కలియుగ ప్రత్యక్ష దైవం వేంకటేశ్వరుడు కొలువైన తిరుపతిలో అంతర్జాతీయ దేవాలయాల సదస్సు, ప్రదర్శన నేటి నుంచి మూడు రోజుల పాటు జరగనుంది. ఇంటర్నేషనల్ టెంపుల్స్ కన్వెన్షన్ అండ్ ఎక్స్పో 2025 ఫిబ్రవరి 17, 18, 19 తేదీల్లో తిరుపతిలోని ఆశా కన్వెన్షన్స్‌లో జరుగుతుంది. ఆ కార్యక్రమాన్ని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్, గోవా ముఖ్యమంత్రి ప్రమోద్ సావంత్ ప్రారంభిస్తారు. ఇందులో భాగంగా గుడుల గురించి నిపుణులతో చర్చలు, వర్క్‌షాప్‌లు జరుగుతాయి.
ఐటీసీఈ కార్యక్రమాన్ని, ‘టెంపుల్ కనెక్ట్’ స్వచ్ఛంద సంస్థ వ్యవస్థాపకుడు గిరీష్ కులకర్ణి ప్రారంభించారు. అంత్యోదయ ప్రతిష్ఠాన్ నిర్వహణా సహకారం అందిస్తోంది. ఈ కార్యక్రమంలో ప్రపంచవ్యాప్తంగా దేవాలయాలను అనుసంధానం చేయడానికి, బలోపేతం చేయడానికి, నవీకరించడానికి గొప్ప వేదికను అందిస్తుంది. దాదాపు 58 దేశాల్లో సుమారు 1581 భక్తి సంస్థల భాగస్వామ్యంతో కార్యక్రమం జరగనుంది.
భారత దేశం భక్తి, ఆధ్యాత్మిక పర్యాటకానికి ప్రపంచ కేంద్రంగా ఉద్భవించినందున, వాటిని భవిష్యత్తుకు సిద్ధం చేయడానికి ఆలయ కార్యకలాపాలను నిర్వహించడం, శక్తివంతం చేయడం, క్రమబద్ధీకరించడం అవసరమని గిరీష్ కులకర్ణి సూచించారు. స్మార్ట్ మేనేజ్ మెంట్ వ్యూహాలను అమలు చేయడం ద్వారా, ఆధ్యాత్మికత, సంప్రదాయం, సమాజాభివృద్ధికి శక్తివంతమైన కేంద్రాలుగా ఉండేలా చూసుకోవచ్చని తెలిపారు.
ఐటీసీఎక్స్ చైర్మన్, మహారాష్ట్ర శాసనమండలి చీఫ్ విప్ ప్రసాద్ లాడ్ మాట్లాడుతూ దేవాలయాలు ప్రార్థనా స్థలాల కంటె గొప్పవనీ, అవి సాంస్కృతిక, ఆర్థిక శక్తి కేంద్రాలనీ స్పష్టం చేశారు. ప్రతీ ప్రార్థనా స్థలం ఎంత చిన్నదైనా, ఎంత దూరమైనా… వాటి మత, సాంస్కృతిక, ఆర్థిక ప్రాముఖ్యతను పెంచే ప్రపంచస్థాయి పాలన నమూనాలను పొందవచ్చని వివరించారు.
ఆలయాల వారసత్వాన్ని కాపాడుతూ సామర్థ్యాన్ని పెంచడానికి అవసమైన సాధనాలను ఐటీసీఎక్స్ నిర్వాహకులు, విధాన రూపకర్తలకు అందించనుంది. ఐటీసీఎక్స్ కో-క్యూరేటర్, ప్రముఖ వ్యాపారవేత్త మేఘా ఘోష్ మాట్లాడుతూ ఐటీసీఎక్స్ 2025 అభ్యాసం, సహకారాన్ని పెంచడానికి రూపొందించారని, అందులో మూడు దశలు ఉంటాయనీ ఆమె తెలిపారు.