తమకు స్వరం ఉందని నిరూపిస్తామన్నారు. రాజకీయాల్లో సాంప్రదాయేతర నేపథ్యాల నుంచి వచ్చిన తనలాంటి యువతకు ప్రాతినిథ్యం వహించాలనుకుంటున్నట్లు చెప్పారు. జార్జియాలోని 48వ జిల్లా నుంచి అశ్విన్ సెనేట్‌కు పోటీ చేస్తున్నారు.

అశ్విన్ రామస్వామి నెగ్గితే మొదటి జెన్ జెడ్ సెనేటర్‌గా గుర్తింపు పొందనున్నారు. కంప్యూటర్ సైన్స్, న్యాయ శాస్త్రం రెండు డిగ్రీలను అశ్విన్ కలిగి ఉన్నారు. అశ్విన్ తల్లిదండ్రులు, తమిళనాడు నుంచి 1990లో అమెరికాకు వలస వెళ్లారు.

K Venkateswara Rao | 15:41 PM, Mon Feb 19, 2024

యాత్రా స్థలాలే కాదు...దేశమంతా హైటెక్ మౌలిక సదుపాయాల అభివృద్ది : ప్రధాని

దేవాలయాల ప్రాంతాలే కాదు, దేశమంతా అత్యాధునిక మౌలిక సదుపాయాలను అభివృద్ధి చేస్తున్నామని ప్రధాని మోదీ గుర్తు చేశారు. ఉత్తరప్రదేశ్‌లోని సంబల్‌లో గ్రాండ్ శ్రీ కల్కి ధామ్‌కు ప్రధాని మోదీ శంకుస్థాపన (pm modi lays foundation stone for kalki dham temple) చేశారు. భారతీయల విశ్వాసాలకు గ్రాండ్ కల్కి ధామ్ రాబోయే రోజుల్లో ఒక గొప్ప కేంద్రంగా విలశిల్లనుందన్నారు.కొత్త దేవాలయాలే కాదు, దేశంలో వందలాది నూతన ఆసుపత్రులు, మెడికల్ కాలేజీలను నిర్మిస్తున్నట్లు ఆయన చెప్పారు. దేశం నుంచి తరలిపోయిన పురాతన వస్తు సంపదను కూడా వెనక్కు తెచ్చే కార్యక్రమం మొదలైందని ప్రధాని గుర్తు చేశారు. దేశంలో విదేశీ పెట్టుబడులు రికార్డు స్థాయికి పెరిగాయని, ప్రపంచంలోని ఏ మారుమూల దేశంలో ఉన్నా భారతీయులు గర్వంగా తలెత్తుకు తిరగగలుగుతున్నారని సంతోషం వ్యక్తం చేశారు.


2024 జనవరి 22న అయోధ్యలో రామాలయానికి ప్రాణ ప్రతిష్ఠ చేయడంతో కొత్త శకం ప్రారంభమైందన్నారు. రాముడు వేలాది సంవత్సరాలు సుపరిపాలన చేశారని, అయోధ్యలో బాలరాముని ఆలయం ప్రారంభంతో రాబాయే వెయ్యి సంవత్సరాల్లో నూతన శకం మొదలవుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు.

K Venkateswara Rao | 14:23 PM, Mon Feb 19, 2024

రాబోయే వంద రోజులు చాలా కీలకం : ప్రధాని మోదీ

వచ్చే ఎన్నికల్లో బీజేపీ 370 ఎంపీ సీట్లు సాధిస్తుందని ఆ పార్టీ ఢిల్లీలో నిర్వహించిన జాతీయ మండలి సమావేశంలో ప్రధాని మోదీ ఆశాభావం వ్యక్తం చేశారు. నవభారత్ నిర్మాణం కోసం ప్రతి ఒక్కరు నిరంతరం కృషి చేయాలని పిలుపునిచ్చారు. పదేళ్ల బీజేపీ పాలనలో 25 కోట్ల మందిని పేదరికం నుంచి బయటకు తీసుకువచ్చినట్లు ఆయన గుర్తుచేశారు. భారత్‌ను ప్రపంచం గుర్తించిందని, దేశం కోసం ఇంకా పనిచేయాల్సింది చాలా ఉందని ఆయన అన్నారు. ఏక్ భారత్, శ్రేష్ట్ భారత్ అనేదే మన నినాదం కావాలన్నారు.ఇప్పటికే పదేళ్లు ప్రధానిగా చేశారని, విశ్రాంతి తీసుకోవాలని ఓ బీజేపీ సీనియర్ నేత కోరాడని, అయితే తాను రాజకీయాల కోసం, పేరుకోసం మరోసారి ప్రధాని కావాలని ఆకాక్షించడం లేదని, దేశం కోసమేనని ప్రధాని మోదీ అన్నారు. వచ్చే ఎన్నికలకు ప్రతి ఓటరును బీజేపీ నేతలు కలవాలన్నారు.రాబోయే ఐదేళ్లలో భారత్ ప్రపంచంలో నాలుగు అగ్రరాజ్యాల ఆర్థిక వ్యవస్థల్లో ఒకటిగా ఎదుగుతుందన్నారు. దేశంలో 4 కోట్ల మంది పేదలకు ఇళ్లు నిర్మించిన ఘనత బీజేపీకే దక్కుతుందన్నారు. అంతక ముందు కేంద్ర హోం మంత్రి అమిత్ షా మాట్లాడుతూ ఇండీ కూటమి పని అయిపోయిందన్నారు. కుటుంబ పార్టీలకు కాలం చెల్లిందన్నారు. రాబోయే ఎన్నికల్లో ఎన్డీయే కూటమి 400పైగా సీట్లు సాధిస్తుందని షా ఆశాభావం వ్యక్తం చేశారు.

K Venkateswara Rao | 15:51 PM, Sun Feb 18, 2024

ఆడ, మగ సింహాలు ఒకే ఎన్‌క్లోజర్లో : కోర్టును ఆశ్రయించిన వీహెచ్‌పీ

పశ్చిమబెంగాల్ అటవీ శాఖ అధికారులు తీసుకున్న నిర్ణయం వివాదానికి దారితీసింది. పశ్చిమబెంగాల్ శిలిగురి సఫారీ పార్క్‌లో అక్బర్, సీత అనే రెండు మగ, ఆడ సింహాలను ఒకే ఎన్‌క్లోజర్‌లో ఉంచడం తీవ్ర వివాదానికి దారితీసింది. అటవీశాఖ అధికారుల నిర్ణయంపై వీహెచ్‌పీ కోర్టును ఆశ్రయించింది. జూ పార్కు డైరెక్టరును ప్రతివాదులుగా చేర్చారు.కోల్‌కతా హైకోర్టులో వీహెచ్‌పీ నాయకులు కేసు వేయగా, అది 20వ తేదీ విచారణకు రానుంది. త్రిపురలోని సిపాహాజలా జూ పార్కు నుంచి అధికారులు మగ, ఆడ సింహాలను తీసుకువచ్చారు. కావాలనే అధికారులు అలాంటి పేర్లు పెట్టారని వీహెచ్‌పీ ఆరోపిస్తోంది. వెంటనే ఆడ సింహం పేరు మార్చాలంటూ వారు కోర్టును ఆశ్రయించారు. అయితే వాటికి ఇంకా పేర్లు ఖరారు చేయలేదని అధికారులు చెబుతున్నారు.

K Venkateswara Rao | 11:09 AM, Sun Feb 18, 2024

ఎన్నికల నిర్వహణకు సిద్దం : సీఈసీ

సార్వత్రిక ఎన్నికల నిర్వహణకు అంతా సిద్దం చేసినట్లు కేంద్ర ఎన్నికల సంఘ ప్రకటించింది. ఒడిషాలో పర్యటించిన కేంద్ర ఎన్నికల సంఘం ప్రధాన అధికారి రాజీవ్ కుమార్ భువనేశ్వర్‌లో మీడియాతో మాట్లాడుతూ ఈ విషయం వెల్లడించారు. లోక్‌సభ, నాలుగు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలకు యంత్రాంగాన్ని సిద్దం చేసినట్లు తెలిపారు. ఒడిషాల్లో 50 శాతం పోలింగ్ కేంద్రాల్లో వెబ్ కాస్టింగ్ సదుపాయం కల్పించినట్లు ప్రకటించారు.వచ్చే ఎన్నికల్లో ఓటర్లంతా తమ ఓటు హక్కు ఉపయోగించుకోవాలని కోరారు. అధికారులు నిష్పక్షపాతంగా, పారదర్శంగా పనిచేయాలని ఆదేశించారు. అన్ని పార్టీలను అందుబాటులో ఉండాలని అధికారులను కోరారు. ఎన్నికల్లో డబ్బు ప్రభావం, మందు, హింసకు తావులేకుండా చూడాలని అధికారులను ఆదేశించారు. పోలింగ్‌కు భద్రతా ఏర్పాట్లు పూర్తి చేశారు. పోలింగ్ పూర్తి అయ్యాక ఈవీఎంలకు మూడంచెల భద్రత కల్పించనున్నారు.

K Venkateswara Rao | 19:41 PM, Sat Feb 17, 2024

జీఎస్ఎల్వీ - ఎఫ్14 ప్రయోగం విజయవంతం

ఇస్రో ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన జీఎస్ఎల్వీ - ఎఫ్14 ప్రయోగం విజయవంతమైంది. శనివారం సాయంత్రం 5 గంటల 30 నిమిషాలకు ప్రారంభమైన ప్రయోగం 6 గంటల 46 నిమిషాలకు ముగిసింది. జీఎస్ఎల్వీ - ఎఫ్14 వాహకనౌకతో ఇన్సాట్-3డీఎస్ ఉపగ్రహాన్ని విజయవంతంగా ప్రయోగించినట్లు ఇస్రో ఛైర్మన్ ప్రకటించారు. కక్ష్యలోని ప్రవేశించేందుకు వాహకనౌక మరో రెండు రోజులు ప్రయాణం చేయాల్సి ఉంది.


వాతావరణం, భూమి, సముద్ర ఉపరితలాలపై ప్రయోగాలు చేసేందుకు ఈ ఉపగ్రహం పనిచేయనుంది. ఇప్పటికే ప్రయోగించిన రెండు వాతావరణ ఉపగ్రహాలతో ఇది సమన్వయం చేసుకోనుంది. 2275 కిలోల బరువైన ఉపగ్రహాన్ని జీఎస్ఎల్వీ వాహకనౌక విజయవంతంగా నింగిలోకి తీసుకెళ్లింది. ఇక నుంచి వాతావరణ పరిశీలన మరింత మెరుగ్గా జరగనుందని శాస్త్రవేత్తలు ఆశాభావం వ్యక్తం చేశారు.

K Venkateswara Rao | 19:04 PM, Sat Feb 17, 2024

ఇస్రో జీఎస్ఎల్వీ ఎఫ్ 14 ప్రయోగం లైవ్

isro gslv f14 

K Venkateswara Rao | 17:13 PM, Sat Feb 17, 2024

వందేభారత్ ప్రయాణం మరింత సురక్షితం

రైళ్లు ఢీ కొట్టుకోకుండా స్వదేశీ తయారీ యాంటీ కొలిజన్ డివైస్ కవచ్‌ను వందేభారత్ రైలులో విజయవంతంగా ప్రయోగించారు. గంటకు 160 కి.మీ వేగంలో కూడా ఈ కవచ్ విజయవంతంగా పనిచేసింది. 8 బోగీలున్న వందేభారత్ రైలులో (vandebharat train kavach test) కవచ్ ఆటోమేటిగ్గా బ్రేకులు వేసింది.యూపీలోని మథుర, పాల్వాల్ మధ్య ఈ పరీక్షను విజయవంతంగా నిర్వహించారు.రైళ్లు ఢీ కొట్టుకోకుండా నిరోధించే కవచ్‌ను రీసెర్చ్ డిజైన్స్ అండ్ స్టాండర్డ్స్ ఆర్గనైజేషన్ తయారు చేసింది. లోకోపైలెట్ పొరపొటున బ్రేకులు వేయకుంటే వెంటనే కవచ్ రంగంలోకి దిగి రైలును ఆపుతుంది.ప్రయోగంలో వందేభారత్ రైలును 160 కి.మీ వేగంతో నడిపారు. లోకో పైలెట్ బ్రేకులు వేయలేదు. కవచ్ ఆటోమేటిగ్గా వందేభారత్ రైలును నిలిపివేసింది. ఈ వ్యవస్థను దేశ వ్యాప్తంగా రైల్వే లైన్ల వెంట అమలు చేయడానికి ఆర్‌ఎఫ్ఐడీ ట్యాగులు, కవచ్ టవర్లు అవసరం ఉంటుంది. వీటిని దేశ వ్యాప్తంగా ఏర్పాటు చేయడానికి రైల్వే శాఖ (bharatiya railways) సిద్దం అవుతోంది.

K Venkateswara Rao | 10:48 AM, Sat Feb 17, 2024

సార్వత్రిక ఎన్నికలకు 3.40 లక్షల కేంద్ర బలగాలు

సార్వత్రిక ఎన్నికలకు కేంద్రం సిద్దమవుతోంది. లోక్‌సభతోపాటు, ఏపీ, అరుణాచల్‌ప్రదేశ్, ఒడిషా, సిక్కిం రాష్ట్రాల ఎన్నికలకు 3.40 లక్షల కేంద్ర బలగాలు (crpf) అవసరం అవుతాయని అంచనా వేశారు. ఇందుకు అనుగుణంగా పలు రాష్ట్రాలకు కేటాయింపులు చేశారు.కేంద్ర ఎన్నికల సంఘం అవసరాల మేరకు 3400 కంపెనీల కేంద్ర బలగాలను వినియోగించనున్నట్లు ఓ ఉన్నతాధికారి మీడియాకు తెలిపారు.దశల వారీగా ఎన్నికలు జరగనుండటంతో బలగాలను ఒక ప్రాంతం నుంచి మరో ప్రాంతానికి తలించనున్నారు.కేంద్ర బలగాలను మోహరించేందుకు ఆయా రాష్ట్రాల ఎన్నికల అధికారుల సూచనల మేరకు పంపించడం జరుగుతుంది. ఈవీఎంలకు రక్షణ కల్పించడం, ఓటర్లలో భయం లేకుండా చేయడం, ఎన్నికలకు అడ్డుపడే శక్తులను అణచివేయడంలాంటి విధులను కేంద్ర బలగాలు నిర్వహించనున్నాయి. రాబోయే రెండు మాసాల్లో లోక్‌సభ ఎన్నికలతోపాటు, నాలుగు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో 98 కోట్ల మంది ఓటర్లు పాల్గొనున్నారు.కేంద్ర బలగాల్లో 920 బెటాలియన్లను పశ్చిమబెంగాల్, 635 జమ్ము, కశ్మిర్‌లకు కేటాయించారు. మరో 360 కంపెనీలు ఛత్తీస్‌గఢ్‌కు, 295 బిహార్‌కు, ఉత్తరప్రదేశ్‌కు 252 కంపెనీలు, మరో 250 కంపెనీలు ఏపీకి కేటాయించారు. పంజాబ్, ఝార్ఖండ్ రాష్ట్రాలకు చెరి 200 కంపెనీలు, మణిపుర్, రాజస్థాన్, తమిళనాడులకు 175 కంపెనీల చొప్పుల కేంద్ర బలగాలను కేటాయించారు.ఏప్రిల్‌లో మొదలయ్యే ఎన్నికలు మే చివరి నాటికి ముగియనున్నాయి. 543 లోక్‌సభ ఎంపీలను ప్రజలు ఎన్నుకోనున్నారు. ఎన్డీయే కూటమికి ఇప్పటికే 370 మంది సభ్యుల బలం ఉండగా, వచ్చే ఎన్నికల్లో 400పైగా సీట్లు సాధించాలని యోచిస్తోంది.

K Venkateswara Rao | 14:03 PM, Thu Feb 15, 2024

ఆమెకు ఆమే సాటి - నైటింగేల్ ఆఫ్ ఇండియా సరోజినీనాయుడు

సరోజినీనాయుడు. ఆ పేరు తెలియని భారతీయులుండరు. స్వాతంత్ర్య సమరయోధురాలుగా, కవయిత్రిగా, జాతీయ కాంగ్రెస్‌కు మొదటి మహిళా అధ్యక్షురాలిగా, తొలి మహిళా గవర్నరుగా ఆమె దేశానికి అందించిన సేవలు నిరుపమానం. సరోజినీనాయుడు 135వ జయంతోత్సవాల సందర్భంగా ఆమె దేశానికి చేసిన సేవలు మరోసారి స్మరించుకుందాం.
పువ్వుపుట్టగానే పరమళించడం అంటే ఇదేకదా

సరోజినీనాయుడు 1879వ సంవత్సరం, ఫిబ్రవరి 13వ తేదీన హైదరాబాద్‌లో జన్మించారు. తండ్రి డాక్టర్ అఘోరనాథ్ చటోపాధ్యాయ, తల్లి వదర సుందరి దంపతుల గారాలపట్టి సరోజినీనాయుడు. అఘోరనాథ్ చటోపాధ్యాయ హైదరాబాద్ నిజాం కాలేజీకి మొదటి ప్రధానోపాధ్యాయుడిగా పనిచేశారు. తల్లి వరదాదేవి రచయిత్రి. బెంగాలీలో అనేక కావ్యాలు, కథలు రచించారు. తండ్రి అఘోరనాథ్ 8 భాషల్లో పండితుడు. విద్యాధికుల కుటుంబంలో జన్మించడంతో సరోజినీనాయుడు కూడా చదువులో ప్రతిభ చూపారు. బాల్యం నుంచి ప్రతి విషయం నేర్చు కోవాలనే కుతాహలం కనబరిచేవారు. పట్టుబట్టిన విషయం తెలుసుకునే వరకు వదిలేవారు కాదు.చిన్నతనం నుంచి ఆమెకు ఇంగ్లీషుపై మమకారం ఉండేది. ఇంగ్లీషులో మాట్లాడాలనే పట్టుదలతో భాషపై పట్టుసాధించింది. సెయింట్ జార్జ్ గ్రామర్ స్కూల్‌లో ప్రాథమిక విద్యను పూర్తి చేసింది. పదకొండో తరగతి నాటికే ఇంగ్లీషులో అనర్గళంగా మాట్లాడటం నేర్చుకుంది.అప్పటికే ఇంగ్లీషులో రచనలు కూడా ప్రారంభించింది. 12 సంవత్సరాలకే మద్రాసు విశ్వవిద్యాలయంలో మెట్రిక్కులేషన్ పూర్తి చేయగలిగిందంటే అంటే ఆమె ప్రతిభ అర్థం చేసుకోవచ్చు.గోల్డెన్ త్రెషోల్డ్ విద్యా దేవాలయం

సరోజినీనాయుడు తండ్రి నాంపల్లి రైల్వే స్టేషన్ సమీపంలో ఓ బంగ్లాలో నివశించేవారు.ఆ బంగ్లాను సరోజినీనాయుడు కుమార్తె పద్మజా నాయుడు 1974లో హైదరాబాద్ యూనివర్సిటీకి ఉచితంగా ఇచ్చారు. 1975లో ప్రధాని ఇందిరాగాంధీ ఆ భవనాన్ని హైదరాబాద్ యూనివర్సిటీకి అంకితం చేశారు.విదేశాల్లో ఉన్నత చదువులు

సరోజినీనాయుడు 13వ ఏటనే సరోవరరాణి పేరుతో పెద్ద రచనే చేశారు. పదమూడు వందల పంక్తులతో, చెప్పదలచుకున్న విషయాన్ని సూటిగా అందరి హృదయాలను తాకేలా ఆమె రచన సాగించారు. ఆమె ప్రతిభను గుర్తించిన నిజాం నవాబు ఉన్నత చదువులకు విదేశాలకు పంపాలని నిర్ణయించుకున్నారు. ఆమెకు ఆ రోజుల్లోనే రూ.4200 వేతనంగా ఇచ్చి విదేశాల్లో విద్యనభ్యసించేందుకు పంపించారు. నిజాం నవాబు ప్రోత్సాహంతో సరోజినీనాయుడు లండన్‌లోని కేంబ్రిడ్జి విశ్వవిద్యాలయంలో విద్యాభ్యాసం చేశారు. చదువుకుంటూనే రచనలు కొనసాగించారు.ఆమె రచనల్లో భారతీయుల జీవితాలు ప్రతిబింబించేవి.సరోజినీనాయుడు రచనల్లో బర్డ్ ఆఫ్ టైమ్, ది గోల్డెన్ త్రెషోల్డ్, ది బ్రోకెన్ వింగ్స్ ప్రసిద్దమైనవి.
వివాహం..కుటుంబ బాధ్యతలు

1898లో విదేశాల్లో విద్యను పూర్తి చేసుకుని సరోజినీనాయుడు, స్వదేశానికి తిరిగి వచ్చారు. ముత్యాల గోవిందరాజులునాయుడును ఆమె వివాహం చేసుకున్నారు. అప్పటికే ఆయన హైదరాబాద్‌ ప్రధాన ఆరోగ్య అధికారిగా పనిచేస్తున్నారు. కులం, మతం, మూఢ విశ్వాసాలకు సరోజినీనాయుడు దూరంగా ఉండేవారు. కులమతాలకు అతీతంగా సమసమాజ స్థాపన చేయాలని ఆమె జీవితాంతం పరితపించారు. సరోజినీనాయుడు దంపతులకు ఒక కుమారుడు, ఇద్దరు కుమార్తెలు కలిగారు. కుమారుడు ముత్యాల జయసూర్యనాయుడు.హోమియో డాక్టర్. ప్రముఖ స్వాతంత్ర్య సమరయోధులు కూడా. వీరి కుమార్తె పద్మజానాయుడు బెంగాల్ గవర్నర్‌గా సేవలందించారు.
ముగ్గురు సంతానం కలిగినా సరోజినీనాయుడు, వారి గురించే కాకుండా దేశం గురించి ఆలోచన చేశారు. స్వాతంత్ర్య ఉద్యమంలోకి దూకారు. ఆంగ్లేయుల పాలనకు వ్యతిరేకంగా దేశమంతా పర్యటించారు. అఖిల భారత జాతీయ కాంగ్రెస్ పార్టీలో చేరి, గోపాల కృష్ణగోఖలే మార్గంలో నడిచారు. అనేక ఉద్యమాల్లో పాల్గొని జాతీయ నాయకురాలిగా ఎదిగారు.మహిళా విద్యా అవసరాన్ని గుర్తించిన సరోజినీనాయుడు

1906లో మహిళా విద్య అవసరాన్ని గుర్తించిన సరోజినీనాయుడు, వారిలో చైతన్యం తీసుకువచ్చే ప్రయత్నం చేశారు. జాతీయ కాంగ్రెస్ పార్టీలో చేరి 1915లో ముంబైలో జరిగిన మహాసభలు, 1916లో లక్నోలో జరిగిన సభల్లో పాల్గొన్నారు. జాతి వేరనీ, నువ్వు వేరనీ విడిగా ఉండకు, నీకు అన్యాయం జరిగితే దేశానికి జరిగినట్లే, దేశం అనుభవించే బానిసత్వం, నీవు కూడా అనుభవిస్తున్నట్లే అంటూ దేశమంతా తిరుగుతూ దేశభక్తిని నింపారు.దేశమంతా విస్తృతంగా తిరగడంతో సరోజినీనాయుడు 1919లో తీవ్ర అనారోగ్యం పాలైంది. జలియన్ వాలా బాగ్ ఉదంతం సమయంలో ఆమె లండన్లో చికిత్స పొందుతోంది. అప్పటికే ఆమెకు గుండెజబ్బు బాగా ముదిరిపోయిందని డాక్టర్లు హెచ్చరించారు. అయినా డాక్టర్ల మాటలు లెక్కచేయకుండా జలియన్ వాలా బాగ్ ఉదంతానికి వ్యతిరేకంగా జరిగిన ఉద్యమంలో పొల్గొన్నారు.శాసనోల్లంఘన

లండన్‌లో చికిత్సకోసం వెళ్లిన సరోజినీనాయుడు జలియన్ వాలా బాగ్ ఉదంతంతో వెంటనే ఓడలో భారత్ చేరుకున్నారు.వెంటనే శాసనోల్లంఘన ఉద్యమంలో పాల్గొన్నారు. గాంధీజీ ఆదేశాల మేరకు బ్రిటిష్ దొరల శాసనాలు దిక్కరిస్తూ చరిత్ర పుస్తకాలను వీధుల్లో అమ్మి శాసనోల్లంఘనలో పాల్గొంది. గాంధీజీతో 1931లో లండన్‌లో జరిగిన రౌండ్ టేబుల్ సమావేశాలకు హాజరైంది. 1942 క్విట్ ఇండియా ఉద్యమంలో చురుగ్గా పాల్గొని బ్రిటిష్ ప్రభుత్వాన్ని గడగడలాడించింది. క్విట్ ఇండియా ఉద్యమంలో అరెస్టైన సరోజినీనాయుడు 1945 వరకు జైలు జీవితం గడిపారు. తీవ్ర అనారోగ్యంపాలు కావడంతో ఆమెను బ్రిటిష్ దొరలు జైలు నుంచి విడుదల చేశారు.గవర్నర్‌గా సేవలు

స్వాతంత్రం వచ్చాక జాతీయ కాంగ్రెస్ ఆమె సేవలు ఉపయోగించుకుంది. దేశంలోనే అతిపెద్ద రాష్ట్రం ఉత్తరప్రదేశ్‌ గవర్నర్‌గా సరోజినీనాయుడును నియమించింది. వృద్దాప్యం, తీవ్రమైన అనారోగ్యంగా ఉన్నా ఆమె అందించిన సేవలు నేటికీ మరవలేనివి.జీవితాంతం మానవ సేవకు, దేశ సేవకు అంకితమై, అలసిపోయిన సరోజినీనాయుడు 1949, మార్చి 2న లక్నోలో కన్నుమూశారు.

K Venkateswara Rao | 11:51 AM, Tue Feb 13, 2024

చర్చలు విఫలం ఢిల్లీ చలో నేడే

రైతు సంఘాల నేతలతో కేంద్ర ప్రభుత్వం సోమవారంనాడు జరిపిన చర్చలు విఫలం అయ్యాయి. తమ డిమాండ్ల సాధన కోసం 200 రైతు సంఘాలు చలో ఢిల్లీకి (chalo delhi) పిలుపునిచ్చిన సంగతి తెలిసిందే. ఇవాళ చలో ఢిల్లీకి 20 వేల మందికిపైగా రైతులు సిద్దం కావడంతో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అప్రమత్తం అయ్యాయి. పంజాబ్, హర్యానా, ఉత్తరప్రదేశ్ నుంచి భారీ సంఖ్యలో రైతులు ట్రాక్టర్లుతో ఢిల్లీకి బయలు దేరారు. చలో ఢిల్లీ కార్యక్రమాన్ని అడ్డుకునేందుకు భద్రతాదళాలను కేంద్ర ప్రభుత్వం రంగంలోకి దించింది.


చర్చలు విఫలం

రైతుల డిమాండ్లపై చండీగఢ్‌లో సోమవారం అర్థరాత్రి వరకు చర్చలు సాగాయి. కేంద్ర మంత్రులు పీయూష్ గోయల్, అర్జున్ ముండాలు 200 రైతుల సంఘాల నేతలతో చర్చలు జరిపినా ఫలితం లేకపోయింది. చర్చలు విఫలం అయ్యాయి. కనీస మద్దతు ధరపై చట్టం చేయాలని, 2021లో ఢిల్లీలో నిరసన తెలిపిన రైతులపై పెట్టిన వేలాది కేసులు ఎత్తివేయాలని, స్వామినాథన్ కమిషన్ సిఫార్సుల అమలు, రుణ మాఫీ అమలు అంశాలపై రైతు సంఘాలు పట్టుపట్టాయి.కేంద్రం అంగీకరించకపోవడంతో చర్చలు విఫలం అయినట్లు రైతు సంఘాలు ప్రకటించాయి.


ఢిల్లీ అంతటా 144 సెక్షన్

రైతుల చలో ఢిల్లీ కార్యక్రమాన్ని దృష్టిలో పెట్టుకుని కేంద్ర బలగాలు రంగంలోకి దిగాయి. ఎలాంటి ఉద్రిక్తతలు తలెత్తకుండా చర్యలు తీసుకున్నారు. రైతుల ఉద్యమంలోకి సంఘ విద్రోహ శక్తులు చొరబడకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు.
ఇప్పటికే రోడ్లపై ఇనుప కంచెలు ఏర్పాటు చేశారు. రైతులను, ట్రాక్టర్లను ఎక్కడికక్కడ నిలువరించేందుకు ఏర్పాట్లు చేశారు. రైతుల చలో ఢిల్లీ పిలుపుతో రాజధానిలో ట్రాఫిక్ జామ్‌లు ఏర్పడ్డాయి.

K Venkateswara Rao | 09:47 AM, Tue Feb 13, 2024

చంద్రబాబు బెయిల్ రద్దు పిటీషన్ వాయిదా

స్కిల్ కేసులో ఏపీ హైకోర్టు టీడీపీ అధినేత, మాజీ సీఎం చంద్రబాబునాయుడుకు మంజూరు చేసిన బెయిల్‌ను, రద్దు చేయాలంటూ ప్రభుత్వం దాఖలు చేసిన పిటీషన్‌పై విచారణను సుప్రీంకోర్టు (supreme court ) వాయిదా వేసింది. జస్టిస్ పంకజ్ మిట్టల్, జస్టిస్ బేలా ఎం.త్రివేదిల సుప్రీం ధర్మాసనం ఈ విచారణను ఈ నెల 26కు వాయిదా వేసింది. చంద్రబాబు తరపు న్యాయవాది సిద్ధార్థ లూథ్రా కేసును మూడు వారాలు వాయిదా వేయాలని కోరారు.ఏపీ సీఐడి తరపున న్యాయవాది రంజిత్ కుమార్ స్పందిస్తూ, కౌంటర్ దాఖలు చేయడానికి ఇప్పటికే చాలా సమయం తీసుకున్నారని, మరలా సమయం కోరడంపై అభ్యంతరం వ్యక్తం చేశారు. కౌంటర్ దాఖలు చేశారని, విచారణ చేపట్టాలని కోరారు. తొలుత రెండు వారాల తరవాత విచారణ చేపట్టాలని భావించిన ధర్మాసనం, రంజిత్ కుమార్ వాదనల తరవాత కేసు విచారణను ఈ నెల 26కు వాయిదా వేసింది.

K Venkateswara Rao | 13:35 PM, Mon Feb 12, 2024

ముంబైలో ఇద్దరు బంగ్లాదేశ్ పౌరుల అరెస్ట్

భారత్‌లో అక్రమంగా నివశిస్తోన్న ఇద్దరు బంగ్లాదేశ్ పౌరులను మహారాష్ట్ర రాజధాని ముంబైలో పోలీసులు అరెస్ట్ చేశారు. నవీ ముంబైలోని ఓ కాలనీలో అనుమానాస్పదంగా తిరుగుతోన్న ఇద్దరు బంగ్లాదేశ్ పౌరులను పోలీస్ యాంటీ టెర్రరిస్ట్ స్క్వాడ్ (ఏటీఎస్) అధికారులు ఆదివారం అరెస్ట్ చేశారు.వారిని పన్వెల్‌లోని నద్వే వద్ద అదుపులోకి తీసుకున్నారు. ఖిదుక్‌పాడలో తనిఖీలు నిర్వహించిన ఏటీఎస్ అధికారులు ఇద్దరు బంగ్లాదేశీలను అరెస్ట్ చేశారు.దేశంలోకి అక్రమంగా ప్రవేశించడంతోపాటు ఆధార్, వోటర్ ఐడీ కార్డులు, డ్రైవింగ్ లైసెన్స్ కూడా పొందారని అధికారులు తెలిపారు. పాస్‌పోర్ట్ నిబంధనలు 1950, విదేశీయుల చట్టం కింద వీరిపై కేసులు నమోదు చేశారు. అక్రమ వలసలతో సంబంధాలు కలిగిన వారిపై ఏటీఎస్ విచారణ చేస్తోంది.

K Venkateswara Rao | 12:42 PM, Sun Feb 11, 2024

ఇజ్రాయెల్ దాడుల్లో హమాస్ అగ్రనేత కుమారుడి మృతి

హమాస్ ఉగ్రవాదులు కాల్పుల విరమణ కోసం చేస్తున్న ప్రయత్నాలు ఫలించేలా కనిపించడం లేదు. తాజాగా ఇజ్రాయెల్ సైన్యం జరిపిన దాడుల్లో హమాస్ అగ్రనేత ఇస్మాయిల్ హనియే కుమారుడు హజెం హనియే చనిపోయినట్లు స్థానిక వార్తా కథనాల ద్వారా తెలుస్తోంది. దక్షిణ గాజాలో శనివారం ఇజ్రాయెల్ సైన్యం జరిపిన వైమానిక దాడుల్లో హజెం హనియో చనిపోయినట్లు భావిస్తున్నారు.గాజాలోని రఫాలో ఇజ్రాయెల్ సైన్యం వైమానిక దాడులతో విరుచుకుపడింది. ఈ దాడుల్లో కనీసం 44 మంది పాలస్తీనావాసులు చనిపోయారు. గాజాను ఖాళీ చేయాలని ఇజ్రాయెల్ అధ్యక్షుడు నెతన్యాహు ప్రకటించిన కాసేపటికే దాడులు మొదలయ్యాయి. ఆ తరవాత లక్షలాది మంది ఆ ప్రాంతాన్ని ఖాళీ చేశారు.
తాజాగా ఇజ్రాయెల్ రఫాపై చేస్తున్న దాడులను పలు దేశాలు ఖండించాయి. రాఫాను ఆక్రమించుకోవాలని ఇజ్రాయెల్ చూస్తోందంటూ అమెరికా ఆరోపించింది. గాజాలోని సగం జనాభా రఫాలో నివశిస్తోంది. ఇలాగే దాడులు కొనసాగిస్తే వేలాది మంది ప్రాణాలు కోల్పోయే ప్రమాదముందని పలు దేశాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి.

K Venkateswara Rao | 11:34 AM, Sun Feb 11, 2024

అయోధ్యపై లోక్‌సభలో చర్చ లైవ్

అయోధ్యపై చర్చ

K Venkateswara Rao | 10:24 AM, Sat Feb 10, 2024

అడ్వాణీకి ప్రముఖుల శుభాకాంక్షలు

బీజేపీ సీనియర్ నేత ఎల్.కె.అడ్వాణీకి దేశ అత్యున్నత పురస్కారం భారతరత్న ప్రకటించడంతో ప్రముఖులు శుభాకాంక్షలు తెలిపారు.సోషల్ మీడియా వేదికగా పలువురు పోస్టులు పెట్టారు. భారత అభివృద్ధి స్వాప్నికుడు, నవభారత నిర్మాణ మార్గదర్శకుడు, జీవితం మొత్తాన్ని ప్రజాసేవకే అంకితం చేసిన దేశభక్తుడు లాల్ కృష్ణ అడ్వాణీకి భారతరత్న ప్రకటించడం ఆనందంగా ఉందని మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు శుభాకాంక్షలు తెలిపారు.బీజేపీ వ్యవస్థాపక సభ్యుడు. కోట్లాదిమందికి స్ఫూర్తిదాయకమైన మహానేత, మాజీ ఉప ప్రధాని లాల్ కృష్ణ అడ్వాణీకి భారతరత్న ఇవ్వడం ఆనందంగా ఉందని యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ దాస్ పేర్కొన్నారు. అడ్వాణీ అవిశ్రాంత పోరాటం అందరిలో ప్రేరణ నింపిందని యోగి శుభాకాంక్షలు తెలిపారు.ఎల్.కె.అడ్వాణీకి భారతరత్న ఇవ్వడం ఎంతో ఆనందంగా ఉందని తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబునాయుడు ట్వీట్ చేశారు. ఎన్డీయేలో భాగంగా అడ్వాణీతో కలసి పనిచేయడం ఆనందాన్ని ఇచ్చిందని చంద్రబాబు తెలిపారు.దేశంలోనే అత్యంత సీనియన్ రాజకీయవేత్త, మార్గనిర్ధేశకుడు ఎల్.కె.అడ్వాణీకి భారతరత్న ఇవ్వడం సంతోషకరమైన విషయమని కేంద్ర ఉపరితల రవాణా మంత్రి నితిన్ గడ్కరీ కొనియాడారు. అడ్వాణీ ఆయురారోగ్యాలతో జీవించాలని ప్రార్థిస్తున్నానంటూ గడ్కరీ ఎక్స్‌లో పోస్ట్ చేశారు.

K Venkateswara Rao | 15:15 PM, Sat Feb 03, 2024

భూమి ఇవ్వకపోవడం వల్లే విశాఖ రైల్వే జోన్ ఏర్పాటు కాలేదు : రైల్వే మంత్రి

విశాఖ రైల్వే జోన్ ఏర్పాటు కాకపోవడంపై ఆ శాఖ మంత్రి సంచలన ఆరోపణలు చేశారు. రైల్వే జోన్ డీపీఆర్ సిద్దంగా ఉందని, ఇప్పటి వరకు ఏపీ ప్రభుత్వం 53 ఎకరాల భూమి కేటాయించలేదని రైల్వే మంత్రి అశ్వినీ వైష్ణవ్ ఢిల్లీలో మీడియాకు తెలిపారు. 2009 నుంచి 2014 వరకు ఉమ్మడి ఆంద్రప్రదేశ్‌లో రైల్వేల అభివృద్ధికి రూ.886 కోట్లు ఖర్చు చేయగా, ప్రస్తుత బడ్జెట్లో ఒక్క ఏపీకి రూ.9138 కోట్లు కేటాయించినట్లు మంత్రి చెప్పారు.ఏపీలో ఏటా 240 కి.మీ కొత్త రైలు మార్గాల నిర్మాణం జరుగుతోందని రైల్వే మంత్రి వెల్లడించారు. విద్యుదీకరణ పనులు నూరుశాతం పూర్తయ్యాయన్నారు. పదేళ్లలో 414 ఫ్లైఓబర్లు, అండర్ పాస్‌లు నిర్మించినట్లు గుర్తుచేశారు. రైల్వేలపై కేంద్రం పెద్ద ఎత్తున పెట్టుబడులు పెడుతోందని చెప్పారు. తెలంగాణలోని ఖాజీపేటలో రైల్ కోచ్ ఫ్యాక్టరీ పనులు జరుగుతున్నాయన్నారు.

K Venkateswara Rao | 15:50 PM, Thu Feb 01, 2024

చండీగఢ్ స్థానిక ఎన్నికల్లో బీజేపీ హవా

కొద్ది రోజుల్లో సార్వత్రిక ఎన్నికలు జరగనున్న వేళ చండీగఢ్‌లో జరిగిన స్థానిక ఎన్నికల్లో బీజేపీ సత్తా చాటింది. చండీగఢ్ మేయర్ స్థానం బీజేపీ గెలుచుకుంది. ఇవాళ జరిగిన ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థి మనోజ్ సోన్కర్ విజయం సాధించారు. ఆమ్‌ఆద్మీ, కాంగ్రెస్ పార్టీలు కలసి పోటీ చేసినా మేయర్ పీఠం దక్కించుకోలేకపోయాయి.


హైకోర్టు ఆదేశాల మేరకు చండీగఢ్‌లో ఇవాళ మేయర్ ఎన్నికలు నిర్వహించారు. ఆప్ మేయర్ అభ్యర్థి కుల్‌దీప్‌ కుమార్‌పై బీజేపీ నాయకుడు మనోజ్ సోస్కర్ విజయం (chandigarh mayor elections results) సాధించారు. డిప్యూటీ మేయర్ ఫలితాలు వెల్లడి కావాల్సి ఉంది.సార్వత్రిక ఎన్నికల ముందు చండీగఢ్ మేయర్ ఎన్నికల్లో గెలుపు బీజేపీ నేతలకు ఊపుతెచ్చింది.దీని ప్రభావం ఇండీ కూటమిపై పడే అవకాశం కూడా ఉంది. సార్వత్రిక ఎన్నికల్లో ఒంటరిగానే పోటీ చేస్తామని ఆప్ నేతలు ఇప్పటికే ప్రకటన చేశారు. పశ్చిమబెంగాల్‌లో తృణమూల్ కూడా ఇండీ కూటమికి దూరంగా జరిగింది. బిహార్‌లో నితీశ్ కుమార్ బీజేపీతో జట్టుకట్టిన విషయం తెలిసిందే.

K Venkateswara Rao | 15:22 PM, Tue Jan 30, 2024

కనిపించకుండా పోయిన ఝార్ఖండ్ సీఎం

భూ కుంభకోణంలో మనీలాండరింగ్ కేసు ఎదుర్కొంటోన్న ఝార్ఖండ్ సీఎం హేమంత్ సోరెన్ కనిపించకుండా పోయారు. సోమవారం నాడు హేమంత్ సోరెన్‌ను విచారించేందుకు ఢిల్లీలోని ఆయన అధికారిక నివాసానికి ఈడీ అధికారులు వెళ్లారు. సీఎం అందుబాటులోకి రాలేదు. సోమవారం సాయంత్రం వరకు ఎదురు చూసినా సీఎం హేమంత్ సోరెన్ రాకపోవడంతో, అతనికి చెందిన లగ్జరీ కారును అధికారులు సీజ్ చేశారు.
తాజాగా ఝార్ఖండ్‌లో హేమంత్ సోరెన్ సతీమణికి సీఎం పగ్గాలు అప్పగించే ప్రయత్నాలు జరుగుతున్నాయని వార్తలు గుప్పుమన్నాయి. ఇప్పటికే సంకీర్ణ కూటమిలోని జేఎంఎం, ఆర్జేడీ, కాంగ్రెస్ ఎమ్మెల్యేలు రాంచీ చేరుకున్నారు. ఇవాళ కూటమి ఎమ్మెల్యేలందరూ సీఎం నివాసంలో సమావేశం కానున్నట్లు సమాచారం అందుతోంది. కూటమి శాసనభ్యులందరూ రాంచీలో అందుబాటులో ఉండాలని ఆదేశాలు అందినట్లు తెలుస్తోంది.ఝార్ఖండ్ సీఎం హేమంత్ సోరెన్ గత వారం ప్రత్యేక విమానంలో ఢిల్లీ వచ్చినట్లు ఈడీ అధికారుల వద్ద సమాచారం ఉంది. ఆ తరవాత ఆయన ఎక్కడికి వెళ్లారనే దానిపై సమాచారం అందాల్సి ఉంది. సోరెన్‌కు చెందిన జెట్ విమానం ఢిల్లీ విమానాశ్రయంలోనే ఉందని అధికారులు తెలిపారు. జనవరి 31న రాంచీలోని తన నివాసానికి రావాలని సోరెన్ ఈడీ అధికారులకు రెండు వారాల కిందట సమాచారం ఇచ్చారు. అయితే సోరెన్ రేపు అందుబాటులోకి వస్తారా? లేదా అనేది? తేలాల్సిఉంది.

K Venkateswara Rao | 11:16 AM, Tue Jan 30, 2024
upload
upload