ఖాతా తెరవకుండానే ఇంటి బాటపట్టిన పాకిస్తాన్
పాకిస్తాన్ ఆతిథ్యమిస్తున్న ఛాంపియన్స్ ట్రోఫీలో మరో మ్యాచ్ వర్షార్పణమైంది. నేడు రావల్పిండి వేదికగా పాకిస్తాన్, బంగ్లాదేశ్ మధ్య జరగాల్సిన మ్యాచ్ రద్దు అయింది. టాస్ కూడా వేయకుండానే మ్యాచ్ రద్దు అయినట్లు అంపైర్లు ప్రకటించారు. దీంతో గెలుపు ఖాతా తెరవకుండానే పాకిస్తాన్ ఇంటి బాటపట్టింది.
గురువారం ఉదయం నుంచి వాన కురవడంతో మైదానమంతా చిత్తడిగా మారింది. ఔట్‌ఫీల్డ్ మొత్తం జలమయం కావడంతో మ్యాచ్ నిర్వహణకు ప్రతికూలంగా తయారైంది. దీంతో టాస్ కూడా వేయకుండానే మ్యాచ్‌ను రద్దు చేయాల్సి వచ్చింది.
ఈ టోర్నీలో పాకిస్తాన్ తో పాటు, బంగ్లాదేశ్ జట్లు ఒక్క విజయం కూడా లేకుండానే ఇంటి బాటపట్టాల్సి వచ్చింది. గ్రూప్ ఎ విభాగం నుంచి భారత్, న్యూజీలాండ్ ఇప్పటికే సెమీస్‌కు చేరాయి.భారత్, కివీస్ మధ్య జరిగే పోరులో గెలిచిన జట్టు గ్రూప్-ఎలో టాప్ ప్లేస్ లో ఉంటుంది.
రావల్పిండిలో మంగళవారం కూడా వర్షం పడటంతో ఆస్ట్రేలియా, దక్షిణాఫ్రికా మధ్య జరగాల్సి మ్యాచ్ రద్దు అయింది.
గ్రూప్-బి విభాగంలోబుధవారం జరిగిన మ్యాచ్‌లో ఇంగ్లండ్‌పై అప్గనిస్తాన్ విజయం సాధించడంతో సెమీస్ రేసు క్లిష్టంగా మారింది. ఓటమితో ఇంగ్లండ్ టోర్నీ నుంచి వెనుదిరగగా సెమీస్ బెర్త్‌ల కోసం సౌతాఫ్రికా, ఆస్ట్రేలియా, అప్గనిస్తాన్ పోటీపడుతున్నాయి.
సౌతాఫ్రికా, ఆస్ట్రేలియా ఇప్పటి వరకు చెరో మ్యాచ్ గెలవగా ఈ రెండు జట్ల మధ్య జరగాల్సిన మ్యాచ్ వర్షం కారణంగా రద్దైంది. సౌతాఫ్రికా, ఆస్ట్రేలియా తొలి రెండు స్థానాల్లో ఉండగా అప్గనిస్తాన్ మూడో స్థానంలో ఉంది.
అప్గనిస్తాన్, ఆస్ట్రేలియా మధ్య గురువారం జరిగే మ్యాచ్ ఫలితంతో సెమీస్ రేసు పై స్పష్టత రానుంది. ఆస్ట్రేలియా గెలిస్తే సెమీస్ బెర్త్ ఖరారవుతుంది.అప్గనిస్తాన్ టోర్నీ నుంచి వెనుదిరుగుతుంది. అప్గనిస్తాన్ గెలిస్తే సెమీస్ కు అర్హత సాధిస్తుందిత. రెండో బెర్త్ మార్చి 1న సౌతాఫ్రికా, ఇంగ్లండ్ మ్యాచ్ ఫలితం ద్వారా తేలనుంది. సౌతాఫ్రికా గెలిస్తే రెండో సెమీస్ బెర్త్ కన్ఫామ్ అవుతుంది. ఇంగ్లండ్ గెలిస్తే సౌతాఫ్రికా, ఆస్ట్రేలియా జట్లలో మెరుగైన రన్ రేట్ జట్టు సెమీస్‌కు చేరుతుంది.