నైరుతి రుతుపవనాలు కేరళ తీరాన్ని తాకాయి. వారం రోజులు ముందుగానే నైరుతి రుతుపవనాలు కేరళ తీరాన్ని చేరుకున్నాయి. మరో మూడురోజుల్లో నైరుతి రుతుపవనాలు ఆంధ్రప్రదేశ్‌లో ప్రవేశిస్తాయని భారత వాతావరణ శాఖ వెల్లడించింది.ఏటా జూన్ 1వ తేదీన కేరళ తీరాన్ని తాకాల్సి ఉండగా నైరుతి రుతుపవనాలు,ఈ ఏడాది వారం ముందుగానే పలకరించాయి.
జూన్ 15వ తేదీ నుంచి ఏపీలో నైరుతి రుతుపవనాల ప్రభావంతో విస్తారంగా వర్షాలు కురుస్తాయని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది. ఇప్పటికే అరేబియా సముద్రంలో ఏర్పడిన అల్పపీడనం వాయుగుండంగా మారిందని వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు. దీని ప్రభావంతో కర్ణాటక, గోవా, మహారాష్ట్రలో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి.
నైరుతి రుతుపవనాల వర్షాలు దేశంలో వ్యవసాయరంగానికి చాలా కీలకం. ఇప్పటికీ 52 శాతం భూమికి వర్షాలే ఆధారం. దేశంలో మొత్తం ఆహార ధాన్యాల ఉత్పత్తిలో 40 శాతం వర్షాధార భూముల నుంచే అందుతోంది. పది రోజుల్లో రుతుపవనాలు దేశ వ్యాప్తంగా విస్తరిస్తాయని అధికారులు అంచనా వేశారు.
బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం కొనసాగుతోంది. దీని ప్రభావంతో తెలుగు రాష్ట్రాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు పడతాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. దీని ప్రభావంతో రెండు రోజులు పాటు పిడుగులతో కూడిన వర్షం పడే ప్రమాదముందని అధికారులు హెచ్చరించారు. ఒకటి రెండు ప్రాంతాల్లో అతి భారీ వర్షాలు కూడా నమోదవుతాయని అంచనా వేశారు.