Sunday, October 01, 2023

Odisha-365

రాజకీయం

upload

దేశ రాజకీయాలు

PM MODI@PALAMURU: తెలంగాణకు మోదీ వరాలు.. పసుపు బోర్డు, సమ్మక్క-సారక్క గిరిజన వర్సిటీ

తెలంగాణపై ప్రధాని మోదీ వరాల జల్లు కురిపించారు. మహబూబ్ నగర్  పర్యటనలో భాగంగా పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసిన ప్రధాని మోదీ, తెలంగాణ ప్రజలకు కీలక వరాలు ప్రకటించారు.  తెలంగాణలో పసుపు బోర్డుతో  పాటు సమ్మక్క-సారక్క పేరుతో గిరిజన వర్సిటీ ఏర్పాటు చేస్తామని బహిరంగ సభ వేదికగా ప్రకటించారు. 

తెలుగులో ప్రసంగాన్ని ప్రారంభించిన ప్రధాని మోదీ,  నా కుటుంబ సభ్యులారా అంటూ తెలంగాణ ప్రజలను సంబోధించారు. తెలంగాణ అభివృద్ధికి కేంద్రం కట్టుబడి ఉందని, పాలమూరు సభ సాక్షిగా పసుపు బోర్డు ఏర్పాటు చేస్తామని ప్రకటించారు. పసుపు రైతుల సంక్షేమం కోసం జాతీయ పసుపు బోర్డు ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. ములుగు జిల్లాలో గిరిజన విశ్వవిద్యాలయం ఏర్పాటు చేస్తామని, వన దేవతలు అయిన సామ్మక్క-సారక్క పేరుపై వర్సిటీ ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు. ఇందు కోసం కేంద్ర ప్రభుత్వం రూ. 900 కోట్లు ఖర్చు చేస్తుందన్నారు.

తెలంగాణలో ఇవాళ రూ. 13,500 కోట్ల అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టామని చెప్పిన ప్రధాని, కేంద్రం తీసుకుంటున్న చర్యలతో యువతకు ఉపాధి అవకాశాలు పెరిగాయన్నారు.  జాతీయ రహదారుల నిర్మాణంతో అన్ని రాష్ట్రాలతో తెలంగాణ అనుసంధానం మునిపటి కంటే పెరిగిందన్నారు.

దేశంలో నిర్మించే ఐదు టెక్స్‌టైల్స్ పార్కుల్లో తెలంగాణకు ఒకటి కేటాయించామన్నారు. హన్మకొండలో నిర్మించే టెక్స్‌టైల్ పార్కుతో  వరంగల్, ఖమ్మం ప్రజలకు ఉపాధి అవకాశాలు  పెరుగుతాయన్నారు. ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఎమినెన్స్ గా హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీని గుర్తిస్తామన్నారు. కృష్ణపట్నం-హైదరాబాద్ మల్టీ ప్రొడెక్ట్ పైప్ లైన్ పనులను ప్రారంభించారు. జక్లేర్ కృష్ణ కొత్త రైల్వే లైన్ ను జాతికి అంకితమిచ్చారు.K Venkateswara Rao | 16:01 PM, Sun Oct 01, 2023

TDP PLANS: గాంధీ జయంతి రోజు చంద్రబాబు సతీమణి నిరాహార దీక్ష…

బస్సు యాత్ర చేపట్టే ఛాన్స్ టీడీపీ అధినేత చంద్రబాబును రాష్ట్రప్రభుత్వం అక్రమ కేసులతో వేధిస్తోందంటూ ఆ పార్టీ నేతలు వరుస ఆందోళనలకు పిలుపునిస్తున్నారు. రాష్ట్రవ్యాప్తంగా  ం ‘మోతమోగిద్దాం’ పేరుతో నిరసనలు చేపట్టాలని ఇప్పటికే శ్రేణులకు పిలుపునిచ్చింది. చంద్రబాబు సతీమణి నారా భువనేశ్వరి అక్టోబర్ 2న నిరాహార దీక్ష చేస్తారని ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు వెల్లడించారు. చంద్రబాబు అరెస్టును ఖండిస్తూ అక్టోబర్ 2 రాత్రి 7 గంటల నుంచి 7.05 వరకు ప్రతీ ఇంట్లో లైట్లన్నీ ఆపేసి కొవ్వొత్తులతో  నిరసన తెలపాలని  కోరారు.

  త్వరలో టీడీపీ, జనసేన నుంచి కొంతమందితో కమిటీ వేసి క్షేత్రస్థాయిలో పోరాడతామన్న అచ్చెన్నాయుడు, ఆదివారం నుంచి నాలుగు రోజుల పాటు పవన్ మచిలీపట్నం పార్లమెంట్ పరిధిలో పర్యటిస్తారని తెలిపారు. చంద్రబాబు అరెస్టుతో  పలువురు కలత చెందారని, అక్రమ అరెస్టును తట్టుకోలేక ఇప్పటికే 97 మంది చనిపోయారని చెప్పారు. వీరికి నంద్యాలలో జరిగిన టీడీపీ పొలిటికల్ యాక్షన్ కమిటీ సమావేశంలో సంతాపం తెలిపామన్నారు.

ప్రాణాలు విడిచిన వారి కుటుంబాలను త్వరలో కలిసి ధైర్యం చెబుతామన్నారు. మేలుకో తెలుగోడా పేరుతో నారా భువనేశ్వరి బస్సు యాత్ర కూడా నిర్వహించే అవకాశం ఉందని తెలుస్తోంది. చంద్రబాబు జైల్లో ఉండటం, న్యాయపోరాటంలో భాగంగా లోకేశ్ దిల్లీకి పరిమితం కావడంతో ఆ పార్టీ శ్రేణుల్లో నైరాశ్యం ఏర్పడింది.

తెలుగు తమ్ముళ్ళలో జోష్ నింపేందుకు చంద్రబాబును అక్రమంగా అరెస్టు చేశారని ప్రజల్లోకి బలంగా తీసుకెళ్ళేందుకు భువనేశ్వరి చేపట్టే ‘మేలుకో తెలుగోడా’ కార్యక్రమం ఉపయోగపడుతుందని ఆ పార్టీ అభిమానులు, కేడర్ అభిప్రాయపడుతున్నారు.

T Ramesh | 16:24 PM, Sat Sep 30, 2023

ASADUDDIN CHALLENGES RAHUL:  వయనాడ్ కాదు హైదరాబాద్ అంటూ... రాహుల్‌కు సవాల్ విసిరిన అసదుద్దీన్ ఓవైసీ

అసెంబ్లీ ఎన్నికల గడువు దగ్గర పడుతుండటంతో తెలంగాణలో రాజకీయాలు ఆసక్తికరంగా మారాయి. పాలక బీఆర్ఎస్‌కు దీటుగా కాంగ్రెస్, బీజేపీ వ్యూహాలు అమలు చేస్తున్నాయి. ఇప్పటికే ప్రజాక్షేత్రంలో ఆయా పార్టీల నేతలు గెలుపే లక్ష్యంగా శ్రమిస్తున్నారు. ప్రచారపర్వంలో ప్రత్యర్థులపై విమర్శలు, ఆరోపణలతో విరుచుకు పడుతున్నారు.

హ్యాట్రిక్ కోసం కేసీఆర్ వ్యూహాత్మకంగా అడుగులు వేస్తుండగా, పూర్వ వైభవం కోసం కాంగ్రెస్ ఆరాటపడుతోంది. తెలంగాణలో అధికారంలోకి వచ్చి తెలుగు రాష్ట్రాల రాజకీయాలపై పట్టు సాధించేందుకు కాషాయ పార్టీ దూకుడు ప్రదర్శిస్తోంది.

పాలక బీఆర్ఎస్ మిత్రపక్షంగా వ్యవహరిస్తున్న ఆల్ ఇండియా మజ్లిస్ ఇత్తేహాదుల్ ముస్లిమీన్(ఏఐఎమ్ఐఎమ్), కాంగ్రెస్ లక్ష్యంగా విమర్శలు చేయడంతో తెలంగాణ రాజకీయాలు మరింత ఆసక్తిని రేకిస్తున్నాయి. ‘‘ఆర్భాటపు ప్రకటనలు, కల్లబొల్లి మాటలు చెప్పడం మాని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ, హైదరాబాద్ నుంచి పోటీ చేయాలని’’ సవాల్ విసిరారు.  వయనాడ్ నుంచి కాకుండా రాహుల్ తనపై పోటీ చేయాలని ఎమ్ఐఎమ్ అధినేత, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ అన్నారు.

ఎమ్ఐఎమ్ పార్టీ సమావేశంలో ప్రసంగించిన అసదుద్దీన్, అయోద్యలో బాబ్రీ మసీదు కూల్చివేత కాంగ్రెస్ పాలనలో జరిగిందన్నారు. కాంగ్రెస్ నేతలు పెద్దపెద్ద ప్రకటనలు చేస్తున్నారని మండిపడిన ఎమ్ఐఎమ్ చీఫ్, అనవసరపు విమర్శలు మాని హైదరాబాద్ నుంచి పోటీ చేయాలని రాహుల్ గాంధీకి సవాల్ విసిరారు. బాబ్రీ మసీదుతో పాటు సెక్రటేరియట్ మసీదు కూల్చివేత కాంగ్రెస్ పాలనలో జరిగిన విషయాన్ని మరిచిపోలేదన్నారు.  

ఇటీవల తెలంగాణలో పర్యటించిన కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ, బీఆర్ఎస్, ఎమ్ఐఎమ్, బీజేపీలు కలిసి పనిచేస్తున్నాయని విమర్శించారు. వేరే వేరు పార్టీలుగా ఉన్నప్పటికీ కలిసే పనిచేస్తున్నారని ఎద్దేవా చేశారు. ఈ మూడు పార్టీలకు వ్యతిరేకంగా కాంగ్రెస్ పోరాటం చేస్తుందన్నారు. కేసీఆర్, ఓవైసీని ప్రధాని మోదీ తన సొంతవారిగా భావిస్తున్నారని అందుకే వారిపై ఈడీ కేసులు దాఖలు కాలేదని ఘాటు విమర్శలు చేశారు.

T Ramesh | 13:10 PM, Mon Sep 25, 2023

AP BJP:  మద్యం విక్రయాలపై సీబీఐ విచారణ కోరుతామన్న పురందరేశ్వరి

రాష్ట్రంలో మద్యం అక్రమాలపై సీబీఐ విచారణ కోరుతామని బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు పురందరేశ్వరి అన్నారు. విజయవాడ లోని బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో ఏర్పాటు చేసిన నరేంద్రమోదీ ఫొటో ఎగ్జిబిషన్‌ను పురందరేశ్వరి ప్రారంభించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ అక్రమ మద్యం ద్వారా వైసీపీ నేతలు జేబులు నింపుకున్నారని ఆరోపించారు.

నరసాపురంలో నిన్న మద్యం దుకాణాన్ని తనిఖీ చేసినప్పుడు నగదు లావాదేవీల్లో అక్రమాలు బయట పడ్డాయన్నారు. మధ్యాహ్నం సమయానికి లక్ష రూపాయల మేరకు విక్రయాలు జరిగితే అందులో డిజిటల్ చెల్లింపులు జరిగింది రూ. 700 మాత్రమేనన్నారు.

ప్రజల కష్టార్జితాన్ని వైసీపీ నేతలు దోచుకుంటున్నారని దుయ్యబట్టిన పురందరేశ్వరి, ప్రతిరోజు మద్యం అమ్మకాల ద్వారా వైసీపీ నేతలు రాష్ట్రవ్యాప్తంగా అక్రమ సంపాదన పొగేసుకుంటున్నారని తెలిపారు. ప్రజల కష్టాన్ని దోచుకుని ఉచితాలు ఇస్తున్నామనే దిశగా మాట్లాడటం రాష్ట్ర ప్రభుత్వానికి సమర్థనీయం కాదన్నారు.

T Ramesh | 17:30 PM, Fri Sep 22, 2023

JDS JOINS NDA: ఎన్డీయేలో చేరిన జేడీఎస్

అధికార ఎన్డీయేలో మాజీ ప్రధాని దేవగౌడ్‌కు చెందిన జేడీ(ఎస్) చేరింది. కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి, జేడీఎస్ అగ్రనేత కుమారస్వామి, దిల్లీలో కేంద్ర హోంమంత్రి అమిత్ షాను మర్యాదపూర్వకంగా కలిసి ఎన్డీయేలో అధికారికంగా చేరుతున్నట్లు తెలిపారు. అమిత్ షాతో కుమారస్వామి జరిపిన చర్చల్లో గోవా సీఎం ప్రమోద్ సావంత్ కూడా పాల్గొన్నారు.

పార్లమెంటు భవనంలో దేవగౌడ్, అతని కుమారుడు కుమారస్వామి, బీజేపీ చీఫ్ జేపీనడ్డాతో పాటు అమిత్ షాతో గురువారమే భేటీ అయ్యారు. ఈ సందర్భంగా సీట్ల సర్దుబాటుపై చర్చ జరిగినట్లు సమాచారం. గడిచిన కొన్ని నెలలుగా బీజేపీ-జేడీఎస్ పొత్తుపై అనేక ఊహాగానాలు వెలువడ్డాయి. రానున్న లోక్ సభ ఎన్నికల్లో ఇరుపార్టీలు పొత్తుతో పోటీ చేస్తాయని తెలుస్తోంది. కర్ణాటకలో మొత్తం 28 ఎంపీ సీట్లు ఉండగా, జేడీఎస్‌కు నాలుగు సీట్లు కేటాయించేందుకు బీజేపీ సుముఖత తెలిపింది.

2019 లోక్‌సభ ఎన్నికల్లో జేడీఎస్, కాంగ్రెస్ పొత్తుతో పోటీ చేశాయి. అయితే బీజేపీ 25 సీట్లలో విజయం సాధించింది. మాండ్యలో బీజేపీ మద్దతు తెలిపిన స్వతంత్ర అభ్యర్థి కూడా విజయం సాధించారు. తాజాగా జరిగిన అసెంబ్లీ  ఎన్నికల్లో జేడీఎస్ 19 సీట్లకే పరిమితమైంది. ఆ పార్టీ చరిత్రలో మొదటి సారి అత్యంత తక్కువ సీట్లకు పరిమితం కావాల్సి వచ్చింది. ఇటీవల జరిగిన ఎన్డీయే, ఇండియా సమావేశాల సందర్భంగా  ఏ కూటమి నుంచి ఆ పార్టీకి పిలుపురాకపోవడం గమనార్హం.

T Ramesh | 17:14 PM, Fri Sep 22, 2023

upload
upload

PM MODI: పార్లమెంట్ పాత భవనానికి వీడ్కోలు.. ప్రత్యేక  సమావేశాల  సందర్భంగా ప్రధాని భావోద్వేగం

భారత్ సువర్ణాధ్యాయానికి పార్లమెంట్ పాత భవనం సాక్షిగా నిలిచిందని ప్రధాని నరేంద్రమోదీ అన్నారు. పార్లమెంట్ ప్రత్యేక సమావేశాల ప్రారంభం సందర్భంగా ప్రసంగించిన ప్రధాని మోదీ.. పార్లమెంటు 75 ఏళ్ళ ప్రస్థానంలోని ఘట్టాలను గుర్తుచేసుకుని భావోద్వేగానికి గురయ్యారు.

రేపటి నుంచి సమావేశాలు కొత్త భవనంలో జరగనున్న వేళ, పాత భవనంలోని స్మృతులను మోదీ గుర్తు చేసుకున్నారు. ఎన్నో చారిత్రిక ఘట్టాలకు వేదికగా నిలిచిన పాత పార్లమెంట్ భవనం నుంచి వీడ్కోలు తీసుకుంటున్నామని తెలిపిన మోదీ, ఇక్కడ జరిగిన చర్చలు, ప్రణాళికలు భారత గతిని మార్చాయి అన్నారు. ‘‘ మనం కొత్త భవనంలోకి వెళ్తున్నప్పటికీ పాత భవనం భావితరాలకు స్ఫూర్తి నిస్తుంది’’ అని పార్లమెంట్ సభ్యులకు ప్రధాని చెప్పారు. ఈ భవనంలో చర్చలు, వాదనలు ఎన్ని ఉన్నా మన గౌరవాన్ని మరింత పెంచిందన్నారు.

75 ఏళ్ళలో 7,500 మంది ఎంపీలు, 17 మంది స్పీకర్లు ఈ భవనంలో పనిచేశారని వివరించారు. భారతదేశాన్ని 2047 నాటికి అభివృద్ధి చెందిన దేశంగా తీర్చిదిద్దడానికి తీసుకోబోయే నిర్ణయాలన్నీ కొత్త పార్లమెంటు భవనంలోనే నిర్ణయించబడతాయన్నారు. 75 ఏళ్ల పార్లమెంటు ప్రస్థానం కొత్త గమ్యం నుంచి మొదలవుతోందన్నారు. ప్రజల సందర్శనార్థం పాత భవనాన్ని తెరిచే ఉంచాలని నిర్ణయించినట్లు తెలిపారు.

చంద్రయాన్-3 విజయం, భారత సాంకేతిక అభివృద్ధికి నిదర్శనమని చెప్పిన ప్రధాని. దేశ అభివృద్ధి ప్రపంచమంతా ప్రకాశిస్తోందన్నారు. సమష్టి కృషి కారణంగానే జీ-20 సదస్సు విజయవంతమైందన్న ప్రధాని, అనేక రంగాల్లో భారత్ గణనీయంగా అభివృద్ధి చెందిందని పేర్కొన్నారు.

అనేక దేశాలకు భారత్ విశ్వమిత్రగా మారుతోందన్నారు. భారత సామర్థ్యాన్ని ప్రతిదేశం ప్రశంసిస్తోందన్నారు. జీ 20లో ఆఫ్రికన్ యూనియన్ రావడం చారిత్రక ఘట్టమని అభిప్రాయపడ్డారు.  పార్లమెంటులో క్రమక్రమంగా మహిళల సంఖ్య పెరిగిందని హర్షం వ్యక్తం చేశారు.

T Ramesh | 12:43 PM, Mon Sep 18, 2023

CWC@HYD:  ముగిసిన సీడబ్ల్యూసీ సమావేశాలు.. ఎన్నికల సమరానికి సిద్ధమంటూ సందేశం

తెలంగాణలో చరిత్ర సృష్టించేందుకు కాంగ్రెస్ సిద్ధంగా ఉందని, వచ్చే ఎన్నికల్లో తమ పార్టీకి ఓట్లు వేసి గెలిపించాలని కాంగ్రెస్ పార్టీ కోరింది. హైదరాబాద్ లో నిర్వహించిన సీడబ్ల్యూసీ సమావేశాల ముగింపు సందర్భంగా  కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ప్రజలను ఈ మేరకు కోరింది.

తెలంగాణ ఏర్పాటులో కాంగ్రెస్ పార్టీ కీలకపాత్ర పోషించిందని గుర్తు చేసిన కాంగ్రెస్, యూపీఏ చైర్‌పర్సన్ సోనియా గాంధీ, అప్పటి ప్రధాని మన్మోహన్ సింగ్ ప్రజల ఆకాంక్షలను గుర్తించి తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు చేసిన విషయాన్ని సీడబ్ల్యూసీ తీర్మానంలో ఆ పార్టీ ప్రస్తావించింది. తెలంగాణ ఏర్పడి తొమ్మిదేళ్ళు గడుస్తున్నా బంగారు తెలంగాణగా అభివృద్ధి చేయడంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజల్ని మోసం చేశాయని ఆరోపించింది. రెండు రోజులు పాటు హైదరాబాద్ వేదికగా జరిగిన సీడబ్ల్యూసీ సమావేశాలు ముగిశాయి.

సొంతపార్టీ నేతలపై వివాదాస్పద వ్యాఖ్యలు చేయవద్దని ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే ఈ సందర్భంగా నేతలకు సూచించారు. పార్టీ ప్రయోజనాలు దెబ్బతీసేలా ఎవరూ వ్యవహరించొద్దని హెచ్చరించారు. సీడబ్ల్యూసీ సమావేశాల్లో ఆయన నేతలకు దిశానిర్దేశం చేశారు. నేతలంతా క్రమశిక్షణ పాటించి పార్టీని మరింత బలోపేతం చేయాలని కోరారు.

పార్టీ నేతలకు ఆ పార్టీ అగ్రనేత సోనియా గాంధీ కీలక సూచనలు చేశారు. కాంగ్రెస్ పార్టీ ప్రయోజనాలకు హాని కలిగించే వ్యాఖ్యల జోలికి నేతలెవరూ పోవద్దని సూచించారు. పొరపాటుగా ఏ చిన్న విమర్శ చేసినా అది పార్టీకి పెద్దస్థాయిలో నష్టం చేసే అవకాశం ఉందన్నారు. మీడియా ముందుకు వచ్చినప్పుడు సంయమనం పాటించాలని నేతలకు దిశానిర్దేశం చేశారు.

  తెలంగాణలోని పలు నియోజకవర్గాల్లో సోమవారం కాంగ్రెస్ ముఖ్యనేతలు పర్యటించనున్నారు. కామారెడ్డిలో పంజాబ్ మాజీ సీఎం చెరంజీత్ చన్నీ, ఆదిలాబాద్ లో తెలంగాణ కాంగ్రెస్  ఇన్‌ఛార్జి మాణిక్ రావ్ ఠాక్రే, కరీంనగర్ లో ఏపీ పీసీసీ చీఫ్ గిడుగు రుద్రరాజు, కుత్బుల్లాపూర్ లో సీడబ్ల్యూసీ శాశ్వత ఆహ్వానితుడు సుబ్బిరామిరెడ్డి, జూబ్లిహిల్స్ లో లోక్‌సభ మాజీ స్పీకర్ మీరాకుమార్, జడ్చర్లలో రాజస్థాన్ ఉప ముఖ్యమంత్రి సచిన్ పైలెట్, రాజేంద్రనగర్ లో మహారాష్ట్ర  మాజీ సీఎం అశోక్ చౌహాన్, ఎల్బీనగర్ లో ఛత్తీస్‌ఘడ్ సీఎం భూపేశ్ భగేల్ పాల్గొననున్నారు.

T Ramesh | 17:41 PM, Sun Sep 17, 2023

MP ASSEMBLY POLLS: ప్రచారపర్వంలో బీజేపీ దూకుడు..39 మంది ఎమ్మెల్యే అభ్యర్థులతో  మొదటి జాబితా విడుదల

అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా మధ్యప్రదేశ్‌లో రాజకీయాలు హోరాహోరీగా సాగుతున్నాయి. ప్రత్యర్థులకు ఏ మాత్రం అవకాశం ఇవ్వకుండా అధికార బీజేపీ జాగ్రత్తలు తీసుకుంటోంది. రాష్ట్రవ్యాప్తంగా సుడిగాలి పర్యటనలు చేస్తున్న బీజేపీ అగ్రనేతలు ప్రచారంలో మిగతా పార్టీలకంటే ముందున్నారు.

తాజాగా టికెట్ల కేటాయింపులో కూడా ఆ పార్టీ దూకుడు కొనసాగిస్తోంది. అధికారాన్ని నిలబెట్టుకునేందుకు ప్రచారపర్వంలో తీవ్రంగా శ్రమిస్తోన్న కాషాయనేతలు, వ్యూహాత్మకంగా ముందుకెళ్తున్నారు. 39 మంది అభ్యర్థులతో మొదటి విడత జాబితాను మధ్యప్రదేశ్ బీజేపీ విడుదల చేసింది. కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి నరేంద్ర సింగ్ తోమర్ ఈ జాబితాను ప్రకటించారు. త్వరలో మిగతా స్థానాల అభ్యర్థులు కూడా ప్రకటిస్తామని ఉమారియాలో మీడియాకు తెలిపారు.

బీజేపీ కి పోటీగా కాంగ్రెస్, ఆప్ కూడా ప్రచారం ప్రారంభించాయి. ఆమ్ ఆద్మీ పార్టీ పది స్థానాలకు తన అభ్యర్థులను ప్రకటించింది. ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు, దిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్... సేవడా, గోవిందపూర్, హుజుర్, దిమాని, మొరేనా, పెట్లావాద్, సిర్మోర్, సిరోంజ్, మహరాజ్‌పూర్ అసెంబ్లీ స్థానాలకు అభ్యర్థులను ప్రకటించారు.

ఇటీవల మధ్యప్రదేశ్ లో పర్యటించిన ప్రధాని నరేంద్ర మోదీ, బినా జిల్లాలో ఆ పార్టీ శ్రేణులు నిర్వహించిన భారీ ర్యాలీని ఉద్దేశించి ప్రసంగించారు. I.N.D.I.A భాగస్వామ్య పక్షాలను ఇండీ కూటమిగా ఎద్దేవా చేసిన ప్రధాని మోదీ,  సనాతన ధర్మాన్ని నిర్మూలించే రహస్య అజెండాతో జట్టుకట్టారని దుయ్యబట్టారు. కాంగ్రెస్ పాలనలో మధ్యప్రదేశ్ ను లూటీ చేశారని మండిపడ్డారు.

మధ్యప్రదేశ్ లో 230 అసెంబ్లీ సీట్లు ఉండగా, ఈ ఏడాది ఎన్నికలు జరగనున్నాయి. 2018 లో జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ మెజారీటీ సీట్లలో గెలిచింది. ఆ పార్టీ నేత కమల్ నాథ్ సీఎంగా ప్రమాణ స్వీకారం చేశారు. రెండేళ్ళపాటు కొనసాగిన ప్రభుత్వం తర్వాత కూలిపోయింది. జ్యోతిరాదిత్య సిందియాతో పాటు ఆయన మద్దతుదారులుగా ఉన్న 22 మంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్ ను వీడి బీజేపీలో చేరారు. దీంతో కాంగ్రెస్ ప్రభుత్వం మైనారిటీలో పడి కూలిపోయింది. అనంతరం నిర్వహించిన బలపరీక్షలో బీజేపీ పాలకపార్టీగా ఎన్నికైంది. శివరాజ్ సింగ్ చౌహన్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టారు.

T Ramesh | 13:18 PM, Fri Sep 15, 2023

BJP-JDS ALLIANCE: కాంగ్రెస్‌ను ఓడించడమే నా లక్ష్యం

బీజేపీతో పొత్తుపై జేడీఎస్ ముఖ్యనేత, మాజీ సీఎం కుమారస్వామి కీలక వ్యాఖ్యలు చేశారు. ఎన్డీయే కూటమిలో చేరిక పై ఇంకా తుదినిర్ణయం తీసుకోలేదన్నారు. రాబోయే ఎన్నికల్లో కాంగ్రెస్‌ను ఓడించడమే జేడీఎస్ లక్ష్యమన్నారు. తమ పార్టీలో ఎలాంటి చీలిక లేదన్న కుమారస్వామి, తమ పార్టీ తరఫున గెలిచిన 19 మంది ఎమ్మెల్యేలు ఒకే మాటపై ఉన్నారని స్పష్టం చేశారు.

బీజేపీతో సీట్ల పంపకం గురించి మాట్లాడటం తొందరపాటు అవుతుందన్న కుమారస్వామి, కాంగ్రెస్ పాలనలోని అవినీతిని ఎండగట్టి, రాబోయే ఎన్నికల్లో ఆ పార్టీని ఓడించడమే తమ కర్తవ్యం అన్నారు. పార్టీలో ఎలాంటి అంతర్గత విభేదాలు లేవని, ఒక వేళ ఎదైనా సమస్య ఉత్పన్నమైతే పరిష్కరించుకునే సత్తా తమకు ఉందని ధీమా వ్యక్తం చేశారు.

ఎన్డీయేలో చేరికపై ఇంకా తుది నిర్ణయం తీసుకోలేదని చర్చలు కొనసాగుతున్నాయని  కుమారస్వామి చెప్పారు. మాజీ ప్రధాని దేవగౌడ నేతృత్వంలోని జేడీఎస్, ఎన్డీయేలో చేరేందుకు సుముఖంగా ఉందని  బీజేపీ ముఖ్యనేత, కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి యడ్యూరప్ప  అన్నారు. మొత్తం 28 లోక్ సభ సీట్లలో జేడీఎస్ నాలుగు స్థానాల్లో పోటీ చేసేందుకు అంగీకారం కుదిరిందని తెలిపింది.

  జేడీఎస్ తీరుపై ముఖ్యమంత్రి సిద్దరామయ్య మండిపడ్డారు. బీజేపీకి ఆ పార్టీ బీ టీమ్ గా మారిందని ఎద్దేవా చేశారు. పేరులో సెక్యూలర్ పెట్టుకుని మతతత్వ పార్టీతో జతకట్టేందుకు సిద్ధమైందని తీవ్ర విమర్శలు చేశారు.

T Ramesh | 17:04 PM, Sun Sep 10, 2023

upload

యువత

An open letter to the Indian film industry

Technical | 17:40 PM, Fri Jun 02, 2023