పాకిస్థాన్ నిఘా సంస్థ ఐఎస్ఐ ఏజంట్లకు అమ్ముడుపోయిన వారి జాబితా పెరిగిపోతోంది. యూట్యూబర్ జ్యోతి మల్హోత్రా వ్యవహారం మరవక ముందే తాజాగా రాజస్థాన్‌కు చెందిన ఓ ప్రభుత్వ ఉద్యోగి గూఢచర్యం ఆరోపణలపై అరెస్టయ్యారు. రాజస్థాన్ స్టేట్ ఎంప్లాయ్‌మెంట్ కార్యాలయంలో ఉద్యోగిగా పనిచేసే సకూర్ ఖాన్ మగళియార్‌ను నిఘా వర్గాలు అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నాయి. గతంలో సకూర్ ఖాన్ ఓ మంత్రికి పీఏగా పనిచేసినట్లు పోలీసులు గుర్తించారు.
సకూర్ ఖాన్ కదలికలపై నిఘా వర్గాలు గత కొంత కాలంగా కన్నేశాయి. అతనికి పాక్ దౌత్యకార్యాలయంతో ఉన్న సంబంధాలపై కూడా నిఘా వర్గాలు ఆరా తీస్తున్నాయి. సకూర్ పాకిస్థాన్‌లో ఏడుసార్లు పర్యటించాడని ప్రాథమిక విచారణలో తేలింది.
సకూర్ మొబైల్ డేటాలో పాకిస్థాన్‌కు చెందిన పలువురి ఫోన్ నంబర్లు ఉన్నట్లు అధికారులు గుర్తించారు. వాటి వివరాలపై నిఘా వర్గాలు, సీఐడి ఆరా తీస్తోంది. అతడి ఫోన్‌లో ఎలాంటి మిలటరీ సమాచారం లేదని అధికారులు తెలిపారు.కొన్ని ఫైల్స్ అతను డిలీట్ చేసినట్లు అధికారులు గుర్తించారు. అతని బ్యాంకు ఖాతాలను కూడా పోలీసులు పరిశీలిస్తున్నారు.