అమెరికా పర్యటనలో ఉన్న ప్రధాని నరేంద్ర మోదీ, ఆ దేశ అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంఫ్ తో భేటీ అయ్యారు. ట్రంప్ అమెరికా అధ్యక్షుడిగా రెండోసారి బాధ్యతలు చేపట్టిన తర్వాత ఈ ఇద్దరి మధ్య భేటీ జరగడం ఇదే మొదటిసారి.
వాణిజ్యం, సుంకాలు, వలసలు, ఇరుదేశాల మధ్య ఇతర సంబంధాలపై ఇరువురి మధ్య ఈ సమావేశంలో చర్చ జరిగింది. మోదీ వెంట భారత విదేశాంగశాఖ మంత్రి జైశంకర్, జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్ ఉన్నారు.
శ్వేతసౌధంలో మళ్లీ ట్రంప్ ను చూడటం ఆనందంగా ఉందన్న మోదీ, భారతీయుల తరఫున ఆయనకు శుభాకాంక్షలు తెలిపారు. భారత్-అమెరికా వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని మరింత ముందుకు తీసుకెళ్తామన్నారు.
భారత్‌కు నరేంద్ర మోదీ లాంటి నేత ఉండటం గర్వకారణమన్న డోనాల్డ్ ట్రంప్ , తమస్నేహాన్ని రానున్న నాలుగేళ్లు కొనసాగిస్తామన్నారు. తాము ఎవరినీ ఓడించాలనుకోవడం లేదన్న ట్రంప్ , అమెరికా ప్రజల కోసం అద్భుతంగా పని చేస్తామన్నారు. భారత్ తో స్నేహం విషయంలో ఎలాంటి మార్పు ఉండదన్నారు.
అమెరికా పర్యటనలో భాగంగా పలువురు ప్రముఖలతో మోదీ సమావేశం అవుతున్నారు. టెస్లా సీఈఓ ఎలాన్ మస్క్‌తో వాషింగ్టన్ డీసీలో మోదీ భేటీ అయ్యారు. స్పేస్, మొబిలిటీ, టెక్నాలజీ, ఇన్నోవేషన్ అంశాలపై ఇద్దరి మధ్య చర్చలు జరిగాయి.