ఆపరేషన్ సిందూర్ తర్వాత ఉగ్రవాదానికి వ్యతిరేకంగా ప్రపంచ మద్దతును కూడగట్టడానికి భారతదేశం ఒక భారీ ఔట్‌రీచ్ కార్యక్రమాన్ని ప్రారంభించింది. ఏడు అఖిలపక్ష పార్లమెంటరీ ప్రతినిధులను 32 దేశాలు, యూరోపియన్ యూనియన్‌కు పంపింది. 2025 ఏప్రిల్ 22న జమ్మూకశ్మీర్‌లోని పహల్‌గామ్‌లో 26 మందిని హత్య చేసిన ఉగ్రవాద దాడికి భారత్ స్పందనగా చేపట్టిన ఆపరేషన్ సిందూర్ గురించి వివరించడానికి ఈ కార్యక్రమాన్ని చేపట్టారు. భారతదేశం సమైక్యంగా ఉందని ప్రపంచానికి చాటడం, పాకిస్తాన్ తప్పుడు కథనాలను ఎదుర్కోవడం, ఉగ్రవాదంపై భారత్ జీరో-టాలరెన్స్ విధానాన్ని బలోపేతం చేయడం ఈ కార్యక్రమం లక్ష్యాలు. ప్రపంచ నాయకులు, మేధో వర్గాలు, మీడియాతో ఈ ప్రతినిధులు చర్చలు జరుపుతారు. దాని కోసం ఈ 32 దేశాలనే ఎంచుకోవడం వెనుక పకడ్బందీ వ్యూహం ఉంది. భౌగోళిక రాజకీయ (జియోపొలిటికల్) ప్రభావాన్ని సానుకూలంగా వాడుకోవడం, అంతర్జాతీయ మద్దతు కూడగట్టడం, ప్రపంచ వేదికపై పాకిస్తాన్‌ను ఒంటరి చేయడం దాని లక్ష్యాలు.
ఆపరేషన్ సిందూర్ – దౌత్య ప్రచారం:
ఈ దౌత్యపరమైన దాడి మూలాలు పహల్గామ్ దాడిలో ఉన్నాయి. పాకిస్తాన్ కేంద్రంగా పనిచేస్తున్న లష్కరే తోయిబా అనుబంధ సంస్థ ది రెసిస్టెన్స్ ఫ్రంట్‌కు చెందిన ఉగ్రవాదులు ప్రణాళికాబద్ధమైన దాడిలో ఒక నేపాలీ సహా 26 మందిని దారుణంగా చంపారు. అత్యంత క్రూరమైన ఆ దాడిలో, బాధితులను పాయింట్-బ్లాంక్ రేంజ్‌లో కాల్చి చంపారు. ఆ దాడి భారత్‌లో పాకిస్తాన్ ఉగ్రవాద కార్యకలాపాలను గుర్తుచేసే దాడి. దానికి ప్రతిస్పందనగా భారతదేశం మే 7న ఆపరేషన్ సిందూర్‌ను ప్రారంభించింది. అందులో భాగంగా పాకిస్తాన్, పాకిస్తాన్ ఆక్రమిత కశ్మీర్‌లోని తొమ్మిది ఉగ్రవాద శిబిరాలను లక్ష్యంగా చేసుకుని 24 కచ్చితమైన క్షిపణి దాడులు చేసింది. భారత సైన్యంలోని పదాతి, నౌకా, వైమానిక దళాలు సమష్ఠిగా అమలు చేసిన ఆ ఆపరేషన్‌లో వంద మందికి పైగా ఉగ్రవాదులను మట్టుపెట్టింది. 1999లో ఐసి-814 విమానం హైజాక్, 2019 పుల్వామా బాంబు దాడి వంటి దాడులకు బాధ్యులైన ఉగ్రవాదులు వారిలో ఉన్నారు. ఆ ఆపరేషన్‌లో పాకిస్తాన్‌లోని పౌరులకు, సైనిక స్థావరాలకూ ప్రమాదం వాటిల్లకుండా భారత్ జాగ్రత్తలు తీసుకుంది.
ఆపరేషన్ సిందూర్ సైనిక విజయం భారతదేశపు వ్యూహంలో ఒక భాగం మాత్రమే. పాకిస్తాన్ తనను తాను బాధితురాలిగా చిత్రీకరించుకోవడానికి చేస్తున్న ప్రయత్నాలను అడ్డుకోడానికి… ఐక్యరాజ్యసమితి భద్రతా మండలి వంటి అంతర్జాతీయ వేదికలపై భారత్ మీద నేరం మోపే ప్రయత్నాలను నిలువరించడానికీ… భారతదేశం ఈ ప్రతిష్ఠాత్మక దౌత్య ప్రచార కార్యక్రమాన్ని చేపట్టింది. పాకిస్తాన్‌కు భద్రతామండలిలో 2026 వరకూ తాత్కాలిక సభ్య దేశం హోదా ఉంది. దాన్ని వినియోగించుకుని దుష్ప్రచారం చేసే ప్రమాదం ఉంది. దాన్ని నిలువరించాలన్నది భారత్ ఉద్దేశం.
ఈ దౌత్య ప్రచారం ద్వారా భారత్ సాధించదలచిన లక్ష్యం ఏంటంటే… భారతదేశపు ఐకమత్యాన్ని ప్రదర్శించడం, ఉగ్రవాదంలో పాకిస్తాన్ భాగస్వామ్యాన్ని బహిర్గతం చేయడం, భారతదేశ చర్యలకు ప్రపంచ మద్దతును పొందడం. దానికోసం అన్ని రాజకీయ పార్టీలకూ చెందిన ఎంపీలు, మాజీ దౌత్యవేత్తలు 59 మందితో కూడిన బృందాన్ని పంపించడం ద్వారా దేశ ప్రయోజనాల విషయంలో రాజకీయ విభేదాలకు అతీతంగా అందరూ కలిసి ఉంటారనే సందేశాన్ని ప్రపంచానికి ఇస్తోంది.
32 దేశాల వ్యూహాత్మక ఎంపిక:
భారత విదేశాంగ కార్యదర్శి విక్రమ్ మిస్రీ మే 20న పార్లమెంట్ సౌత్ బ్లాక్‌లో, ఏడింట మూడు ప్రతినిధుల బృందాల సభ్యులకు 32 దేశాలు, యూరోపియన్ యూనియన్ ఎంపిక వెనుక కారణాన్ని వివరించారు. విదేశాంగ శాఖ ఎంపిక చేసిన దేశాలలో ఐరాస భద్రతా మండలిలోని శాశ్వత, తాత్కాలిక సభ్య దేశాలు, భవిష్యత్తులో సభ్యత్వం పొందే దేశాలు, ఇంకా ఇతర ప్రభావవంతమైన దేశాలూ ఉన్నాయి. పాకిస్తాన్ భద్రతా మండలి, తదితర అంతర్జాతీయ వేదికల మీద భారత వ్యతిరేక కథనాలను ముందుకు తెస్తుందని భావిస్తున్న సమయంలో, తన దౌత్యపరమైన పరపతిని పెంచుకోవాలనే భారతదేశపు ఉద్దేశ్యాన్ని ఈ వ్యూహాత్మక ఎంపిక ప్రతిబింబిస్తుంది.
ఈ జాబితాలో పనామా, గయానా, గ్రీస్ లాంటి శాశ్వత సభ్యులు కాని దేశాలు మాత్రమే కాకుండా శాశ్వత సభ్యులైన యునైటెడ్ స్టేట్స్, యునైటెడ్ కింగ్‌డమ్, ఫ్రాన్స్, రష్యా, చైనా వంటి ప్రధాన శక్తులు కూడా ఉన్నాయి. రాబోయే నెలల్లో తాత్కాలిక సభ్యులుగా భద్రతా మండలిలో చేరనున్న మరో ఐదు దేశాలు కూడా ఉన్నాయి. ఇంకా…. సౌదీ అరేబియా, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, కతార్, బ్రెజిల్, దక్షిణాఫ్రికా వంటి మిగిలిన దేశాలు వాటి భౌగోళిక రాజకీయ పలుకుబడి, ఆర్థిక ప్రభావం లేదా ప్రాంతీయ ప్రాముఖ్యత కోసం ఎంపిక చేయబడ్డాయి.
ఉదాహరణకు, సౌదీ అరేబియా, కతార్ వంటి మధ్యప్రాచ్య దేశాలు ఇస్లామిక్ ప్రపంచంలో వాటి ప్రభావం కారణంగా కీలకమైనవి. ఆ దేశాల్లో పాకిస్తాన్ తరచుగా ఆర్గనైజేషన్ ఆఫ్ ఇస్లామిక్ కోఆపరేషన్ (OIC) వంటి సంస్థల ద్వారా సానుభూతి సంపాదించేందుకు ప్రయత్నిస్తుంది. అలాగే ఇథియోపియా, దక్షిణాఫ్రికా వంటి ఆఫ్రికన్ దేశాలు గ్లోబల్ సౌత్‌లో నాయకత్వ పాత్రల కోసం ఎంపిక చేయబడ్డాయి. జపాన్, దక్షిణ కొరియా, సింగపూర్ వంటి దేశాలు భారతదేశంతో బలమైన ఆర్థిక, దౌత్య సంబంధాలు కలిగిన కీలకమైన ఆసియా ఖండపు మిత్ర దేశాలు.
జనతాదళ్ (యునైటెడ్) ఎంపీ సంజయ్ ఝా నేతృత్వంలోని గ్రూప్ 3 సభ్యురాలు, బిజెపి ఎంపీ అపరాజిత సారంగి తమ వ్యూహాన్ని మీడియాకు వివరించారు.
“ఈ 32 దేశాలు భద్రతా మండలిలో ప్రస్తుతం సభ్యులుగా ఉన్నవి లేదా చేరబోతున్నవి లేదా ప్రపంచవ్యాప్తంగా గణనీయమైన ప్రభావాన్ని కలిగి ఉన్నవి అని విదేశాంగ కార్యదర్శి వివరించారు” అని ఆమె అన్నారు. “పాకిస్తాన్ గతంలో చేసినట్లుగా, భారతదేశంపై నిరాధారమైన వాదనలను ముందుకు తీసుకురావడానికి నిస్సందేహంగా భద్రతా మండలిలో తన స్థానాన్ని ఉపయోగించుకుంటుంది. ఆపరేషన్ సిందూర్ గురించి సత్యాన్ని తెలియజేయడమే మా ప్రతినిధి బృందాల లక్ష్యం. పాకిస్తాన్ తప్పుగా ఆరోపించినట్లుగా ఆపరేషన్ సిందూర్ పాకిస్తాన్ పౌరుల మీద దాడి కాదు. కచ్చితంగా ఉగ్రవాద వ్యతిరేక చర్య మాత్రమే.”
బిజెపి ఎంపిలు బ్రిజ్ లాల్, ప్రధాన్ బారువా, హేమాంగ్ జోషి, సిపిఐ(ఎం) ఎంపి జాన్ బ్రిట్టాస్, మాజీ మంత్రి సల్మాన్ ఖుర్షీద్, మాజీ రాయబారి మోహన్ కుమార్‌లతో కూడిన సారంగి ప్రతినిధి బృందం మే 22న జపాన్, మే 24న దక్షిణ కొరియా, మే 27న సింగపూర్, మే 28న ఇండోనేషియా, మే 31న మలేషియా దేశాలను సందర్శిస్తుంది.
ఉగ్రవాదానికి వ్యతిరేకంగా సమైక్య సందేశం:
అధికార ఎన్‌డీఏ కూటమి నుంచి 31 మంది ఎంపీలు, ప్రతిపక్ష పార్టీల నుండి 20 మంది ఎంపీలతో కూడిన ఈ బృందాలకు బిజెపి ఎంపిలు బైజయంత్ జే పాండా, రవిశంకర్ ప్రసాద్, కాంగ్రెస్ ఎంపి శశి థరూర్, శివసేనకు చెందిన శ్రీకాంత్ షిండే, డిఎంకెకు చెందిన కనిమొళి, ఎన్‌సిపికి చెందిన సుప్రియా సులే, జెడియుకు చెందిన సంజయ్ ఝా నాయకత్వం వహిస్తున్నారు. ప్రతీ బృందంలోనూ విశ్రాంత దౌత్యవేత్తలు ఉంటారు. వారు భారత సందేశాన్ని చాటడంలో తమ దౌత్య నైపుణ్యాలను ఉపయోగిస్తారు. శశి థరూర్, సల్మాన్ ఖుర్షీద్ వంటి ప్రతిపక్ష నాయకులను చేర్చడం అరుదైన ద్వైపాక్షిక ప్రయత్నాన్ని ప్రతిబింబిస్తుంది. ఆ చర్య 1994లో అటల్ బిహారీ వాజ్‌పేయి నేతృత్వంలోని ప్రతినిధి బృందం ఐక్యరాజ్య సమితి మానవ హక్కుల కమిషన్‌లో పాకిస్తాన్ దుష్ప్రచారాలను ఎదుర్కోవడానికి చేసిన ప్రయత్నాన్ని తలపిస్తోంది.
పహల్గామ్ దాడికి సంబంధించిన వివరణాత్మక పత్రాలు, ఆపరేషన్ సిందూర్ ప్రత్యేకతలు, ఎల్‌ఇటి, జైష్-ఎ-మొహమ్మద్ (జెఇఎం), హిజ్బుల్ ముజాహిదీన్ వంటి ఉగ్రవాద గ్రూపులకు పాకిస్తాన్ మద్దతు ఇస్తున్నట్లు ఆధారాలను విదేశాంగ శాఖ ఈ బృందాల ప్రతినిధులకు అందించింది.
భారత్ చేసిన దాడులు కచ్చితమైనవి, కవ్వింపు చర్యలు కానివి, గురి చూసి కేవలం ఉగ్రవాద స్థావరాల మీద మాత్రమే దాడులు చేసాయి అని విదేశాంగ కార్యదర్శి విక్రమ్ మిస్రీ చెప్పారు. ఉదాహరణకు,
మురీద్కేలోని లష్కర్-ఎ-తయ్యబా స్థావరం మర్కజ్ తయ్యబా, బహావల్‌పూర్‌లోని జైష్-ఎ-మహమ్మద్ స్థావరం మర్కజ్ సుభాన్ అల్లా వంటి ఉగ్రవాద స్థావరాలను మాత్రమే లక్ష్యంగా చేసుకుని “దామాషా ప్రకారం, కచ్చితంగా, ప్రతిచర్యగా చేసేవి మాత్రమే” అని వివరించారు.
తమ పౌరుల ప్రాణనష్టం గురించి పాకిస్తాన్ చేస్తున్న వాదనలను ఆయన తోసిపుచ్చారు. అవి పూర్తిగా కల్పించి చెప్పినవి’ అని వివరించారు. పాకిస్తాన్ చేసే ఏదైనా ప్రతీకార చర్య తీవ్రత… నిర్ణయాత్మక ప్రతిస్పందనను ఎదుర్కోవలసి ఉంటుందని హెచ్చరించారు.
ఈ ప్రతినిధుల లక్ష్యం మూడు విధాలుగా ఉంది: ఆపరేషన్ సిందూర్ ఆవశ్యకత గురించి విదేశీ ప్రభుత్వాలకు వివరించడం, ఉగ్రవాదాన్ని ప్రోత్సహించడంలో పాకిస్తాన్ పాత్రను బహిర్గతం చేయడం, టిఆర్ఎఫ్‌ను ఐక్యరాజ్య సమితి ఉగ్రవాద సంస్థగా గుర్తించేలా చేయడం. ప్రతీ దేశంలోనూ మంత్రులు, ప్రజా ప్రతినిధులు, మేధో వర్గం, పాత్రికేయులతో సంభాషించడం ద్వారా, ప్రపంచ లక్ష్యాన్ని రూపొందించడం, పాకిస్తాన్ కల్పిత ప్రచారాన్ని ఎదుర్కోవడం, ముఖ్యంగా భద్రతా మండలిలో భారత వ్యతిరేక వ్యాఖ్యలు చేయకుండా నిలువరించడమే ప్రతినిధులు తమ లక్ష్యంగా నిర్దేశించుకున్నారు.
ప్రపంచం స్పందనలు – దౌత్య సందర్భం:
ఆపరేషన్ సిందూర్‌కు అంతర్జాతీయ ప్రతిస్పందన మిశ్రమంగా ఉంది కానీ చాలావరకూ, భారతదేశపు ఆత్మరక్షణ హక్కుకు మద్దతు లభిస్తోంది. అమెరికా విదేశాంగ కార్యదర్శి మార్కో రూబియో, భారతదేశపు చర్యలను ఉగ్రవాదానికి ప్రతిస్పందనగా అంగీకరిస్తూనే, ఉద్రిక్తతలను తగ్గించాలని కోరారు.
ఇజ్రాయెల్ మొదటినుంచీ భారత్‌కు పూర్తిస్థాయి మద్దతుదారుగా ఉంది. రాయబారి రూవెన్ అజార్ ఎక్స్ సామాజిక మాధ్యమంలో రాస్తూ “‘హేయమైన నేరాలకు’ వ్యతిరేకంగా భారతదేశపు ఆత్మరక్షణ హక్కుకు ఇజ్రాయెల్ మద్దతు ఇస్తోంది” అని పేర్కొన్నారు. భద్రతా మండలి ప్రస్తుత సభ్యదేశమైన పనామా కూడా భారతదేశపు ఉగ్రవాద నిరోధక ప్రయత్నాలను ఆమోదించింది. యూరోపియన్ యూనియన్ పహల్గామ్ దాడిని ఖండించింది మరియు ఇరు పక్షాలూ సంయమనం పాటించాలని పిలుపునిచ్చింది. పాకిస్తాన్ సన్నిహిత మిత్రదేశమైన చైనా, భారతదేశం మీద జరిగిన దాడులపై “విచారం” వ్యక్తం చేసింది. ఏప్రిల్ 22 దాడిని మాత్రం ఖండించింది.
ఏది ఏమైనా భారత్ పాక్ మధ్య ఉద్రిక్తతలు ఎక్కువగానే ఉన్నాయి. మే 7,8,9 తేదీలలో జమ్మూ, పఠాన్‌కోట్, ఉధంపూర్‌లోని భారత సైనిక స్థావరాలను లక్ష్యంగా చేసుకుని పాకిస్తాన్ డ్రోన్, క్షిపణి దాడులను చేపట్టింది. వాటిని భారత్ సమర్ధంగా అడ్డుకుంది. అయితే ఆ చర్యలు ఇస్లామాబాద్ తన దాడులను తీవ్రతరం చేయాలనే ఉద్దేశంతో ఉందని వెల్లడించాయి. మే 10న కాల్పులను నిలిపివేసారు. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ మధ్యవర్తిత్వం ఘనత తనదే అని చెప్పుకున్నారు. కానీ ఆ విషయాన్ని భారత్ తిరస్కరించింది. తన సైనిక చర్యలే పాకిస్తాన్‌ను వెనక్కి తగ్గేలా చేసాయంది. ఇప్పుడు భారతదేశపు దౌత్య పర్యటనను కాపీ కొట్టి, పాకిస్తాన్ విదేశాంగ మంత్రి బిలావల్ భుట్టో-జర్దారీ కూడా ప్రతిదౌత్య ప్రచారం చేస్తామని ప్రకటించారు. అలా ప్రపంచ వేదికపై కథనాల యుద్ధం మొదలైంది.
సవాళ్ళు – దేశీయ పరిస్థితులు:
భారత్ చేపట్టిన ఈ దౌత్య పర్యటన కార్యక్రమంపై దేశంలోనే వివాదాలు కల్పించారు. కాంగ్రెస్ తన పార్టీ నుంచి ప్రతినిధుల ఎంపికను తప్పు పట్టింది. తాము సిఫార్సు చేసిన నలుగురు ఎంపీలలో ఆనంద్ శర్మ ఒక్కరే ఉన్నారని, శశి థరూర్ వంటి వారు స్వతంత్రంగా ఎంపికయ్యారని పేర్కొంది. జాతీయ భద్రతను బిజెపి రాజకీయం చేస్తోందని కాంగ్రెస్ ఎంపీ జైరాం రమేష్ ఆరోపించారు. అయినా ఆయన “అత్యున్నత జాతి ప్రయోజనాలను” దృష్టిలో ఉంచుకొని ఆ కార్యక్రమంలో కాంగ్రెస్ భాగస్వామి అయిందని ధ్రువీకరించారు.
శశి థరూర్ మాత్రం తన విదేశాంగ నైపుణ్యాన్ని ఉదహరిస్తూ, ఈ కార్యక్రమం రాజకీయాలకు అతీతమైనది అని వాదిస్తూ, తన ఎంపికను సమర్థించుకున్నారు.
ప్రపంచంలో భారత్ ప్రాభవం:
ఈ ప్రతినిధులు మే 23 నుండి తమ పది రోజుల మిషన్‌ను ప్రారంభించడం, భారత దౌత్య కార్యాచరణలో నిర్ణయాత్మక ఘట్టంగా నిలుస్తుంది. ద్వైపాక్షిక ఫ్రంట్‌ను సమీకరించడం ద్వారా, భద్రతా మండలి సభ్యుల ప్రభావాన్ని ఉపయోగించడం ద్వారా, కీలకమైన ప్రపంచ ప్రతినిధులను లక్ష్యంగా చేసుకోవడం ద్వారా, భారతదేశం ఉగ్రవాదంపై పోరు గురించి కథనాన్ని (నెరేటివ్) పునర్‌నిర్వచించింది, అదే సమయంలో పాకిస్తాన్‌ను దౌత్యపరంగా ఒంటరిగా చేయడం లక్ష్యంగా పెట్టుకుంది. పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి కిరెన్ రిజిజు ఎక్స్ మాధ్యమంలో వివరించినట్లు, ఈ ప్రచారం “రాజకీయాలకు అతీతంగా జాతీయ ఐక్యతకు శక్తివంతమైన ప్రతిబింబం”.
ఏప్రిల్ విషాదం నుండి ఇంకా కోలుకోలేని పహల్గామ్ నివాసులకు, 140 కోట్ల భారతీయ పౌరులను రక్షించాలని దృఢనిశ్చయంతో ఉన్న దేశానికి, ఆపరేషన్ సిందూర్, దాని తదనంతరం దౌత్యపరమైన పరిణామాలూ భారతదేశం కొత్త సంకల్ప యుగానికి నాంది పలుకుతాయి. ఎంపీ సారంగి చెప్పినట్లుగా, “భారతదేశం ఉగ్రవాదానికి వ్యతిరేకంగా ఐక్యంగా ఉంది. ప్రపంచానికి మా సందేశం స్పష్టంగా ఉంది: మా ప్రజలను రక్షించడానికి మేము నిర్ణయాత్మకంగా వ్యవహరిస్తాము.” ఇక్కడ సందేశం స్పష్టంగా ఉంది…. ఉగ్రవాదంపై పోరాడడానికి, ప్రపంచ వేదికపై తన సరైన స్థానాన్ని దక్కించుకోవడానికి భారతదేశం చేసుకున్న సంకల్పపు బరువును ఆ ప్రతినిధి బృందం తన భుజస్కంధాల మీద మోస్తోంది.