కేంద్రం ప్రతిపాదించిన డీలిమిటేషన్ ప్రక్రియను వ్యతిరేకిస్తున్నామని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వెల్లడించారు. జనాభా ఆధారంగా చేపట్టే డీలిమిటేషన్‌ను దక్షిణాది రాష్ట్రాలు ఒప్పుకోవు. అలా చేస్తే దక్షిణాది రాష్ట్రాలకు తీవ్ర నష్టం వాటిల్లుతుంది. ఉత్తర భారతదేశం దక్షిణాదిని రెండోతరగతి పౌరులుగా మార్చేస్తారని ఆరోపించారు. ఉత్తరాది రాష్ట్రాల ఆధిపత్యాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ ఆమోదించబోమన్నారు.
తమిళనాడులోని అధికార డీఎంకే పార్టీ కేంద్రప్రభుత్వానికి వ్యతిరేకంగా నిర్వహించిన అఖిల పక్ష సమావేశానికి రేవంత్ రెడ్డి హాజరయ్యారు. ఆ సందర్భంగా మాట్లాడుతూ కేంద్రానికి రూపాయి చెల్లిస్తే వెనక్కి తిరిగి తెలంగాణకు వస్తున్నది 42పైసలు మాత్రమే అన్నారు. తమిళనాడుకు 26 పైసలు, కర్ణాటకకు 16 పైసలు, కేరళకు 49 పైసలు వస్తున్నాయన్నారు. అదే సమయంలో బిహార్‌కు 6 రూపాయల 6 పైసలు, ఉత్తరప్రదేశ్‌కు 2 రూపాయల 3 పైసలు, మధ్యప్రదేశ్‌కు 1రూపాయి 73 పైసలు వెనక్కు వస్తున్నాయన్నారు.
లోక్‌సభ సీట్లు పెంచకుండా రాష్ట్రాల్లో అంతర్గతంగా డీలిమిటేషన్ చేయాలని రేవంత్ రెడ్డి సూచించారు. దక్షిణాది రాష్ట్రాలపై ఉత్తరాది రాష్ట్రాల పెత్తనాన్ని అంగీకరించబోమన్నారు. జనాభా ఆధారంగా చేసే పునర్విభజనను ఆమోదించకూడదని నిర్ణయం తీసుకున్నామని రేవంత్ రెడ్డి చెప్పుకొచ్చారు.
భారత్‌పై యుద్ధానికి 130 అణుబాంబులు సిద్దం : పాక్ మంత్రి ప్రేలాపనలు