Sunday, October 01, 2023

Odisha-365
upload upload upload

Skill Development Corporation

CBN ARREST: అక్రమ కేసులను వ్యతిరేకిస్తూ చంద్రబాబు, భువనేశ్వరి, లోకేశ్ నిరాహార దీక్ష

టీడీపీ అధినేత చంద్రబాబు, ఆయన కుమారుడు నారా లోకేశ్ రేపు నిరసన దీక్ష చేపట్టనున్నారు. టీడీపీ నేతలపై అక్రమ కేసులు, అరెస్టులకు నిరసనగా ఈ దీక్ష చేపడుతున్నట్లు ఆ పార్టీ నేతలు చెబుతున్నారు. నైపుణ్యాభివృద్ధి కేంద్రాల ఏర్పాటులో నమోదైన కేసులో అరెస్టై  జుడీషియల్ రిమాండ్ లో ఉన్న చంద్రబాబు రాజమహేంద్రవరం కేంద్ర కారాగారంలోనే దీక్షకు దిగనున్నారు.

నారా భువనేశ్వరి కూడా గాంధీ జయంతి సందర్భంగా నిరసన దీక్ష చేపట్టనున్నారు.లోకేశ్, దిల్లీలో నిరసన వ్యక్తం చేస్తారు. గాంధీ జయంతి సందర్భంగా ఈ నిరసన కార్యక్రమాలు చేపట్టాలని నిర్ణయించినట్లు టీడీపీ ముఖ్యనేతలు వెల్లడించారు. వీరి దీక్షలకు సంఘీభావంగా నియోజకవర్గాలు, మండల కేంద్రాల్లో తెలుగుదేశం శ్రేణులు ఆందోళన కార్యక్రమాలు కొనసాగించనున్నాయి.

సోమవారం సాయంత్రం 7 గంటలకు ఐదు నిమిషాల పాటు ఇంట్లోనే లైట్లు ఆఫ్ చేసి కొవ్వొత్తులతో నిరసన చేపట్టాలని కార్యకర్తలకు టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు పిలుపునిచ్చారు. అమరావతి రింగ్ రోడ్డు కేసులో సీఐడీ ఇచ్చిన 41(ఏ) నోటీసుపై స్పందించిన నారా లోకేశ్, ఈ నెల 4న విచారణకు హాజరవుతున్నట్లు తెలిపారు. సీఎం జగన్, ఆయన సహచరుల్లా వాయిదాలు అడిగే అలవాటు తనకు లేదన్నారు. పదేళ్లుగా బెయిల్ పై బతుకుతున్నారంటూ సీఎం జగన్, ఎంపీ విజయసాయిరెడ్డిపై సెటైర్లు వేశారు. ప్రభుత్వ ప్రజావ్యతిరేక విధానాలపై పోరాటం కొనసాగించాలని టీడీపీ శ్రేణులకు సూచించారు.

T Ramesh | 12:25 PM, Sun Oct 01, 2023

TDP PLANS: గాంధీ జయంతి రోజు చంద్రబాబు సతీమణి నిరాహార దీక్ష…

బస్సు యాత్ర చేపట్టే ఛాన్స్ టీడీపీ అధినేత చంద్రబాబును రాష్ట్రప్రభుత్వం అక్రమ కేసులతో వేధిస్తోందంటూ ఆ పార్టీ నేతలు వరుస ఆందోళనలకు పిలుపునిస్తున్నారు. రాష్ట్రవ్యాప్తంగా  ం ‘మోతమోగిద్దాం’ పేరుతో నిరసనలు చేపట్టాలని ఇప్పటికే శ్రేణులకు పిలుపునిచ్చింది. చంద్రబాబు సతీమణి నారా భువనేశ్వరి అక్టోబర్ 2న నిరాహార దీక్ష చేస్తారని ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు వెల్లడించారు. చంద్రబాబు అరెస్టును ఖండిస్తూ అక్టోబర్ 2 రాత్రి 7 గంటల నుంచి 7.05 వరకు ప్రతీ ఇంట్లో లైట్లన్నీ ఆపేసి కొవ్వొత్తులతో  నిరసన తెలపాలని  కోరారు.

  త్వరలో టీడీపీ, జనసేన నుంచి కొంతమందితో కమిటీ వేసి క్షేత్రస్థాయిలో పోరాడతామన్న అచ్చెన్నాయుడు, ఆదివారం నుంచి నాలుగు రోజుల పాటు పవన్ మచిలీపట్నం పార్లమెంట్ పరిధిలో పర్యటిస్తారని తెలిపారు. చంద్రబాబు అరెస్టుతో  పలువురు కలత చెందారని, అక్రమ అరెస్టును తట్టుకోలేక ఇప్పటికే 97 మంది చనిపోయారని చెప్పారు. వీరికి నంద్యాలలో జరిగిన టీడీపీ పొలిటికల్ యాక్షన్ కమిటీ సమావేశంలో సంతాపం తెలిపామన్నారు.

ప్రాణాలు విడిచిన వారి కుటుంబాలను త్వరలో కలిసి ధైర్యం చెబుతామన్నారు. మేలుకో తెలుగోడా పేరుతో నారా భువనేశ్వరి బస్సు యాత్ర కూడా నిర్వహించే అవకాశం ఉందని తెలుస్తోంది. చంద్రబాబు జైల్లో ఉండటం, న్యాయపోరాటంలో భాగంగా లోకేశ్ దిల్లీకి పరిమితం కావడంతో ఆ పార్టీ శ్రేణుల్లో నైరాశ్యం ఏర్పడింది.

తెలుగు తమ్ముళ్ళలో జోష్ నింపేందుకు చంద్రబాబును అక్రమంగా అరెస్టు చేశారని ప్రజల్లోకి బలంగా తీసుకెళ్ళేందుకు భువనేశ్వరి చేపట్టే ‘మేలుకో తెలుగోడా’ కార్యక్రమం ఉపయోగపడుతుందని ఆ పార్టీ అభిమానులు, కేడర్ అభిప్రాయపడుతున్నారు.

T Ramesh | 16:24 PM, Sat Sep 30, 2023

Skill Case: చంద్రబాబు మాజీ పీఎస్‌ను సస్పెండ్ చేసిన ప్రభుత్వం

మాజీ సీఎం చంద్రబాబుకు పీఎస్‌గా పనిచేసిన పెండ్యాల శ్రీనివాస్‌ను ప్రభుత్వం సస్పెండ్ చేసింది. సర్వీసు నిబంధనలు అతిక్రమించారనే కారణంతో ఆయనను సస్పెండ్ చేస్తూ ప్రభుత్వ  ప్రధాన కార్యదర్శి జవహర్‌రెడ్డి సస్సెన్షన్ ఉత్తర్వులు జారీ చేశారు. ప్రస్తుతం ఆయన ప్లానింగ్ డిపార్టుమెంట్ లో అసిస్టెంట్ సెక్రటరీ బాధ్యతలు నిర్వహిస్తున్నారు.

స్కిల్ డెవలప్‌మెంట్ స్కామ్ లో పెండ్యాల శ్రీనివాస్ కూడా ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. శ్రీనివాస్ ద్వారానే చంద్రబాబుకు డబ్బులు అందాయని సీఐడీ ఆరోపించింది.  ప్రస్తుతం ప్లానింగ్ విభాగంలో విధులు నిర్వహిస్తున్నప్పటికీ ఉన్నతాధికారులకు సమాచారం ఇవ్వకుండా అమెరికా వెళ్ళారు.

ప్రభుత్వ అధికారులు విదేశీ పర్యటనకు వెళ్ళాలంటే ఉన్నతాధికారులకు సమాచారం ఇవ్వాల్సి ఉంటుంది.ఈ నిబంధనను అతిక్రమించడంతో పెండ్యాల శ్రీనివాస్ కు ప్లానింగ్ డిపార్టుమెంట్ మెమో జారీ చేసింది. వారం రోజుల్లో అమెరికా టూర్‌పై సంజాయిషీ ఇవ్వాలని ఆదేశించింది. కానీ ఆయన నుంచి స్పందన లేకపోవడంతో సస్పెండ్ చేస్తున్నట్లు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఉత్తర్వులు జారీ చేశారు.

T Ramesh | 13:05 PM, Sat Sep 30, 2023

IRR CASE: అమరావతి రింగ్ రోడ్డు కేసులో చంద్రబాబు బెయిల్ పిటిషన్ విచారణ వాయిదా

అమరావతి రింగు రోడ్డు కేసులో ముందస్తు బెయిల్ కోరుతూ మాజీ సీఎం చంద్రబాబు నాయుడు దాఖలు చేసిన పిటిషన్ పై విచారణ అక్టోబర్ 3కు వాయిదా పడింది. అలాగే అంగళ్లు అల్లర్ల కేసులో బెయిల్ పిటిషన్‌పై తీర్పును హైకోర్టు ధర్మాసనం రిజర్వు చేసింది. 

ఇన్నర్ రింగ్ రోడ్డు కేసులో సీఐడీ తరఫున అడ్వకేట్ జనరల్ శ్రీరామ్ వాదించారు. లింగమనేని రమేష్ భూముల పక్క నుంచి వెళ్ళేలా రింగ్ రోడ్డు అలైన్‌మెంట్ లో మార్పులు చేశారని, దీంతో ఆ భూమి ధర భారీగా పెరిగిందని సీఐడీ వాదించింది. హెరిటేజ్ సంస్థ కూడా భూ అక్రమాలకు పాల్పడిందని కోర్టుకు తెలిపారు.

చంద్రబాబు తరఫున సుప్రీంకోర్టు న్యాయవాది సిద్ధార్థ లూధ్రా వాదనలు వినిపించారు. ఇరువర్గాల వాదనలు విన్న హైకోర్టు, తదుపరి విచారణను అక్టోబర్ 3కి వాయిదా వేసింది. బెయిల్ నిరాకరణకు లింగమనేని వ్యవహారానికి లింకు పెట్టొద్దని న్యాయస్థానాన్ని లూధ్రా కోరారు. స్కిల్ కేసులో క్వాష్ పిటిషన్ సంబంధించి కూడా అక్టోబర్ 3నే సుప్రీంకోర్టు వాదనలు విననుంది.

T Ramesh | 17:42 PM, Fri Sep 29, 2023

CBN BAIL PETITION: ఫైబర్‌ గ్రిడ్ కేసులో ముందస్తు బెయిల్ కోసం హైకోర్టులో చంద్రబాబు పిటిషిన్

అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్డు కేసులో ముందస్తు బెయిల్ కోరుతూ ఇప్పటికే హైకోర్టును ఆశ్రయించిన చంద్రబాబు, తాజాగా మరో పిటిషన్ వేశారు. ఫైబర్ గ్రిడ్ కేసులో ముందస్తు బెయిల్ ఇవ్వాలంటూ లంచ్ మోషన్ పిటిషన్ దాఖలు చేశారు. ఈ కేసులో ఆయన ఏ25 గా ఉన్నారు.

స్కిల్ స్కామ్ కేసులో అరెస్టు అయి జుడీషియల్ రిమాండ్ లో భాగంగా రాజమహేంద్రవరం కేంద్రకారాగారంలో ఉన్న చంద్రబాబును పీటీ వారెంట్ పై విచారించేందుకు అనుమతి కోరుతూ సీఐడీ, ఏసీబీ కోర్టును కోరింది. ఫైబర్ గ్రిడ్, అమరావతి రింగు రోడ్డు, అంగళ్ళు కేసుల్లో ఆయన నిందితుడిగా ఉన్నారని కోర్టుకు వివరించింది.

అలాగే స్కిల్ కేసులో మరోసారి రిమాండ్ కోరుతూ మరో పిటిషన్ వేసింది. చంద్రబాబు బెయిల్ పిటిషిన్ కూడా విచారణకు రానుంది. వీటన్నింటిని అక్టోబర్ 4న ఏసీబీ కోర్టు న్యాయమూర్తి విచారించనున్నారు.

స్కిల్ కేసులో తనపై సీఐడీ నమోదు చేసిన సెక్షన్లు క్వాష్ చేయాలంటూ సుప్రీంకోర్టులో చంద్రబాబు వేసిన పిటిషన్  అక్టోబర్ 3న బెంచ్ ముందుకు వచ్చే అవకాశముంది.     చంద్రబాబు వేసిన పిటిషన్ విచారణ సందర్భంగా రాష్ట్రప్రభుత్వం కేవియట్ దాఖలు చేసింది.

నైపుణ్యాభివృద్ధి కేంద్రాల ఏర్పాటు పేరిట చంద్రబాబు, ప్రభుత్వ నిధులు దారి మళ్ళించి సొమ్ము చేసుకున్నారని సీఐడీ ఆరోపిస్తోంది. ప్రభుత్వం వాదనలు వినేందుకు అవకాశం ఇవ్వాలని సుప్రీంకోర్టును రాష్ట్రప్రభుత్వం అభ్యర్థించింది.

T Ramesh | 14:37 PM, Fri Sep 29, 2023

CBN SKILL CASE: చంద్రబాబు కేసులో సుప్రీంలో రాష్ట్రప్రభుత్వం కేవియట్

నైపుణ్యాభివృద్ధి కేంద్రాల ఏర్పాటులో తనపై నమోదు చేసిన కేసును క్వాష్ చేయాలంటూ చంద్రబాబు సుప్రీంకోర్టును ఆశ్రయించారు. అక్టోబర్ 3న ఈ కేసు వాదనలు సర్వోన్నత న్యాయస్థానం విననుంది. దీంతో రాష్ట్రప్రభుత్వం సుప్రీంకోర్టులో కేవియట్ దాఖలు చేసింది.

చంద్రబాబు దాఖలు చేసిన పిటిషన్‌లో భాగంగా తమ వాదన వినాలని అభ్యర్థించింది. స్కిల్ డెవలప్‌మెంట్ కేసులో చంద్రబాబు పాత్రపై ఆధారాలు ఉన్నాయని పిటిషన్ లో పేర్కొన్నారు. విద్యార్థులకు శిక్షణ పేరిట కోట్ల రూపాయల కుంభకోణానికి పాల్పడ్డారని, నిధులను షెల్ కంపెనీల ద్వారా దారి మళ్ళించి సొమ్ము చేసుకున్నారని వ్యాజ్యంలో ప్రభుత్వం తెలిపింది.

ఈ కేసులో మా వాదన మీ ముందు ఉంచుతామని న్యాయమూర్తిని కోరారు. తనను అవినీతి నిరోధక చట్టం లోని 17(ఏ)కు విరుద్ధంగా అరెస్టు చేశారని, అనంతరం ఎఫ్ఐఆర్ లో పేరు నమోదు చేశారని హైకోర్టులో చంద్రబాబు క్వాష్ పిటిషన్ వేశారు.

దర్యాప్తు తుది దశలో ఉన్నందున తాము ఎలాంటి ఉత్తర్వులు జారీ చేయలేమంటూ హైకోర్టు పేర్కొంది. పిటిషన్ డిస్మిస్ చేశారు.   హైకోర్టు ఉత్తర్వులను చంద్రబాబు సుప్రీంకోర్టులో సవాలు చేశారు. ఈ కేసు సెప్టెంబర్ 27న దిస్వభ్య ధర్మాసనం ముందుకు విచారణకు వచ్చింది. కానీ అందులోని జస్టిస్ ఎస్వీఎన్ భట్టి  ‘నాట్ బీఫోర్ మీ’ అన్నారు. దీంతో అక్టోబర్ 3కు మరో న్యాయమూర్తి జస్టిస్ సంజీవ్ ఖన్నా వాయిదా వేశారు.

ఈ విషయాన్ని చంద్రబాబు తరఫు న్యాయవాది సిద్ధార్థ లూధ్రా, చీఫ్ జస్టిస్ ఎదుట ప్రస్తావించారు. తమ పిటిషన్ వాదనలు విని చంద్రబాబుకు తక్షణమే ఉపశమనం కల్పించాలని కోరారు. అయితే సీఐడీ తరఫు న్యాయవాదులు వాదనలు వినిపించేందుకు సమయం కావాలని కోరారు. దీంతో కేసును అక్టోబర్ 3న వేరే బెంచ్ కు పంపుతామని ఆరోజే పూర్తి వాదనలు వినిపించాలని ప్రధాన న్యాయమూర్తి సూచించారు.

  ఈ నేపథ్యంలో చంద్రబాబు దాఖలు చేసిన స్పెషల్ లీవ్ పిటిషన్ లో తాము వాదనలు వినిపిస్తామని రాష్ట్రప్రభుత్వం కేవియట్ దాఖలు చేసింది.

T Ramesh | 17:49 PM, Thu Sep 28, 2023

SOCIAL MEDIA CASE ARRESTS: న్యాయవ్యవస్థపై అనుచిత వ్యాఖ్యల కేసులో కొనసాగుతున్న అరెస్టులు

నైపుణ్యాభివృద్ధి కేసును విచారణ చేసిన ఏసీబీ కోర్టు జడ్జి హిమబిందును అవమానించేలా సోషల్ మీడియాలో పోస్టులు పెట్టిన వారిపై పోలీసులు కేసులు నమోదు చేసి అరెస్టు చేస్తున్నారు. టీడీపీ నేత ముల్లా ఖాజా హుస్సేన్ ను నంద్యాల పోలీసులు అరెస్టు చేశారు. ముల్లా ఖాజా హుస్సేన్ ఓ ప్రైవేటు కాలేజీలో లెక్చరర్ గా పనిచేస్తున్నారు.

కృష్ణా జిల్లాకు చెందిన టీడీపీ నేత బుర్రా వెంకట్‌ను కూడా  కంకిపాడు పోలీసులు అదుపులోకి తీసుకుని స్పెషల్ బ్రాంచ్ పోలీసులకు అప్పగించారు. స్కిల్ కేసులో చంద్రబాబుకు రిమాండ్ విధించిన న్యాయమూర్తిని అవమానించేలా పోస్టులు పెట్టాడని ఇతనిపై అభియోగం ఉంది.

స్కిల్ కేసులో చంద్రబాబుకు జుడీషియల్ రిమాండ్ విధించిన జడ్జితో పాటు హైకోర్టులో క్వాష్ పిటిషన్ ను కొట్టివేసిన న్యాయమూర్తికి వ్యతిరేకంగా కొందరు సోషల్ మీడియాలో పోస్టులు చేశారు. జడ్జిలపై అనుచిత పోస్టులు, ట్రోలింగ్ వ్యవహారంపై రాష్ట్రప్రభుత్వం, హైకోర్టులో క్రిమినల్ కంటెంప్ట్ పిటిషన్ వేసింది. కొందరు కావాలనే అనుచిత పోస్టులు చేశారని అడ్వకేట్ జనరల్ శ్రీరామ్ కోర్టుకు తెలిపారు.

సోషల్ మీడియాలో పోస్టులు చేసిన 26 మంది అకౌంట్లు పరిశీలించి నోటీసులు జారీ చేయాలని డీజీపీకి ఉన్నత న్యాయస్థానం ఆదేశాలు జారీ చేసింది. అంతకు ముందు రాష్ట్రపతి భవన్ కూడా ఈ అంశంపై స్పందించింది. తమకు అందిన ఫిర్యాదును ఏపీ సీఎస్ కు పంపి తగిన చర్యలు తీసుకోవాలని సూచించింది.

T Ramesh | 13:13 PM, Thu Sep 28, 2023

CBN ARREST: బెయిల్, కస్టడీ పిటిషన్ల విచారణ వాయిదా...ఐఆర్ఆర్ కేసుపై హైకోర్టు ఏమందంటే..?

స్కిల్ స్కామ్ కేసులో చంద్రబాబు కస్టడీ, బెయిల్ పిటిషన్లపై విచారణను ఏసీబీ కోర్టు అక్టోబర్ 4కు వాయిదా వేసింది. చంద్రబాబును మరోసారి కస్టడీకి ఇస్తే దర్యాప్తు పూర్తి చేస్తామని సీఐడీ తరఫు న్యాయవాది పొన్నవోలు సుధాకర్ రెడ్డి తెలిపారు. గత కస్టడీలో చంద్రబాబు సహకరించలేదని, ఆధారాలు చూపించడంతో చంద్రబాబు సమాధానాలు దాటవేశారన్నారు.

కస్టడీకి ఇస్తే కేసులో పూర్తి కుట్రకోణం బయటపెడతామన్నారు.  విచారణను అక్టోబర్ 5 వరకు వాయిదా వేయాలనుకున్నట్లు న్యాయమూర్తి చెప్పగా కస్టడీపై తమ వాదనలు పూర్తి చేయనివ్వాలని ఏఏజీ పొన్నవోలు అభ్యర్థించారు. విచారణ వాయిదా వేయాలని చంద్రబాబు తరఫు న్యాయవాదులు కోరగా, న్యాయమూర్తి ఆగ్రహం వ్యక్తం చేశారు.

బెయిల్ పిటిషన్ దాఖలు చేసి 17 రోజులైనా వాదనలు ఎందుకు వినిపించడం లేదని వివరణ అడిగారు. ఎంతకాలం పిటిషన్ పెండింగ్ లో ఉంచాలని ప్రశ్నించారు. లిఖిత పూర్వక మెమో దాఖలు చేయాలని ఆదేశించారు. చంద్రబాబు బెయిల్, కస్టడీ పిటిషన్లపై వచ్చే నెల నాలుగున విచారణ చేస్తామని, అదే రోజు ఇరు వర్గాలు వాదనలు పూర్తి చేయాలని న్యాయమూర్తి ఆదేశించారు. మరోసారి వాదనలు వాయిదా వేయవద్దని చంద్రబాబు లాయర్లకు సూచించారు.

అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్డు కేసులో భాగంగా హైకోర్టులో వాదనలు కొనసాగాయి. చంద్రబాబుకు ముందస్తు బెయిల్ ఇవ్వొద్దంటూ సీఐడీ వాదించింది. కేసును ఈ నెల29, శుక్రవారం మధ్యాహ్నానికి కోర్టు వాయిదా వేసింది.

ఇన్నర్ రింగ్ రోడ్డు అక్రమ అలైన్‌మెంట్ కేసులో A14గా ఉన్న లోకేశ్, హైకోర్టులో ముందస్తు బెయిల్ పిటిషన్ వేశారు.

T Ramesh | 17:10 PM, Wed Sep 27, 2023

Skill Scam : చంద్రబాబు పిటిషన్‌పై విచారణ వచ్చే వారానికి వాయిదా

స్కిల్ డెవలప్‌మెంట్ కేసులో మాజీ సీఎం చంద్రబాబునాయుడు తరపు న్యాయవాదులు సుప్రీంకోర్టులో వేసిన స్పెషల్ లీవ్ పిటిషన్‌పై విచారణ జరిపేందుకు న్యాయమూర్తి జస్టిస్ ఎస్‌వీఎస్ భట్టి విముఖత చూపారు. ఇదే విషయాన్ని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి వద్ద ప్రస్తావించేందుకు చంద్రబాబు తరపు న్యాయవాది సిద్దార్ధ్ లూథ్రా ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. కేసును వేరే బెంచ్‌కు బదిలీ చేయనున్నారు. అయితే కేసు ఇవాళ విచారణకు వచ్చే అవకాశాలు దాదాపుగా లేవనే తెలుస్తోంది.

అవినీతి నిరోధక చట్టంలోని సెక్షన్ 17ఏ నిబంధనలు ఉల్లంఘించి, గవర్నర్ నుంచి ముందస్తు అనుమతి తీసుకోకుండా స్కిల్ స్కామ్‌లో చంద్రబాబుపై కేసు నమోదు చేయడంపై ఆయన తరపు న్యాయవాదులు స్పెషల్ లీవ్ పిటిషన్ వేశారు. క్వాష్ పిటిషన్‌ను గత వారం ఏపీ హైకోర్టు తిరస్కరించిన విషయం తెలిసిందే. ఏపీ హైకోర్టు తీర్పును సవాలు చేస్తూ చంద్రబాబు సుప్రీంకోర్టులో ఎస్‌ఎల్‌పి వేశారు. చంద్రబాబు కేసును తాను విచారించలేనని, వేరే బెంచ్ ముందుకు తీసుకెళ్లాలని న్యాయమూర్తి జస్టిస్ ఎస్‌వీఎస్ భట్టి ప్రకటించడంతో, ఈ కేసు వచ్చే వారానికి వాయిదా పడింది.

K Venkateswara Rao | 15:46 PM, Wed Sep 27, 2023

రాష్ట్రపతి గారూ.... మా రాష్ట్రంలో ప్రజాస్వామ్యాన్ని కాపాడండి

ఆంధ్రప్రదేశ్‌లో ప్రజాస్వామ్యాన్ని కాపాడాలని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ రాష్ట్రపతి ద్రౌపది ముర్మును కోరారు. పార్టీ ఎంపీలు కేశినేని నాని, గల్లా జయదేవ్‌, రామ్మోహన్ నాయుడు, కనకమేడల రవీంద్రకుమార్‌లతో కలిసి ఆయన రాష్ట్రపతిని కలిసారు. పార్టీ అధినేత చంద్రబాబు అరెస్టు గురించి రాష్ట్రపతికి వివరించారు. జగన్‌ పాలనలోప్రతిపక్షాలను అణచివేస్తున్నారని ఆరోపించారు.

రాష్ట్రపతితో భేటీ అనంతరం లోకేష్ మీడియాతో మాట్లాడారు ‘‘జగన్ అధికారంలోకి వచ్చిననాటి నుంచి జరుగుతున్న అరాచకాలను రాష్ట్రపతికి వివరించాం. టీడీపీ నేతలపై అక్రమ కేసులు పెట్టి జైలుకు పంపిన అంశాలను వివరించాం. మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడును స్కిల్‌ డెవలప్‌మెంట్‌ కేసులో జైలుకు పంపించారని వెల్లడించాం. మా దగ్గరున్న అన్ని ఆధారాలనూ రాష్ట్రపతికి అందజేశాం. సోషల్ మీడియాలో పోస్టులు పెడితే కేసులు పెట్టి జైలుకు పంపుతున్నారు. యువగళం పాదయాత్ర తిరిగి ప్రారంభిస్తానని నిన్న ప్రకటించాక.. నన్ను ఇన్నర్‌ రింగ్‌రోడ్డు కేసులో ఇరికించారు. ఇన్నర్‌ రింగ్‌రోడ్డు, ఫైబర్‌ గ్రిడ్‌, స్కిల్‌ డెవలప్‌మెంట్‌తో నాకేంటి సంబంధం. రోడ్డే లేకపోయినా కేసు ఎలా పెట్టారో తెలియడం లేదు’’ అన్నారు.

ఢిల్లీలో తన పర్యటన గురించి వివరిస్తూ ‘‘ప్రతిపక్ష పార్టీల నేతలను కలిసి రాష్ట్రంలో అరాచకాలపై వివరించాం. రోజుకో వదంతి, రోజుకో కేసులతో వేధిస్తున్నారు. తప్పకుండా రిటర్న్‌ గిఫ్ట్‌ ఇస్తా. కేసులకు సంబంధించి ప్రభుత్వం వద్ద ఎలాంటి ఆధారాలు లేవు. కేసు పెట్టాక అధారాలు ఇవ్వాలని సీఐడీ అధికారులు కోరుతున్నారు. కక్ష సాధింపు తప్ప ఒక్క కేసులోనూ చంద్రబాబు పాత్ర లేదు. నాకు, మా కుటుంబ సభ్యులకు ఒక్క పైసా రాలేదు’’ అని లోకేష్ చెప్పుకొచ్చారు.

P Phaneendra | 17:45 PM, Tue Sep 26, 2023

KTR : చంద్రబాబు అరెస్ట్ వ్యవహారం అక్కడే తేల్చుకోండి : కేటీఆర్

మాజీ సీఎం చంద్రబాబునాయుడు అరెస్ట్ వ్యవహారం పూర్తిగా ఏపీకి సంబంధించిన వ్యవహారమని, అది అక్కడే తేల్చుకోవాలని తెలంగాణ మంత్రి కేటీఆర్ వ్యాఖ్యానించారు. ఏపీ గొడవలకు తెలంగాణను వేదిక కానివ్వమని ఆయన అన్నారు. తెలంగాణ ప్రజలను ఆంధ్రా పార్టీలు ఇబ్బంది పెట్టడం సరికాదన్నారు. చంద్రబాబు అరెస్టు వ్యవహారం ఏపీలో రెండు రాజకీయ పార్టీల మధ్య జరుగుతున్న పోరుగా ఆయన అభివర్ణించారు. బీఆర్‌ఎస్ నేతలు స్పందిస్తే అది వారి వ్యక్తిగత మన్నారు. పొరుగు రాష్ట్రాల్లో జరుగుతున్న వివాదాలకు తెలంగాణకు సంబంధం లేదని కేటీఆర్ తేల్చిపడేశారు. ఎవరైనా ర్యాలీలు, ధర్నాలు చేయాలనుకుంటే ఏపీలో చేసుకోవాలని సూచించారు.

ఏపీ వివాదాలకు హైదరాబాద్‌లో ర్యాలీలు చేస్తే శాంతి భద్రతల సమస్య తలెత్తుతుందని కేటీఆర్ అన్నారు. ర్యాలీలను అనుమతించేది లేదని తేల్చి చెప్పారు. చంద్రబాబు అరెస్ట్ వ్యవహారంలో తాము తటస్థంగా ఉన్నట్టు కేటీఆర్ స్పష్టం చేశారు. ఇలాంటి వివాదాల విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలన్నారు. చంద్రబాబు న్యాయపోరాటం చేస్తున్నారు, కోర్టుల్లో న్యాయం జరుగుతుందని కేటీఆర్ ఆశాభావం వ్యక్తం చేశారు.

లోకేశ్, పవన్, జగన్ అందరూ నా మిత్రులేనని, ఏపీ తగాదాలు హైదరాబాద్‌కు ముడిపెట్టవద్దని కేటీఆర్ సూచించారు. హైదరాబాద్‌లో అన్ని ప్రాంతాల వారు ప్రశాంతంగా జీవిస్తున్నారని గుర్తుచేశారు. తెలంగాణ ఉద్యమం సమయంలోనూ ఐటీ కారిడార్‌లో ర్యాలీలు జరగలేదన్నారు. ఒకరికి అవకాశం కల్పిస్తే చాలా మంది వస్తారని కేటీఆర్ అన్నారు. ఏపీ నుంచి ఎందరో హైదరాబాద్‌లో పెట్టుబడులు పెడుతున్నట్టు ఆయన తెలిపారు. వారికి ఎలాంటి ఇబ్బంది రాకూడదన్నారు.

K Venkateswara Rao | 17:07 PM, Tue Sep 26, 2023

Skill Scam : చంద్రబాబు పిటిషన్‌పై సుప్రీంకోర్టులో రేపు విచారణ

స్కిల్ స్కామ్ కేసులో మాజీ సీఎం చంద్రబాబునాయుడు తరపు న్యాయవాదులు సుప్రీంకోర్టులో దాఖలు చేసిన స్పెషల్ లీవ్ పిటిషన్ రేపు విచారణకు రానుంది. చంద్రబాబు తరపు న్యాయవాదులు దాఖలు చేసిన మెన్షన్ మెమోపై సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి చంద్రచూడ్ ఇవాళ నిర్ణయం తీసుకున్నారు. ఈ కేసు రేపు విచారణ చేపట్టేందుకు సీజే అంగీకరించారు. చంద్రబాబు కేసు ఏ బెంచ్ ముందు విచారణకు వస్తుందనే విషయం సాయంత్రానికి తేలనుంది.

అవినీతి నిరోధక చట్టంలోని సెక్షన్ 17ఏ కింద ప్రజాప్రతినిధులను అరెస్టు చేసే ముందు గవర్నర్ అనుమతి తీసుకోవాలని, ఈ సెక్షన్ చంద్రబాబు కేసుకు కూడా వర్తిస్తుందంటూ ఆయన తరపు న్యాయవాదులు ఎస్ఎల్‌పి వేశారు. ఎలాంటి ఆధారాలు లేకుండా కేసు నమోదు చేశారని, కేసు కొట్టివేయాలంటూ చంద్రబాబు తరపు న్యాయవాదులు సర్వోన్నత న్యాయస్థానాన్ని ఆశ్రయించారు.

స్కిల్ స్కామ్ కేసులో చంద్రబాబునాయుడు పెట్టుకున్న బెయిల్ పిటిషన్‌పై ఏసీబీ కోర్టులో ఇవాళ విచారణ జరగాల్సి ఉంది. న్యాయమూర్తి సెలవుపై వెళ్లడంతో ఈ కేసు విచారణ రేపటికి వాయిదా పడింది. మరోవైపు చంద్రబాబు బెయిల్ పిటిషన్‌పై ఇవాళ హైకోర్టులో కేసు విచారణ జరగనుంది.

K Venkateswara Rao | 12:51 PM, Tue Sep 26, 2023

Skill Scam : చంద్రబాబు బెయిల్ పిటిషన్ విచారణ వాయిదా

స్కిల్ డెవలప్‌మెంట్ కేసులో అరెస్టై రిమాండులో ఉన్న చంద్రబాబు బెయిల్ పిటిషన్, సీఐడి కస్టడీ పిటిషన్లను విజయవాడ ఏసీబీ కోర్టు మంగళవారానికి వాయిదా వేసింది. ఐదు రోజుల తమ కస్టడీకి అప్పగించాలంటూ సీఐడీ వేసిన పిటిషన్‌పై కౌంటర్ వేయాలని చంద్రబాబు తరపు న్యాయవాదులను ఏసీబీ కోర్టు ఆదేశించింది. రెండు పిటిషన్ల విచారణను మంగళవారానికి వాయిదా వేసింది.

రెండు రోజులు కస్టడీలో చంద్రబాబును విచారించిన వివరాలతో కూడిన సీల్డ్ కవర్‌ను సీఐడీ ఏసీబీ కోర్టుకు సమర్పించింది. మరో ఐదు రోజులు తమ కస్టడీకి ఇవ్వాలని సీఐడీ పిటిషన్ దాఖలు చేయగా, ముందుగా బెయిల్ పిటిషన్‌పై విచారణ చేపట్టాలని చంద్రబాబు తరపు న్యాయవాదులు కోరారు.ఇరువర్గాల వాదనలను పరిశించిన న్యాయమూర్తి, రెండు కేసుల విచారణను మంగళవారానికి వాయిదా వేశారు.

K Venkateswara Rao | 16:21 PM, Mon Sep 25, 2023

Skill Case: సుప్రీంకోర్టును ఆశ్రయించిన చంద్రబాబు, విచారణ తేదీ రేపు ఖరారు చేస్తామన్న సీజేఐ

స్కిల్ స్కామ్ కేసులో తనకు ఏసీబీ కోర్టు రిమాండ్ విధించడంపై టీడీపీ అధినేత చంద్రబాబు సుప్రీంకోర్టును ఆశ్రయించగా, రేపు విచారణ తేదీని ఖరారు చేస్తామని సీజేఐ చెప్పారు.

త్వరగా వాదనలు వినాలని చంద్రబాబు తరఫు న్యాయవాది సిద్ధార్థ లూథ్రా చేసిన అభ్యర్థిపై చీఫ్ జస్టిస్ సానుకూలంగా స్పందించారు. చంద్రబాబును ఎప్పుడు అరెస్టు చేశారని అడగగా, ఈ నెల 8న అని లూథ్రా బదులిచ్చారు. పిటిషన్‌ను రేపు మెన్షన్ లిస్టులో చేరుస్తామని తెలిపారు. అన్ని వివరాలు పిటిషన్‌లో పొందుపరచాలని సీజేఐ సూచించారు.  

ఈనెల 28 నుంచి అక్టోబర్ 2 వరకు సుప్రీంకోర్టుకు వరుస సెలవులు ఉన్నాయి. 28న మిలాదున్ నబీ  కాగా 29న దిల్లీలో స్థానికంగా సెలవు ప్రకటించారు. సెప్టెంబర్ 30 శనివారం, అక్టోబర్1 ఆదివారం, అక్టోబర్ 2 గాంధీ జయంతి సెలవులు కావడంతో చంద్రబాబు పిటిషన్ విచారణ ఎప్పుడు ఉంటుందనే విషయంపై స్పష్టత లేదు.

ఏసీబీ కోర్టులో దాఖలు చేసిన బెయిల్ పిటిషన్ మధ్యాహ్నం తర్వాత విచారణకు రానుంది. అలాగే పీటీ వారెంట్లపై న్యాయమూర్తి విచారించనున్నారు. బెయిల్ పై ఇరుపక్షాల వాదనలు వింటామని ఏసీబీ కోర్టు తెలిపింది.

 పలువురు టీడీపీ నేతలు వేర్వేరు కేసుల్లో హైకోర్టులో క్వాష్ పిటిషన్లు దాఖలు చేస్తున్నారు. అసైన్డ్ భూముల కేసులో ముందస్తు బెయిల్ కోసం పిటిషన్ వేసిన టీడీపీ నేత, మాజీ మంత్రి నారాయణ, తనపై నమోదైన కేసు కొట్టివేయాలని క్వాష్ పిటిషన్ దాఖలు చేశారు. అమరావతి రింగురోడ్డు కేసులోనూ వ్యాజ్యం దాఖలు చేశారు. దీనిపై ఇవాళ హైకోర్టు విచారణ జరపనుంది.

వీరవల్లి పోలీసులు నమోదు చేసిన కేసులో ఎఫ్ఐఆర్‌ను క్వాష్ చేయాలని కొల్లు రవీంద్ర పిటిషన్ వేయగా, పేర్ని నాని ఫిర్యాదు చేసిన కేసులో ఎఫ్ఐఆర్‌ను క్వాష్ చేయాలని బుద్ధా వెంకన్న హైకోర్టును ఆశ్రయించారు.

T Ramesh | 12:14 PM, Mon Sep 25, 2023

Tesla Tobot Yoga : టెస్లా రొబో యోగాసనాలు

tesla tobot yoga 

K Venkateswara Rao | 12:12 PM, Mon Sep 25, 2023

SKILL CASE: చంద్రబాబుకు ముగిసిన సీఐడీ కస్టడీ.. అక్టోబర్ 5 వరకు రిమాండ్ పొడిగింపు

నైపుణ్యాభివృద్ధి సంస్థ కేసులో మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబుకు విధించిన రెండు రోజుల కస్టడీ ముగిసింది. దీంతో చంద్రబాబును వర్చువల్ గా ఏసీబీ కోర్టు న్యాయమూర్తి ఎదుట ప్రవేశపెట్టారు. అనంతరం రిమాండ్ తో పాటు కస్టడీ పొడిగించాలని సీఐడీ అధికారులు న్యాయమూర్తిని కోరారు.

కస్టడీ ముగిసినందున అక్కడి నుంచి వెళ్ళిపోవాలని ఆదేశించారు. అనంతరం చంద్రబాబుతో మాట్లాడారు.  అనంతరం రిమాండ్ ను అక్టోబర్ 5 వరకు పొడిగిస్తున్నట్లు జడ్జి చెప్పారు.

T Ramesh | 18:02 PM, Sun Sep 24, 2023

Mann Ki Baat : జీ 20 తరవాత భారత్ బాధ్యత మరింత పెరిగింది

జీ 20 దేశాల సమావేశాలను విజయవంతంగా నిర్వహించిన తరవాత ప్రపంచంలో భారత ప్రతిష్ఠ మరింత పెరిగిందని ప్రధాని మోదీ అన్నారు. జీ 20 సందర్భంగా ఇండియా మిడిల్ ఈస్ట్ యూరప్ ఎకనామిక్ కారిడార్‌ను సభ్యదేశాలకు సూచించినట్టు ప్రధాని మోదీ తెలిపారు. ప్రపంచ వాణిజ్యానికి ఈ కారిడార్ అనేక దశాబ్దాలపాటు ఆధారంగా నిలుస్తుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. చంద్రయాన్ 3 విజయవంతం, జీ 20 సమావేశాలు దేశంలో ప్రతి పౌరుడి ఆనందాన్ని రెట్టింపు చేశాయని మన్ కీ బాత్ కార్యక్రమంలో ప్రధాని మోదీ స్పష్టం చేశారు.ప్రజల నుంచి తనకు అందిన సందేశాల్లో ప్రధానంగా ఈ అంశాలే ఉన్నాయన్నారు.

జీ 20 కూటమిలో ఆఫ్రికన్ యూనియన్‌కు శాశ్వత సభ్వత్వం ఇవ్వడం ద్వారా భారత నాయకత్వాన్ని ప్రపంచం గుర్తించిందని మోదీ గుర్తుచేశారు. జీ 20 సదస్సుకు ఆతిథ్యం ఇచ్చిన భారత్ మండపం ప్రముఖ ప్రాంతంగా మారిందని ఆయన అన్నారు. దాని ముందు వేలాది మంది ప్రజలు సెల్ఫీలు దిగుతున్నారని మోదీ వెల్లడించారు. సెప్టెంబరు 27న ప్రపంచ పర్యాటక దినోత్సవం సందర్భంగా ఆయన ఈ విషయాలను గుర్తుచేశారు.

అతి తక్కువ పెట్టుబడితో లక్షలాది మందికి ఉపాధి కల్పించే రంగాల్లో పర్యాటక శాఖ ముందుందని ఆయన అన్నారు. జీ 20 దేశాల ప్రతినిధులు దేశంలోని వివిధ ప్రాంతాల్లో పర్యటించారన్నారు. మన సంస్కృతి వారసత్వ సంపదలు, వైవిద్యం గురించి ప్రతినిధులు తెలుసుకున్నట్టు మోదీ తెలిపారు. బెంగాల్‌లోని శాంతినికేతన్, కర్ణాటకలోని హోయసల ఆలయానికి ప్రపంచ వారసత్వ కట్టడాల జాబితాలో చోటు దక్కడం గర్వించాల్సిన విషయమన్నారు. ఈ రెండింటితో దేశంలో 42 కట్టడాలు ప్రపంచ వారసత్వ జాబితాలో చోటు దక్కించుకున్నట్టైంది. 

K Venkateswara Rao | 15:09 PM, Sun Sep 24, 2023

SKILL CASE: చంద్రబాబును రెండో రోజు విచారిస్తున్న సీఐడీ

స్కిల్ డెవలప్‌మెంట్ కేసులో మాజీ సీఎం, టీడీపీ అధినేత చంద్రబాబును సీఐడీ అధికారులు రెండో రోజు ప్రశ్నిస్తున్నారు.  కోర్టు ఆదేశాల ప్రకారం విచారణకు ముందు చంద్రబాబుకు వైద్య పరీక్షలు నిర్వహించిన అధికారులు, జైలు కాన్ఫరెన్స హాలులో ప్రశ్నిస్తున్నారు. రెండు బృందాలుగా ఏర్పడి విచారణ చేస్తున్నారు. సాయంత్రం ఐదుగంటల వరకు విచారణ కొనసాగనుంది.

నేటితో చంద్రబాబు సీఐడీ కస్టడీ ముగియనుంది. దీంతో  విచారణ అనంతరం అధికారులు వర్చువల్ గా జడ్జి ముందు ప్రవేశపెట్టనున్నారు.   తొలిరోజు నాలుగు దశల్లో విచారణ జరిగినట్లు తెలుస్తోంది. డొల్ల కంపెనీల ద్వారా నిధుల మళ్ళింపు ఆరోపణలపై నేడు విచారించే అవకాశం ఉందని తెలుస్తోంది.

రాజమండ్రి సెంట్రల్ జైలు ఆవరణలో పోలీసుల ఆంక్షలు కొనసాగుతున్నాయి. రెండు అంచెల భద్రతా చర్యలు తీసుకున్నారు. చంద్రబాబుకు సంఘీభావంగా ఐటీ ఉద్యోగులు హైదరాబాద్ నుంచి రాజమండ్రి చేరుకోవడంతో పోలీసులు అప్రమత్తమయ్యారు.

స్కిల్ డెవలప్‌మెంట్ వ్యవహారంలో తనను విచారించేందుకు రెండు రోజుల పాటు సీఐడీ కస్టడీకి ఇస్తూ ఏసీబీ కోర్టు జారీ చేసిన ఉత్తర్వులను కొట్టివేయాలని కోరుతూ టీడీపీ అధినేత చంద్రబాబు తరఫున హైకోర్టులో క్వాష్ పిటిషన్ వేశారు. ఈ వ్యాజ్యంపై అత్యవసరంగా విచారణ జరపాలని చంద్రబాబు తరఫు న్యాయవాది ప్రణతి హైకోర్టును అభ్యర్థించారు. న్యాయమూర్తి జస్టిస్ సురేశ్ రెడ్డి అందుకు నిరాకరించారు. సాధారణ పద్ధతిలో తమ ముందుకు వస్తే విచారిస్తామని పేర్కొన్నారు.

T Ramesh | 11:23 AM, Sun Sep 24, 2023

SKILL CASE:  స్కిల్ కేసును సుప్రీంకోర్టులో సవాలు చేసిన చంద్రబాబు

స్కిల్ డెవలప్‌మెంట్ కేసులో తనను అక్రమంగా అరెస్టు చేశారంటూ టీడీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు  సుప్రీంకోర్టును ఆశ్రయించారు. హైకోర్టు కొట్టివేసిన క్వాష్ పిటిషన్ ను అత్యున్నత న్యాయస్థానంలో ఆయన తరఫు న్యాయవాదులు దాఖలు చేశారు. ఈ పిటిషన్ సోమవారం విచారణకు వచ్చే అవకాశముంది.

స్కిల్ డెవలప్‌మెంట్ కేసులో ప్రధాన కుట్రదారుడు అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడేనంటూ సీఐడీ ఆరోపిస్తోంది. మరింత లోతైన విచారణలో భాగంగా ఆయనను అరెస్టు చేశారు. అరెస్టును సమర్థించిన ఏసీబీ న్యాయస్థానం జుడీషియల్ రిమాండ్ విధించింది. దీంతో చంద్రబాబు తరఫు న్యాయవాదులు హైకోర్టులో క్వాష్ పిటిషన్ దాఖలు చేయగా పిటిషన్‌ను డిస్మిస్ చేస్తున్నట్లు న్యాయమూర్తి ప్రకటించారు.

సీఐడీ విచారణ తుది దశలో ఉన్నందున క్వాష్ చేయలేమని పిటిషన్‌ను తోసిపుచ్చింది. సెక్షన్ 482కింద మినీ ట్రయల్ నిర్వహించలేమని హైకోర్టు పేర్కొంది. హైకోర్టు తీర్పును చంద్రబాబు తరఫు న్యాయవాదులు సుప్రీంకోర్టులో సవాలు చేశారు.  సుప్రీంకోర్టు రిజిస్ట్రీలో క్వాష్ పిటిషన్ కాపీ అందజేశారు. సోమవారం పిటిషన్‌ను స్వీకరించే అవకాశముంది.

హైకోర్టులో క్వాష్ పిటిషన్ విచారణ సందర్భంగా హేమాహేమీలైన న్యాయవాదులు వాదనలు వినిపించారు. చంద్రబాబు తరఫున సిద్ధార్థ లూద్రా, హరీశ్ సాల్వే వాదించగా, సీఐడీ తరఫున ముకుల్ రోహత్గీ వకాల్తా పుచ్చుకున్నారు.

T Ramesh | 13:13 PM, Sat Sep 23, 2023

SKILL CASE: స్కిల్ స్కాంలో చంద్రబాబును ప్రశ్నిస్తున్న సీఐడీ

స్కిల్ డెవలప్‌మెంట్ కేసులో అరెస్టైన మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబును సీఐడీ అధికారులు కస్టడీలోకి తీసుకుని విచారిస్తున్నారు. ఉదయమే రాజమహేంద్రవరం కేంద్ర కారాగారానికి చేరుకున్న సీఐడీ అధికారులు, చంద్రబాబుకు వైద్య పరీక్షలు చేయించారు అల్పాహారం తీసుకుని మందులు వేసుకున్న తర్వాత కోర్టు ఆదేశించిన సమయానికి కస్టడీలోకి తీసుకుని విచారణ ప్రారంభించారు.

జైలులోని కాన్ఫరెన్స్ హాల్ లో విచారణ చేస్తున్నారు.   12 మంది సభ్యుల సీఐడీ బృందం చంద్రబాబును విచారిస్తోంది.  న్యాయవాది దమ్మాలపాటి శ్రీనివాస్ సమక్షంలో విచారణ కొనసాగుతోంది. సాయంత్రం ఐదు గంటల వరకు విచారణ కొనసాగనుంది. ప్రతి గంటకూ  ఐదు నిమిషాలు విరామం ప్రకటించడంతో పాటు మధ్యాహ్నం ఒంటి గంటకు భోజన విరామం ఉంటుంది.

సీఐడీ డీఎస్పీ ధనుంజయనాయుడు నేతృత్వంలో విచారణ జరుగుతోంది. విజయభాస్కర్(డిప్యూటీ ఎస్పీ), లక్ష్మీనారాయణ (డిప్యూటీ ఎస్పీ), ఇన్స్‌పెక్టర్లు మెహన్ కుమార్, రవి కుమార్, శ్రీనివాసన్, సాంబశివరావు, ఏఎస్ఐ రంగనాయకులు, పీసీ సత్యనారాయణ ఉన్నారు. వీరితో పాటు విచారణను రికార్డు చేసేందుకు ఫ్రొఫెషనల్ వీడియో గ్రాఫర్, ఇద్దరు  మీడియేటర్లు ఉంటారు.

విచారణ నివేదకను సీల్డ్ కవర్ లో న్యాయస్థానానికి నివేదించాలని ఏసీబీ కోర్టు ఆదేశించింది. విచారణ సందర్భంగా చంద్రబాబుపై థర్డ్ డిగ్రీ ప్రయోగించరాదని, ఎలాంటి తీవ్రమైన చర్యలు తీసుకోవద్దని న్యాయమూర్తి స్పష్టం చేశారు.

T Ramesh | 11:11 AM, Sat Sep 23, 2023

Skill case: సీఐడీ కస్టడీకి చంద్రబాబు, రెండురోజుల పాటు విచారణకు ఏసీబీ కోర్టు అనుమతి

స్కిల్ డెవలప్‌మెంట్ కేసులో చంద్రబాబును సీఐడీ కస్టడీకి అనుమతిస్తూ ఏసీబీ కోర్టు తీర్పు చెప్పింది. చంద్రబాబును అయిదు రోజుల కస్టడీకి ఇవ్వాలని సీఐడీ కోరగా న్యాయమూర్తి రెండ్రోజుల విచారణకు అనుమతించారు. రాజమహేంద్రవరం జైలులోనే చంద్రబాబును విచారణ చేయాలని న్యాయమూర్తి ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.

అంతకు ముందు చంద్రబాబు రిమాండ్ ను ఏసీబీ కోర్టు పొడిగించింది. ఈ నెల 24 వరకు జ్యడీషియల్ రిమాండ్ పొడిగిస్తున్నట్లు న్యాయస్థానం వెల్లడించింది. స్కిల్ డెవలప్‌మెంట్ కేసులో అరెస్టై జైలులో ఉన్న చంద్రబాబును పోలీసులు వర్చువల్ గా ఏసీబీ కోర్టులో హాజరు పరిచారు.

రిమాండ్ సమయం ముగియడంతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా విచారించారు. ఈ సందర్భంగా చంద్రబాబు అభిప్రాయాన్ని న్యాయమూర్తి కోరారు. జైలులో ఉంచి మానసిక క్షోభకు గురిచేస్తున్నారని చంద్రబాబు న్యాయమూర్తికి చెప్పారు. తన హక్కులను రక్షించాలని కోరారు.

అనంతరం చంద్రబాబుతో మాట్లాడిన న్యాయమూర్తి, ‘‘ మీరు పోలీసు కస్టడీలో లేరు, జ్యుడిషియల్ కస్టడీలో ఉన్నారు. దీనిని శిక్షగా భావించొద్దు, మీపై వచ్చినవి ఆరోపణలు మాత్రమే’’ అన్నారు. చట్టం నిబంధనల ప్రకారమే రిమాండ్ విధించామన్నారు.

T Ramesh | 15:11 PM, Fri Sep 22, 2023

AP High Court : చంద్రబాబు క్వాష్ పిటిషన్‌ను కొట్టేసిన హైకోర్టు

స్కిల్ స్కామ్ కేసులో మాజీ సీఎం చంద్రబాబునాయుడు దాఖలు చేసిన క్వాష్ పిటిషన్‌ను హైకోర్టు కొట్టివేసింది. కేసు కొట్టేయాలంటూ చంద్రబాబు వేసిన క్వాష్ పిటిషన్‌ను హైకోర్టు కొట్టేసింది. సీఐడీ తరపు లాయర్ల వాదనలతో హైకోర్టు ఏకీభవించింది. హైకోర్టు ఇచ్చిన తీర్పుపై చంద్రబాబు తరపు న్యాయవాదులు సుప్రీంకోర్టును ఆశ్రయించే అవకాశం ఉంది. స్కిల్ స్కామ్‌లో సుప్రీంకోర్టును ఆశ్రయించే విషయంలో ఇప్పటికే టీడీపీ నేతలు సీనియర్ న్యాయవాదులతో చర్చలు జరుపుతున్నారని తెలుస్తోంది.

స్కిల్ స్కామ్ కేసులో చంద్రబాబును విచారించేందుకు తమ కస్టడీకి అనుమతించాలంటూ సీఐడి వేసిన కేసులో ఇవాళ విజయవాడ ఏసీబీ కోర్టు తీర్పు వెలువరించనుంది. ఇప్పటికే చంద్రబాబు రిమాండ్ ముగియడంతో మరో రెండు రోజులు జుడీషియల్ రిమాండ్ పొడిగిస్తూ ఏసీబీ కోర్టు ఆదేశాలిచ్చింది.

K Venkateswara Rao | 14:05 PM, Fri Sep 22, 2023

Udhayanidhi Stain : ఉదయనిధి స్టాలిన్‌కు సుప్రీంకోర్టు నోటీసులు

తమిళనాడు మంత్రి ఉదయనిధి స్టాలిన్ చేసిన వివాదాస్పద వ్యాఖ్యల వ్యవహారం సుప్రీంకోర్టుకు చేరింది. సనాతన ధర్మంపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన ఉదయనిధి స్టాలిన్‌పై చర్యలు తీసుకోవాలంటూ సర్వోన్నత న్యాయస్థానంలో పిటిషన్ దాఖలైంది. పిటిషన్ స్వీకరించిన సుప్రీంకోర్టు మంత్రి ఉదయనిధి స్టాలిన్‌కు నోటీసులు జారీ చేసింది.

తమిళనాడులో ఇటీవల జరిగిన ఓ కార్యక్రమంలో మాట్లాడిన మంత్రి ఉదయనిధి స్టాలిన్ సనాతన ధర్మంపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. సనాతన ధర్మాన్ని డెంగ్యూ, మలేరియా దోమలతో పోల్చుతూ వాటిని నిర్మూలించాలని మంత్రి పిలుపునివ్వడం వివాదానికి దారితీసింది. మంత్రి వ్యాఖ్యలపై ఇప్పటికే 262 మంది ప్రముఖులు భారత ప్రధాన న్యాయమూర్తికి లేఖలు రాశారు. వీరిలో మాజీ న్యాయమూర్తులు, ఉన్నతాధికారులు కూడా ఉన్నారు. మంత్రి ఉదయనిధి వివాదాస్పద వ్యాఖ్యలపై ఇప్పటికే ఉత్తరప్రదేశ్, కర్ణాటక రాష్ట్రాల్లో నాలుగు కేసులు నమోదయ్యాయి.

K Venkateswara Rao | 13:44 PM, Fri Sep 22, 2023

Chandrababu Custody : చంద్రబాబు జ్యుడిషియల్ కస్టడీ పొడిగింపు

స్కిల్ స్కామ్ కేసులో అరెస్టై రాజమండ్రి జైలులో రిమాండులో ఉన్న మాజీ సీఎం చంద్రబాబునాయుడు 14 రోజుల రిమాండ్ నేటితో ముగిసింది. దీంతో పోలీసులు వర్చువల్‌గా చంద్రబాబును విజయవాడలోని ఏసీబీ కోర్టులో హాజరుపరిచారు. రిమాండు ముగియడంతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా కోర్టులో హాజరు పరిచారు. సీఐడీ కస్టడీపై కూడా న్యాయమూర్తి చంద్రబాబు అభిప్రాయాలు తీసుకున్నారు. జైల్లో తనను మానసిక క్షోభకు గురిచేస్తున్నారని చంద్రబాబు న్యాయమూర్తి దృష్టికి తీసుకెళ్లారు. తన హక్కులను కాపాడాలని ఆయన జడ్జిని కోరారు. ఈ నెల 24 వరకు చంద్రబాబు రిమాండ్ పొడిగిస్తూ విజయవాడ ఏసీబీ కోర్టు నిర్ణయం తీసుకుంది.

స్కిల్ డెవలప్‌మెంట్ కేసులో చంద్రబాబు తరపు న్యాయవాదులు హైకోర్టులో క్వాష్ పిటిషన్ వేసిన సంగతి తెలిసిందే. దీనిపై ఏపీ హైకోర్టు విచారణ పూర్తి చేసింది. ఇవాళ తీర్పును వెలువరించే అవకాశం ఉంది. మరోవైపు స్కిల్ స్కామ్ కేసులో చంద్రబాబును విచారించాలంటూ తమ కస్టడీకి ఇవ్వాలంటూ సీఐడి వేసిన పిటిషన్‌పై కూడా విజయవాడ ఏసీబీ కోర్టులో ఇవాళ తీర్పు వెలువడే అవకాశం ఉంది.

K Venkateswara Rao | 11:19 AM, Fri Sep 22, 2023

Chandrababu Bail : చంద్రబాబు కస్టడీ పిటిషన్‌పై తీర్పు వాయిదా

స్కిల్ స్కామ్‌ కేసులో రిమాండులో ఉన్న మాజీ సీఎం చంద్రబాబునాయుడును విచారించడానికి తమ కస్టడీకి అప్పగించాలంటూ సీఐడి వేసిన పిటిషన్‌పై విజయవాడ ఏసీబీ కోర్టు తీర్పును రేపటికి వాయిదా వేసింది. ఈ కేసును మంగళవారం, బుధవారంనాడు విచారించిన కోర్టు తీర్పును ముందుగా గురువారం ఉదయానికి వాయిదా వేసింది. మరలా ఇవాళ సాయంత్రం తీర్పు వెలువరిస్తామని ప్రకటించారు.చివరకు తీర్పును రేపటికి వాయిదా వేస్తున్నట్టు న్యాయమూర్తి ప్రకటించారు.చంద్రబాబు కస్టడీ పిటిషన్‌పై రేపు ఉదయం 11 గంటలకు తీర్పు ఇచ్చే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది.

స్కిల్ డెవలప్‌మెంట్ కేసులో టీడీపీ అధినేత చంద్రబాబునాయుడుకు విజయవాడ ఏసీబీ కోర్టు 14 రోజుల రిమాండ్ విధించిన సంగతి తెలిసిందే. కేసు కోట్టివేయాలంటూ చంద్రబాబు తరపు న్యాయవాదులు ఏపీ హైకోర్టులో క్వాష్ పిటిషన్ వేశారు. ఈ కేసులో రేపు హైకోర్టు తీర్పు వెలువరించే అవకాశం ఉంది. స్కిల్ స్కామ్‌లో మరిన్ని ఆధారాలు రాబట్టేందుకు చంద్రబాబును తమ కస్టడీకి ఇవ్వాలంటూ సీఐడి అధికారులు వేసిన పిటిషన్‌పై విజయవాడ ఏసీబీ కోర్టులో రెండు రోజులపాటు సుదీర్ఘ వాదనలు జరిగాయి. ప్రభుత్వం తరపున ఏఏజీ పొన్నవోలు సుధాకర్‌రెడ్డి, చంద్రబాబు తరపున సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాది సిద్ధార్థ లూద్రా వాదనలు వినిపించారు. కస్టడీ పిటిషన్‌పై రేపు ఉదయం తీర్పు వెలువరించే అవకాశం ఉందని తెలుస్తోంది.

K Venkateswara Rao | 17:38 PM, Thu Sep 21, 2023

Mobile Alert : మొబైల్ ఫోన్లకు ఎమర్జెన్సీ అలర్ట్ : ఉలిక్కిపడ్డ జనం

దేశ వ్యాప్తంగా కోట్లాది మంది ఫోన్లకు గురువారం మధ్యాహ్నం ఎమర్జెన్సీ అలర్ట్ మెసేజ్ వచ్చింది. ఎమర్జెన్సీ అలర్ట్ అంటూ ఫ్లాష్ మెసేజ్ రావడంతో జనం బెంబేలెత్తిపోయారు. అసలు ఈ మెసేజ్ ఎందుకు వచ్చిందో తెలియక జనం ఆందోళనకు గురయ్యారు. ఇలా గతంలో ఎన్నడూ జరగలేదు. దీంతో మొబైల్ వినియోగదారులు కాసేపు షాక్‌కు గురయ్యారు.

భూకంపాలు, సునామీలు, వరదల్లాంటి ఆకస్మిక విపత్తులు వచ్చినప్పుడు ప్రజలను అప్రమత్తం చేసేందుకు కేంద్ర ప్రభుత్వం ఇలాంటి మెసేజ్‌లను పంపుతుంది. ఎమర్జెన్సీ అలర్ట్ సిస్టమ్ టెస్టింగ్‌లో భాగంగా మెసేజ్ పంపినట్టు జాతీయ విపత్తు నిర్వహణ సంస్థ తెలిపింది.

స్మార్ట్ ఫోన్ యూజర్లకు పెద్ద సౌండ్‌తో అలర్ట్ రావడంతో ఫ్లాష్ మెసేజ్ కూడా వచ్చింది. ఇంగ్లీష్, హిందీలతో పాటు ప్రాంతీయ భాషల్లో కూడా ఈ అలర్ట్ పంపించారు. మెసేజ్‌తో పాటు ఆడియో సందేశం కూడా వినిపించింది. ఈ మెసేజ్‌ను పట్టించుకోవాల్సిన అవసరం లేదని టెలికమ్యూనికేషన్ విభాగం ప్రకటించింది. ఇది టెస్టింగ్ మెసేజ్ అంటూ తెలిపింది. జాతీయ విపత్తు నిర్వహణ సంస్థ పాన్ ఇండియా ఎమర్జెన్సీ అలర్ట్ సిస్టమ్‌ను పరీక్షించడానికి మెసేజ్ పంపారని తెలియడంతో జనం ఊపిరిపీల్చుకున్నారు.

K Venkateswara Rao | 15:18 PM, Thu Sep 21, 2023

బాబు కస్టడీ కోసం పిటిషన్‌పై ముగిసిన వాదనలు, తీర్పు రేపు

టీడీపీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడును కస్టడీకి కోరుతూ సీఐడీ వేసిన పిటిషన్‌పై విజయవాడ ఏసీబీ కోర్టులో విచారణ ముగిసింది. న్యాయమూర్తి గురువారం ఉదయం 11.30 గంటలకు తీర్పు వెలువరిస్తామని ప్రకటించారు.

 చంద్రబాబును ఐదు రోజుల పాటు కస్టడీకి కోరుతూ సీఐడీ తరఫున ఏఏజీ పొన్నవోలు సుధాకర్‌ రెడ్డి వాదనలు వినిపించారు. చంద్రబాబును అన్ని ఆధారాలతోనే అరెస్టు చేశారన్నారు. ‘ఈ కేసుతో ప్రమేయం ఉన్న ప్రతి ఒక్కరినీ మరింత విచారించాలి. ఈ కేసులో రికవరీ కంటే కుట్ర కోణాన్ని వెలికితీయడం ముఖ్యం. చంద్రబాబును పూర్తిస్థాయిలో విచారిస్తేనే మరిన్ని వాస్తవాలు వెలుగులోకి వస్తాయి. స్కిల్‌ కేసులో నిధులు ఎక్కడెక్కడికి వెళ్లాయో సమాచారం ఉంది. కేసుకు సంబంధించి పూర్తి వివరాలు రాబట్టాల్సి ఉంది’’ అని వాదించారు.

 చంద్రబాబు తరపున సీనియర్‌ న్యాయవాదులు సిద్ధార్థ్‌ లూథ్రా, సిద్ధార్థ్‌ అగర్వాల్‌ వాదించారు. చంద్రబాబును కోర్టులో హాజరుపరిచిన సెప్టెంబరు 10న సీఐడీ కస్టడీ కోరలేదని, మరుసటి రోజు కస్టడీకి కోరుతూ మెమో ఎలా దాఖలు చేస్తారని.. పాత అంశాలతో కస్టడీకి ఎలా కోరతారని ప్రశ్నించారు. అరెస్టు ప్రక్రియ నిబంధనలకు విరుద్ధంగా జరిగిందన్నారు. చంద్రబాబు అవినీతి చేసినట్టు ఎక్కడా ఆధారాల్లేవని పేర్కొన్నారు. చంద్రబాబును సీఐడీ ఆఫీసులో కొన్ని గంటలపాటు చంద్రబాబును విచారించారు. అన్ని విషయాలు రాబట్టామని చెప్పి, మళ్లీ కస్టడీకి ఎందుకు అడుగుతున్నారు... అని  వాదించారు.

 ఇరువైపులా వాదనలు విన్న న్యాయమూర్తి తమ నిర్ణయాన్ని గురువారానికి వాయిదా వేశారు.

P Phaneendra | 18:19 PM, Wed Sep 20, 2023

Cabinet Meeting : దసరా నుంచి విశాఖ నుంచే పాలన

ఏపీ క్యాబినెట్ కీలక నిర్ణయాలు తీసుకుంది. వచ్చే విజయదశమి నుంచి విశాఖ నుంచి పరిపాలన కొనసాగించాలని క్యాబినెట్ నిర్ణయించింది. రేపటి నుంచి శాసనసభ సమావేశాలు జరగనున్న నేపథ్యంలో సీఎం జగన్‌మోహన్‌రెడ్డి అధ్యక్షతన ఏపీ క్యాబినెట్ ఇవాళ సమావేశమైంది. పరిపాలనా రాజధానిపై సీఎం కీలక ప్రకటన చేశారు. దసరా నుంచి విశాఖ నుంచే పరిపాలన సాగుతుందని, కార్యాలయాల ఎంపికపై కమిటీని వేయాలని నిర్ణయించారు. కమిటీ సూచనల మేరకు కార్యాలయాలు ఏర్పాటు చేయనున్నారు. ముందస్తు లేదా జమిలి ఎన్నికలపై కేంద్ర నిర్ణయం ప్రకారం ముందుకెళ్లాలని నిర్ణయించారు.

ప్రభుత్వ ఉద్యోగుల జీపీఎస్ అమలు బిల్లుకు ముందుగా క్యాబినెట్ ఆమోదం తెలిపింది. ప్రభుత్వ ఉద్యోగి పదవీ విరమణ చేసే సమయానికి, స్థలం లేనివారికి కచ్ఛితంగా ఇంటి స్థలం ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఉద్యోగి పదవీ విరమణ తరవాత కూడా ఆరోగ్య శ్రీ వర్తించేలా చూడాలని నిర్ణయం తీసుకున్నారు. వారి పిల్లల చదువుల ఫీజులు కూడా రీఎంబర్స్ చేయనున్నారు.

క్యాబినెట్ భేటీలో మరికొన్ని కీలక నిర్ణయాలు కూడా తీసుకున్నారు. జగనన్న సివిల్ సర్వీసెస్ ప్రోత్సాహకం పేరుతో కొత్త పథకానికి శ్రీకారం చుట్టారు. కాంట్రాక్టు ఉద్యోగుల క్రమబద్దీకరణ ముసాయిదా బిల్లుకు ఆమోదం తెలిపారు, ప్రైవేటు యూనివర్సిటీల చట్టంలో సవరణ బిల్లుకు ఆమోదం తెలిపారు. పోలవరం ముంపు బాధితులకు ఇళ్లు, దేవాదాయ చట్ట సవరణ బిల్లుకు క్యాబినెట్ ఆమోదించింది.

K Venkateswara Rao | 15:52 PM, Wed Sep 20, 2023

Tirumala : బోనులో చిక్కిన మరో చిరుత

తిరుమల కాలినడక మార్గంలో చిరుతల కలకలం తగ్గడం లేదు. తాజాగా అలిపిరి కాలినడక మార్గంలో శ్రీలక్ష్మీనరసింహ స్వామి ఆలయం వద్ద అటవీ శాఖ అధికారులు ఏర్పాటు చేసిన బోనులో మరో చిరుత చిక్కింది. దీంతో గడచిన రెండు మాసాల్లో ఆరు చిరుతలు బోనులో చిక్కాయి. అలిపిరి కాలినడక మార్గంలో లక్షిత అనే చిన్నారిపై దాడి చేసి పాపను చంపేసిన ప్రదేశంలోనే ఇవాళ మరో చిరుత చిక్కింది. గతంలో దాడి ఘటన జరిగిన 2850వ మెట్టు వద్ద ఏర్పాటు చేసిన బోనులో చిరుత చిక్కింది. తాజాగా బంధించిన చిరుతను తిరుపతి జూ పార్కుకు తరలించారు.

ఇప్పటికే బంధించిన ఐదు చిరుతల్లో రెండింటిని అటవీ ప్రాంతంలో వదిలేశారు. తిరుమల అడవుల్లో తిరుగుతోన్న చిరుతలు ఒకదాని తరవాత ఒకటి బోనుల్లో చిక్కుకోవడంతో భక్తుల్లో కొంత ఆందోళన తగ్గింది.

తిరుపతి ఎస్వీ యూనివర్సిటీ సమీపంలో మరో చిరుత కదలికల దృశ్యాలు సీసీ కెమెరాల్లో రికార్డయ్యాయి. చిరుతల సంచారంతో అటు విద్యార్ధులు, స్థానికులు బెంబేలెత్తుతున్నారు. యూనివర్సిటీ సమీపంలోనూ బోనులు ఏర్పాటు చేసి చిరుతను బంధించాలని విద్యార్థులు కోరుతున్నారు.

K Venkateswara Rao | 11:22 AM, Wed Sep 20, 2023

Gang Rape : వితంతువుకు మత్తు మందిచ్చి గ్యాంగ్ రేప్

రాజస్థాన్‌లో అరాచకం చోటు చేసుకుంది. భర్తను కోల్పోయి ఇద్దరు పిల్లలతో సంసారం భారంగా మారిన మహిళకు ఉద్యోగం ఆశ చూపి ఓ వ్యక్తి దగ్గరయ్యాడు. ఆ తరవాత
కుట్రతో ఆమెకు శీతల పానీయంలో మత్తుమందు కలిపి తాగించాడు. తన ఐదుగురు స్నేహితులతో కలసి 14 రోజుల పాటు గ్యాప్‌రేప్‌కు పాల్పడ్డారు. ఈ ఘటన భరత్‌పూర్‌లో వెలుగు చూసింది.

రాజస్థాన్‌ భరత్‌పూర్‌లోని ఓ హోటల్లో ఈ అఘాయిత్యం జరిగినట్టు తెలుస్తోంది. మొత్తం ఆరుగురు కామాంధులు వితంతువుపై 14 రోజులపాటు సామూహిక అత్యాచారానికి పాల్పడినట్టు బాధితురాలి కథనం ద్వారా తెలుస్తోంది. కామాంధుల నుంచి తప్పించుకుని బాధిత మహిళ కామా పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. నిందితులంతా పరారీలో ఉన్నట్టు పోలీసులు తెలిపారు. కేసు నమోదు చేసి నిందితుల కోసం గాలిస్తున్నట్టు డీఎస్పీ దేశ్‌రాజ్ కుల్దీప్ వెల్లడించారు.

K Venkateswara Rao | 09:56 AM, Wed Sep 20, 2023

JIr Airfiber : జియో ఎయిర్ ఫైబర్ వచ్చేసింది

ఇంటర్నెట్ వినియోగదారులు ఎప్పటి నుంచో ఎదురు చూస్తోన్న జియో ఎయిర్ ఫైబర్ అందుబాటులోకి వచ్చింది. వినాయక చవితి నుంచి అందుబాటులోకి తీసుకురానున్నట్టు రిలయన్స్ 46వ వార్షిక సాధారణ సమావేశంలో ప్రకటించిన విధంగానే ఇవాళ జియో ఎయిర్ ఫైబర్ సేవలు ప్రారంభించారు.

అత్యంత వేగంతో జియో ఎయిర్ ఫైబర్ నెట్ సేవలు అందిస్తుంది. 5జీ ఆధారిత వైర్‌లెస్ వైఫై సేవలు జియో ఎయిర్ ఫైబర్ సొంతం. ఇక నుంచి వైర్ ఆధారిత సేవలకు ప్రత్యామ్నాయంగా ఎయిర్ ఫైబర్ అందుబాటులోకి తెచ్చారు. ఇప్పటికే జియో ఫైబర్ సేవలు అందుబాటులో ఉన్నాయి. అయితే ప్రస్తుతం జియో ఎయిర్ ఫైబర్‌లో ఎలాంటి కేబుల్స్‌తో పనిలేదు. సమీపంలోని టవర్స్ నుంచి సిగ్నల్స్ అందుకుని నెట్ సేవలు అందిస్తుంది. బ్రాడ్‌బ్యాండ్ కన్నా వేగవంతమైన ఇంటర్నెట్ సేవలు, వైర్‌లెస్ ద్వారా అందించనుంది. ఎన్ని మొబైల్స్, కంప్యూటర్లు, ట్యాబులకైనా కనెక్ట్ చేసుకోవచ్చని కంపెనీ ప్రకటించింది.

కనీస ప్లాన్ రూ.599గా నిర్ణయించారు. ఇందులో 30 ఎంబీపీఎస్ స్పీడ్ లభిస్తుంది. వీటికి అదనంగా డిస్నీ ప్లస్, హాట్‌స్టార్, సోనీలివ్, జీ5, జియో సినిమా, సన్ నెక్ట్స్ ఓటీటీలు ఉచితంగా లభిస్తాయి. రూ.599 నుంచి ప్రారంభమయ్యే ప్యాకేజీతోపాటు, గరిష్ఠ ప్యాకేజీ రూ.3999గా నిర్ణయించారు రూ.3999 ప్యాకేజీలో 1 జీబీపీఎస్ స్పీడ్ నెట్ అందిస్తారు. వీటికి అదనంగా ఉచితంగా ఓటీటీ సేవలు కూడా లభిస్తాయి. నేటి నుంచి అహ్మదాబాద్, హైదరాబాద్, బెంగళూరు, చెన్నై, ఢిల్లీ, కోల్‌కతా, ముంబయి, పుణె నగరాల్లో అందుబాటులోకి తెచ్చారు. రాబోయే కొద్ది రోజుల్లో దేశమంతా అందుబాటులోకి తీసుకురానున్నారు.

K Venkateswara Rao | 15:31 PM, Tue Sep 19, 2023

SKILL DEVELOPMENT CASE: స్కిల్ కేసు ఆరోపణలు నిరాధారం.. సీమెన్స్ మాజీ ఎండీ

స్కిల్ డెవలప్‌మెంట్ స్కీమ్ కేసులో ఏపీ సీఐడీ చేస్తున్న ఆరోపణలు నిరాధారమని సీమెన్స్ సంస్థ మాజీ ఎండీ సుమన్ బోస్ చెప్పారు.  ప్రాజెక్టు వందశాతం విజయవంతమైందన్న సుమన్ బోస్.. దీనిలో ఏమాత్రం అవినీతి జరగలేదని చెప్పారు. స్కిల్ కేసులో చంద్రబాబు అరెస్టు అనంతరం చోటుచేసుకుంటున్న పరిణామాలపై స్పందించిన సీమెన్స్ సంస్థ మాజీ ఎండీ, అవినీతి జరిగిందని ఆరోపణలు వచ్చినప్పుడు సరైన విచారణ జరిపాక కేసు పెట్టాల్సి ఉండగా, కేసు పెట్టడం కోసమే ఆరోపణలు చేసినట్లు ఉందన్నారు.

ఒక్క శిక్షణా కేంద్రాన్ని కూడా సందర్శించకుండా ఆరోపణలు నిజమని ఎలా తేలుస్తారని దిల్లీలో నిర్వహించిన మీడియా సమావేశంలో ప్రశ్నించారు. సీమెన్స్ కంపెనీతో ఏపీ స్కిల్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్  మధ్య ఒప్పందం ఉందని తెలిపిన సుమన్ బోస్. అన్నీ విషయాలు అధ్యయనం చేసిన తర్వాతే ప్రాజెక్టును ప్రారంభించినట్లు తెలిపారు. ఒక సాఫ్ట్‌వేర్ పై యువతకి అవగాహన కల్పించినప్పుడు దానికి డిమాండ్ పెరుగుతుందన్నారు. మార్కెటింగ్ లో భాగంగానే 90: 10 ఒప్పందం జరిగిందని వివరించారు.

సీమెన్స్ పై చేస్తున్న ఆరోపణలన్నీ బోగస్ అని ఇప్పటి వరకు ఒక్క ఆరోపణ కూడా నిజమని చూపలేకపోయారన్నారు. ఇదే తరహా ప్రాజెక్టును చాలా రాష్ట్రాల్లో అమలు చేశామన్నారు. వ్యవహారం న్యాయస్థానం పరిధిలో ఉన్నందున అన్ని విషయాలు అక్కడే వివరిస్తామన్నారు.

 ఈ ప్రాజెక్టు బిల్ట్- ఆపరేట్-ట్రాన్స్‌ఫర్ పద్ధతిలో చేపట్టామన్న సుమన్ బోస్, 2021లో ప్రాజెక్టును శిక్షణ కేంద్రాలను ప్రభుత్వానికి అప్పగించినట్లు తెలిపారు. 2016లోనే ఈ ప్రాజెక్టును కేంద్రం ప్రశంసించిందన్నారు. 2018లో ఈ ప్రాజెక్టు నుంచి తాను తప్పుకున్నానన్న సుమన్ బోస్, తనపైనా ఇతరులపైనా తీవ్రమైన ఆరోపణలు చేస్తున్నారని ఆవేదన చెందారు.  ప్రాజెక్టులో అధికభాగం సీమెన్స్ సంస్థ నుంచి డిస్కౌంట్స్ రూపంలోనే అందిందని, అలాంటప్పుడు అవినీతి ఎలా సాధ్యమైందని ప్రశ్నించారు.

T Ramesh | 17:01 PM, Sun Sep 17, 2023

Lokesh Delhi Tour:  నారా లోకేశ్ అధ్యక్షతన టీడీపీ పార్లమెంటరీ పార్టీ సమావేశం

  టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ అధ్యక్షతన దిల్లీలో టీడీపీ పార్లమెంటరీ పార్టీ సమావేశం జరిగింది. ఈ నెల 18 నుంచి 22 వరకు జరిగే పార్లమెంట్ ప్రత్యేక సమావేశాల్లో పార్టీ అనుసరించాల్సిన వ్యూహంపై ఎంపీలకు లోకేశ్ దిశానిర్దేశం చేశారు. రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితులు ఉభయసభల దృష్టికి తీసుకెళ్ళాలని సూచించారు.

అంతకు ముందు దిల్లీలో మీడియాతో మాట్లాడిన లోకేశ్, వైసీపీని వ్యతిరేకించే పార్టీలు టీడీపీ-జనసేనతో కలిసి రావాలని పిలుపునిచ్చారు. తమతో కలిసి వచ్చే ప్రతి పార్టీకి స్వాగతం పలుకుతామన్నారు. వచ్చే ఎన్నికల్లో తమదే విజయమని ధీమా వ్యక్తం చేసిన లోకేశ్... జగన్ అవినీతి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదన్నారు.\

 చంద్రబాబు అరెస్టును టీడీపీ ప్రచారంలో ఓ స్పీడ్ బ్రేకర్ గానే చూస్తామన్న లోకేశ్,  స్కిల్ కేసు విషయంలో దేశ ప్రజలకు వాస్తవాలు చెప్పేందుకే దిల్లీ వచ్చినట్లు చెప్పారు.  అవినీతి నిరోధక చట్ట నిబంధనలు ఉల్లంఘించి చంద్రబాబును అరెస్టు చేశారన్నారు. 17(ఏ) నిబంధన ప్రకారం అరెస్టుకు ముందుస్తు అనుమతి తప్పనిసరి దానిని సిట్ పట్టించుకోలేదన్నారు. చంద్రబాబు ఎలాంటి అవినీతికి పాల్పడలేదని లోకేశ్ ఉద్ఘాటించారు.

T Ramesh | 18:28 PM, Sat Sep 16, 2023

CM JAGAN ON SKILL SCAM: చంద్రబాబుతో పవన్ ములాఖత్‌పై వైసీపీ అధినేత సెటైర్లు

టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్ పై సీఎం జగన్ మోహన్ రెడ్డి ఘాటు విమర్శలు చేశారు. స్కిల్ స్కామ్ లో అరెస్టై జైల్లో ఉన్న చంద్రబాబుతో పవన్ ములాఖాత్ అవ్వడాన్ని సీఎం ఎద్దేవా చేశారు. ములాఖత్‌లో భాగంగా ఇరువురూ రాజకీయంగా మిలాఖత్ అయ్యారని  దుయ్యబట్టారు.

చంద్రబాబు అరెస్టు తర్వాత మొదటిసారి ముఖ్యమంత్రి జగన్‌మోహన్ రెడ్డి  ఆ వ్యవహారంపై స్పందించారు. స్కిల్ స్కామ్ సూత్రధారి, పాత్రధారి చంద్రబాబేనని ఆరోపించిన సీఎం జగన్, నకిలీ ఒప్పందంతో ప్రభుత్వ ఖజానాను దోచేశారన్నారు. ప్రజాధనం దోచుకున్న చంద్రబాబును కాకుంటే ఇంకెవరిని అరెస్టు చేయాలని సీఎం జగన్ ప్రశ్నించారు.

తూర్పుగోదావరి జిల్లా నిడదవోలులో పర్యటించిన సీఎం జగన్, వైఎస్సార్ కాపు నేస్తం లబ్ధిదారులకు నాలుగో విడత ఆర్థిక సాయాన్ని అందించారు. అనంతరం ప్రజలను ఉద్దేశిస్తూ ప్రసంగిస్తూ స్కిల్ స్కామ్ అంశాన్ని ప్రస్తావించారు. చంద్రబాబు అవినీతికి పాల్పడి ఆధారాలతో దొరికిపోయారని చెప్పిన ముఖ్యమంత్రి జగన్, నిస్సిగ్గుగా కొందరు చంద్రబాబుకు మద్దతు పలుకుతున్నారని మండిపడ్డారు. చట్టం ఎవరికైనా ఒక్కటే అన్నారు.  

45 ఏళ్ళగా చంద్రబాబు అవినీతికి పాల్పడుతున్నారని ఆరోపించిన సీఎం జగన్, లేని కంపెనీని ఉన్నట్లుగా సృష్టించి స్కాం చేశారన్నారు. సాక్ష్యాలు, ఆధారాలు చూపిన తర్వాతే కోర్టు రిమాండ్ విధించిందన్నారు.    ప్రశ్నిస్తా, ప్రశ్నిస్తా అనే వ్యక్తి, చంద్రబాబు అవినీతి గురించి ఎందుకు మాట్లాడటం లేదని విమర్శలు గుప్పించారు. ఎల్లో మీడియా ఎందుకు నిజాలు చూపడం లేదన్నారు. చంద్రబాబు వాటాలు పంచుతాడు కాబట్టే మాట్లాడటం లేదన్నారు.

లంచాలు తీసుకుంటే తప్పేంటని చెత్తపలుకు రాసేది ఒకడు.. ములాఖత్ లో మిలాఖత్ చేసుకుని పొత్తు పెట్టుకునేది ఇంకొకడని ఘాటు విమర్శలు చేశారు. చంద్రబాబు నడిపిన కథలో ఆయన్ను కాకుండా ఇంకెవరిని అరెస్టు చేయాలన్న జగన్.. రూ.371 కోట్ల రూపాయల జనం  సొమ్ము ఎక్కడికి పోయిందన్నారు. ఎవరి జేబుల్లోకి ఈ సొమ్మంతా పోయిందో ప్రజలంతా ఆలోచన చేయాలని కోరారు.

T Ramesh | 15:31 PM, Sat Sep 16, 2023

Sensex : జీవితకాల గరిష్ఠాలను తాకిన దేశీయ స్టాక్ సూచీలు

స్టాక్ సూచీలు దూకుడుమీదున్నాయి. రెండో వారాంతంలోనూ స్టాక్ మార్కెట్లు లాభాలతో ముగిశాయి. ఉదయం లాభాలతో ప్రారంభమైన స్టాక్ సూచీలు సాయంత్రం ట్రేడింగ్ ముగిసే సమయానికి జీవిత కాల గరిష్ఠాలను రికార్డు చేశాయి. దేశీయ, అంతర్జాతీయంగా సానుకూల వాతావరణం నెలకొనడంతో స్టాక్ మార్కెట్లు పరుగులు పెడుతున్నాయి. వరుసగా 11వ రోజూ స్టాక్ మార్కెట్లు లాభాల జోరుకొనసాగించాయి.

ఉదయం లాభాలతో ప్రారంభమైన సెన్సెక్స్, ట్రేడింగ్ ముగిసే సమయానికి 319 పాయింట్లు లాభపడి 67838 వద్ద ముగిసింది. నిఫ్టీ 89 పాయింట్లు పెరిగి 20192 వద్ద ముగిసింది. రూపాయి మరింత బలహీన పడింది. డాలరుతో రూపాయి మారక విలువ 83.13గా ఉంది.

సెన్సెక్స్ 30 సూచీలో టాటా మోటార్స్, టెక్ మహీంద్రా, హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్, టీసీఎస్, భారతీ ఎయిర్‌టెల్, యాక్సిస్ బ్యాంక్, నెస్లే ఇండియా, సన్ ఫార్మా, ఐసీఐసీఐ బ్యాంక్ షేర్లు లాభాల్లో ముగిశాయి. కోటక్ మహీంద్రా బ్యాంక్, టైటన్, ఏషియన్ పెయింట్స్, బజాజ్ ఫిన్‌సర్వ్, హెచ్‌యూ‌ఎల్, ఇండస్‌ఇండ్ బ్యాంక్, పవర్ గ్రిడ్ నష్టాలను చవిచూశాయి.

K Venkateswara Rao | 16:42 PM, Fri Sep 15, 2023

Sajjala : చంద్రబాబుకు డూప్ పవన్ కల్యాణ్

చంద్రబాబు డూప్‌గా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ వ్యవహరిస్తున్నాడని ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి ఎద్దేవా చేశారు. పవన్ మనసులో ఎప్పుడూ చంద్రబాబే ఉంటాడని ఆయన అన్నారు. 2014లో ఓట్ల చీలకుండా ఉండేలా జనసేన పోటీలో నిలబడలేదు, 2019లో ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీల్చేందుకు జనసేన, టీడీపీ విడివిడిగా పోటీ చేశాయన్నారు. అసలు జనసేన, టీడీపీ ఎప్పుడు విడిపోయాయని సజ్జల ప్రశ్నించారు.

వైసీపీకి ప్రజల్లో 75 శాతం మద్దతు ఉందని, అధికారంలో ఉన్న ఏ పార్టీకి ఈ స్థాయిలో మద్దతు ఉండదని సజ్జల గుర్తుచేశారు. ఎవరెవరు కలసి పనిచేసినా వచ్చే ఎన్నికల్లో వైసీపీకి 60 శాతం ఓట్లు వస్తాయని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. ప్రజల నుంచి వస్తోన్న మద్దతు చూసిన తరవాతే ఈ మాట చెబుతున్నట్టు సజ్జల చెప్పారు. ఎన్నికలు ఎప్పుడు వచ్చినా తాము సిద్దమేనని ఆయన అన్నారు. పవన్ వ్యాఖ్యలను తాము పట్టించుకోమని సజ్జల వ్యాఖ్యానించారు.

స్కిల్ స్కాంలో రూ.350 కోట్లు షెల్ కంపెనీలకు మళ్లించారని ప్రభుత్వ సలహాదారు చెప్పారు. నిధులను డిజైన్ టెక్ కంపెనీకి మళ్లించినట్టు విచారణలో తేలిందని సజ్జల వెల్లడించారు. గుడి, గుడిలోని లింగాన్ని మింగింది చంద్రబాబు ముఠా అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. చంద్రబాబుకు తెలియకుండానే సీమెన్స్‌కు డబ్బులు వెళ్లాయా అని ఆయన ప్రశ్నించారు. ఒప్పందంలో ఎక్కడా రూ.3300 కోట్లు అనేదే లేదన్నారు.జీవోలో ఒకలాగ, ఒప్పందంలో మరోలా రాసుకున్నారని సజ్జల గుర్తుచేశారు. త్వరలో అన్నీ బయటకు వస్తాయన్నారు.

వ్యవస్థలను మేనేజ్ చేయడంలో చంద్రబాబు సిద్దహస్తుడని సజ్జల ధ్వజమెత్తారు. అన్ని వేళలా వ్యవస్థలను మేనేజ్ చేయడం కుదరదన్నారు. అడ్డంగా దొరికిపోయి, చంద్రబాబు సుద్దపూస అంటే ప్రజలు నమ్మరని ఆయన అన్నారు. చంద్రబాబు ముఠా చేసే క్యాంపెయిన్లు పట్టించుకోవాల్సిన అవసరం లేదన్నారు. సినిమాల్లో వేసినట్టు డైలాగులు వేస్తే జనం నవ్వుకుంటారని సజ్జల సెటైర్లు వేశారు.

K Venkateswara Rao | 17:48 PM, Thu Sep 14, 2023

LOKESH ON ALLIANCE: వైసీపీపై ఉమ్మడి పోరాటం, 2024లో పొత్తుతోనే పోటీ

వైసీపీకి వ్యతిరేకంగా టీడీపీ, జనసేన కలిసి పోరాడాలని నిర్ణయం తీసుకున్నట్లు నారా లోకేశ్ తెలిపారు. ప్రజావ్యతిరేక చర్యలకు పాల్పడుతున్న పాలకపార్టీకి వ్యతిరేకంగా పోరాడాలని చంద్రబాబు ఆదేశించారని చెప్పారు. 2024 ఎన్నికల్లో టీడీపీ, జనసేన ఉమ్మడిగా పోరాడాలని నిర్ణయించినట్లు చెప్పారు.

రాష్ట్రం కోసం, భావి తరాల కోసమే ఈ నిర్ణయం తీసుకున్నామని పేర్కొన్నారు. స్కిల్ స్కీమ్ స్కామ్ లో జూడిషీయల్ రిమాండ్ లో ఉన్న చంద్రబాబుతో పవన్ ములాఖత్ సందర్భంగా ఈ పరిణామం చోటుచేసుకుంది.  వైసీపీకి వ్యతిరేకంగా ప్రజాపోరాటాలు చేయడంతో పాటు ఎన్నికల్లో కలిసి పోటీచేయాలని నిర్ణయించుకున్నట్లు లోకేశ్ చెప్పారు. టీడీపీ, జనసేన తరఫున కమిటీలు వేయబోతున్నట్లు వెల్లడించారు.

జగన్ చేసే ప్రతి తప్పును ప్రజాక్షేత్రంలో ఎండగడతాం అన్నారు. వైసీపీ ప్రభుత్వంపై నారా లోకేశ్ మండిపడ్డారు. ప్రజల తరఫున, ప్రజల కోసం పోరాడుతున్న వారిపై అక్రమ కేసులు బనాయిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. తనపై 22 కేసులు పెట్టిన ప్రభుత్వం జనసేన అధినేత పవన్, అమరావతి రాకుండా  అడ్డుకున్నారని చెప్పారు. పవన్ కళ్యాణ్ లాంటి నాయకుడినే రాష్ట్రంలో అడుగుపెట్టకుండా అడ్డుకున్నారంటే సామాన్యుడి పరిస్థితేంటని లోకేశ్ ప్రశ్నించారు.

 వైసీపీ నేతలు చట్ట వ్యతిరేక చర్యలకు పాల్పడితే ఎలాంటి చర్యలు తీసుకోని పోలీసులు, విపక్షనేతలపై మాత్రం తప్పుడు కేసులు పెడుతున్నారని ఆరోపించారు. యువగళం పాదయాత్ర శాంతియుతంగా జరుగుతున్నప్పటికీ తమ వాలంటీర్లపై కేసులు పెట్టి జైల్లో పెట్టారని చెప్పారు.  

రాష్ట్రాభివృద్ధి కోసం ఏం చేయాలనేదానిపై పవన్, చంద్రబాబు చర్చించారని టీడీపీ పొలిట్‌బ్యూరో సభ్యుడు నందమూరి బాలకృష్ణ తెలిపారు. ప్రజా సంక్షేమాన్ని గాలికొదిలేసి, ప్రతిపక్షాలపై దాడికి పాల్పడే వ్యక్తి ముఖ్యమంత్రిగా ఉండటం మన దౌర్భాగ్యం అని విమర్శించారు. జైల్లో ఉన్నప్పటికీ చంద్రబాబు రాష్ట్రం గురించే ఆలోచిస్తున్నారని చెప్పారు. దేశం మొత్తం చంద్రబాబు అరెస్టును తప్పుబడుతోందన్నారు.

T Ramesh | 16:19 PM, Thu Sep 14, 2023

CBN REMAND UPDATE: చంద్రబాబును కస్టడీకి  కోరుతూ మరో పిటిషన్

టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుపై మరో కేసు నమోదైంది. అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్డు కేసులోనూ చంద్రబాబును విచారించడానికి అనుమతి కోరుతూ సీఐ, ప్రిజనర్ ఇన్ ట్రాన్సిట్ ( పీటీ) వారెంట్ వేసింది.  2022లో నమోదైన కేసులో పీటీ వారెంటుపై చంద్రబాబును విచారించేందుకు కోర్టు అనుమతి కోరింది.

ఈ కేసులో ఏ1గా చంద్రబాబు, ఏ2గా నారాయణ, ఏ6గా లోకేశ్ ఉన్నారని, చంద్రబాబును విచారించాల్సిన అవసరం ఉందని పిటిషన్ లో పేర్కొన్నారు.   ఈ కేసుకు సంబంధించి ఏపీ హైకోర్టులో ఇది వరకే వాదనలు పూర్తయ్యాయి. న్యాయస్థానం తీర్పును రిజర్వులో ఉంచింది. ప్రస్తుతం స్కిల్ డెవలప్‌మెంట్ కేసులో చంద్రబాబు అరెస్టై రాజమహేంద్రవరం సెంట్రల్ జైల్లో ఉన్నారు. దీంతో సీఐడీ పీటీ వారెంట్ కోరుతూ పిటిషన్ వేసింది. స్కిల్ డెవలప్‌మెంట్ కేసులో చంద్రబాబును ఐదు రోజుల కస్టడీకి కోరుతూ మరో పిటిషన్ దాఖలు చేసింది. 

చంద్రబాబు హౌస్ రిమాండ్ పై ఏసీబీ కోర్టులో ఇరువర్గాల వాదనలు ముగిసాయి. సీఐడీ తరఫున ఏజీ శ్రీరామ్, పొన్నవోలు సుధాకర్ రెడ్డి వాదించగా, చంద్రబాబు తరఫున ప్రముఖ న్యాయవాది సిద్ధార్థ లూద్రా వాదించారు. కాసేపట్లో న్యాయమూర్తి తీర్పు చెప్పనున్నారు.  తీర్పూ అనుకూలంగా రాకపోతే  హైకోర్టుకు వెళ్ళాలని టీడీపీ లీగల్ సెల్ భావిస్తోంది.

చంద్రబాబు ఇప్పటి వకు ఎస్ఎస్‌జీ భద్రతలో ఉన్నారని, ఆయనకు ప్రస్తుతం జైల్లో కల్పించిన భద్రతపై అనుమానం ఉందని లూద్రా వాదించారు. హౌజ్ కస్టడీకి సంబంధించి గతంలో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును పరిశీలించాలని కోరారు.

చంద్రబాబు భద్రతకు ఎలాంటి ఇబ్బందులు లేవని, రాజమండ్రి సెంట్రల్ జైల్లో చంద్రబాబుకు గట్టిభద్రత కల్పించామని అడ్వకేట్ జనరల్ శ్రీరామ్ తెలిపారు. జైలులో చంద్రబాబుకు ప్రత్యేక గదితో పాటు సీసీ కెమెరాల పర్యవేక్షణలో కొనసాగుతోంది. జైల్లో కల్పిస్తున్న భద్రతపై జైళ్ళ శాఖ డీజీ ఆదేశాలను న్యాయమూర్తికి అందజేశారు. చంద్రబాబు సాక్షులను ప్రభావితం చేసే అవకాశం ఉందని, గృహ నిర్బంధం పిటిషన్ ను డిస్మిస్ చేయాలని కోరారు.

T Ramesh | 17:11 PM, Mon Sep 11, 2023

SKILL SCAM argument: చంద్రబాబు అరెస్టుపై ముగిసిన వాదనలు.. కాసేపట్లో తీర్పు..

స్కిల్ డెవలప్‌మెంట్ కేసులో మాజీ సీఎం చంద్రబాబు నాయుడు అరెస్టుకు సంబంధించి విజయవాడ ఏసీబీ కోర్టులో వాదనలు ముగిశాయి. న్యాయమూర్తి ఎదుట ఇరుపక్షాలు సుదీర్ఘ వాదనలు వినిపించాయి. దీంతో కాసేపట్లో కోర్టు తీర్పు వెల్లడించనుంది. ఈ కేసులో 2021లో ఎఫ్ఐఆర్ నమోదైందని విచారించేందుకు చంద్రబాబును 15 రోజుల కస్టడీకి ఇవ్వాలని  సీఐడీ తరఫు న్యాయవాది   కోరారు. 28 పేజీల రిమాండ్ రిపోర్టును కోర్టుకు సీఐడీ అందజేసింది.

సీఐడీ తరఫున ఏజీ పొన్నవోలు సుధాకర్ రెడ్డి, న్యాయవాదుల వివేకాచారీ, వెంకటేశ్ హాజరయ్యారు. చంద్రబాబు తరపున సుప్రీంకోర్టు న్యాయవాది సిద్ధార్థ లూద్రా వాదనలు వినిపించారు. చంద్రబాబు కూడా తానే స్వయంగా వాదించారు.

స్కిల్ డెవలప్‌మెంట్ స్కాం రాజకీయ ప్రేరేపిత చర్య అని వాదించిన సిద్ధార్థ లూద్రా, చంద్రబాబును కేసులో ఇరికించేందుకు ప్రయత్నం చేస్తోందన్నారు. చంద్రబాబు హక్కులకు భంగం కలిగించేలా వ్యవహరించారని అరెస్టుకు అవసరమైన ప్రక్రియను పాటించలేదని న్యాయమూర్తి దృష్టికి తీసుకెళ్ళారు.

లూద్రా లేవనెత్తిన ప్రశ్నలకు సీఐడీ తరఫున ఏఏజీ సుధాకర్ రెడ్డి సమాధానమిచ్చారు. చంద్రబాబుపై సీఐడీ 34 అభియోగాలు నమోదు చేసిందని, కుంభకోణంలో చంద్రబాబు పాత్ర ఉందన్నారు. చంద్రబాబు లాయర్లు ఎంతసేపూ సాంకేతిక అంశాల గురించే మాట్లాడుతున్నారని, అవినీతి చేయలేదని ఒక్క మాట కూడా చెప్పడం లేదన్నారు. చంద్రబాబును అరెస్టు చేయడానికి గవర్నర్  అనుమతి అవసరం లేదని, స్పీకర్ కు సమాచారం ఇస్తే సరిపోతుందని, ఆ నియమాలను సీఐడీ పాటించిందన్నారు. అరెస్టైన మూడు నెలలలోపు గవర్నర్ కు ఎప్పుడైనా సమాచారం అందజేసే సౌలభ్యం ఉందన్నారు.

తీవ్రమైన ఆర్థిక నేరాలకు పాల్పడిన వారిని ఎలాంటి నోటీసు ఇవ్వకుండానే అరెస్టు చేయవచ్చు అని చెప్పారు. ముఖ్యమంత్రి హోదాలో చంద్రబాబు నిధుల విడుదలకు ఆదేశించారని అందుకు సంబంధించిన ఆధారాలు తమ వద్ద ఉన్నాయని కోర్టు దృష్టికి తీసుకెళ్ళారు.

సెక్షన్ 409 పూర్తిగా వర్తిస్తుందని చంద్రబాబుకు రిమాండ్ విధించాలని కోరారు. ఏసీబీ కోర్టులో చంద్రబాబు తరఫు న్యాయవాది లూథ్రా,  చంద్రబాబుకు రిమాండ్ విధిస్తే బెయిల్ అప్లికేషన్ ను పరిగణనలోకి     తీసుకోవాలని కోరారు  . దీనిపై న్యాయస్థానం ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. నంద్యాలలో కోర్టు ఉండగా చంద్రబాబును విజయవాడ ఎందుకు తీసుకువచ్చారని కొత్త వాదన లేవనెత్తారు.

T Ramesh | 15:25 PM, Sun Sep 10, 2023

CBN ARREST: కోర్టులో తన వాదనలు వినిపించిన చంద్రబాబు

స్కిల్ డెవలప్‌మెంట్ స్కాంలో మాజీ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత చంద్రబాబు అరెస్టుపై  ఏసీబీ కోర్టులో విచారణ జరుగుతోంది. టీడీపీ అధినేత చంద్రబాబు నుంచి న్యాయమూర్తి వాంగ్మూలం తీసుకున్నారు. తన అరెస్టు అక్రమం అని చంద్రబాబు వాంగ్మూలంలో పేర్కొన్నారు. రాజకీయ కక్షతోనే తనపై కేసు నమోదు చేశారని పిటిషన్ దాఖలు చేశారు. రాజకీయ లబ్ధి కోసమే తనపై తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని పిటిషన్ లో పేర్కొన్న చంద్రబాబు, సీఐడీ రిమాండ్ రిపోర్టును తిరస్కరించాలని కోరారు.

గవర్నర్ అనుమతి లేకుండా కేసు నమోదు చేయడంతో పాటు తనను అదుపులోకి తీసుకోవడం చట్టవిరుద్ధమన్నారు. స్కిల్‌డెవలప్‌మెంట్ కార్పొరేషన్ ఏర్పాటు చేయాన్నది నాటి కేబినెట్ నిర్ణయమని, దానిపై క్రిమినల్ చర్యలు ఎలా తీసుకుంటారన్నారు. అసెంబ్లీ ఆమోదం తెలిపిన బడ్జెట్ ను క్రిమినల్ చర్యలతో ప్రశ్నించలేరని తెలిపారు. 2021 డిసెంబరు 9న నమోదు చేసిన ఎఫ్ఐఆర్ లోనూ రిమాండ్ రిపోర్టులోనూ తన పాత్రను పేర్కొనలేదని వివరించారు.

చంద్రబాబు తరఫున వాదనలు వినిపించడానికి ముగ్గిరికి అవకాశం కల్పించాలని న్యాయమూర్తిని కోరగా, ఇద్దరికి మాత్రమే జస్టిస్ హిమబిందు అవకాశం కల్పించారు. దీంతో సిద్ధార్థ లూద్రా, పోసాని వెంకటేశ్వరరావు పేర్లు చెప్పగా న్యాయమూర్తి అనుమతి ఇచ్చారు.

409 సెక్షన్ కింద వాదనలు జరుగుతున్నాయి. దీనిపై సుప్రీంకోర్టు ప్రముఖ న్యాయవాది సిద్ధార్థ లూద్రా వాదిస్తున్నారు. ఈ సెక్షన్ పెట్టడం సబబు కాదని, వర్తించాలంటే సరైన ఆధారం కావాలన్నారు. సీఐడీ తరఫున ఏజీ పొన్నవోలు సుధాకర్ రెడ్డి, లాయర్లు వివేకాచారి, వెంకటేశ్ వాదిస్తున్నారు. చంద్రబాబును 15 రోజుల కస్టడీకి ఇవ్వాలని కోరింది. మొత్తం 28 పేజీలతో రిమాండ్ రిపోర్టు సమర్పించింది. చంద్రబాబు తరఫున సిద్ధార్థ లూద్రా వాదనలు ఇంకా కొనసాగిస్తున్నారు.

T Ramesh | 11:06 AM, Sun Sep 10, 2023

AP CID ON CBN ARREST: స్కిల్  డెవలప్‌మెంట్  స్కాంలో  చంద్రబాబే  ప్రధాన కుట్రదారు

టీడీపీ అధినేత చంద్రబాబు అరెస్టుపై ఏపీ సీఐడీ చీఫ్ సంజయ్ స్పందించారు. నంద్యాలలో ఉదయం ఆరు గంటలకు చంద్రబాబును అరెస్టు చేసినట్లు తెలిపారు. స్కిల్ డెవలప్‌మెంట్ కేసులో ఆయన్ను ప్రధాన నిందితుడిగా గుర్తించినట్లు పేర్కొన్నారు.

నైపుణ్యాభివృద్ధి కేంద్రాల ఏర్పాటులో కుంభకోణం జరిగిందని, అందులో రూ. 550 కోట్ల మేర అక్రమాలు జరిగాయని గుర్తించినట్లు తెలిపారు. ప్రభుత్వం తన వాటాగా ఇవ్వాల్సిన రూ. 371 కోట్లు, డిజైన్‌టెక్ సహా ఇతర షెల్ కంపెనీలకు వెళ్ళినట్లు గుర్తించామన్నారు.

సీమెన్స్ తరఫున డిజైన్ టెక్ అనే సంస్థ ద్వారా లావాదేవీలు జరిగాయని, ఒప్పందం జరిగే సమయానికి ఆ సంస్థే లేదన్నారు. ఏపీ స్కిల్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్‌లో గంటా సుబ్బారావుకు నాలుగు పదవులు ఇచ్చారన్నారు. కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్నచంద్రబాబు, సాక్ష్యాలను మాయం చేసే అవకాశం ఉందని అందుకే అరెస్టు చేసినట్లు తెలిపారు.

కుంభకోణంలో అప్పటి కార్యదర్శితో పాటు చంద్రబాబు తనయుడి పాత్రపైనా దర్యాప్తు జరుగుతోందన్నారు. సీమెన్స్ సంస్థ నుంచి  రూ.550 కోట్లు పెట్టుబడి వస్తుందని పేర్కొంటూ ప్రభుత్వం జీవోల ద్వారా రూ. 371 కోట్లు ఇచ్చేశారని, దీనికి కేబినెట్ ఆమోదం కూడా లేదని సీఐడీ చీఫ్ తెలిపారు.

కేసు విచారణకు సంబంధించి సీఐడీ బృందాలు దుబాయి, అమెరికాకు వెళ్తున్నాయన్నారు. ఈ కేసులో రాజేశ్, నారా లోకేశ్ పాత్రలు ఎంత ఉన్నాయన్నది తేలుస్తామన్నారు. ఏపీ ఫైబర్‌నెట్ తో పాటు ఇన్నర్ రింగ్ రోడ్డు అక్రమాల కేసులో లోకేశ్ పాత్రపైనా విచారణ చేస్తామని తెలిపారు.

చంద్రబాబును విజయవాడ తరలించేందుకు హెలికాప్టర్ సిద్ధం చేశామని అయితే ఆయన నిరాకరించారన్నారు. ఈ కేసులో అంతిమలబ్ధిదారు చంద్రబాబే అని ఆయన ప్రధాన కుట్రదారు ి కాబట్టే అరెస్టు చేశామని తెలిపారు.

T Ramesh | 12:36 PM, Sat Sep 09, 2023

TDP CHIEF CHANDRABABU: చంద్రబాబును అరెస్టు చేసిన సీఐడీ

స్కిల్ డెవలప్‌మెంట్ కేసులో టీడీపీ జాతీయ అధ్యక్షుడు, మాజీ సీఎం చంద్రబాబు నాయుడును సీఐడీ పోలీసులు అరెస్టు చేశారు. నంద్యాల ఆర్కే ఫంక్షన్ హాల్ వద్ద చంద్రబాబును అరెస్టు చేసిన పోలీసులు అక్కడి నుంచి విజయవాడకు తరలించారు.  క్రైం నంబరు 29/2021 కేసులో అరెస్టు చేసినట్లు సీఐడీ తెలిపింది. 120(B), 166, 167, 418, 420, 465 సెక్షన్ల కింద చంద్రబాబును అదుపులోకి తీసుకున్నారు. సీఐడీ చట్టంలోని 12, 13(2) రెడ్ విత్ (1)(c)(d) సెక్షన్లను పోలీసులు చంద్రబాబుపై నమోదు చేశారు. చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో స్కిల్ డెవలప్‌మెంట్ విభాగంలో అవినీతికి పాల్పడ్డారని రూ. 317 కోట్లు దారి మళ్ళించారనే ఆరోపణలతో కేసు నమోదైంది.

అర్ధరాత్రి నుంచే చంద్రబాబును అరెస్టు చేసేందుకు పోలీసులు ప్రయత్నాలు ప్రారంభించారు. ఆయన బస చేసిన ప్రదేశానికి భారీగా చేరుకున్న పోలీసు సిబ్బంది, తెల్లవారు జాము సమయంలో అదుపులోకి తీసుకున్నారు.  వైద్య పరీక్షలు నిర్వహించిన అనంతరం, ఆయన కాన్వాయ్ లోనే ఎస్ఎస్‌జీ భద్రతతో విజయవాడ తరలిస్తున్నారు.

అరెస్టుకు సంబంధించిన పత్రాలపై చంద్రబాబు సంతకం చేశారు. విజయవాడలోని ఏసీబీ కోర్టులో చంద్రబాబును హాజరుపరిచే అవకాశం ఉంది. చంద్రబాబు అరెస్టు పై ఆయన తరఫు న్యాయవాది స్పందించారు. వైద్య పరీక్షల్లో చంద్రబాబుకు హైబీపీ, షుగర్ ఉందని తేలిందని హైకోర్టులో బెయిల్ కు ప్రయత్నం చేస్తున్నామని తెలిపారు. కేసుతో సంబంధంలేని సెక్షన్లు నమోదు చేయడంతో పాటు స్కిల్ డెవలప్‌మెంట్ కేసులో 37వ ముద్దాయిగా పేర్కొన్నారని తెలిపారు.

శుక్రవారం అర్దరాత్రి దాటిన తర్వాత చంద్రబాబు బస చేసిన ప్రదేశానికి అధికసంఖ్యలో పోలీసులు చేరుకున్నారు. అనంతపురం నుంచి పోలీసు బృందాలను నంద్యాలకు రప్పించారు. మొత్తం ఆరు బస్సుల్లో బలగాలు ఎస్పీ కార్యాలయం వద్దకు చేరుకున్నాయి.

డీఐజీ రఘురామరెడ్డి, జిల్లా ఎస్పీ రఘువీరారెడ్డి ఆధ్వర్యంలో పోలీసులను మోహరించారు. ఈ రోజు ఉదయం 5 గంటలకు చంద్రబాబు బస చేస్తున్న వాహనం వద్దకు పోలీసులు భారీగా చేరుకున్నారు. వాహనం చుట్టూ ఉన్న టీడీపీ నేతలను కూడా అరెస్టు చేశారు. మాజీమంత్రులు, మాజీ ఎమ్మెల్యేలు, టీడీపీ ముఖ్యనేతలను పోలీసులు అదుపులోకి తీసుకుని స్టేషన్‌కు తరలించారు.


T Ramesh | 10:39 AM, Sat Sep 09, 2023
upload

Crime News

Pm Modi

upload