మొదటి భాగం ఇక్కడ చూడండి
రెండవ భాగం ఇక్కడ చూడండి
చివరి, మూడవ భాగం చదవండి
హెచ్ఆర్‌సిపి నివేదిక, పాకిస్తాన్‌లో ప్రత్యేకించి సింధ్ ప్రొవిన్స్‌లో నుంచి హిందువులు పారిపోతుండడంలో ఇస్లామిక్ అతివాదుల పాత్రను కూడా ప్రముఖంగా ప్రస్తావించింది. మచ్చుకి, ఘోట్కీలో మియా అబ్దుల్ హక్ అలియాస్ మితూ అనేవాడు, ఆ నగరంలో బలవంతపు మతమార్పిడులు చేయడం, చిన్నచిన్న హిందూ అమ్మాయిలను ఎత్తుకుపోయి వారికి ముస్లిములతో పెళ్ళిళ్ళు చేయడం వంటి దుర్మార్గాలు చేయడంలో దిట్ట. ‘‘అదే సమయంలో, హిందూ అబ్బాయిలకు సంబంధించి అలాంటి కేసులు ఒక్కటైనా నమోదు కాకపోవడం, ఈ మతమార్పిడుల చట్టబద్ధత మీద అనుమానాలు కలిగిస్తోంది’’ అని ఆ నివేదిక వెల్లడించింది. పాకిస్తాన్ న్యాయ వ్యవస్థలోని ఆందోళనకరమైన అంశాల గురించి ఆ విధంగా హెచ్‌ఆర్‌సిపి నివేదిక ప్రస్తావించింది.
బలవంతపు మతమార్పిడులు, దైవదూషణ ఆరోపణలు:
సింధ్ ప్రాంతంలో హిందూ మైనర్ అమ్మాయిలను ఎత్తుకుపోవడం, ఇస్లాంలోకి నయానో భయానో మతం మార్చడం, ఎత్తుకుపోయినవారే ఆ అమ్మాయిలను పెళ్ళి చేసేసుకోవడం అనేది ఒక క్రమపద్ధతిలో జరిగిపోతున్నాయని నివేదిక స్పష్టం చేసింది. రీనా, రవీనా అనే అమ్మాయిలకు సంబంధించిన కేసులో ఇస్లామాబాద్ హైకోర్టు, ఆ అమ్మాయిల తల్లిదండ్రుల ఆవేదనను విస్మరించి, వారిని ఎత్తుకుపోయిన వారికే అనుకూలంగా తీర్పునిచ్చిందని హెచ్ఆర్‌సిపి వెల్లడించింది. 2013లో సింధ్ చైల్డ్ మ్యారేజ్ రిస్ట్రెయింట్ యాక్ట్ అమల్లోకి వచ్చింది. దాని ప్రకారం అమ్మాయి వివాహ వయస్సు కనీసం18 ఏళ్ళు. అయితే దాని అమలు మాత్రం సవ్యంగా జరగడం లేదు. పంజాబ్ ప్రొవిన్స్‌లోని లోయర్ మ్యారేజ్ ఏజ్ చట్టాలను దుండగులు తమకు అనుకూలంగా వాడుకుంటున్నారని నిర్ధారణ అయింది.
దైవదూషణ ఆరోపణలు సాధారణంగా ఉండవు. కొన్ని సందర్భాల్లో మాత్రం వ్యక్తిగత ద్వేషాల కారణంగా ఆ ఆరోపణలు చేస్తారు. ఆ కారణంగా కూడా సింధ్ ప్రొవిన్స్ నుంచి హిందువులు పారిపోయారు. అలాంటి ఆరోపణల వల్ల భయాందోళనలు, అనుమానాలతో కూడిన వాతావరణం తయారవుతుందని నివేదిక స్పష్టం చేసింది. దానికి ఒక ఉదాహరణ, ఘోట్కీలోని ఒక హిందూ పంచాయతీ నాయకుడు, ఇలా చెప్పాడు. గ్రామంలోని ఇద్దరు వ్యక్తుల మీద దైవదూషణ, దైవద్రోహం ఆరోపణలు వచ్చాయి. దాంతో వారు భారతదేశానికి పారిపోయారని ఆ నివేదిక చెప్పింది.
వలసలకు ఆర్థిక, పర్యావరణ కారణాలు:
సింధీ హిందువులు ఎదుర్కొంటున్న సవాళ్ళకు… నిరుద్యోగం, ద్రవ్యోల్బణం వంటి ఆర్థిక సమస్యలు కూడా తోడయ్యాయి. హెచ్ఆర్‌సిపి నివేదిక ఇలా చెబుతోంది. హిందూ వ్యాపారవేత్తలను ముస్లిం వ్యాపార భాగస్వాములు వేధిస్తూ ఉంటారు. అప్పులు తీసుకుని తిరిగి చెల్లించరు. మరోవైపు స్థానిక అధికారులు విద్యుత్ బిల్లుల వంటి వాటిని హిందువులకు పెంచి వేస్తుంటారు. ఇంక వాతావరణ పరిస్థితులు కూడా హిందువులకు వ్యతిరేకమే. అతి వేడిమి వ్యవసాయ ఉత్పాదకతను గణనీయంగా తగ్గించివేస్తుంది. చాలావరకూ హిందువులకు అదే జీవనాధారం. అలాంటి ప్రజలు ఇప్పుడు కరాచీ లాంటి నగర ప్రాంతాలకు, లేదా భారత్ లాంటి పెద్ద దేశాలకూ వలస పోతున్నారు.
భారతదేశపు పౌర సవరణ చట్టం – సింధీ హిందువులకు జీవనరేఖ:
భారతదేశం 2019లో పౌరసత్వ సవరణ చట్టాన్ని రూపొందించింది. దాన్ని 2024లో అమల్లోకి తీసుకొచ్చింది. ఆ చట్టం, పాకిస్తానీ హిందువులకు భారతదేశంలో భద్రతను, పౌరసత్వాన్నీ పొందే మంచి అవకాశం కల్పించింది. గత ఐదేళ్ళలో ఒక్క సింధ్ ప్రొవిన్స్ నుంచే సుమారు 2వేల మంది హిందూ శరణార్థులు భారత్‌కు వలస వెళ్ళి అక్కడ పౌరసత్వం సాధించుకున్నారు. ఇంకా 1200మంది హిందువుల దరఖాస్తులు మాత్రం పెండింగ్‌లో ఉన్నాయి. ప్రత్యేకించి, మధ్యప్రదేశ్‌లో ఎక్కువమంది శరణార్థులకు పౌరసత్వం ఇచ్చాం’’ అని ఆ నివేదిక స్పష్టం చేసింది.
ప్రపంచ కార్యాచరణకు ప్రయత్నం:
జెఎస్ఎఫ్ఎం ప్రకటన, హెచ్ఆర్‌సిపి కనుగొన్న విషయాలను బట్టి విషయ తీవ్రత అర్ధమవుతోంది. పాకిస్తాన్‌ను ఉగ్రవాద కేంద్రంగానూ, ఊచకోతల స్థావరంగానూ ఆ నివేదికలు తేటతెల్లం చేసాయి. అలాంటి సమయంలో, పాకిస్తాన్‌లో ఉగ్రవాదుల స్థావరాలను ధ్వంసం చేయాల్సిన అవసరం ఉందనీ, అణగారిన దేశాల స్వీయ నిర్ణయాత్మక ప్రకటనకు మద్దతు ఇవ్వాలనీ సహితో విజ్ఞప్తి చేసారు. ‘‘పాకిస్తాన్ ప్రేరేపిత ఉగ్రవాదంపై పోరులో భారత్ మాకు మార్గదర్శనం చేసినందుకు, నాయకత్వం వహించినందుకు, ధైర్యం చూపించినందుకూ ధన్యవాదాలు’’ అని చెప్పారు. పాకిస్తాన్ విధానాలను నైతిక స్పష్టతతోనూ, వ్యూహాత్మక కార్యాచరణతోనూ ఎదుర్కొనాలని ఆయన ప్రపంచ శక్తులను కోరారు.