అగ్రరాజ్యం అమెరికా ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన ఖండాంతర అణు క్షిపణి మినిట్ మ్యాన్ 3ని పరీక్షించింది.అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ గొల్డెన్ డోమ్ గురించి ప్రకటన చేసిన మరుసటి రోజు అణు క్షిపణి పరీక్షలు చర్చకు తెరలేపాయి. కాలిఫోర్నియాలోని వాన్డెన్ బెర్గ్ స్పేస్ బేస్‌లో ఈ పరీక్షలు నిర్వహించారు.
అణు క్షిపణి గంటకు 15 వేల మైళ్ల వేగంతో, 4200 కి.మీ ప్రయాణించింది. మార్షల్ ఐల్యాండ్స్‌లోని స్పేస్ అండ్ మిస్సైల్ డిఫెన్స్ కమాండ్ కేంద్రానికి చేరింది.ఈ పరీక్షలను అమెరికా ధ్రువీకరించింది. అమెరికా గ్లోబల్ స్ట్రైక్ కమాండ్ జనరల్ థామస్ బుస్సెరీ ఈ పరీక్షలు విజయవంతమైనట్లు ప్రకటించారు. ఐసీబీఎం పరీక్ష అమెరికా సన్నద్ధతను , శక్తిని ప్రపంచానికి చాటిందని ఆయన పేర్కొన్నారు. ప్రపంచ వ్యాప్తంగా చోటుచేసుకుంటోన్న పరిణామాలకు ఈ అణు క్షిపణి పరీక్షకు సంబంధం లేదన్నారు.
గతంలో కూడా అమెరికా మినిట్ మ్యాన్ 3ని పరీక్షించింది. ఇందులో రీ ఎంట్రీ వెహికల్ ఉంటుంది. ఇది అణు బాంబును మోసుకెళుతుంది. ట్రంప్ రెండో సారి అమెరికా అధ్యక్షుడు అయ్యే ముందు కూడా ఈ క్షిపణి ప్రయోగించారు. అమెరికా వాయుసేన ఈ క్షిపణిని అత్యంత నమ్మకమైనదిగా భావిస్తోంది.
అమెరికా అధ్యక్షుడు తాజాగా గోల్డెన్ డోమ్ ప్రాజెక్టు చేపడుతున్నట్లు ప్రకటించారు. రూ.15 లక్ష కోట్ల విలువైన ఈ ప్రాజెక్టు ద్వారా అంతరిక్షంలో ఆయుధాలు మోహరించే వీలవుతుంది. అమెరికా నిర్ణయంపై రష్యా, చైనా తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశాయి.