పాకిస్తాన్, పాక్ ఆక్రమిత కశ్మీర్‌లలోని ఉగ్రవాద స్థావరాలను తుడిచిపెట్టడమే లక్ష్యంగా భారతదేశం చేపట్టిన ‘ఆపరేషన్ సిందూర్’ వ్యూహాత్మకంగా ఓ అద్భుతం. పాకిస్తాన్‌లో ఏ మూల ఉన్న ఉగ్రవాద స్థావరాన్నయినా తుడిచిపెట్టేయగల సత్తా భారత్ సొంతం అని ఈ ఆపరేషన్ స్పష్టం చేసింది. అందులో మరింత విశేషంగా, దేశీయంగా తయారు చేసిన అత్యాధునిక వ్యవస్థలు జాతీయ రక్షణ అవసరాలకు అత్యద్భుతంగా సరిపోయిన తీరు గురించి గొప్పగా చెప్పుకోవలసిందే. డ్రోన్లతో యుద్ధం, బహుళ అంచెల గగనతల రక్షణ, ఎలక్ట్రానిక్ వార్‌ఫేర్… ఇలా ప్రతీ అంచెలోనూ… మిలటరీ ఆపరేషన్స్‌లో భారతదేశం సాంకేతికంగా ఆత్మనిర్భరత (స్వయం సమృద్ధి) సాధించడంలో మైలురాయిని అందుకుందని ఈ ఆపరేషన్ సిందూర్ నిరూపించింది.
శత్రువులు చేసే మోసపూరితమైన యుద్ధ పద్ధతిలో సైనిక బలగాలతో పాటు నిరాయుధులైన సామాన్య ప్రజలు సైతం పలుమార్లు హతమారి పోతుంటారు. ఏప్రిల్ 22న పహల్‌గామ్‌లో పాకిస్తానీ ముస్లిం ఉగ్రవాదులు అమాయకులైన పర్యాటకులను అత్యంత పాశవికంగా కాల్చి చంపేయడం మన కళ్ళ ముందు జరిగిన ఘోరం. అలాంటి మోసపూరితమైన దాడులను ఎదుర్కొనేందుకు భారత సైన్యం చాలా కచ్చితంగా లెక్క కట్టి చేసిన ప్రయోగమే ఆపరేషన్ సిందూర్.
ఉగ్రవాదుల నీచమైన దాడికి భారతదేశం చాలా సావధానంగా, బాగా ఆలోచించి, అత్యంత కచ్చితంగా, పకడ్బందీ వ్యూహంతో ప్రతిస్పందించింది. వాస్తవాధీన రేఖనో, అంతర్జాతీయ సరిహద్దునో దాటకుండానే భారతీయ బలగాలు ఉగ్రవాద స్థావరాలను ధ్వంసం చేసాయి, ఎన్నో ముప్పులను తొలగించివేసాయి. ఆ క్రమంలో ఉగ్రవాద స్థావరాలపై దాడులు చేయడానికి భారతదేశం ఉపయోగించిన వ్యవస్థలు చాలావరకూ దేశీయంగా అభివృద్ధి చేసినవి కావడవం విశేషం. గత దశాబ్ద కాలంలో జాతీయవాద ప్రభుత్వం దేశ రక్షణకు అమిత ప్రాధాన్యతనిచ్చింది. ప్రతిపక్షాలు రచ్చ చేస్తున్నా, రక్షణ వ్యవస్థలను బలోపేతం చేయడానికి భారీగా పెట్టుబడులు పెట్టింది. ఆ వ్యయమే ఇవాళ ఆపరేషన్ సిందూర్ అమలులో ఎంతో అక్కరకు వచ్చింది. మచ్చుకి చెప్పుకోవాలంటే… మే 9, 10 మధ్య రాత్రి భారతదేశపు వైమానిక స్థావరాల మీద, లాజిస్టిక్స్ ఇన్‌స్టలేషన్స్ మీదా పాకిస్తాన్ వైమానిక దళం చేసిన దాడులను అడ్డుకుని నిర్వీర్యం చేసినది ఈ బహుళ అంచెల రక్షణ వ్యవస్థే.
శత్రువు చేసిన దాడుల ప్రభావం భారతదేశ వ్యాప్తంగా ఉన్న పౌర జనజీవన మౌలిక సదుపాయాలు, రక్షణ స్థావరాల మీద ఏమాత్రం పడకుండా కాపాడడంలో ఈ బహుళ అంచెల రక్షణ వ్యవస్థ కీలక పాత్ర పోషించిందని భారత ప్రభుత్వమే స్వయంగా ప్రకటించింది.
భారతదేశాన్ని గగన తలం నుంచి నిరంతరం పర్యవేక్షిస్తూ మన భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ ఇస్రో చేసిన సేవలు వెలకట్టలేనివి అని భారత ప్రభుత్వం కొనియాడింది. ఇస్రో సమకూర్చిన ఉపగ్రహ సాంకేతికత, డ్రోన్ టెక్నాలజీ లేకుండా దేశాన్ని, ప్రత్యేకించి దేశపు ఉత్తర భాగాన్ని గమనించడం సాధ్యమయ్యే పనే కాదు.
ఇస్రో ఛైర్మన్ వి నారాయణన్ మే 11న మాట్లాడుతూ, దేశ ప్రజల భద్రత, రక్షణ అవసరాలను తీర్చడం కోసం వ్యూహాలను చాకచక్యంగా అమలు చేయడం కోసం కనీసం 10 ఉపగ్రహాలు నిరంతరాయంగా పని చేస్తున్నాయని వివరించారు.
భారతదేశం పూర్తిస్థాయి స్వదేశీ తయారీ అయిన, భూమ్యుపరితలం నుంచి గగనతలంలోకి (సర్ఫేస్ టు ఎయిర్ – ఎస్ఎఎం) క్షిపణి ‘ఆకాశ్’ ప్రచండమైన ఫలితాలనిచ్చింది. ఆకాశ్ వ్యవస్థ ఒకేసారి పలు లక్ష్యాలను ఒక గుంపుగానూ లేదా దేనికి దాన్నే ఛేదించగలదు.
ఆపరేషన్ సిందూర్‌లో భాగంగా భారత్ చేసిన దాడుల్లో ఎక్కడా భారతీయ ఆస్తులకు ఎలాంటి నష్టమూ వాటిల్లలేదు. అలాగే ప్రత్యర్ధులు చేసిన దాడులను సైతం నేల మీదకు రాకుండా దాదాపు ఎక్కడికక్కడే నిర్వీర్యం చేయగలిగాయి. భారతదేశపు నిఘా, ప్రణాళిక, అమలు విభాగాల నిరంతర అప్రమత్తత వల్లనే అది సాధ్యమయిందని భారత ప్రభుత్వం స్పష్టం చేసింది. దీర్ఘ శ్రేణి డ్రోన్‌ల నుంచి గైడెడ్ మ్యూనిషన్స్ వరకూ అత్యాధునికమైన స్వదేశీ టెక్నాలజీ వినియోగం ఈ దాడులను అత్యంత ప్రభావశీలంగా పూర్తి చేయగలిగింది.
నిజానికి భారతదేశపు వైమానిక బలగాలు పాకిస్తాన్ ఉపయోగించిన చైనా తయారీ గగనతల రక్షణ వ్యవస్థలను అధిగమించి, వాటిని జామ్ చేసాయి. కేవలం 23 నిమిషాల్లోనే మొత్తం ఆపరేషన్‌ను పూర్తి చేయగలిగాయి. శత్రుదేశం కంటె భారతదేశానికి సాంకేతికత పరంగా ఉన్న ఆధిక్యతను ప్రదర్శించాయి.
డ్రోన్ శక్తి – వేగంగా ఎదుగుతున్న స్వదేశీ పరిశ్రమ:
డ్రోన్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా (డిఎఫ్ఐ) అనేది అత్యున్నత స్థాయి పరిశ్రమ. అందులో 550కి పైగా డ్రోన్ కంపెనీలు, 5500 మందికి పైగా డ్రోన్ పైలట్లు ఉన్నాయి. 2030 నాటికల్లా భారతదేశాన్ని ప్రపంచ డ్రోన్ల కేంద్రస్థానంగా తీర్చిదిద్దాలి అనేది డిఎఫ్ఐ దార్శనికత. భారతీయమైన డ్రోన్లు, కౌంటర్-డ్రోన్ సాంకేతికతల డిజైనింగ్, అభివృద్ధి, ఉత్పత్తి, అనుసరణ, ఎగుమతులను డిఎఫ్ఐ ప్రమోట్ చేస్తుంది. డ్రోన్ రంగంలో సులభతర వాణిజ్య విధానాన్ని అవలంబించడం, డ్రోన్ టెక్నాలజీలను అందిపుచ్చుకోవడం, భారత్ డ్రోన్ మహోత్సవ్ వంటి పలు కార్యక్రమాలను నిర్వహించడం వంటి విధులను డిఎఫ్ఐ నిర్వర్తిస్తోంది.
గగనతల రక్షణ – టెక్నాలజీయే మొదటి రక్షణ వరస:
మే 7, 8 మధ్య రాత్రి భారతదేశపు ఉత్తర, పశ్చిమ భాగాల్లో అవంతీపురా, శ్రీనగర్, జమ్మూ, పఠాన్‌కోట్, అమృత్‌సర్, కపుర్తలా, జలంధర్, లూధియానా, ఆదంపూర్, భటిండా, చండీగఢ్, నాల్, ఫలోడీ, ఉత్తర్లాయ్, భుజ్ వంటి ప్రాంతాల్లోని మిలటరీ లక్ష్యాల మీద డ్రోన్లు, క్షిపణులతో దాడులు చేసింది.
పాకిస్తాన్ చేసిన ఆ దాడులను భారతదేశం సమీకృత మానవరహిత గగనతల వ్యవస్థల సమూహం (ఇంటిగ్రేటెడ్ కౌంటర్ అన్‌మ్యాన్డ్ ఏరియల్ సిస్టమ్స్ గ్రిడ్), గగనతల రక్షణ వ్యవస్థలతో (ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్స్) తిప్పికొట్టింది. మే 8 ఉదయం పాకిస్తాన్‌లోని పలు ప్రాంతాల్లోని ఎయిర్ డిఫెన్స్ రాడార్లు, ఇతర వ్యవస్థల మీద భారత్ లక్షిత దాడులు చేసింది. లాహోర్‌లోని ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్‌ను ధ్వంసం చేసింది కూడా.
ఆపరేషన్ సిందూర్‌లో పెచోరా, ఒఎస్ఎ-ఎకె, లో లెవెల్ ఎయిర్ డిఫెన్స్ గన్స్ వంటి యుద్ధాలకు పనికొచ్చే ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్స్‌ను… స్వదేశీ తయారీ ఆకాశ్ సిస్టమ్ వంటి వాటినీ వాడడం సాధ్యమైంది. ఆకాశ్ అద్భుతమైన ప్రదర్శనను చూసి భారత రక్షణ రంగ నిపుణుల సంతోషానికి అవధే లేదు.
భారతదేశపు గగనతల రక్షణ వ్యవస్థలు (ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్స్) ప్రధానంగా ఎయిర్‌ఫోర్స్‌కు సంబంధించిన, దానితో పాటే ఆర్మీ, నేవీలకు చెందిన వ్యవస్థలను కలిపి అనూహ్యమైన, అద్భుతమైన సంయుక్త శక్తిని ప్రదర్శించాయి. ఆ వ్యవస్థలు అన్నీ కలిసి, దుర్భేద్యమైన గోడ కట్టాయి. దాన్ని ఛేదించడానికి పాకిస్తాన్ ఎన్నో ప్రయత్నాలు చేసినా, వాటన్నింటినీ తిప్పి కొట్టాయి.
అత్యంత కచ్చితత్వంతో చేసిన దాడులు:
భారతదేశపు అఫెన్సివ్ స్ట్రైక్స్ పాకిస్తాన్‌లోని కీలకమైన ఎయిర్ బేస్‌లు నూర్ ఖాన్, రహీమ్‌యార్ ఖాన్‌లను అత్యంత కచ్చితత్వంతో లక్ష్యంగా చేసుకున్నాయి. విధ్వంసకర ప్రభావం కోసం లాయిటరింగ్ మ్యూనిషన్స్‌ను ఉపయోగించారు. అత్యున్నతమైన లక్ష్యాలను ఒక్కొక్క దాన్నీ గుర్తించడం, ధ్వంసం చేయడం.. అదొక్కటే పని. చివరికిశత్రువుకు చెందిన రాడార్, క్షిపణి వ్యవస్థలు కూడా ధ్వంసం అయిపోయాయి.
లాయిటరింగ్ మ్యూనిషన్స్‌నే ‘ఆత్మాహుతి డ్రోన్‌లు’ లేక ‘కామికాజ్ డ్రోన్‌లు’ అని కూడా పిలుస్తారు. ఆ ఆయుధ వ్యవస్థలు నిర్దిష్టమైన నిర్ణీత లక్ష్యం పైన ఎగురుతూ, వాటి చుట్టూ సున్నా చుట్టి ఆ లక్ష్యాన్ని సరిగ్గా గుర్తించి మరీ దాడి చేస్తాయి. ముందుగా సరైన లక్ష్యాన్ని గుర్తించి, దాన్ని మార్కింగ్ చేసుకోవడం ఈ డ్రోన్ వ్యవస్థల ప్రత్యేకత.