ఓ ప్రత్యేకమైన వాతావరణంలో సమారోప్ కార్యక్రమం విజయవంతం అవుతోందని, శతాబ్దిలోకి సంఘం ప్రవేశించే ముందు స్వయంసేవకులకు ఈ వర్గ నడుస్తోందన్నారు. ప్రస్తుతం సంఘ్ శతాబ్దిలోకి ప్రవేశించిందని, కానీ.. వచ్చే విజయదశమి నాటికి వంద సంవత్సరాలు నిండుతాయని, ఈ నిమిత్తంగా యోజన చేసిన కార్యక్రమాలు ఈ యేడాది అంతా నడుస్తాయని తెలిపారు.
పహల్గాంలో అమానవీయంగా ఉగ్రదాడి జరిగిందన్నారు. సాధారణమైన పౌరులను ఉగ్రవాదులు కాల్చి చంపారని ఆవేదన వ్యక్తం చేశారు. దీంతో సహజంగానే మన మనస్సుల్లో కోపం, దు:ఖం వచ్చిందని, దోషులను కఠినంగా శిక్షించాలని డిమాండ్లు కూడా వచ్చాయని అన్నారు. దీంతో తగిన చర్య తీసుకున్నారని, శిక్షలు కూడా వేశారన్నారు. ఫలితంగా భారత సైనికుల ధైర్యం, వీరత్వం మళ్లీ ప్రకాశించిందన్నారు. మన రక్షణ రంగంలో ఆవిష్కరణలు, పరిశోధనలు ప్రభావవంతంగా అద్భుతంగా వున్నాయన్న విషయం నిరూపితమైందన్నారు. అలాగే ప్రభుత్వ పట్టుదల కూడా ఇందులో ప్రస్ఫుటమైందన్నారు. రాజకీయ సమాజంలో కూడా తగిన పరిణతి కనిపించి సమాజమంతా ఐక్యంగా వుందన్న సందేశం వెళ్లిందన్నారు. మతపరమైన విభేదాలతో పాటు ఇతరత్రా విభేదాలన్నింటినీ పక్కన పెట్టి, సమాజం ఒక్కటైందన్నారు. ఇది ఇలాగే కొనసాగాలని, సమాజంలో ఈ లక్షణం శాశ్వతంగా నిలిచిపోవాలని ఆకాంక్షించారు. ఓవిధంగా దేశభక్తి వాతావరణం నిర్మితమైందని, జాతీయ ప్రయోజనాల దృష్ట్యా సమాజం తమ మధ్య వున్న తేడాలను కూడా మరిచిపోయి ఏకమయ్యారని, పోటీదారులు కూడా ఒకరితో ఒకరు సహకరించుకున్నారన్నారు. ఇది ఆదర్శవంతమైన ప్రజాస్వామ్య చిత్రమని, ఇది ఇలాగే కొనసాగాలని అందరి కోరిక అని డాక్టర్ మోహన్ భగవత్ పేర్కొన్నారు.
రక్షణ, భద్రత రంగంలో భారత దేశం స్వయం సమృద్ధిగా వుండాలని డాక్టర్ మోహన్ భాగవత్ ఆకాంక్షించారు. భారత దేశంతో ప్రత్యక్షంగా యుద్ధంలో గెలవలేని వారు ప్రాక్సీ యుద్ధం, ఉగ్రవాద కార్యకలాపాలు అనే విధానాల ద్వారా మనదేశాన్ని రక్తసిక్తం చేయాలనుకుంటున్నారని అన్నారు. అయితే ప్రస్తుత కాలంలో యుద్ధం స్వభావం పూర్తిగా మారిపోయిందని, ఇకపై ముఖాముఖిగా వుండదని, సాంకేతికత కూడా మారుతోందన్నారు. వున్న చోటనే వుంటూ బటన్ నొక్కి, డ్రోన్ ద్వారా దాడులు చేయవచ్చన్నారు.అయితే ఈ క్లిష్ట సమయంలో ఏ దేశం సత్యం వైపు నిలబడుతోంది? ఎవరు మనకు వ్యతిరేకంగా నిలుస్తున్నారో కూడా తెలుసుకోగలిగామన్నారు. అందుకే భద్రత విషయంలో పూర్తి స్వావలంబన సాధించాలన్నారు.
భారతీయులు సత్యం, అహింస అనే వాటిని అనుసరిస్తామని, మనకు శత్రువులే లేరు కానీ.. ఉగ్రవాదాన్ని వ్యాప్తి చేసే దేశాలున్నంత వరకు మనం అప్రమత్తంగానే వుండాలని హెచ్చరించారు. అయితే.. భద్రతా దళాలు, ప్రభుత్వాలు, పరిపాలనాపరమైన అన్ని చర్యలు తీసుకుంటాయి కానీ.. నిజమైన బలం మాత్రం సమాజంలోనే వుందన్నారు. రెండో ప్రపంచ యుద్ధ సమయంలో హిట్లర్ లండన్ పై ఓ నెల పాటు నిరంతరంగా బాంబులు వేశాడని, దీంతో నగరం, సైన్యం నాశనమైందని గుర్తు చేశారు.ఈ సమయంలో హిట్లర్ స్నేహితుడు ముస్సోలిని మధ్యవర్తిత్వం చేయడానికి ముందుకు వచ్చాడని, అప్పుడు ప్రధానమంత్రి చర్చిల్ రాజు దగ్గరికి వెళ్లి ప్రతిపాదించాడు. ఆ తర్వాత అతను ఇంగ్లాండ్ మహానగరాలలో తిరుగుతూ ప్రజలతో సంభాషించాడు. ప్రజలు, ‘మేము పోరాడతాము మరియు మేము తలవంచము’అని తేల్చి చెప్పారన్నారు.ఆ తర్వాత చర్చిల్ కూడా ‘‘మనం పోరాడదాం. మన భవిష్యత్ తరాలు కూడా పోరాడతాయి’’ అని ప్రకటించాడని, యుద్ధం తర్వాత చర్చిల్ ‘‘ఇంగ్లాండ్ సింహం’’ గా పిలవబడ్డాడని తెలిపారు. అప్పుడు చర్చిల్ ప్రతిస్పందిస్తూ.. ‘‘ప్రజలు సింహాలు. నేను వారి కోసం మాత్రమే గర్జిస్తాను. ఓ దేశం నిజమైన బలం సమాజమే’’ అని అన్నారని మోహన్ భాగవత్ ఉటంకించారు.
భారత్ వైవిధ్యభరితమైన దేశమని, అనేక సమస్యలున్నాయని పేర్కొన్నారు. అయితే.. ఓ పరిస్థితి ఒకరికి ప్రయోజనం చేకూర్చవచ్చు. మరొకరికి హాని కలిగించవచ్చని వివరించారు. ఇది తరుచుగా సమాజంలో అసంతృప్తిని సృష్టిస్తోందని, కానీ.. విస్తృత జాతీయ ప్రయోజనాల ముందు ఇవన్నీ ప్రాధన్యతా అంశాలు కానేకావన్నారు. సమాజంలోని ఏ వర్గం కూడా మరో వర్గంతో సంఘర్షణకు దిగొద్దని, సామరస్యం కోసం మనమంతా కృషి చేయాలని పిలుపునిచ్చారు.
ఒకప్పుడు ప్రజలు పోరాడాలని కోరుకునేవారని, పాలకులను కూడా రెచ్చగొట్టేవారన్నారు. ఎట్టి పరిస్థితుల్లోనూ సమాజంలోని ఏ వర్గం కూడా మరో వర్గంతో పోరాడే పరిస్థితి రావొద్దని, అందరి మధ్యా సద్భావన కొనసాగాలని ఆకాంక్షించారు.భావోద్వేగంగా వచ్చే ప్రేరణతో నిరంకుశులుగా మారడం సరైన విధానమే కాదన్నారు. ఇప్పుడు మన ప్రభుత్వం భారత రాజ్యాంగాన్ని అనుసరించే పరిపాలన చేస్తోందన్నారు. అసందర్భంగా ఘర్షణ తలెత్తే విధంగా మాట్లాడం సరైన విధానం కూడా కాదని, ఇలాంటి నకారాత్మక విషయాలన్నింటినీ త్యజించాలన్నారు.బాధితులుగా నటించేవారు, లేదా ద్వేషాన్ని రెచ్చగొట్టే వారి ఉచ్చులో అస్సలే పడొద్దని సూచించారు. మనం సామరస్యంగా, సద్గుణవంతులుగా, ఓ సదుద్దేశంతో ఒకరితో ఒకరు పరస్పరం సహకరించుకుంటూనే వుండాలన్నారు. వేర్వేరు భాషలు మాట్లాడినా, రకరకాల దేవతార్చనలు చేస్తున్నా.. వేర్వేరు ఆహారపు అలవాట్లు వున్నా… మన మూలాల్లోనే ఐక్యత వుందని పునరుద్ఘాటించారు. భిన్నత్వంలో కూడా ఏకత్వాన్ని తీసుకురావడమే భారత్ యొక్క నిజమైన ధర్మమని రవీంద్రనాథ్ ఠాగూర్ అన్నారని గుర్తు చేశారు.
మన పూర్వీకుల నుంచి మనమంతా ఒక్కటేనని, ఈ విషయంలో ఆంగ్లేయులే గందరగోళాన్ని సృష్టించారని మోహన్ భాగవత్ అన్నారు. ఒక్కటిగా వుండాలన్న విషయాన్నే మనం మరిచిపోయామని, నిజానికి ప్రపంచం మొత్తం ఒకటి, మానవత్వం ఒక్కటీ ఒక్కటి అని అన్నారు. ఐక్యతను పెంపొందించుకుంటూ వైవిధ్యాన్ని కూడా కొనసాగించాలని, దానిని అభివృద్ధికి ప్రాతిపదికగా ఉపయోగించాలన్నారు. ఈ విషయంలో ప్రపంచానికి భారత్ ఓ ఉదాహరణగా నిలబడాలన్నారు.
అన్ని మార్గాలూ ఒకే వైపు తీసుకెళ్తాయని,అలాంటప్పుడు మత మార్పిడి ఎందుకు? అని సూటిగా ప్రశ్నించారు. స్వార్థం, దురాశ లేకపోతే… అన్ని మార్గాలూ ఒకే వైపుకు తీసుకెళ్తాయన్నారు. ఎవర్ని పూజించినా కుదురుతుందని, కానీ.. బలవంతం చేసి, మీ మార్గం తప్పు అని చెప్పడం సరైన పద్ధతి కాదని తేల్చి చెప్పారు. మత మార్పిడి అంటే హింస అని, దురాశ, బలవంతం కారణంగా మతం మారిన వారు తిరిగి మన ధర్మంలోకి వచ్చేస్తామంటే స్వాగతించాలని, అంగీకరించాలన్నారు. ఇక… గిరిజన సమాజం భిన్నమైన సమాజమేమీ కాదని, మన సంస్కృతే అడవుల నుంచి పుట్టిందని, గిరిజన సమాజమే మన ఆధారభూతమని అన్నారు. ప్రకృతిని పూజించడం, పవిత్రంగా భావించడం అన్నది భారత్ మాత్రమే అనుసరించే ఓ సంప్రదాయమని పేర్కొన్నారు.
వెయ్యి సంవత్సరాలు బానిసత్వంలోనే మగ్గామని, అందుకే పోరాడేందుకు అలవాటు పడ్డామన్నారు. ఆ సమయంలో పోరాటం అవసరం కానీ, ఇప్పుడు మనం స్వతంత్ర ప్రజలమన్నారు. ఓపిక వుండాలని, మనల్ని మనం సరి చేసుకుంటే మార్పు తథ్యమని అన్నారు. మార్పు కోసం ఓపికతో పనిచేయాలన్నారు. రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ అందరితోనూ కలుస్తుందని, అసలు సంఘ్ ఆవిర్భవించిందే అందుకు అని డాక్టర్ మోహన్ భాగవత్ స్పష్టం చేశారు.
ఇక సంఘ శిక్షావర్గల గురించి మాట్లాడుతూ… ఓ కార్యకర్తను సిద్ధం చేయడానికి ఓ వ్యవస్థ వుందని, అందుకే వర్గ అని మోహన్ భాగవత్ తెలిపారు. ఈ విధానం 98 సంవత్సరాలుగా కొనసాగుతోందని, కాలక్రమేణా పెరుగుతూ వస్తోందన్నారు. దేశవ్యాప్తంగా వున్న కార్యకర్తలందరూ కలిసి మెలిసి పనిచేస్తారని, ఈ 100 సంవత్సరాలలో దీనిని అందరూ అనుభవిస్తూనే వున్నారన్నారు. ఈ సందర్భంగా వీర సావర్కర్ అన్న విషయాన్ని తెలియజేస్తూ.. ‘‘ వీర సావర్కర్ ఇలా అన్నారు. మనం ఓ పని కోసం తుఫాను మాదిరి ప్రయత్నం చేస్తాం. కానీ సంఘ్ మాత్రం బొట్టు బొట్టు మాదిరిగా పనిచేస్తుంది. అందుకే దాని పని గొప్పది. ఆ కార్యంలో పెరుగుదల కనిపిస్తుంది అని అన్నారు’’ అని మోహన్ భాగవత్ గుర్తు చేశారు.