ఛత్తీస్గఢ్ బీజాపూర్ జిల్లాలో భారీ ఎన్కౌంటర్ చోటు చేసుకుంది. మావోయిస్టుల కోసం గాలిస్తోన్న బలగాలపైకి కాల్పులకు తెగబడటంతో బలగాలు జరిపిన ఎదురు కాల్పుల్లో 31 మంది మావోయిస్టులు చనిపోయినట్లు డీఆర్జీ అధికారి తెలిపారు. నేషనల్ పార్క్లో ఈ ఎన్కౌంటర్ జరిగింది. డీఆర్జి, ఏస్టీఎఫ్ దళాలకు మావోయిస్టులు మధ్య కాల్పులు కొనసాగుతున్నాయి.
కేంద్ర హోం మంత్రి అమిత్ షా చెప్పినట్లు 2026 నాటికి మావోయిస్టులు లేని భారత్ ఆవిష్కృతమవుతుందన్నారు. అందుకు అనుగుణంగా మావోయిస్టుల ప్రభావిత రాష్ట్రాల్లో కేంద్ర బలగాలు ముమ్మరంగా గాలింపు చర్యలు చేపడుతున్నాయి. ఛత్తీస్గఢ్, జార్ఖండ్, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్ రాష్ట్రాల్లో 36 కంపెనీల బలగాలు, స్థానిక పోలీసుల సాయంతో డీఆర్జీ, ఎస్టీఎఫ్ సైనికులు మావోయిస్టుల ఏరివేత చేపట్టిన సంగతి తెలిసిందే.
గడచిన ఆరు మాసాల్లోనే 14 ఎన్కౌంటర్లు జరిగాయి. 216 మంది మావోయిస్టులు మృతి చెందారు. ఇంకా 250 మంది వరకూ మావోయిస్టులు ఉండే అవకాశముందని అంచనా. మావోయిస్టులు కీలక నేతలను కూడా కోల్పోయారు. ఆధునిక సాంకేతిక సమాచారంతో బలగాలు మావోయిస్టుల ఏరివేతను విజయవంతంగా ముందుకు తీసుకెళుతున్నాయి.