కొత్తగా రేషన్ కార్డు కోసం దరఖాస్తు చేసుకునే దంపతులకు వివాహ ధ్రువపత్రం అవసరం లేదని పౌర సరఫరాల మంత్రి నాదెండ్ల మనోహర్ స్పష్టం చేశారు. రేషన్ కార్డులు దరఖాస్తు చేసుకున్న 21 రోజుల్లో పరిష్కరిస్తామన్నారు. కొత్త రేషన్ కార్డుకు మ్యారేజీ సర్టిఫికెట్ తప్పనిసరి అంటూ జరుగుతున్న ప్రచారంలో నిజం లేదన్నారు. పెళ్లి కార్డు, పెళ్లి ఫోటోలతో కూడా పనిలేదని చెప్పారు. సచివాలయ సిబ్బంది తప్పులు జరగకుండా చూసుకోవాలని ఆదేశించారు.
జూన్ నెలలో 4.24 కోట్ల మందికి ఉచితంగా కొత్త రేషన్ కార్డులు జారీ చేస్తామని మంత్రి ప్రకటించారు. దీనికి సంబంధించిన పూర్తి సమాచారం తమ వద్ద ఉందన్నారు. సామాన్యులకు సాంకేతికత అందుబాటులోకి తీసుకురావడంలో ప్రభుత్వం ముందు ఉంటుందని మంత్రి మనోహర్ చెప్పారు. వయసుతో సంబంధం లేకుండా రేషన్ కార్డులో కుటుంబ సభ్యులు ఎవరైనా కొత్తగా పేరు చేర్పించుకోవచ్చన్నారు. పేర్లు తొలగింపునకు మరణించిన వారి జాబితాకే అనుమతిస్తున్నట్లు చెప్పారు. కార్డులో హెడ్ ఆఫ్ ద ఫ్యామిలీ మార్పునకు అవకాశం కల్పిస్తున్నామన్నారు.
పేర్లు తప్పుగా నమోదైన వాటిని సరిచేసుకోవడం, చిరునామా మార్చుకునేందుకు అవకాశం కల్పించినట్లు మంత్రి నాదెండ్ల చెప్పారు. తహసీల్దార్ స్థాయిలోనే రేషన్ కార్డులకు సంబంధించిన అన్ని సమస్యలు పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు.