Wednesday, November 29, 2023

Odisha-365
google-add
పింగళి వెంకయ్య జయంతి

పింగళి వెంకయ్య: జాతీయ పతాకమే ఆయన అస్తిత్వం

Editor | 11:01 AM, Wed Aug 02, 2023

నూట నలభై కోట్ల భారతీయుల ఆకాంక్షలకు, స్వేచ్ఛా స్వాతంత్ర్యాలకు ప్రతీక మన త్రివర్ణ పతాకం. మువ్వన్నెల జెండాను చూస్తే ప్రతీ భారతీయుడి గుండె ఆనందంతో ఉప్పొంగి పోతుంది. చిన్నా పెద్దా, జాతి, మత బేధాలు లేకుండా ప్రతీ ఒక్కరిలో దేశ భక్తిని, జాతీయవాద స్ఫూర్తిని రగిలిస్తుంది. మూడు రంగుల్లో కోట్లాది మంది భారతీయుల ఆశలను, ఆకాంక్షలను నిక్షిప్తం చేసి.. జాతీయ జెండాగా రూపొందించిన మహనీయుడు పింగళి వెంకయ్య. ఆసేతు శీతాచలం రెపరెపలాడుతున్న త్రివర్ణ పతాక రూపశిల్పి పింగళి వెంకయ్య.

రెండు శతాబ్దాలకు పైగా భారతదేశాన్ని చెరపట్టిన బ్రిటిషర్లకు వ్యతిరేకంగా పోరాటం సాగుతున్న రోజులవి. తెల్లదొరల పాలనకు వ్యతిరేకంగా జరుగుతున్న పోరాటంలో భారతీయులందరినీ ఏకం చేసే జాతీయ పతాకం ఒకటి ఉండాలని పింగళి వెంకయ్య బలంగా భావించారు. జన్మతః గొప్ప దేశ భక్తుడైన వెంకయ్య.. భారత జాతీయ పతాక నమూనాలను ఎన్నో రూపొందించారు. 1916లో ‘భారతదేశానికి ఒక జాతీయ పతాకం’ అనే పుస్తకాన్ని రచించారు. అందులో మన దేశానికి జాతీయ జెండా ఆవశ్యకతను వివరిస్తూ.. పలు నమూనాలు రూపొందించారు. 1916లో లక్నోలో జరిగిన భారత జాతీయ కాంగ్రెస్ సమావేశంలో వెంకయ్య తయారు చేసిన జాతీయ జెండాను ఎగురవేశారు. 1919లో జలంధర్ వాస్తవ్యులైన లాలా హన్స్ రాజ్ ఆ పతాకంపై రాట్నం చిహ్నముంటే బాగుంటుందని సూచించగా గాంధీజీ దాన్ని అంగీకరించారు.

ఆ క్రమంలో... 1921లో జరిగిన అఖిల భారత జాతీయ కాంగ్రెస్ మహాసభల్లో పింగళి వెంకయ్య కీలక భూమిక పోషించారు. గాంధీజీ సూచనలతో జాతీయ పతాకానికి తుది రూపు ఇచ్చేందుకు ఉపక్రమించారు. ఆకుపచ్చ, ఎరుపు రంగులతో పాటు చరఖా బొమ్మతో కూడిన జాతీయ పతాకాన్ని రూపొందించారు. తరువాత కొద్ది మార్పులు, చేర్పులతో ఆ పతాకానికి తెలుపు రంగును జతచేశారు. ఎరుపు వర్ణాన్ని కాషాయ వర్ణంగా మార్చారు. 1931లో ఈ నమూనాను అధికారికంగా ఆమోదించారు. నేతాజీ సుభాష్ చంద్రబోస్ స్థాపించిన అజాద్ హింద్ ఫౌజ్ సైతం పింగళి వెంకయ్య చేతుల మీదుగా రూపొందిన జాతీయ జెండానే తమ జెండాగా వినియోగించింది.  నిజానికి.. 1921లో పింగళి వెంకయ్య రూపొందించిన జాతీయ పతాకం స్వాతంత్ర్యోద్యమ చరిత్రలో కీలక పాత్ర పోషించింది. అప్పటివరకూ కాంగ్రెస్ పార్టీ, ఇతరత్రా నాయకులు రూపొందించిన జాతీయ పతాకాలు సామాన్యుల్లో ఆదరణ పొందలేదు. కానీ పింగళి రూపొందించిన జెండా జాతీయోద్యమ పతాకంగా మారింది.

పింగళి వెంకయ్య రూపొందించిన పతాకాన్ని కాంగ్రెస్ యథాతథంగా ఆమోదించక పోయినా పింగళి జెండా భారీ స్థాయిలో ఉద్యమ స్ఫూర్తిని రగిల్చింది. జలియన్‌వాలా బాగ్ దురంతానికి నిరసనగా చేపట్టిన కార్యక్రమంలో 1923 ఏప్రిల్ 13న నాగపూర్‌లో స్థానిక కాంగ్రెస్ కార్యకర్తలు పింగళి జెండాను ఎగురవేశారు. దానికి బ్రిటిష్ పోలీసులు అభ్యంతరం చెప్పారు. ఆ ఘర్షణ ఒక మహోద్యమంగా మారింది. నాగపూర్ కాంగ్రెస్ కమిటీ ‘జెండా సత్యాగ్రహా’నికి పిలుపునిచ్చింది. స్వరాజ్యం కాంక్షిస్తూ సాగిన ఆ సత్యాగ్రహం అనతి కాలంలోనే జాతీయ స్థాయికి ఎదిగింది. జాతీయోద్యమం దేశవ్యాప్తంగా తీవ్రంగా బలపడింది. పింగళి రూపొందించిన జెండా తన వంతు పాత్ర పోషించింది. భారత జాతీయ పతాకంగా ఆ జెండా ఆనాడే గుర్తింపు పొందింది.

1947లో భారతదేశం స్వతంత్ర దేశంగా అవతరించేనాటికి జాతీయ పతాకాన్ని ఖరారు చేసే బాధ్యత రాజ్యాంగసభ తీసుకుంది. స్వాతంత్ర్యోద్యమం లో కాంగ్రెస్ పార్టీ జెండాగా ఉన్న చరఖాతో కూడిన త్రివర్ణ పతాకాన్ని భారత జాతీయ పతాకంగా అంగీకరించటానికి విముఖత వ్యక్తమైంది. దీంతో.. చరఖా స్థానంలో బుద్ధుడి ధర్మ చక్రాన్ని చేర్చాలని రాజ్యాంగసభ చైర్మన్ డాక్టర్ అంబేద్కర్ ప్రతిపాదించారు. ఐతే ధర్మచక్రానికి బదులు అశోక చక్రాన్ని చేర్చాలన్న ప్రతిపాదన మీద ఏకాభిప్రాయం వ్యక్తమైంది. మరోవైపు, జెండా మీద చరఖాను తొలగించటం గాంధీకి ఏమాత్రం ఇష్టం లేదు. చరఖా ఉండాల్సిందేనని ఆయన అభిప్రాయపడ్డారు. అయినా రాజ్యాంగసభ సిఫారసు మేరకు నెహ్రూ ప్రభుత్వం అశోక చక్రం ఉన్న జెండానే ఖరారు చేసింది. అదే పతాకం 1947 ఆగస్టు 15న ఎర్రకోటపై రెపరెపలాడింది. నేటికీ 140 కోట్ల మంది భారతీయుల ఆశలు, ఆకాంక్షలకు ప్రతిరూపంగా వెలుగొందుతోంది.

పింగళి వెంకయ్యను జాతీయ పతాక రూపశిల్పి మాత్రమే కాదు, బహుముఖ ప్రజ్ఞాశాలి కూడా. విద్యావేత్తగా, రైతుగా, పరిశోధకునిగా, కవిగా, స్వాతంత్ర్య సమరయోధునిగా పింగళి వెంకయ్య ప్రజ్ఞా పాటవాలు అపూర్వం. ఆంధ్రప్రదేశ్‌ కృష్ణా జిల్లాలోని భట్లపెనుమర్రు గ్రామంలో ఓ సాధారణ కుటుంబలో 1876 ఆగస్టు 2న జన్మించారు. ఆయన తండ్రి హనుమంత నాయుడు, తల్లి వెంకటరత్నం. తండ్రి గ్రామ కరణం కావడం, వ్యవసాయ భూమి ఉండటంతో సేద్యంపై వెంకయ్యకు మక్కువ ఏర్పడింది. అందుకే వ్యవసాయ శాస్త్రంలో పట్టభద్రుడయ్యారు. లాహోర్ ఆంగ్లో వేదిక్ విద్యాలయంలో చేరి పలు భాషల్లో ప్రావీణ్యం పొందారు. 1895లో సైన్యంలో చేరి బోయర్ యుద్ధంలో పాల్గొనేందుకు దక్షిణాఫ్రికా వెళ్ళారు. అక్కడే గాంధీని కలుసుకున్నారు. ఆయన శాంతి- అహింసా విధానాలకు ఆకర్షితులయ్యారు. కోల్‌కతాలో జరిగిన ఓ సమావేశంలో బ్రిటిష్ పతాకం యూనియన్ జాక్‌కు భారత సైనికులు సెల్యూట్ చేయడం చూశారు. పరాయి వాడి జెండాకు నా అన్నదమ్ములు తలొంచి వందనాలు సమర్పించడం ఏంటి? పుణ్యభూమి, ధన్యభూమిగా కీర్తించే నా భారతావనికి సొంత జెండా ఎందుకు ఉండకూడదు? అన్న ఆలోచన ఆయన్ని కుదురుగా ఉండనీయలేదు. అంతే, ఒకవైపు లెక్చరర్ గా విధులు నిర్వహిస్తూనే.. జాతీయ జెండాకు రూపకల్పన చేశారు. పింగళి తన ఆలోచనలతో 1916లో ‘ఎ నేషనల్ ఫ్లాగ్ ఫర్ ఇండియా’ అనే పుస్తకం రాశారు. అందులో 24 రకాల జెండా నమూనాలను ప్రతిపాదించారు.

ఉన్నత విద్యావంతుడైన పింగళి వెంకయ్య మ‌చిలీప‌ట్నంలోని ఆంధ్ర జాతీయ క‌ళాశాల‌ లో 1911 నుంచి కొంత కాలం అధ్యాపకునిగా పనిచేశారు. మద్రాసు ప్రెసిడెన్సీ కళాశాలలో భూగర్భ శాస్త్ర పరిశోధనలు చేసి డిప్లొమా పొందారు. 1924 నుండి 1944 వరకు నెల్లూరులో ఉండి మైకా గురించి పరిశోధనలు చేశారు. బొగ్గు వజ్రంగా మారే విధానాన్ని గురించి ‘తల్లిరాయి’ అనే పుస్తకం రాశారు. ఆ తరువాత భాషా పరిజ్ఞానం పై మక్కువతో అనేక దేశాల్లో ప‌ర్య‌టించారు. వివిధ భాష‌ల్లో ప్రావీణ్యం సంపాదించారు. జప‌నీస్ భాష నేర్చుకోవ‌డం కోసం ప‌ట్టుద‌ల‌తో ఆ దేశం వెళ్లి వ‌చ్చిన వెంక‌య్య‌ను కొన్నాళ్ళు 'జ‌పాన్ వెంక‌య్య' అని కూడా పిలిచేవారు. త‌ర్వాత వ్య‌వ‌సాయంలో కూడా అడుగుపెట్టి కొత్త పత్తి వంగ‌డాలు క‌నిపెట్టేందుకు పరిశోధన చేయడంతో ఆయనకు 'ప‌త్తి వెంక‌య్య' అన్న పేరు కూడా ఉండేది. వ‌జ్రాల‌పై కూడా ఆయన విశేష‌మైన పరిశీల‌న చేశారు.

స్వాతంత్ర్య సమర యోధుడిగా, జాతీయ జెండా రూపకర్తగా, విద్యా వేత్తగా, భౌతిక, వ్యవసాయ పరిశోధకునిగా, అధ్యాపకుడిగా, కవిగా విశేష సేవలందించిన పింగళి వెంకయ్యను జీవిత చరమాంకంలో ఆర్ధిక కష్టాలు చుట్టుముట్టాయి. ఆజన్మాంతం ఆయన సాదా సీదా జీవితాన్నే గడిపారు. తన ఇద్దరు కుమారులు, కుమార్తె, భార్యతో విజయవాడలోని ఓ చిన్న ఇంట్లో నివసించేవారు.

దేశానికి స్వాతంత్ర్యం లభించిన తరువాత ప్రభుత్వం వెంకయ్యను ఖనిజ పరిశోధక శాఖ సలహాదారుగా నియమించింది. ఆ పదవిలో ఆయన 1960 వరకు పనిచేసారు. కానీ ఒక్క రూపాయి కూడా తనకోసం, తన కుటుంబం కోసం వెనకేసుకోలేదు. బ్రిటిష్ పాలనాకాలంలో మిలటరీలో పనిచేసినందున ఆయనకు విజయవాడ చిట్టినగరులో ప్రభుత్వం కొంత స్థలం ఇచ్చింది. ఆ స్థలంలో కట్టుకున్న చిన్న ఇంటిలోనే కడు పేదరికంతో  జీవితాన్ని గడిపారు. జీవితాంతం దేశం కొరకు, స్వాతంత్ర్యం కొరకు పోరాడిన వెంకయ్య చివరి రోజుల్లో తిండికి కూడా ఇబ్బంది పడ్డారు. చివరకు.. తీవ్ర దారిద్ర్యంలోనే ఆయన 1963, జూలై 4 న కన్నుమూశారు.

భారత జాతీయ పతాకం ఈ నేలపై రెపరెపలాడుతున్న కాలం జాతి స్మరించుకోదగిన ధన్యజీవి మన పింగళి వెంకయ్య. ఆయనకు సరైన గుర్తింపు ఇవ్వడంలో మన ప్రభుత్వాలు విఫలమయ్యాయనే చెప్పుకోవాలి. పింగళి వెంకయ్యకు భారతరత్న ఇవ్వాలనే డిమాండ్ ఏనాటి నుంచో పెండింగ్‌లో ఉంది. కనీసం ఆయన చిత్ర పటం కూడా పార్లమెంట్‌లో పెట్టలేదు. ఇప్పటికైనా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చొరవ తీసుకుని ఆ మహనీయుడికి సముచిత గుర్తింపు ఇవ్వాలి.

google-add
google-add
google-add

ప్రభుత్వ పథకాలు

కుల గణనకు రంగం సిద్దం

K Venkateswara Rao | 10:40 AM, Thu Nov 23, 2023
google-add

యువత

google-add

సంస్కృతి

google-add
google-add
google-add