మే 21న ఛత్తీస్‌గఢ్ నారాయణపూర్ జిల్లా అబూజమాఢ్‌లో భారత భద్రతా బలగాలు ఘనవిజయం సాధించాయి. ఓర్ఛా దగ్గర దట్టమైన అటవీ ప్రాంతంలో 27మంది మావోయిస్టులను మట్టుపెట్టగలిగాయి. 50 గంటలకు పైగా జరిగిన ఆపరేషన్‌లో సిపిఐ మావోయిస్టు ప్రధాన కార్యదర్శి నంబాల కేశవరావు అలియాస్ బసవరాజును (71) తుదముట్టించగలిగారు.
చీమలు కూడా చొరబడలేని అబూజమాఢ్ నిన్నమొన్నటివరకూ రెడ్ టెర్రర్‌కు కేరాఫ్ అడ్రస్. ఇప్పుడు భారత ప్రభుత్వం అక్కడ కూడా సునిశితమైన దాడులు చేయగలిగింది. పిన్ పాయింట్ ఆపరేషన్స్‌తో వర్గ శత్రువును నిర్మూలించగలిగింది. మావోయిస్టుల మీద పోరాటంలో ఇదొక గొప్ప విజయం. అందుకే కేంద్ర హోంమంత్రి అమిత్ షా, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ స్పందించారు. ‘‘ఛత్తీస్‌గఢ్‌లోని నారాయణపూర్‌లో మన భద్రతా బలగాలు 27మంది భయంకరమైన మావోయిస్టులను మట్టుపెట్టాయి. వారిలో సిపిఐ మావోయిస్టు ప్రధాన కార్యదర్శి, అగ్రశ్రేణి నాయకుడు, నక్సల్ ఉద్యమానికి వెన్నెముక అయిన నంబాల కేశవరావు అలియాస్ బసవరాజు కూడా ఉన్నాడు’’ అని అమిత్ షా ట్వీట్ చేసారు. నక్సలిజం మీద భారత ప్రభుత్వపు మూడు దశాబ్దాల పోరాటంలో మొదటిసారి ప్రధాన కార్యదర్శి స్థాయి నాయకుణ్ణి మన బలగాలు తుదముట్టించగలిగాయి. ఆ ఘన విజయానికి ధైర్యవంతులైన మన భద్రతా బలగాలను, భద్రతా సంస్థలనూ అభినందిస్తున్నాను అంటూ ప్రశంసించారు. 2026 మార్చి 31 కంటె ముందు నక్సలిజాన్ని తుడిచిపెట్టివేయాలన్న నిర్ణయానికి కట్టుబడి ఉన్నామని పునరుద్ఘాటించారు.
ఎవరీ నంబాల కేశవరావు అలియాస్ బసవరాజు?
ఆంధ్రప్రదేశ్ శ్రీకాకుళం జిల్లాకు చెందిన బసవరాజు చాలాకాలం నుంచీ మన దేశంలో మావోయిస్టు బీభత్సకాండకు నాయకుడు. బసవరాజు చిన్నవయసులోనే మావోయిస్టు ఉద్యమంలో చేరాడు. అప్పట్లో సిపిఐ-ఎంఎల్ (పీపుల్స్ వార్ గ్రూప్) విద్యార్థి విభాగంలో పనిచేసేవాడు. కాలక్రమంలో దాని సాయుధ విభాగంలో చేరాడు. అవిభక్త ఆంధ్రప్రదేశ్‌లో తూర్పుగోదావరి, విశాఖపట్నం జిల్లాల్లో మావోయిస్టు ఉద్యమం తన అడుగుజాడలను విస్తరించడం వెనుక బసవరాజు కృషి ఎంతో ఉంది.
విశ్వసనీయ సమాచారం ప్రకారం బసవరాజు 80వ దశకంలో బస్తర్ అడవుల్లో మావోయిస్టులకు తమిళ ఉగ్రవాద సంస్థ లిబరేషన్ తమిళ్ టైగర్స్ ఈలం (ఎల్‌టీటీఈ) క్యాడర్లు ఇచ్చిన శిక్షణ పొందాడు. 1992లో సిపిఐ-ఎంఎల్ (పిడబ్ల్యుజి)లో అత్యంత శక్తివంతమైన కేంద్ర కమిటీలోకి బసవరాజును తీసుకున్నారు.
2004లో సిపిఐ-ఎంఎల్ (పిడబ్ల్యుజి), మావోయిస్ట్ కమ్యూనిస్ట్ సెంటర్ ఆఫ్ ఇండియా (ఎంసిసిఐ) విలీనమై సిపిఐ (మావోయిస్టు) అనే గ్రూపుగా ఏర్పడ్డాయి. ఆ కొత్త గ్రూపు సెంట్రల్ మిలటరీ కమిషన్‌కు అధినేతగా బసవరాజు ఎంపికయ్యాడు.
2018లో నిషిద్ధ సిపిఐ (మావోయిస్టు) గ్రూపు ప్రధాన కార్యదర్శి బాధ్యతల నుంచి ‘గణపతి’ రాజీనామా చేసాక, ఆ పదవిని బసవరాజు స్వీకరించాడు. అప్పటినుంచీ సిపిఐ (మావోయిస్టు) సుప్రీం లీడర్‌గా వ్యవహరిస్తున్నాడు. పలు రాష్ట్రాలతో పాటు ఎన్ఐఏ మోస్ట్‌వాంటెడ్ జాబితాలో అగ్రస్థానంలో ఉన్నాడు. అతని తల మీద రూ.1.5కోట్ల బహుమానం ప్రకటించారు.
మావోయిస్టుల భారీ దాడుల వ్యూహకర్త:
సిపిఐ మావోయిస్ట్ గ్రూప్ సెంట్రల్ మిలటరీ కమిషన్ అధినేతగా, అనంతర కాలంలో ఆ సంస్థకు ప్రధాన కార్యదర్శిగా ఉన్న బసవరాజే, ఆ గ్రూపు చేసిన భారీ దాడుల వ్యూహకర్త అని తెలుస్తోంది. 2010లో దంతెవాడలో 76మంది భద్రతా బలగాలను హతమార్చిన ఏంబుష్, 2013లో జీరం దగ్గర పలువురు రాజకీయ నాయకుల హత్య సహా ఎన్నో దాడులకు వ్యూహాలను సమకూర్చింది బసవరాజే అని సమాచారం.
సిపిఐ (మావోయిస్ట్) సాయుధ విభాగమైన పిఎల్‌జిఎ క్యాడర్లు బసవరాజును నిరంతరం రక్షిస్తూ ఉండేవారు. గత కొంతకాలంగా మావోయిస్టుల ఏరివేతకు భద్రతా బలగాలు తీవ్రంగా ప్రయత్నిస్తున్నందున, వారి దృష్టిని మరల్చేందుకు బసవరాజు చుట్టూ ఉండే రక్షణ వలయాన్ని తగ్గించారని సమాచారం.
భద్రతా బలగాలు నంబాల కేశవరావు అలియాస్ బసవరాజును మట్టుపెట్టడం మావోయిస్టు సంస్థకు చావుదెబ్బ. ఇటీవల కాలంలో వరుసగా పెద్దపెద్ద నాయకులు అరెస్ట్ అవుతుండడం, భద్రతా బలగాలు పెద్దసంఖ్యలో మావోయిస్టులను పట్టుకొంటుండడం లేదా మట్టుపెడుతుండడంతో మావోయిస్టు సంస్థకు నాయకత్వ లేమి పెద్ద సమస్యగా మారింది. అలాంటి తరుణంలో ఏకంగా పార్టీ ప్రధాన కార్యదర్శినే కోల్పోవడం సిపిఐ మావోయిస్టు ఉనికికే ముప్పుగా మారింది. నంబాల కేశవరావు అలియాస్ బసవరాజు మరణంతో వామపక్ష హింసావాద సంస్థ ఇప్పుడు మనుగడ కోసం పోరాటం చేయాల్సిన స్థితికి జారుకుందని చెప్పవచ్చు.