మావోయిస్టు విముక్త భారతదేశం అనే లక్ష్యాన్ని సాధించే క్రమంలో దేశం పెద్ద మైలురాయిని అధిగమించింది. కేంద్ర హోంమంత్రి అమిత్ షా చేసిన ప్రతిజ్ఞను నెరవేర్చే క్రమంలో భద్రతా బలగాలు గొప్ప ముందడుగు వేయగలిగాయి. మే 21న అబూజమాఢ్ వద్ద చేసిన ఎన్‌కౌంటర్‌లో మావోయిస్టు సంస్థ ప్రధాన కార్యదర్శి నంబాల కేశవరావు అలియాస్ బసవరాజును మట్టుపెట్టాయి.
గత కొన్నేళ్ళుగా బస్తర్ అటవీ ప్రాంతాలకు పరిమితమై, అంతకంతకూ వెనుకడుగులు వేస్తున్న మావోయిస్టు సంస్థకు ఆ పరిణామం చావుదెబ్బ అని చెప్పవచ్చు. ప్రాథమిక నివేదికలను బట్టి, సిపిఐ మావోయిస్టు సంస్థ సుప్రీం కమాండర్‌ను తుదముట్టించేందుకు చేపట్టిన ఆపరేషన్‌ను… పక్కా ప్రణాళిక ప్రకారం, వ్యూహాన్ని అద్భుతంగా అమలు చేయడం ద్వారా… విజయవంతం చేయగలిగారు.
ఛత్తీస్‌గఢ్ పోలీసులు, ఇతర నిఘా సంస్థల నుంచి పొందిన కీలక నిఘా సమాచారం ఆధారంగా ఆ ఆపరేషన్ ప్రారంభించారు. దాని కోసం వివిధ జిల్లాలకు చెందిన డిస్ట్రిక్ట్ రిజర్వ్ గార్డ్స్ దళాల నుంచి పోలీసులను ఎంచుకుని ప్రత్యేకమైన యూనిట్ ఏర్పాటు చేసారు. కచ్చితమైన ప్రణాళికతో ఆ యూనిట్ తమ ఆపరేషన్‌ను అమలు చేసింది. నిషిద్ధ సిపిఐ మావోయిస్టు సంస్థకు చెందిన అత్యంత భయంకరుడైన నాయకుడు, పార్టీ ప్రధాన కార్యదర్శి అయిన నంబాల కేశవరావు అలియాస్ బసవరాజు సహా మొత్తం 27మంది మావోయిస్టులను మట్టుపెట్టడం ద్వారా భద్రతా బలగాలు కీలకమైన విజయాన్ని సాధించాయి.
‘‘భద్రతా బలగాలు ఈ ఆపరేషన్‌ను చాలా వ్యూహాత్మకంగా. సిపిఐ మావోయిస్టు ప్రధాన కార్యదర్శి నంబాల కేశవరావు అలియాస్ బసవరాజును మట్టుపెట్టగలిగాయి. భద్రతా బలగాలకు ఇది గొప్ప విజయం. ఆ ప్రాంతంలో ఇకపై సాధారణ పరిస్థితులు నెలకొంటాయి, శాంతి సాధ్యమవుతుంది. నక్సలిజాన్ని తుడిచిపెట్టడం సాధ్యమేనని దేశ ప్రజలు ఆశించవచ్చు’’ అని బస్తర్ ఐజీ పి సుందర్ రాజ్ చెప్పారు.
నారాయణపూర్ జిల్లా అబూజమాఢ్‌లో ఎన్‌కౌంటర్ జరిగిన స్థలంలో సిపిఐ మావోయిస్టు కార్యదర్శి నంబాల కేశవరావు అలియాస్ బసవరాజు సహా మొత్తం 27 మంది మావోయిస్టుల మృతదేహాలూ లభించాయి. సంఘటనా స్థలం దగ్గర ఆయుధాలు, మందుగుండు సామగ్రి కూడా దొరికాయి. ఎన్‌కౌంటర్‌లో తుదముట్టించిన సిపిఐ (మావోయిస్టు) ప్రధాన కార్యదర్శి నంబాల కేశవరావు అలియాస్ బసవరాజు గత 40-45 ఏళ్ళుగా నక్సల్ కార్యకలాపాల్లో క్రియాశీలంగా ఉన్నాడు. అతను 200కు పైగా నక్సల్ దాడుల్లో పాల్గొన్నాడు’’ అని ఐజీ వివరించారు.
ఛత్తీస్‌గఢ్‌లోని బిజాపూర్, తెలంగాణ సరిహద్దుల్లోని కర్రెగుట్టల్లో మావోయిస్టులను ఏరిపారేయరడానికి ‘ఆపరేషన్ బ్లాక్ ఫారెస్ట్’ పేరిట ఒకపక్క ఆపరేషన్ జరుగుతున్న సమయంలోనే అబూజమాఢ్‌లో భద్రతా బలగాలు ఈ ఆపరేషన్ చేపట్టడం విశేషం.
వేలాది మంది భద్రతా బలగాలు పాల్గొంటూ మూడు వారాలుగా జరుగుతున్న ఆపరేషన్ ఘనమైన విజయాన్ని సాధించిందనే చెప్పవచ్చు. భద్రతా బలగాలు 200కు పైగా మావోయిస్టుల రహస్య స్థావరాలను కనుగొని, వాటిని ధ్వంసం చేయగలిగాయి. ఆయుధాల తయారీలో ఉన్న మావోయిస్టు టెక్నికల్ యూనిట్స్‌ను తుడిచిపెట్టివేసాయి.
ఈ ఆపరేషన్‌లో పాల్గొన్న భద్రతా బలగాలు వేర్వేరు ఎన్‌కౌంటర్లలో 31మంది మావోయిస్టులను మట్టుపెట్టడంలో విజయం సాధించాయి. హతులైన మావోయిస్టులు కూడా ఆషామాషీ వారు కాదు. సిఆర్‌సి కంపెనీ, పిఎల్‌జిఎ బెటాలియన్ నెంబర్ 1 వంటి దళాలను భారత ప్రభుత్వపు భద్రతా దళాలు తుడిచి పెట్టేసాయి.
వరుసగా ఒకదాని వెనుక సాగుతున్న ఆపరేషన్లుతో బస్తర్, దాని చుట్టుపక్కల ప్రాంతాల్లో మావోయిస్టుల బలమైన స్థావరాలు కొన్నాళ్ళుగా ఒకటొకటిగా మావోయిస్టుల చేయి జారిపోతూ వచ్చాయి. దాన్నిబట్టి స్పష్టమైనది ఏంటంటే భద్రతా బలగాలు మావోయిస్టుల మీద తమ పోరాటంలో ఆఖరి దశకు చేరుకున్నాయి. దశాబ్దాల తరబడిన ఘర్షణకు గిరిజనుల హృదయ స్థానం లాంటి అబూజమాఢ్‌లో ముగింపు పలకడం తథ్యం.
మావోయిస్టు అర్బన్ నెట్‌వర్క్, దాని హ్యాండ్లర్స్:
క్షేత్రస్థాయిలో సాయుధ మావోయిస్టు చొరబాటు ప్రయత్నాలు ఆగిపోయాయి. దాంతో ఒక కీలకమైన ప్రశ్న తలెత్తుతుంది. మావోయిస్టుల విప్లవం అనే సోకాల్డ్ లక్ష్యాన్ని సాధించడం కోసం సాయుధ దళాలతో కలిసి పోరాడుతూ వచ్చిన ఆ గ్రూపు అర్బన్ నెట్‌వర్క్ పరిస్థితి ఇకపై ఏమవుతుంది?
2007లో మావోయిస్టు అగ్ర నాయకుల నుంచి చేజిక్కించుకున్న డాక్యుమెంట్లు స్పష్టం చేసే విషయం ఏంటంటే ఆ నిషిద్ధ సంస్థ వివిధ రాష్ట్రాల్లోని సానుభూతిపరులైన పలువురు వ్యక్తులతో, వేర్వేరు పేర్లతో చెలామణీ అవుతుండే వివిధ సంస్థలతో నెట్‌వర్క్ ఏర్పాటు చేసుకుంది. దాన్నే యునైటెడ్ నెట్‌వర్క్ అంటారు. అది మావోయిస్టుల లక్ష్యాల కోసం నగర ప్రాంతాల్లో పని చేస్తుంది.
నగర ప్రాంతాల్లో వర్గ పోరును ముమ్మరం చేయడం కోసం ఒక రాజకీయ పార్టీని, ఒక యునైటెడ్ ఫ్రంట్‌ను, సాయుధులైన కొందరు ప్రజలను ఏర్పాటు చేసుకోవాలి. అలా, ప్రజాపోరుకు (పీపుల్స్‌వార్) నగరవాసుల నుంచి మద్దతును కూడగట్టాలి అనే మావోయిస్టు ప్రణాళిక పైన చెప్పిన డాక్యుమెంట్ల ద్వారా వెల్లడైంది.
అలా నగర ప్రాంతాల్లో ప్రత్యక్షంగా నివసిస్తూ మావోయిజం కోసం పని చేసే వారు, ఇతర మావోయిస్టు సానుభూతిపరులను సామాన్యంగా ‘అర్బన్ నక్సల్స్’ అని వ్యవహరిస్తారు. ఈ అర్బన్ నక్సల్స్, మావోయిస్టుల హింసాకాండను ప్రజల మేలు కోసం చేస్తున్న చర్యలుగా చిత్రీకరించి, వారిమీద సానుభూతి పెంచే ప్రయత్నాలు చేస్తుంటారు. మావోయిస్టులకు సాధారణంగా సైద్ధాంతిక మద్దతుగా నిలుస్తుంటారు. వారికి రవాణా సమకూరుస్తూంటారు, అవసరమైనప్పుడు న్యాయసహాయం అందజేస్తుంటారు.
నిఘా సంస్థల దర్యాప్తులో తేలిన విషయం ప్రకారం అలాంటి అర్బన్ నక్సలైట్లు దేశంలోని ప్రధాన నగరాల్లో పెద్ద సంఖ్యలోనే ఉన్నారు. అలాంటి వ్యక్తులు, గ్రూపులూ సమాజంలో హింసాత్మక ఉద్యమాలను లేవనెత్తుతున్నారు, ప్రజల మధ్య విద్వేష భావనలు రేకెత్తిస్తున్నారు. తద్వారా సమాజంలో అశాంతి, అరాచకం ప్రబలేలా చేయడమే వారి దీర్ఘకాలిక లక్ష్యం.
ఈ అర్బన్ నక్సల్స్ అరాచకాలకు మన కళ్ళముందరి ఉదాహరణ… కొంతకాలం క్రితం మహారాష్ట్రలో ‘ఎల్గార్ పరిషత్’ సమావేశం తర్వాత భీమా-కోరేగావ్ దగ్గర జరిగిన హింసాకాండ. విప్లవం సాధించాలి అనే లక్ష్యం కోసం ఈ అర్బన్ నెట్‌వర్క్ మావోయిస్టులకు మద్దతుగా ఎలా పనిచేస్తుంది అన్న విషయాలు భద్రతా దళాల దర్యాప్తులో బైటపడ్డాయి.
అగ్నివీర్ పథకానికి వ్యతిరేకంగా హింసాత్మక అల్లర్లు జరిగిన సంగతి గుర్తుంది కదా… ఆ అల్లర్ల వెనుక ఉన్నది కూడా ఈ నిషిద్ధ మావోయిస్టు సంస్థ సానుభూతిపరులు, కార్యకర్తలు, బహిరంగ క్షేత్రంలో పనిచేసే వారూ అయిన అర్బన్ నక్సలైట్లే అని నిఘా విభాగాలు కనుగొన్నాయి.
బస్తర్‌లో మావోయిస్టులకు వ్యతిరేకంగా చేపట్టిన చొరబాటు వ్యతిరేక ఆపరేషన్లను వ్యతిరేకించినది కూడా ఇలాంటి ఫ్రంటల్ గ్రూపులే అని సిపిఐ (మావోయిస్టు) గ్రూప్‌కు సంబంధించిన కేసుల దర్యాప్తులో ఎన్ఐఏ కనుగొంది.
ఈ అర్బన్ నక్సల్స్ ఆచరణను గమనిస్తే… అటవీ ప్రాంతాలు, మారుమూల ప్రదేశాల్లో భద్రతా బలగాలు, మావోయిస్టులూ తలబడినప్పుడు మావోయిస్టులకు గణనీయమైన నష్టం వాటిల్లి, వాళ్ళు తమ ప్రాబల్య స్థావరాలను వదిలిపెట్టి వెనక్కు వెళ్ళిపోవలసిన పరిస్థితులు తలెత్తినప్పుడే ఈ అర్బన్ నక్సల్స్ క్రియాశీలం అయిపోతారు.
నగర ప్రాంతాల్లో మావోయిస్టుల అజెండాను వ్యాపింపజేసేందుకు ఈ వ్యక్తులూ, సంస్థలూ మావోయిస్టు గ్రూపు తరఫున యువతను రిక్రూట్ చేసుకునే పనులు కూడా చేపడతారని భద్రతా బలగాలు వెల్లడించాయి.
అటవీ ప్రాంతాల్లోనూ, మారుమూల ప్రదేశాల్లోనూ నక్కి ఉండే సాయుధ దళాలను నిర్వీర్యం చేసినంత మాత్రాన, ఆ వెంటనే మావోయిస్ట్ గ్రూప్‌కి చెందిన ఈ ‘అర్బన్ నక్సల్స్’ అనబడే నెట్‌వర్క్ కుప్పకూలిపోదు. ప్రభుత్వం ఒక టైం పెట్టుకుని సాయుధ పోరాటాన్ని ఆ గడువులోగా నిర్మూలించడంలో విజయవంతం అయినా ఈ అర్బన్ నక్సల్స్‌ను మాత్రం తుడిచిపెట్టడం సాధ్యం కాదు.
బస్తర్, దాని చుట్టుపక్కల ప్రాంతాల లోనుంచి సాయుధ పోరాటకారులను తుడిచిపెట్టేస్తున్న ఈ కీలక సమయం… భారతదేశ ప్రజాస్వామిక వ్యవస్థ భద్రతకు పెనుసవాల్ విసిరే మావోయిస్టుల నగర ప్రాంతాల నెట్‌వర్క్‌తో సంబంధాలున్న గ్రూపులు, వ్యక్తులు… ఒక్క మాటలో చెప్పాలంటే అర్బన్ నక్సల్స్‌ను నిఘా సంస్థలు నిశితంగా పరిశీలిస్తూ ఉండాల్సిన తరుణమిది.