సమగ్ర విచారణకు ప్రభుత్వం ఆదేశం
నిజానిజాలు తేల్చేందుకు సిట్
దివంగత సీఎం వైఎస్సార్ సోదరుడు, మాజీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి చినాన్న వైఎస్ వివేకానందరెడ్డి హత్యకేసు క్రైమ్ థిల్లర్ వెబ్ సిరీస్ కు ఏమాత్రం తీసిపోవడం లేదు. ఓ మాజీ మంత్రి ప్రాణాలు పోయి ఏళ్ళు గడుస్తున్నా కేసు విచారణ ఓ కొలిక్కి రాకపోగా మరిన్ని మలుపులు తిరగడంపై పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. సిట్, సీబీఐ విచారణ సమాంతరంగా జరుగుతున్నా రోజరోజుకూ మరింత సంక్షిష్ఠంగా మారుతోంది. చిక్కుముడి వీడుతుంది అనుకునేలోపు మరో కొత్త కోణం అంటూ ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.
ఇప్పటికే ఈ విషయమై వైఎస్ కుటుంబలో విభేదాలు పొడసూపాయి. వైఎస్ రక్తసంబంధీకులు రెండుగా విడిపోయారు. మాజీ సీఎం జగన్ , కడప ఎంపీ అవినాశ్ రెడ్డి, వారి రక్తసంబంధీకులు ఓ గ్రూపుగా, వివేకానందరెడ్డి కుమార్తె సునీతారెడ్డి, వైఎస్సార్ ముద్దల తనయ షర్మిల, ఇతర వైఎస్ కుటుంబ సభ్యులు మరో వర్గంగా చీలిపోయారు.
నిందితులుగా ఆరోపణలు ఎదుర్కొంటున్న వారిలో కొంతమంది అప్రూవర్ లు గా మారారు. అలాగే సాక్షులుగా ఉన్నవారు ఒక్కొక్కరుగా మరణించడంపై అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. దానిపై ఏపీ పాలకవర్గం సహా పలువురు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. చనిపోయిన సాక్షులు, అప్రూవర్లు, నిందితులు తీవ్రమైన అనారోగ్య సమస్యలతోనో, వయోభారంతోనే బాధపడిన వారు కాదని కొందరు వాదిస్తున్నారు. అనుమానాస్పద మరణాలుగా భావించి నిజానిజాలు తేల్చాలని విచారణా సంస్థలను కోరుతున్నారు.
ఈ కేసులో సీబీఐ విచారణాధికారిగా ఉన్న వ్యక్తిపైనే గతంలో పోలీసు కేసు నమోదైంది. అలాగే వైఎస్ వివేకా కుమార్తె పైనా పలువురు ఆరోపణలు చేశారు. వివేకానందరెడ్డి మతాంతర వివాహం చేసుకున్నాడని
ఆస్తి గొడవలు ఉన్నాయని కూడా మీడియాలో వార్తలొచ్చాయి.
అయితే తాజాగా ఈ కేసులో కీలక సాక్షిగా ఉన్న వాచ్ మెన్ రంగన్న చనిపోవడం తీవ్ర చర్చనీయాంశమైంది. వివేకానందరెడ్డి హత్య కేసులో సాక్షులుగా ఉన్న శ్రీనివాసరెడ్డి, గంగాధర రెడ్డి, అభిషేక్ రెడ్డి, వాచ్మెన్ రంగన్న, డ్రైవర్ నారాయణ యాదవ్ చనిపోయారు. అయితే వీరంతా అనుమానాస్పద రితీలో చనిపోయారని దానిపై విచారణ చేపట్టాలని పలువురు కోరుతున్నారు.
దీనిపై స్పందించిన వైఎస్సార్ జిల్లా ఎస్సీ అశోక్ కుమార్… అన్ని విషయాలపై సమగ్ర దర్యప్తు చేస్తామని తెలిపారు. సిట్ ఏర్పాటు చేసి నిజానిజాలు తేలుస్తామన్నారు. ప్రత్యేక దర్యప్తు కమిటీలో ఇద్దరు డీఎస్పీలు, ముగ్గురు సీఐలు, ఇద్దరు ఎస్సైలు, పది మంది కానిస్టేబుళ్ళు ఉంటారని తెలిపారు.
దస్తగిరికి వస్తున్న బెదిరింపులపై కూడా విచారణ జరుపుతామన్నారు. భద్రత కోరితే విచారణ జరిపి పోలీసు శాఖ తరఫున అవసరమైన చర్యలు తీసుకుంటామన్నారు. వివేకానంద రెడ్డి హత్యకేసులో 2019 నుంచి ఇప్పటి వరకు ఆరుగురు చనిపోయారు.
చనిపోయింది ఎవరంటే…?
వివేకానందరెడ్డి అంత్యక్రియల్లో పాల్గొనేందుకు వచ్చిన జగన్ మోహన్ రెడ్డి, ఆయన సతీమణి భారతిలను హైదరాబాద్ నుంచి కారులో పులివెందులకు తీసుకొచ్చిన డ్రైవర్ ఆదినారాయణ 2019 డిసెంబర్ లో మరణించారు.
వాంగ్మూలంతో కేసును కీలక మలుపుతిప్పిన వాచ్మెన్ రంగన్న , 65 ఏళ్ళ వయస్సులో ఈ ఏడాది మార్చి 5న అనుమానాస్పద రీతిలో చనిపోయారు. సాక్షిగా ఉన్న 40 ఏళ్ళ కల్లూరి గంగాధర్ రెడ్డి , 2022 జూన్ లో చనిపోయారు. అనారోగ్యంతో చనిపోయినట్లు అప్పట్లో ప్రచారం జరిగింది.
అనుమానితుడిగా ఉన్న కటికరెడ్డి శ్రీనివాసులరెడ్డి (57)2019 సెప్టెంబర్ 3న చనిపోయారు.ఆయన గుళికలు తిని ఆత్మహత్య చేసుకున్నట్లుగా కేసు నమోదైంది.
డాక్టర్ వైఎస్ అభిషేక్ రెడ్డి (36) ఇటీవలే అనారోగ్యంతో చనిపోయారు.ఈయన వివేకా హత్య కేసు సాక్షుల్లో కీలక వ్యక్తిగా ఉండేవారు. ఈ ఏడాది జనవరి 10న అనారోగ్యంతో చనిపోయాడు.
వైఎస్ భారతి తండ్రి , జగన్ మోహన్ రెడ్డి మామ అయిన ఈసీ గంగిరెడ్డి , 73 ఏళ్ళ వయస్సులో 2020లో చనిపోయారు.
వివేకానందరెడ్డి హత్య కేసు విచారణ జరుగుతుండగానే సాక్షులు, అనుమానితులు, నిందితులుగా ఉన్న వారు అనుమానాస్పదంగా మృతిచెందడంపై ఏపీ హోంమంత్రి అనిత స్పందించారు. దీనిపై కేబినెట్ లో చర్చించామన్నారు. సమగ్ర దర్యాప్తుకు ఆదేశించినట్లు వెల్లడించారు. రంగన్న పోస్ట్ మార్టం తర్వాత అన్ని విషయాలు తెలుస్తాయన్నారు. రంగన్న మృతదేహానికి రీ పోస్టుమార్టం నిర్వహించారు.
పరిటాల రవి హత్య కేసులో సాక్షులు కూడా ఇదే తరహాలో అనుమానాస్పదంగా చనిపోవడాన్ని సీఎం చంద్రబాబు కేబినెట్లో ప్రస్తావించినట్లు సమాచారం. వివేకా హత్యకేసు సాక్షులు అనుమానాస్పదంగా మరణించడంపై డీజీపీ హరికుమార్ గుప్తాను వివరణ కోరడంతో పాటు పూర్తి స్థాయి విచారణ కు ప్రభుత్వం ఆదేశించింది.