దేశ నిర్మాణంలో తొలి అడుగు ఓటవేయడేమనని భారత ఎన్నికల సంఘం నూతన సారథి జ్ఞానేశ్ కుమార్ అన్నారు. సీఈసీ గా రాజీవ్ కుమార్ మంగళవారం పదవీ విరమణ చేయడంతో కొత్త సీఈసీగా జ్ఞానేశ్ కుమార్ ఇవాళ బాధ్యతలు చేపట్టారు. ఈ సందర్భంగా మాట్లాడిన జ్ఞానేశ్ కుమార్18 సంవత్సరాలు నిండిన ప్రతి భారతీయ పౌరుడు ఓటరుగా మారాలని కోరారు. భారత ఎన్నికల సంఘం 26వ సారధిగా జ్ఞానేశ్ కుమార్ సేవలందించనున్నారు.
ఐఐటీ కాన్పూర్ నుంచి సివిల్ ఇంజినీరింగ్ లో పట్టభద్రుడైన జ్ఞానేశ్ కుమార్, ICFAI నుంచి బిజినెస్ ఫైనాన్స్ పట్టా అందుకున్నారు. హర్వార్డ్ వర్సిటీలో ఎన్విరాన్మెంటల్ ఎకనామిక్స్ చదివారు.
సీఈసీ, ఈసీ నియామకాలకు వ్యతిరేకంగా దాఖలైన పిటిషన్లపై నేడు సుప్రీంకోర్టులో విచారణ జరుగుతోంది. భారత ప్రధాన న్యాయమూర్తి(సీజేఐ)తో కూడిన ప్యానెల్ ద్వారా సీఈసీ, ఈసీల ఎంపిక, నియామకం జరగాలని 2023లో రాజ్యాంగ ధర్మాసనం తీర్పు చెప్పింది. ప్రభుత్వం అందుకు విరుద్ధంగా వ్యవహరిస్తోందంటూ సీజేఐని ప్యానెల్ నుంచి మినహాయించిందని ఓ ఎన్జీఓ పిటిషన్ వేశారు.పిటిషనర్ తరఫున న్యాయవాది ప్రశాంత్ భూషణ్ వాదనలు వినిపించారు.
సీఈసీ, ఈసీ నియామకాలను గతంలో ప్రధాని నేతృత్వంలోని కేంద్ర మంత్రి మండలి సిఫారసు మేరకు రాష్ట్రపతి నిర్ణయించేవారు. ఈసీల నియామకాలపై కొలీజియం వంటి వ్యవస్థ ఉండాలంటూ సుప్రీంకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యాలు దాఖలయ్యాయి. 2023, మార్చి 2న వీటిని విచారించిన అత్యున్నత న్యాయస్థానం, నియామకాలను ప్రధానమంత్రి, లోక్సభలో ప్రతిపక్ష నేత, సీజేఐ సభ్యులుగా ఉన్న కమిటీ సిఫారసులతో రాష్ట్రపతి నియమించాలని పేర్కొంది.
సుప్రీంకోర్టు తీర్పు చెప్పిన ఐదు నెలల్లోనే బీజేపీ ప్రభుత్వం ప్రధాన ఎన్నికల అధికారి, ఇతర ఎన్నికల కమిషనర్ల చట్టం- 2023 తీసుకొచ్చింది. సీఈసీ, ఈసీల నియామకాలను ప్రధాని, లోక్సభలో ప్రతిపక్ష నేత, కేబినెట్ మంత్రి సభ్యులుగా ఉన్న కమిటీ సిఫారసులతో రాష్ట్రపతి నియమించాల్సి ఉంది.