పాక్ సరిహద్దుల్లో ఉద్రిక్తతల వేళ భారత్ కీలక నిర్ణయం తీసుకుంది. క్షిపణి రక్షణ వ్యవస్థ ఎస్ 400 ఎయిర్ డిఫెన్సు వ్యవస్థల ముందస్తు డెలివరీకి జాతీయ భద్రతా సలహాదారు రష్యాకు వెళ్లనున్నారు. వచ్చే వారంలో జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోబల్ రష్యాలో పర్యటించనున్నారు.పాక్, భారత్ మధ్య ఉద్రిక్తతలు నెలకొన్న వేళ డొబాల్ పర్యటన ప్రాధాన్యత సంతరించుకుంది.
ఆపరేషన్ సింధూర్ సమయంలో ఎస్ 400 కీలక పాత్ర పోషించింది. పాకిస్థాన్ యుద్ధ విమానాలు, డ్రోన్లు, క్షిపణులను ధ్వంసం చేయడంలో ఎస్ 400 కీలక పాత్ర పోషించింది. ప్రత్యర్థి జామింగ్ విధానాలను తట్టుకుంటూ ఖండాతర క్షిపణులను కూడా కూల్చివేయగల సత్తా ఎస్ 400 సొంతం.
ఈ వ్యవస్థను రష్యాకు చెందిన ఎన్‌పీవో అల్మాజ్ సంస్థ తయారు చేస్తోంది. మొత్తం ఐదు ఎస్ 400 క్షిపణి వ్యవస్థలను కొనుగోలు చేసేందుకు భారత్ 2018లో రష్యాతో ఒప్పందం చేసుకుంది. ఈ డీల్ విలువ రూ.35 వేల కోట్లు. ఇప్పటి వరకు మూడు యూనిట్లు భారత్ చేరుకున్నాయి. మిగిలిన రెండు 2026 ఆగష్టు నాటికి అందించే అవకాశాలున్నాయి. అయితే అంతకు ముందుగానే ఎస్ 400 క్షిపణి రక్షణ వ్యవస్థలను తీసుకువచ్చేందుకు భారత్ ప్రయత్నాలు ప్రారంభించింది. చైనా దాడులను తిప్పికొట్టేందుకు అస్సాం, అరుణాచల్‌ప్రదేశ్ సరిహద్దులో ఎస్ 400 వ్యవస్థలను మోహరించనున్నారు.