దిగుమతులపై సుంకాలు తగ్గించేందుకు భారత్ సుముఖంగా ఉందంటూ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించారు. అమెరికా దిగుమతులపై భారత్ 110 శాతం సుంకాలు విధిస్తోందని భారీగా తగ్గించాల్సి ఉందన్నారు. ఇటీవల ప్రధాని మోదీతో జరిపిన చర్చల్లో సుంకాలు తగ్గించేందుకు అంగీకరించినట్లు ట్రంప్ చెప్పారు. అయితే ఒకేసారి భారీగా తగ్గించేందుకు భారత్ సుముఖత వ్యక్తం చేయలేదు. కొంత సమయం కోరినట్లు వార్తలు వస్తున్నాయి.
టెస్లా కార్ల దిగుమతులపై భారత్ 110 శాతం సుంకాలు విధిస్తోందని మస్క్ వెల్లడించారు. అమెరికా దిగుమతులపై భారత్ సుంకాలు తగ్గించడంతోపాటు, రష్యా నుంచి ఆయుధాలు కొనుగోళ్లు ఆపి అమెరికా నుంచి అత్యాధునిక ఆయుధాలు కొనుగోలు చేయాలని ట్రంప్ సూచించారు.
అమెరికా అధ్యక్షుడిగా ట్రంప్ రెండోసారి ప్రమాణ స్వీకారం చేసిన తరవాత కెనడా, బ్రెజిల్, చైనా, మెక్సికో దేశాల దిగుమతులపై సుంకాలను 25 శాతం పెంచారు. దీనికి ప్రతిగా ఆయా దేశాలు కూడా అమెరికా దిగుమతులపై సుంకాలను భారీగా పెంచాయి. దీంతో వాణిజ్య యుద్ధం మొదలైంది.
అమెరికా డాలరుకు పోటీగా బ్రిక్స్ దేశాలు ఉమ్మడి కరెన్సీని తీసుకువస్తే తీవ్ర చర్యలుంటాయని ట్రంప్ హెచ్చరికలు జారీ చేశారు. ఇటీవల రష్యాలో సమావేశమైన బ్రిక్స్ దేశాధినేతలు అమెరికా డాలరుకు ప్రత్యామ్నాయ డిజిటల్ కరెన్సీని తీసుకురావాలని చర్చలు జరిపారు. ఇంతలో అమెరికా అధ్యక్షుడిగా ట్రంప్ ప్రమాణస్వీకారం చేయడంతో పరిస్థితులు మారిపోయాయి.
అమెరికా వ్యవసాయ ఉత్పత్తులపై చైనా భారీగా సుంకాలను పెంచింది. సోయా, మొక్కజొన్న దిగుమతులపై 25 శాతం సుంకం విధించింది. మార్చి పది నుంచి పెంచిన సుంకాలు అమల్లోకి వస్తాయని చైనా తెలిపింది. వాణిజ్య యుద్ధానికైనా, ఏ యుద్దానికైనా సిద్ధమేనంటూ అమెరికాకు హెచ్చరికలు పంపింది. దీంతో అమెరికా, చైనాల మధ్య ట్రేడ్ వార్ ముదిరింది. ఇక ఉక్రెయిన్‌లో అరుదైన ఖనిజాల తవ్వకానికి అమెరికా తీవ్రంగా ప్రయత్నాలు ప్రారంభించింది. ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్‌స్కీతో జరిపిన చర్చలు విఫలం కావడంతో ఆదేశానికి ఆయుధసాయం నిలిపివేసింది. అమెరికా సుంకాల పెంపుపై పలు దేశాలు తీవ్రంగా స్పందిస్తున్నాయి. అమెరికా ఉత్పత్తులపై సుంకాలు పెంచి కెనడా ధీటుగా సమాధానం చెప్పింది.