గాజాకు వెళ్ళకుండా తాము విధించిన ఆంక్షలను ఉల్లంఘించడానికి ప్రయత్నించిన ‘మేడెలిన్’ అనే నౌకను ఇజ్రాయెల్ మిలటరీ గుర్తించింది. ఆ నౌకలో వామపక్ష ఇస్లామిస్టు కార్యకర్తలు ఉన్నారు. ఇజ్రాయెల్ విధించిన ఆంక్షలను ఉల్లంఘించడమే లక్ష్యంగా వారు దానిలో ప్రయాణిస్తున్నారు. స్వీడన్‌కు చెందిన వామపక్ష కార్యకర్త, ప్రముఖ ‘వోక్’ భావజాల ప్రచారకురాలు గ్రేటా థన్‌బర్గ్‌తో పాటు ఆ పడవలో ఫ్రాన్సుకు చెందిన యూరోపియన్ పార్లమెంట్ సభ్యురాలు రీమా హసన్, జర్మన్ యాక్టివిస్టు యాస్మిన్ అకార్ వంటి 11 మంది ఉన్నారు. ఆ పడవను ఇజ్రాయెల్ సీజ్ చేసింది.
సముద్ర మార్గం ద్వారా హమాస్ ఉగ్రవాదులు ఆయుధాలను అక్రమ రవాణా చేసే అవకాశం లేకుండా చేయడానికి నౌకామార్గం మొత్తాన్నీ బ్లాక్ చేస్తున్నామనీ, ఏ నౌకా ఆ ఆదేశాలను అతిక్రమించడానికి ఒప్పుకోబోమనీ ఇజ్రాయెల్ గతంలోనే ప్రకటించింది. అయినప్పటికీ ఆ ఆదేశాలను ఉద్దేశపూర్వకంగా ఉల్లంఘించి ప్రయాణిస్తున్న ‘మేడెలిన్’ నౌకను, గాజా తీరం చేరకుండా నిలువరించాలని సైన్యం ఆదేశించినట్లు ఇజ్రాయెల్ రక్షణ శాఖ మంత్రి ఇజ్రాయెల్ కజ్ వెల్లడించారు. గాజా తీరానికి చేరుకోడానికి ప్రయత్నించిన మొదటి నౌక ఫ్రీడం ఫ్లోటెల్లా. మే నెలలో గాజా చేరుకోడానికి ప్రయత్నించిన ఆ ఓడ మీద మాల్టా తీరంలో డ్రోన్ దాడి జరిగింది.
ఇప్పుడు సీజ్ చేసిన నౌక కూడా ఫ్రీడం ఫ్లోటెల్లా కొయలేషన్ (ఎఫ్ఎఫ్‌సి) నిర్వహిస్తున్న కార్యక్రమంలో భాగంగా ప్రయాణిస్తున్నదే. బ్రిటిష్ జెండా ఉన్న ‘మేడెలిన్’ అనే పేరు గల ఆ నౌకలో పాలస్తీనా అనుకూల వర్గం ఉందని ఇజ్రాయెల్ చెబుతోంది. ఆ పడవ జూన్ 6న ఇటలీలోని సిసిలీ నుంచి బయల్దేరింది. జూన్ 9 సాయంత్రం లోపు గాజా స్ట్రిప్ చేరుకోవాలన్నది లక్ష్యం. ఇజ్రాయెలీ సైనికులు ఎవరూ తమను ఆపకూడదనేది ఆ నౌక మీద ఉన్న ప్రయాణికుల ఉద్దేశం. కానీ ఆ పడవ మీద ఉన్న మొత్తం అందరినీ ఇజ్రాయెల్ మిలటరీ అరెస్ట్ చేసింది.
మేడెలిన్ నౌకను తమ సైన్యం నియంత్రణలోకి తీసుకొంటూన్న దృశ్యాలను, లైఫ్ జాకెట్లు వేసుకుని ఉన్న నౌకా సిబ్బందికి తమ సైన్యం ఆహారం పెడుతున్న వీడియోను ఇజ్రాయెల్ విదేశాంగ వ్యవహారాల మంత్రి తన ట్విట్టర్ ఖాతాలో షేర్ చేసారు. గాజాలో నౌకల మీద ఆంక్షలను ఉల్లంఘించేందుకు ప్రయత్నిస్తున్న సహాయక నౌకను తమ సైన్యం నియంత్రణలోకి తీసుకుంటోందని ఇజ్రాయెల్ విదేశాంగ శాఖ ప్రకటించింది. కొన్ని ఆమోదిత మార్గాల ద్వారా గాజా ప్రాంతానికి మానవతా సహాయం అందిస్తామని వివరించింది.
మరోవైపు, దక్షిణ గాజాలో రెండు వేర్వేరు ప్రదేశాల్లో జరిపిన కాల్పుల్లో ఐదుగురు వ్యక్తులు ప్రాణాలు కోల్పోయారు. ఇజ్రాయెల్ అనుమతితో రఫా, ఖాన్ యూనిస్ ప్రాంతాల్లో గాజా హ్యుమానిటేరియన్ ఫౌండేషన్‌కు (జిహెచ్‌ఎఫ్) చెందిన ఆహార పంపిణీ కేంద్రాల వద్ద ఆ చర్యలు చోటు చేసుకున్నాయి. అనుమానాస్పద పరిస్థితుల్లో బృందాలు బృందాలుగా వెడుతున్న వ్యక్తుల మీద మాత్రమే కాల్పులు జరిపినట్లు ఇజ్రాయెల్ సైన్యం ప్రకటించింది.