ఏపీ క్యాబినెట్ కీలక నిర్ణయం తీసుకుంది. సీఎం చంద్రబాబునాయుడు అధ్యక్షతన వెలగపూడి సచివాలయంలో ఉదయం 11 గంటలకు సమావేశమైన క్యాబినెట్ పలు అంశాలపై సుదీర్ఘ చర్చ జరిపింది. రైతుల సమస్యలపై అధికారులు ముఖ్యమంత్రికి వివరించారు. వచ్చే ఏడాది దిగుబడులు గణనీయంగా పెరుగుతాయని అధికారులు సీఎం దృష్టికి తీసుకువచ్చారు.అంతర్జాతీయ పరిణామాలతో రైతులు పండించిన పంటల
ధరలు తగ్గాయని అధికారులు వివరించారు. అంతర్జాతీయంగా నెలకొన్న అనిశ్చితి పరిస్థితుల వల్ల ఆక్వా, పొగాకు, మిర్చి, చెరకు, మామిడి పంటల ధరలు తగ్గాయని అధికారులు సీఎంకు వివరించారు.
రైతులను ఆదుకునేందుకు ప్రభుత్వం సిద్దంగా ఉందని సీఎం చంద్రబాబునాయుడు ప్రకటించారు.గిట్టుబాటు ధరలు, దిగుబడులు, నిత్యావసరాల ధరలపై అధ్యయనం చేసేందుకు ఆరుగురు మంత్రులతో క్యాబినెట్ సబ్ కమిటీని ఏర్పాటు చేశారు.రైతులకు గిట్టుబాటు ధరలు దక్కేందుకు తీసుకోవాల్సిన చర్యలపై మంత్రి వర్గ ఉపసంఘం పలు సూచనలు చేయనుంది.
క్యాబినెట్ సమావేశంలో వ్యవసాయం, రైతులకు గిట్టుబాటు ధరలపై 45 నిమిషాల సుదీర్ఘ చర్చ జరిగింది. రైతులకు గిట్టుబాటు ధర కల్పించడం, వ్యవసాయరంగానికి మద్దతుగా మార్కెటింగ్ సదుపాయాలు కల్పించడంపై చర్చ సాగింది. రైతులకు మేలు కలిగేలా క్షేత్ర స్థాయిలో ఫలితాలు వచ్చేలా ప్రభుత్వ చర్యలు ఉంటాయని సీఎం చంద్రబాబునాయుడు చెప్పారు.