ఆంధ్రప్రదేశ్‌లో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఏడాది కావస్తోంది. ఈ ఏడాదిలో ప్రజలకు ఇచ్చిన హామీలు ఎంత వరకు నెరవేర్చారు? ఇంకా ఎన్ని హామీలు గాలికొదిలేశారు. సంక్షేమం, అభివృద్ధి పరుగులు పెడుతోందా? కూటమి ప్రభుత్వం ఏడాదిలో మార్పు చూపించిందా? పథకాల కోసం జనం ఎదురు చూపులు చూస్తున్నారా? అమరావతి రాజధాని, పోలంవరం పనులు పరుగులు తీయిస్తున్నాం..అంటే పేదలు సంతోషిస్తారా…అనే విషయాలను మనం ఈ కథనంలో తెలుసుకుందాం.
ఏపీలో టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి ప్రభుత్వం ఘన విజయం సాధించి ఏడాది అవుతోంది. గత ఏడాది జూన్ 4న వెలువడిన ఫలితాల్లో కూటమి ప్రభుత్వం అధికారం దక్కించుకుంది. జూన్ 12న అధికారం చేపట్టిన కూటమి నేతలు, ఎన్నికల ముందు ఇచ్చిన హామీలు ఎన్ని అమలు చేశారు. ఇంకా ఎన్ని హామీలు అమలు చేయాల్సి ఉంది అనే విషయాలను మనం పరిశీలించినప్పుడు… అనేక విషయాలు వెలుగులోకి వస్తాయి.
అధికారంలోకి రాగానే వృద్ధులు, మహిళలు, వితంతువుల, కళాకారుల సామాజిక పింఛన్లు రూ.3 వేల నుంచి రూ.4 వేలకు పెంచడంతోపాటు, రెండు నెలల బకాయిలు కూడా చెల్లిస్తామని ఎన్నికల ముందు ఇచ్చిన హామీని, అధికారం చేపట్టగానే అమల్లోకి తీసుకువచ్చారు. దివ్యాంగులకు నెలకు రూ.6 వేల నుంచి నూరుశాతం దివ్యాంగులకు రూ.15 వేలు అందిస్తామన్న హామీని కూడా అమల్లోకి తీసుకు వచ్చారు. గతంలో వాలంటీర్లు ఒకటో తేదీ ఉదయాన్నే ఇంటికి తీసుకువచ్చి పింఛన్లు పంపిణీ చేశారు. కూటమి అధికారంలోకి రాగానే వాలంటీర్ వ్యవస్థను పక్కనబెట్టారు. అయితే పింఛన్లు ఇంటికి వస్తాయా? రావా అని చాలా మంది అనుమానం వ్యక్తం చేశారు. సచివాలయ సిబ్బందిని ఉపయోగించుకుని కూటమి ప్రభుత్వం ఒకటో తేదీనే పింఛన్లు లబ్దిదారులకు చేరేలా చేయడంతో మంచి పేరు వచ్చింది. ఒకవేళ ఒకటో తేదీ ఆదివారం అయితే బ్యాంకులు పనిచేయవు కాబట్టి, అంతకు ముందు రోజే పింఛన్ల పంపిణీ చేపడుతున్నారు. ఇంత వరకు బాగానే ఉంది. అయితే కొత్త పెన్షన్ల విషయంలో కూటమి సర్కార్ మీనమీషాలు లెక్కిస్తోంది. ఏడాది కాలంలో మరణించిన వారి స్థానంలో, వితంతువులకు స్పౌజ్ పెన్షన్లు మాత్రమే ఈ నెల నుంచి ఇవ్వాలని నిర్ణయించారు. పెన్షన్లకు అర్హులు ఏపీలో 4 లక్షల దాకా ఉన్నారు. వారి ఊసు ఎత్తడం లేదు. పెన్షన్లు తీసుకునే వారు సంతృప్తిగా ఉన్నారు. అయితే అర్హతలు ఉండి కూడా కొత్త పెన్షన్లు పొందలేని వారు తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. కూటమి ప్రభుత్వం ఈ విషయంలో మాత్రం వ్యతిరేకత ఎదుర్కొంటోంది.
అమరావతి ఏకైక రాజధాని?
కూటమి నేతలు అమరావతి రాజధానికి కట్టుబడి ఉన్నామంటూ ఎన్నికల ముందే స్పష్టం చేశారు. అధికారంలోకి రాగానే అమరావతి రాజధానికి భూములు ఇచ్చిన రైతులకు బకాయి పడ్డ కౌలు మొత్తం విడుదల చేశారు. ప్లాట్లు దక్కని రైతులకు పంపిణీ చేశారు. రాజధానిలో వైసీపీ ప్రభుత్వం ఐదేళ్లపాటు శ్రద్ధగా పెంచిన కంపచెట్లను రూ.36 కోట్లు ఖర్చు చేసి తొలగించారు. ఇక పాత టెండర్లు సాంకేతికంగా రద్దు చేసి, కొత్త టెండర్లు పిలిచి పెద్ద ఎత్తున పనులు ప్రారంభించారు. ఇందుకు కేంద్రం పూర్తి సహాయ సహకారాలు అందించింది. ప్రపంచ బ్యాంకు నుంచి రూ.36 వేల కోట్లు, ఏడీబీ, హడ్కో నుంచి 24 వేల కోట్ల రుణాలు ఇప్పించడంలో కేంద్రం కీలకంగా వ్యవహరించింది. అమరావతి రాజధానికి తీసుకునే అప్పులు, ఏపీ బడ్జెట్‌కు సంబంధం లేకుండా కేంద్ర ఆర్థిక శాఖ తీసుకున్న నిర్ణయంతో పెద్ద వెసులుబాటు దక్కింది. దీంతో నిధుల సమస్య తీరిపోయి, రూ.57 వేల కోట్ల పనులు శరవేగంగా జరుగుతున్నాయి. 60 వేల మంది కార్మికులు ఉపాధి పొందుతున్నారు. రాజధానికి భూములిచ్చిన రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. రైతు ప్లాట్లకు మౌలిక సదుపాయాలు కల్పించేందుకు ప్రభుత్వం రూ.60 వేల కోట్లు ఖర్చు చేస్తోంది. దీంతో భూముల ధరలు పెరిగి అమరావతి రాజధాని రైతులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. రాజధాని విషయంలో కూటమి ప్రభుత్వం నూరు శాతం న్యాయం చేసింది. అదే సమయంలో అన్ని ప్రాంతాల అభివృద్ధికి కట్టుబడి ముందుకు అడుగులు వేస్తోంది.
పోలవరం పనులు పరుగులు 2027 డిసెంబరు నాటికి పూర్తి
అధికారంలోకి వచ్చిన మూడేళ్లలో పోలవరం పూర్తి చేస్తామని కూటమి నేతలు ఎన్నికల్లో హామీ ఇచ్చారు. చెప్పిన విధంగానే పోలవరం పనులు పరుగులు పెట్టిస్తున్నారు. వైసీపీ నేతల నిర్వాకంతో డివాల్ దెబ్బతిని పోలవరం పనులు ముందుకు సాగలేదు. ఏ నిర్ణయం తీసుకోకపోవడంతో జనగ్ రెడ్డి ప్రభుత్వంపై ప్రజల్లోనూ తీవ్ర వ్యతిరేకత వచ్చింది. కూటమి అధికారంలోకి రాగానే ప్రపంచంలోనే నిపుణులైన ఇంజనీర్లను రప్పించి, కేంద్ర జలసంఘం ఇంజనీర్లతో చర్చలు జరిపి డి వాల్ నిర్మాణం చేపట్టింది. జర్మనీ నుంచి తెప్పించిన అత్యాధునిక యంత్రాలతో పనులు శరవేగంగా సాగుతున్నాయి. 2027 డిసెంబరు నాటికి అన్ని పనులు పూర్తి చేస్తామని కూటమి ప్రభుత్వం స్పష్టంగా చెబుతోంది. పోవవరం పనులు ఇప్పటికే సీఎం చంద్రబాబునాయుడు 6సార్లు పరిశీలించారు. 12 దఫాలుగా పోలవరం పనులపై రివ్యూలు చేశారు. పోలవరం పనుల పురోగతిని ప్రతివారం అధికారులను అడిగి తెలుసుకుంటున్నారు. సమస్యలు ఉంటే పరిష్కరిస్తున్నారు. దీంతో పోలవరం పనులు శరవేగంగా సాగుతున్నాయి.
సూపర్ సిక్స్ పథకాల అమలు
కూటమి పార్టీలు ఆరు ప్రధాన పథకాలను ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టాయి. అందులో ప్రధానమైన పెన్షన్ల పెంపు అమల్లోకి తీసుకువచ్చారు. మరో పథకం ఏడాదికి మూడు ఉచిత గ్యాస్ సిలిండర్లను కూడా అమల్లోకి తెచ్చారు. మరో పథకం.. మహిళలకు ఉచిత బస్సు. ఈ ఏడాది ఆగష్టు 15 నుంచి అమల్లోకి తీసుకువస్తామని సీఎం చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. దీంతో మూడు పథకాలపై స్పష్టత వచ్చింది. ఇక తల్లికివందనం. బడికి వెళ్లే పిల్లలు ఎంత మంది ఉంటే అందరికీ తల్లికి వందనం పేరుతో ఏటా రూ.15 వేలు జమ చేస్తామని హామీ ఇచ్చారు. ఇంత వరకు ఈ పథకం అమల్లోకి రాలేదు. ఈ నెలలో బడులు తెరిచే రోజు తల్లికివందనం జమ చేస్తామని కూటమి ప్రభుత్వం చెబుతోంది. ఇక రైతులకు అన్నదాత సుఖీభవ. ఏడాది కాలంలో ఒక్క రూపాయి కూడా విదల్చలేదు. కేంద్రం ఇచ్చే ప్రధానమంత్రి కిసాన్ యోజనతోపాటు, కలిపి ఈ పథకాన్ని మూడు దఫాలుగా రైతుల ఖాతాలో జమ చేస్తామని సీఎం చంద్రబాబు నాయుడు పలు దఫాలు చెప్పారు. ఈ నెల 20 నుంచి ఈ పథకం అమలు చేయబోతున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఇక మహాలక్ష్మి పథకంలో 18 నుంచి 45 సంవత్సరాల మహిళలకు నెలకు రూ.2500, నిరుద్యోగులకు నిరుద్యోగ భృతి ఊసేలేదు.
ఎట్టకేలకు కొత్త రేషన్ కార్డులు విడుదల
కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన ఏడాది పూర్తవుతున్న సందర్భంగా కొత్త రేషన్ కార్డులు మంజూరు చేశారు. వచ్చే నెల నుంచీ కొత్త కార్డులకు కూడా రేషన్ పంపిణీ జరగనుంది. అయితే ఏడాది కాలంలో రేషన్ కార్డులు ఇవ్వకపోవడంతో ప్రజలు కొంత అసౌకర్యానికి గురయ్యారు. ఎట్టకేలకు కొత్తవారికి కూడా కార్డులు మంజూరు చేశారు. ఇక వైసీపీ ప్రభుత్వం ఇంటింటికి రేషన్ పేరుతో ఐదేళ్లలో రూ.9600 కోట్లు వృధా చేశారు. రూ.2 వేల కోట్లతో వాహనాలు కొనుగోలు చేశారు. కూటమి ప్రభుత్వం మూడు నెలలపాటు లబ్దిదారుల అభిప్రాయాలు తీసుకుని, డీలర్ల వ్యవస్థను అందుబాటులోకి తీసుకువచ్చింది. ప్రతి నెలా 15 రోజుల పాటు బియ్యం పంపిణీ చేస్తారు. 65 సంవత్సరాలు దాటిన వృద్ధులు, దివ్యాంగులకు ఇంటి వద్దకే రేషన్ పంపిణీ చేస్తున్నారు. దీంతో బియ్యం మాఫియాకు తెరదింపారు. వైసీపీ పాలనలో 30 శాతం మాత్రమే బియ్యం పంపిణీ చేసి, మిగిలిన బియ్యం మాఫియా చేతుల్లో పెట్టేశారని కూటమి నేతలు విమర్శలు చేస్తున్నారు. డీలర్ల ద్వారా పంపిణీ చేయడంతో బియ్యం మాఫియాకు అడ్డుకట్ట పడినట్లేనని చెబుతున్నారు.
రహదారులు మెరుగుపడ్డాయి
జగన్‌మోహన్‌రెడ్డి ఐదేళ్ల పాలనలో రాష్ట్ర రహదారులు ఛిద్రం అయ్యాయి. 24 వేల కిలోమీటర్ల గ్రామీణ రహదారులు రూపురేఖలు కోల్పోయాయి. రోడ్లపై ప్రయాణించే వారు నిత్యం నరకం అనుభవించారు. ఐదేళ్లలో ప్రమాదాల కారణంగా 40 వేల మంది ప్రాణాలు కోల్పోయారు. 60 వేల మంది వికలాంగులుగా మారారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే రూ.3800 కోట్లు విడుదల చేసి రహదారులు నిర్మించారు. ఇంకా నిర్మిస్తూనే ఉన్నారు. దీంతో రాష్ట్రంలోని రహదారులు కొంత వరకు మెరుగుపడ్డాయి. కేంద్రం సాయంతో గ్రామీణ ఉపాధి హామీ ద్వారా 12 వేల కి.మీ సిమెంటు రోడ్లు నిర్మించారు. గ్రామీణ రహదారులకు మొత్తం మీద రూ.6 వేల కోట్లతో మెరుగులు దిద్దారు.
మెగా డీఎస్సీ కల సాకారం
ఐదేళ్ల వైసీపీ పాలనలో ఒక్క ఉపాధ్యాయ ఉద్యోగం కూడా భర్తి చేయలేదు. బడులు కుదించి విద్యారంగాన్ని గందరగోళంలోకి నెట్టారు. కూటమి ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు మెగా డీఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేసి, పరీక్షలు నిర్వహిస్తోంది. దీంతో మూడున్నర లక్షల మంది 16 వేల ఉద్యోగాల కోసం పోటీ పడుతున్నారు. అంతే కాదు..ఏటా డీఎస్సీ నిర్వహిస్తామని విద్యా మంత్రి నారా లోకేశ్ ప్రకటించారు. దీంతో నిరుద్యోలుగు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.
20 లక్షల ప్రైవేటు ఉద్యోగాల దిశగా చర్యలు
ఏపీలో ఐదేళ్లలో 20 లక్షల ప్రైవేటు ఉద్యోగాలు కల్పిస్తామని కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీ మేరకు పెట్టబుడులు ఆకర్షిస్తున్నారు. ఏడాది కాలంలో 9.60 లక్షల కోట్ల పెట్టుబడుల ద్వారా 8 లక్షల ఉద్యోగాలు కల్పించారు. మరో నాలుగేళ్లలో 12 లక్షల ఉద్యోగాలు తీసుకువచ్చే లక్ష్యంతో పనిచేస్తున్నారు. ఉత్తరాంధ్రలో పరిశ్రమలు తీసుకువచ్చి, 5 లక్షల ఉద్యోగాలు కల్పించే లక్ష్యంతో పనిచేస్తున్నారు. మరోవైపు వెనకబాటుకు గురైన రాయలసీమలో తయారీ రంగం, విద్యుత్ ఉత్పత్తికి ప్రాధాన్యత ఇచ్చారు. దీంతో సీమలో పరిశ్రమల పెట్టుబడులు గణనీయంగా పెరిగాయి.
శ్రీసిటీలో లక్ష ఉద్యోగాలు
నెల్లూరు జిల్లా శ్రీసిటీ ఎలక్ట్రానిక్ పరిశ్రమలకు హబ్‌లా మారింది. బహుళజాతి సంస్థలు భారీ పెట్టుబడులు పెడుతున్నాయి. ఇప్పటికే అక్కడ 12 వేల మంది ఉపాధి పొందుతున్నారు. రాబోయే నాలుగేళ్లలో లక్ష మందికి ఉద్యోగాలు కల్పించే లక్ష్యంతో కూటమి సర్కార్ చర్యలు తీసుకుంటోంది.
పోలవరం బనకచర్ల గేమ్ ఛేంజింగ్ ప్రాజెక్ట్
కూటమి ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన హామీలే కాదు, ఇవ్వని హామీలను కూడా తెరమీదకు తీసుకువచ్చింది. గోదావరి వరద జలాలను పోలవరం నుంచి బనకచర్ల తరలించేందుకు మెగా ప్రాజెక్టుకు రూపకల్పన చేసింది. డీపీఆర్ సిద్దం చేస్తోంది. రూ.81 వేల కోట్ల ఈ ప్రాజెక్టు పూర్తి అయితే రాయలసీమలో నీటి సమస్యకు శాశ్వత పరిష్కారం లభిస్తుంది. నాగార్జునసాగర్ కుడికాలువ ఆయకట్టు స్థిరీకరణ జరుగుతుంది.
మరి కూటమిపై వ్యతిరేకత లేదా?
కూటమి సర్కార్ సంక్షేమంతోపాటు రెడ్ బుక్ రాజ్యాంగం అమలు చేస్తోందనే విమర్శలు వస్తున్నాయి. వైసీపీ నాయకులపై కేసులు, కక్ష తీర్చుకునే విధంగా ఉన్నాయనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. పథకాలు ఏడాది కాలంలో సగం కూడా అమలుకు నోచుకోలేదని సామాన్యులు పెదవి విరుస్తున్నారు. ఆదాయం పెంచి, పథకాలు అమలు చేస్తామని సీఎం చంద్రబాబునాయుడు చెబుతున్నాయి. అది ఎప్పటికి సాధ్యం అవుతుందోనని ప్రజలు ఆందోళన చెందుతున్నారు.