అమరావతి రాజధాని పునర్మిర్మాణ పనులకు రంగం సిద్దమైంది. 2019లో వైసీపీ అధికారంలోకి రాగానే రాజధాని పనులను అటకెక్కించింది. 2024లో కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే మరలా టెండర్లు పిలిచారు. సీఆర్డీయే, అమరావతి రాజధాని అభివృద్ధి సంస్థ జనవరిలో టెండర్లు పిలిచాయి. ఎమ్మెల్సీ ఎన్నికల కారణంగా వాటిని తెరవలేకపోయారు. తాజాగా టెండర్లను ఫైనల్ చేస్తున్నారు. రెండు రోజుల్లో అమరావతి నిర్మాణ పనులను అట్టహాసంగా ప్రారంభించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. పాత డిజైన్లలో ఎలాంటి మార్పులు ఉండవని పురపాలక మంత్రి నారాయణ స్పష్టం చేశారు. అమరావతి రాజధానికి ప్రపంచ బ్యాంకు హడ్కో దశల వారీగా రూ.31 వేల కోట్లు ఇచ్చేందుకు అంగీకరించాయి. దీంతో నిధుల సమస్య తీరింది.
అమరావతి రాజధానిలో 90 పనులు చేయాలని నిర్ణయించారు. ఇందులో 73 పనులకు ఆమోదం లభించింది. రూ.40 వేల కోట్ల విలువైన 62 టెండర్లు పిలిచారు.బిడ్లు పరిశీలించి ఏజన్సీలను ఖరారు చేశారు. సోమవారం సీఎం చంద్రబాబునాయుడు అధ్యక్షతన జరిగే సీఆర్డీయే సమావేశంలో టెండర్లు అప్పగించనున్నారు.
నాలుగు పనులు చేసేందుకు ఎవరూ ముందుకు రాలేదు. జీవో, ఎన్జీవో క్వార్టర్ల పనులు చేసేందుకు టెండర్లు పడలేదు. వీటికి మరలా టెండర్లు పిలవాల్సి ఉంది. ఇప్పటి వరకు 8 టెండర్లు తెరిచారు.అమరావతి రాజధానికి రైతులు ఇచ్చిన ఫ్లాట్లలో రోడ్ల అభివృద్ధికి 5వ తేదీన టెండర్లు ముగిశాయి. 7న బంగ్లాల నిర్మాణ టెండర్లు ముగిశాయి. వాటిని ఖరారు చేయాల్సి ఉంది. ఐకానిక్ టవర్ల నిర్మాణ పటిష్టతను మరోసారి పరిశీలించిన తరవాత టెండర్లు పిలవాలని నిర్ణయించారు.
అమరావతి రాజధానిలో అంతర్జాతీయ స్థాయిలో గ్రీన్ఫీల్డ్ ఎయిర్పోర్టు నిర్మాణానికి ప్రభుత్వం సిద్ధమైంది. ఇందుకు అవసరమైన ప్రణాళికలు సిద్దం చేసేందుకు నోటిఫికేషన్ విడుదల చేశారు. సాధాసాధ్యాలను పరిశీలించి నివేదిక ఇచ్చేందుకు ఓ ప్రైవేటు సంస్థకు పనులు అప్పగించారు. సమగ్ర నివేదిక అందిన తరవాత గ్రీన్ఫీల్డ్ విమానాశ్రయం నిర్మాణ పనులు ప్రారంభిస్తారు. విజయవాడ సమీపంలో గన్నవరం ఎయిర్పోర్టు ఉన్నా, రాజధానికి అనుకూలంగా లేదనే అభిప్రాయం ఉంది. అమరావతి రాజధానిలో విమానాశ్రయం అందుబాటులో ఉంటే ప్రపంచ వ్యాప్తంగా కనెక్టివిటీ పెరిగి, పెట్టుబడులు వస్తాయని అంచనా వేస్తున్నారు.
అమరావతి రాజధాని పనులు రెండు రోజుల్లో ప్రారంభించేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు పురపాలక మంత్రి నారాయణ స్పష్టం చేశారు. పనులు ప్రారంభించిన 36 నెలల్లో రాజధాని పూర్తి చేస్తామని మంత్రి హామీ ఇచ్చారు. ప్రజల వద్ద నుంచి వసూలు చేసిన పన్నులు ఒక్క రూపాయి కూడా అమరావతి రాజధాని నిర్మాణానికి ఖర్చు చేయడం లేదని తెలిపారు. సెల్ఫ్ సస్టెయినబుల్ ప్రాజెక్టుగా అమరావతి రాజధాని నిర్మిస్తున్నట్లు ఆయన ప్రకటించారు.
అమరావతి రాజధానికి 29 గ్రామాల రైతులు 34 వేల ఎకరాల భూములను ఇచ్చారు. రైతులకు రిటర్నబుల్ ఫ్లాట్లు ఇచ్చిన తరవాత ప్రభుత్వం వద్ద మిగిలిన 14 వేల ఎకరాలతోపాటు, ప్రభుత్వ భూములు మరో 18 వేల ఎకరాలు అందుబాటులో ఉన్నాయి. ప్రభుత్వ భవనాలు, పార్కులు, రోడ్లు నిర్మాణం చేయడంతోపాటు, పెట్టుబడులు పెట్టే సంస్థలకు భూములను ధర నిర్ణయించి కేటాయిస్తున్నారు. భూములు కేటాయించిన మూడు సంవత్సరాల్లో పనులు పూర్తి చేసి కార్యకలాపాలు ప్రారంభించాల్సి ఉంది.
అమరావతి రాజధానితోపాటు అవుటర్ రింగు రోడ్డును ( Amaravati outerringroad) రూ.25000 కోట్లతో నిర్మించడానికి ప్రభుత్వం ఏర్పాట్లు చేసింది. ఇప్పటికే అలైన్మెంట్కు తుది రూపు ఇచ్చారు. ఐదు జిల్లాల్లో 3200 ఎకరాల భూమి సేకరించేందుకు ఐదుగురు సబ్ కలెక్టర్లను ప్రభుత్వం నియమించింది. వారు రాబోయే 6 మాసాల్లో 121 గ్రామాల్లో సభలు నిర్వహించి, భూ సేకరణకు నోటిఫికేషన్ విడుదల చేయనున్నారు. మొత్తం కేంద్రం నిధులతో అమరావతి అవుటర్రింగు రోడ్డు నిర్మించనున్నారు. ఇందుకు కేంద్రం సుముఖత వ్యక్తం చేసింది. వచ్చే ఏడాది మార్చి నుంచి నిర్మాణ పనులు ప్రారంభం కానున్నాయి.
అమరాతి రాజధానిలో పేదల కోసం 4 వేల ఇళ్లు నిర్మించేందుకు ప్రభుత్వం సిద్దమైంది. ఇప్పటికే నిర్మించిన హడ్కో ఇళ్లతోపాటు, అర్హులైన పేదలకు ప్రభుత్వం ఇళ్లు నిర్మించి ఇవ్వనుంది. ప్రభుత్వం గ్రామీణ ప్రాంతాల్లో 3 సెంట్లు, పట్టణ ప్రాంతాల్లో 2 సెంట్లు ఇవ్వడంతోపాటు, ఇంటి నిర్మాణానికి రూ.4 లక్షల ఆర్ధిక సాయం ప్రకటించింది. రాజధాని గ్రామాల్లో కూలీలు, నిరుపేదలకు ఉచితంగా ఇంటి నిర్మాణం చేసి ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది.