వైఎస్ఆర్‌సిపి నేత, మాజీ వ్యవసాయ శాఖ మంత్రి కాకాణి గోవర్ధన్‌రెడ్డికి వెంకటగిరి జూనియర్ సివిల్ జడ్జి మేజిస్ట్రేట్ కోర్టు 14 రోజుల రిమాండ్ విధించింది. దాంతో ఆయనను నెల్లూరు కేంద్ర కారాగారానికి తరలించారు.
క్వార్ట్జ్ అక్రమ తవ్వకాలు, అక్రమ రవాణా కేసులో నిందితుడిగా ఉన్న కాకాణి గోవర్ధన్ రెడ్డిని పోలీసు బృందాలు బెంగళూరు సమీపంలో ఒక గ్రామంలో ఉన్న రిసార్ట్‌లో ఆదివారం సాయంత్రం అదుపులోకి తీసుకున్నాయి. కాకాణి గోవర్ధన్ రెడ్డి 55 రోజులుగా పరారీలో ఉన్నారని, ఆయనను పట్టుకోడానికి పలు బృందాలను ఏర్పాటు చేసామనీ పోలీసులు చెప్పారు. ఆదివారం రాత్రికి బెంగళూరు నుంచి నెల్లూరు తీసుకొచ్చిన పోలీసులు మాజీ మంత్రిని సోమవారం ఉదయం వెంకటగిరి న్యాయస్థానంలో హాజరు పరిచారు.
క్వార్ట్జ్ అక్రమ తవ్వకాలు, అక్రమ రవాణా, నిబంధనలకు విరుద్ధంగా పేలుడు పదార్థాల వాడకం, గిరిజనులను బెదిరించడం వంటి ఆరోపణల మీద నెల్లూరు జిల్లా పొదలకూరు పోలీసు స్టేషన్‌లో కేసులో నమోదయింది. ఆ కేసులో మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్‌రెడ్డి నాలుగో నిందితుడిగా (ఏ4) ఉన్నారు. ఆ కేసుకు సంబంధించి విచారణకు హాజరు కావాలంటూ పోలీసులు పలుమార్లు నోటీసులిచ్చారు. అయినా కాకాణి స్పందించలేదు. ఆ కేసులో తనను నిందితుడిగా చేర్చిన రెండు, మూడు రోజుల తర్వాత కాకాణి పరారయ్యారని పోలీసులు చెప్పారు. ఆ దశలోనే హైకోర్టు, సుప్రీంకోర్టుల్లో ముందస్తు బెయిల్ పిటిషన్లు వేసినా, న్యాయస్థానాలు వాటిని కొట్టేశాయి.
అక్రమ తవ్వకాలకు మంత్రి అండదండలు :–
చెన్నైలో నివసించే విద్యాకిరణ్‌కు నెల్లూరు జిల్లా పొదలకూరు మండలం తాటిపర్తి దగ్గర 32 ఎకరాల్లో రుస్తుం మైన్ పేరిట లైసెన్సు ఉండేది. ఆ లీజు గడువు ముగిసాక ఆయన రెన్యువల్‌కు దరఖాస్తు చేసుకున్నారు. 2019లో వైఎస్ఆర్‌సిపి అధికారంలోకి వచ్చేసరికి క్వార్ట్జ్‌కు విపరీతమైన డిమాండ్ ఏర్పడింది. అప్పట్లో మంత్రిగా ఉన్న కాకాణి గోవర్ధన్‌రెడ్డి అండదండలు, సహకారంతో వైసీపీ నాయకులు తాటిపర్తి దగ్గర భారీగా అక్రమ తవ్వకాలు చేపట్టి క్వార్ట్జ్‌ను తరలించేసారు. ఆ ప్రాంతం కాకాణి స్వగ్రామం తోడేరుకు దగ్గరలోనే ఉండటం, మంత్రి అండదండలతోనే ఆ దందా సాగడంతో అధికారులెవరూ నోరెత్తలేదు.
గనుల తవ్వకాలకు పేలుడు పదార్ధాలను వాడకూడదన్న నిబంధనలను ఉల్లంఘించి, అక్రమంగా తవ్వకాలు చేపట్టారని స్థానిక గిరిజనులు ఆందోళన చెందారు. పేలుడు పదార్ధాల వాడకం వల్ల తమకు ఇబ్బందిగా ఉందంటూ వాపోయారు. అయితే మంత్రి అనుచరులు తమను బెదిరించారని, అందుకే మౌనంగా ఉండిపోయామనీ వారు చెబుతున్నారు.
కాకాణి గోవర్ధన్ రెడ్డి అక్రమ తవ్వకాలు చేపడుతున్నారంటూ టీడీపీ నాయకుడు, ప్రస్తుత సర్వేపల్లి ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి అప్పట్లో దీక్ష చేపట్టారు. జిల్లా కలెక్టర్, ఎస్పీ, రాష్ట్రప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, డీజీపీ, ప్రధానమంత్రి, కేంద్ర మంత్రులూ అలా ప్రతీ ఒక్కరికీ ఎన్నోసార్లు ఫిర్యాదులు చేశారు. వరుస ఫిర్యాదుల నేపథ్యంలో 2024 సాధారణ ఎన్నికలకు ముందు గనులు, రెవెన్యూ శాఖాధికారులు తనిఖీలు చేసారు. సుమారు 61,313 టన్నుల క్వార్ట్జ్‌ను తవ్వేసి తరలించినట్లు తేల్చారు. సీనరేజీ ఛార్జీలతో పాటు పదింతల జరిమానా కలిపి మొత్తం రూ.7.56 కోట్లు చెల్లించాలని షోకాజ్ నోటీసులిచ్చారు. దానికి బాధ్యులు స్పందించలేదు. దాంతో గనుల శాఖ డిప్యూటీ డైరెక్టర్ బాలాజీ నాయక్ ఫిర్యాదు మేరకు 2025 ఫిబ్రవరి 16న పొదలకూరు పోలీసులు కేసు నమోదు చేశారు. ఆ తర్వాత మరో ఆరుగురిని నిందితులుగా చేర్చారు,
మొదట్లో ఆ కేసులో వైఎస్ఆర్‌సీపీ నాయకులు పేర్నాటి శ్యాంప్రసాద్‌రెడ్డి, వాకాటి శివారెడ్డి, వాకాటి శ్రీనివాసుల రెడ్డిలను నిందితులుగా చేర్చారు. వారికి వెన్నుదన్నుగా ఉన్న వ్యక్తి మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్‌రెడ్డి అని, ఆయనను అదే కేసులో నాలుగో నిందితుడిగా చేర్చారు. తర్వాత మరో ఆరుగురికి కూడా ప్రమేయం ఉందని గుర్తించి, వారినీ నిందితులుగా పేర్కొన్నారు.
పోలీసులకు రెండు నెలలు చిక్కని కాకాణి :–
మార్చి 31న కేసు విచారణకు హాజరు కావాలంటూ నోటీసులు ఇవ్వడానికి పోలీసులు ముందు రోజు సాయంత్రం కాకాణి నివాసానికి వెళ్ళారు. ఆయన లేనందున ఇంటికి నోటీసులు అతికించారు. ఆ నోటీసుల్లో పేర్కొన్న మార్చి 31న ఆయన విచారణకు హాజరుకాలేదు. తర్వాత కాకాణి హైదరాబాద్‌లో ఉన్నారనే సమాచారంతో పోలీసులు అక్కడికి వెళ్ళారు, కానీ ఫలితం లేదు. దాంతో కుటుంబ సభ్యులకు నోటీసులు అందజేసారు. ఆ తర్వాత కూడా ఇంకో రెండు సార్లు నోటీసులు ఇచ్చేందుకు పోలీసులు చేసిన ప్రయత్నాలేవీ ఫలించలేదు.
కాకాణి గోవర్ధన్ రెడ్డి పోలీసులకు దొరక్కుండా ఉండేందుకు చాలా వేగంగా స్థావరాలు మారుస్తూ వచ్చారు. తమిళనాడు, కేరళ, కర్ణాటక, తెలంగాణ రాష్ట్రాల్లో పలుచోట్ల తలదాచుకున్నారు. తాజాగా సుప్రీంకోర్టు కూడా ఆయన ముందస్తు బెయిల్ పిటిషన్ తిరస్కరించింది. ఆ తర్వాత కాకాణి, బెంగళూరు దగ్గర ఓ పల్లెటూరిలో దాగి ఉన్నారు. నెల్లూరు పోలీసులు అక్కడికే వెళ్ళి కాకాణిని అదుపులోకి తీసుకున్నారు.
కోర్టుకు మాజీ మంత్రి :–
సోమవారం (ఇవాళ) ఉదయం కాకాణి గోవర్ధన్ రెడ్డిని నెల్లూరు జిల్లా పోలీసులు భారీ బందోబస్తు నడుమ కోర్టుకు తరలించారు. గత (ఆదివారం) రాత్రి ఆయనను పోలీస్ ట్రైనింగ్ కాలేజీలో ఉంచారు. ఉదయం వెంకటాచలం కమ్యూనిటీ హెల్త్ సెంటర్‌లో వైద్య పరీక్షలు నిర్వహించారు. భద్రత నడుమ వెంకఎటగిరి కోర్టుకు తీసుకువెళ్ళారు. అక్కడ న్యాయమూర్తి ఇవాళ తన తుదితీర్పు వెలువరించారు. మాజీ మంత్రి మీద కేసు విచారణ సందర్భంగా కోర్టు ఆవరణలో సెక్షన్ 144 విధించడం గమనార్హం.
కాకాణికి సంబంధం లేదంటున్న వైసీపీ :–
అక్రమ మైనింగ్ కేసులో కాకాణి గోవర్ధన్ రెడ్డి అనుచరుల ప్రమేయం ఉందని వారి మీదా, వారికి సహకరించారంటూ మాజీ మంత్రి మీదా కేసులు నమోదు చేసారు. అయితే కాకాణికి ఆ కేసుతో సంబంధమే లేదని వైసీపీ వాదిస్తోంది. కేవలం రాజకీయ కక్ష కొద్దీ కాకాణిని టార్గెట్ చేసుకున్నారని వైసీపీ అభిప్రాయపడింది. గత ప్రభుత్వ హయాంలోనే టీడీపీ నేత సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ఫిర్యాదులు చేసినప్పుడు మైనింగ్ శాఖ జాయింట్ ఇనస్పెక్షన్ చేసిందని, ఆ గనిలో క్వార్ట్జ్, మిక్సెడ్ మైకా తదితర లోహాలు 1050 మెట్రిక్ టన్నులు ఉన్నాయని, అక్కడ అక్రమ తవ్వకాలు జరగలేదనీ ఆ శాఖ నివేదిక ఇచ్చింది. ఇప్పుడు ఫిర్యాదు చేసిన మైనింగ్ శాఖ ఇన్‌చార్జి డీడీ కూడా ఆనాటి జాయింట్ ఇనస్పెక్షన్‌లో ఉన్నారనీ, మాజీ మంత్రికి క్లీన్‌చిట్ ఇచ్చిన నివేదిక ఇచ్చిన వారిలో ఆయనా ఉన్నారని వైఎస్ఆర్‌సిపి నాయకులు చెబుతున్నారు.
రాష్ట్ర హైకోర్టు ఈ కేసులో బలం లేదంటూ మొదటి నిందితుడికి, మరో ఇద్దరు నిందితులకూ బెయిల్ మంజూరు చేసింది. ఇవాళ న్యాయస్థానం కాకాణికి మాత్రం 14 రోజుల రిమాండ్ విధించింది.