ముస్లిం బుజ్జగింపు రాజకీయాల్లో భాగంగా తెలంగాణలోని కాంగ్రెస్ ప్రభుత్వం తాజాగా ఓ ఉత్తర్వు జారీ చేసింది. దాని ప్రకారం మార్చి 2 నుంచి మొదలయ్యే రంజాన్ నెల అంతా అన్ని ప్రభుత్వ కార్యాలయాలు, పాఠశాలలు, ప్రభుత్వ రంగ సంస్థలలోని ముస్లిం ఉద్యోగులు తమ విధుల నుంచి ఒక గంట ముందుగా వెళ్ళిపోవచ్చు. ఆ మేరకు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పేరిట ఉత్తర్వులు జారీ అయ్యాయి.
తెలంగాణ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి జారీ చేసిన ఆదేశాల్లో ఈవిధంగా ఉంది. ‘‘తెలంగాణలోని ప్రభుత్వ ఉద్యోగులు, ఉపాధ్యాయులు, కాంట్రాక్టు ఉద్యోగులు, ఔట్సోర్సింగ్ ఉద్యోగులు, వివిధ బోర్డులు-కార్పొరేషన్లు-ప్రభుత్వ రంగ సంస్థలలోని ముస్లిములు రంజాన్ నెలలో ప్రార్థనలు చేసుకోడానికి వీలుగా సాయంత్రం 4గంటలకు విధుల నుంచి వెళ్ళడానికి ప్రభుత్వం అనుమతిస్తోంది. అత్యవసర సందర్భాలను మినహాయించి అందరు ముస్లిం ఉద్యోగులూ ఈ వెసులుబాటును వాడుకోవచ్చు.’’
రేవంత్రెడ్డి సర్కారు తీసుకున్న ఈ నిర్ణయం ప్రభుత్వ పక్షపాత ధోరణిని పట్టిస్తోంది. ఒక మతానికి చెందిన ప్రభుత్వోద్యోగులకు ప్రత్యేక సౌకర్యాలు కల్పిస్తుంటే, మిగిలిన మతాల వారికి వారి పండుగల సమయాల్లో అదే విధమైన సౌకర్యం ఎందుకు కల్పించరు? విజయదశమి పర్వదినాల్లో హిందువులను గంట ముందుగా వెళ్ళడానికి అనుమతిస్తారా? ఇప్పటివరకూ అలా చేయలేదు.
తెలంగాణలోని కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం పెద్ద చర్చకే దారితీసింది. కాంగ్రెస్ పార్టీ లౌకికవాదం ఎంపిక చేసిన కొన్ని మతాల వారికి మాత్రమే వర్తిస్తుంది, ఒక మతానికి అనుకూలంగా – మిగతా మతాల వారిని విస్మరించి విధానాలకు రూపకల్పన చేస్తారు. ఇదే రేవంత్ రెడ్డి ప్రభుత్వం హిందువుల పండుగల వేళ శాంతి భద్రతల సాకుతో హిందువుల ఊరేగింపులపై నియంత్రణలు, నిషేధాజ్ఞలూ విధిస్తూంటుంది. ఇప్పుడు మాత్రం ఒక మతపు వ్యక్తుల డిమాండ్లను నెరవేర్చడానికి తన పద్ధతి మార్చుకుంది.
కాంగ్రెస్ మైనారిటీల ఓట్ల కోసం మాత్రమే పాకులాడుతూంటుందన్న ఆరోపణలు నిజం అనడానికి ఎన్నో నిదర్శనాలు ఉన్నాయి. ఇప్పుడీ చర్యలు ఆ మాటలను నిజం చేస్తున్నాయి. కిందటేడాదే వినాయక చవితి. శ్రీరామ నవమి ఊరేగింపుల్లో భారీగా పోలీసులను మోహరించారు, హిందువుల ఊరేగింపులపై ఆంక్షలు విధించారు. అదే ప్రభుత్వం ఇప్పుడు మాత్రం ముస్లిములకు అపూర్వ అవకాశం ఇచ్చింది.