రోహింగ్యాలు… ప్రపంచంలో అత్యధికంగా వలసబాట పట్టిన జనాభాలో వీరిది పెద్ద సంఖ్య. మయన్మార్ నుంచి లక్షల సంఖ్యలో బంగ్లాదేశ్‌లోని శరణార్థి శిబిరాలకు చేరుకున్న వీరు… అక్కడ నుంచి పలు దేశాలకు వలసబాట పట్టారు. ఆగస్టు 2017 నుండి మయన్మార్ సైన్యం దాడుల తర్వాత 770,000 మందికి పైగా రోహింగ్యాలు దేశం విడిచి పోయారు.
బంగ్లాదేశ్‌లోని ప్రపంచంలోనే అతిపెద్ద శరణార్థుల స్థావరంలో లక్షలాది రోహింగ్యాలు తల దాచుకుంటున్నారు. మయన్మార్‌లో ఇంకా 6 లక్షల మంది రోహింగ్యాలు ఉన్నట్లు అంచనా. కనీసం 20000 మంది రోహింగ్యాలు భారత్‌లో అక్రమంగా ప్రవేశించారని అంచనా. వాస్తవ సంఖ్య అంతకంటె చాలా ఎక్కువ ఉండవచ్చు. దానిపై అనేక ఆందోళనలు వ్యక్తం అవుతున్నాయి. వేలాది మంది రోహింగ్యాలు బంగ్లాదేశ్ సరిహద్దులు దాటుకుని అక్రమంగా పశ్చిమబెంగాల్ చేరుతున్నారు. అక్కడి నుంచి దక్షిణాది రాష్ట్రాలకు వలసలు వెళుతున్నారు. దేశ భద్రతకు ఇది సవాల్ విసురుతోంది.
రోహింగ్యాల సమస్య ఎక్కడ మొదలైంది?
మయన్మార్‌లో నెలకొన్న రాజకీయ అనిశ్చితి రోహింగ్యాల మనుగడకు ముప్పు తెచ్చింది. మయన్మార్ సైనిక నాయకత్వం ఫిబ్రవరి 2021లో తిరుగుబాటును ప్రారంభించింది. దీని ఫలితంగా అంతర్యుద్ధం కొనసాగుతోంది. దీంతో లక్షలాది రొహింగ్యాలు బంగ్లాదేశ్‌కు వలసబాట పట్టారు. అక్కడ నుంచి ప్రపంచంలోని పలు దేశాలకు అక్రమంగా వలస వెడుతున్నారు. ఇలా వేలాది రోహింగ్యాలు ఇప్పటికే భారత్ చేరుకున్నారు.
రోహింగ్యాలను తమ స్వదేశానికి సురక్షితంగా తిరిగి పంపే అవకాశం కనిపించడం లేదు. అంతర్జాతీయ వలసదారుల చట్టాలు చాలా కఠినంగా ఉన్నాయి. భారతదేశంలోకి రోహింగ్యాలు అనధికారికంగా, అక్రమంగా చొరబడుతున్నారు. దీంతో పలు రాష్ట్రాల పోలీసులు అరెస్ట్ చేసి జైలుకు తరలిస్తున్నారు. తాజాగా ఏపీ పోలీసులు విజయవాడ సమీపంలోని తాడిగడపలో 15 మంది రొహింగ్యాలను అరెస్ట్ చేసి వారిపై పీడీ యాక్ట్ ప్రయోగించారు.
అక్రమ వలసలకు భారత్ వ్యతిరేకం
భారత్ మొదటి నుంచి అక్రమ వలసలను తీవ్రంగా వ్యతిరేకిస్తోంది.దేశంలో అక్రమ వలసదారులను గుర్తించి, కేసులు నమోదు చేస్తోంది. అక్రమ వలసలు భారత్‌కు పెను సవాల్ విసురుతున్నాయి. వలసదారులకు ఆశ్రయం కల్పించాల్సిన బాధ్యత ప్రతి దేశానికి ఉంది. భారత్ శరణార్థులకు ఆశ్రయం కల్పించడంలో మొదటి నుంచి ఆమోదిస్తుంది. శ్రీలంకలో ప్రభుత్వానికి, ఎల్టీటీఈ తీవ్రవాదుల మధ్యనలిగిన వేలాది మందికి భారత్ ఆశ్రయం కల్పించడంతోపాటు, వారికి ఉపాధి అవకాశాలు కూడా కల్పించింది. అయితే అక్రమ వలసలను భారత్ తీవ్రంగా వ్యతిరేకిస్తోంది. భారత్ ఇటీవల ప్రపంచంలోనే శక్తివంతమైన గ్రూపుల్లో ఒకటైన జీ 20 సదస్సును విజయవంతంగా నిర్వహించింది. 2023 డిసెంబరులో ప్రపంచ వలస విధానాల ఫోరంలోనూ భారత్ అక్రమ వలసదారులపై చర్చలు జరిపింది. అయితే దేశంలోకి అక్రమంగా ప్రవేశించిన రొహింగ్యాలను వారి దేశాలకు తిప్పి పంపడం సాధ్యం కావడం లేదు. అంతర్జాతీయ చట్టాలే ఇందుకు అడ్డంకిగా మారాయి.
వలసలకు అడ్డుకట్ట వేయడానికి భారత్ తీసుకోవాల్సిన చర్యలు
శరణార్థులు, ఆశ్రయం కోరేవారికి సంబంధించిన జాతీయ చట్టాన్ని ఆమోదించాలని ఎంతో కాలంగా డిమాండ్ వస్తోంది. శరణార్థుల బిల్లు 2015లో పార్లమెంటులో మొదటిసారి ప్రవేశపెట్టారు. ఈ బిల్లు అంతర్జాతీయ బాధ్యతలు, భారత రాజ్యాంగ సూత్రాల ఆధారంగా ఆశ్రయం, శరణార్థి వ్యవస్థను ఏర్పాటు చేస్తుంది. శరణార్థుల బిల్లును ఆమోదిస్తే భారతదేశంలో రోహింగ్యాలకు చట్టపరమైన రక్షణ లభిస్తుంది.దేశ అంతర్గత భద్రత దృష్ణ్యా భారత్ ఇలాంటి సాహసం చేయకపోవచ్చని అంతర్జాతీయ విశ్లేషకులు చెబుతున్నారు.
రోహింగ్యాలను బహిష్కరించాలంటూ పిలుపు
2017లో జమ్మూలో రోహింగ్యాలను గుర్తించి బహిష్కరించాలని స్థానిక ప్రజలు ఆందోళన చేపట్టారు. ఆ తర్వాత కేంద్ర ప్రభుత్వం నుంచి కూడా ఇలాంటి ఆదేశాలు రావడంతో, రోహింగ్యాలను బహిష్కరించడాన్ని వ్యతిరేకిస్తూ సుప్రీంకోర్టులో కొందరు పిటిషన్ దాఖలు చేశారు. రోహింగ్యాలు జాతీయ భద్రతకు ముప్పు అని ప్రభుత్వం చేసిన వాదనలను సుప్రీంకోర్టు అంగీకరించింది. బహిష్కరణను ఆపడానికి సుప్రీంకోర్టు నిరాకరించింది. 2022 ఏప్రిల్‌లో తన పిల్లల నుండి రోహింగ్యా తల్లిని రఖైన్‌కు తిప్పి పంపడంపై భారత్ తీవ్ర విమర్శలు ఎదుర్కోవాల్సి వచ్చింది. అయినా అక్రమ వలసదారుల విషయంలో భారత్ కఠినంగా వ్యవహరిస్తోంది. దేశ భద్రత ముఖ్యమని భారత్ స్పష్టం చేసింది.
రోహింగ్యాలను తిప్పి పంపడం అంత తేలిక కాదు
అక్రమంగా భారత్‌లో చొరబడ్డ రోహింగ్యాలను మయన్మార్‌కు తిరిగి పంపడం చాలా సంక్లిష్టమైన వ్యవహారం. ఇలా చేయడం అంతర్జాతీయ నాన్-రీఫౌల్మెంట్ సూత్రాన్ని ఉల్లంఘించడమే అవుతుంది. ఏ ప్రభుత్వం కూడా ఒక వ్యక్తిని హింస, క్రూరమైన, అమానవీయ, అవమానకరంగా వ్యవహరించడం, హాని జరిగే అవకాశమున్న దేశానికి తిరిగి పంపకూడదని వలసదారుల చట్టాలు చెబుతున్నాయి. అంతర్జాతీయ జెనోసైడ్ కన్వెన్షన్ చట్టంపై సంతకం చేసిన దేశంగా, మారణహోమాన్ని నిరోధించడానికి భారతదేశం బాధ్యత వహిస్తుంది. ప్రాణాలతో బయటపడిన వారిని తిరిగి వారి దేశాలకు పంపకూడదని చట్టాలు చెబుతున్నాయి. దేశంలోని న్యాయవాదులు కూడా రోహింగ్యాలను మయన్మార్‌లో ప్రాణాంతక పరిస్థితులకు తిరిగి పంపడం భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 21ని ఉల్లంఘించడమేనని వాదిస్తున్నారు. ఇలా చేయడం వారి జీవించే హక్కును కాలరాయడమే అవుతుందని న్యాయవాదులు చెబుతున్నారు.
వలసదారుల విషయంలో భారత్ స్పష్టమైన వైఖరి
మొదటి నుంచి భారత్ వలసదారుల విషయంలో స్పష్టమైన వైఖరి అవలంబిస్తోంది. వలసదారులతో దేశంలో అనేక సమస్యలు మొదలవుతున్నాయి. దేశ అంతర్గత భద్రత ప్రశ్నార్థకంగా మారుతోంది. గతంలో అనేక అనుభవాలు భారత్ అక్రమ వలసదారుల విషయంలో కఠినంగా వ్యవహరించేలా చేశాయి. లక్షలాది వలసదారులతో ఇప్పటికే పశ్చిమబెంగాల్‌లోని కొన్ని ప్రాంతాల్లోని స్థానికులు మైనారిటీగా మారిపోయారు. వలసదారుల నుంచి దాడులు ఎదుర్కొంటున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో రోహింగ్యాలను శరణార్థులుగా గుర్తించి, వారికి సదుపాయాలు కల్పించాలనే డిమాండ్లను భారత్ తోసిపుచ్చింది. అక్రమ వలసలను ప్రోత్సహించే ప్రసక్తే లేదని విదేశాంగశాఖ మంత్రి జైశంకర్ స్పష్టం చేశారు. భారత్ నుంచి అక్రమంగా విదేశాలకు వలస వెళ్లిన వారు కూడా తిరిగి రావాలని జైశంకర్ పిలుపునిచ్చారు. ఇలాంటి పరిస్థితుల్లో రొహింగ్యాల విషయంలో భారత్ అనుసరిస్థిస్తున్న విధానాలు స్పష్టంగా ఉన్నాయి.