ఉగాది ఉత్సవాలకు శ్రీగిరి ముస్తాబైంది. శ్రీభ్రమరాంబ మల్లికార్జున స్వామి క్షేత్రమైన శ్రీశైలంలో ఈ నెల 27 నుంచి 31 వరకు ఉగాది మహోత్సవాలు నిర్వహించనున్నారు. ఈ విషయాన్ని దేవస్థానం ఈవో శ్రీనివాసరావు తెలిపారు. ఉత్సవాల ఏర్పాట్లపై సమీక్ష అధికారులతో సమీక్ష నిర్వహించిన ఈవో శ్రీనివాసరావు… ఉగాదికి కర్నాటకతో పాటు మహారాష్ట్ర తదితర ప్రాంతాల నుంచి పెద్ద సంఖ్యలో భక్తులు వస్తారని అందుకు తగ్గుట్టుగా సౌకర్యాలు ఉండాలన్నారు.
ఉత్సవాలు 27న మొదలైనా మార్చి 20 నుంచే క్షేత్రానికి భక్తుల తాకిడి పెరుగుతుందని వివరించారు. మార్చి ఒకటిన నిర్వహించిన సమావేశంలో తీసుకున్న నిర్ణయాల మేరకు మార్చి 20లోపు అన్ని పనులు పూర్తికావాల్సిందేనని స్పష్టం చేశారు. స్వామి అమ్మవార్లకు నిర్వహించే కైంకర్యాలన్నీ ఎలాంటి లోటుపాట్లు లేకుండా పరిపూర్ణంగా నిర్వహించాలని వైదిక సిబ్బందికి సూచించారు.
ఉత్సవ పూజాధికాలన్నీ సమయానికే ప్రారంభించాలని స్పష్టం చేశారు. దాదాపు 12 లక్షల లడ్డూ ప్రసాదాలను అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలని సంబంధిత విభాగ అధికారులను ఆదేశించారు.