ఎన్నికల ప్రచారంలో అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఇచ్చిన హామీలు అమల్లో పెట్టారు. అన్ని వస్తువులు దేశంలోనే తయారు చేయాలని, అమెరికన్లకు ఉద్యోగ అవకాశాలు రావాలంటూ విదేశీ వస్తువుల దిగుమతులపై భారీగా సుంకాలను పెంచారు. కెనడా, మెక్సోకోల నుంచి దిగుమతులపై 25 శాతం సుంకం పెంచారు. ఇక చైనా నుంచి దిగుమతులపై 10 శాతం పెంచారు. సుంకాలు పెంచిన ఫైలుపై ట్రంప్ సంతకం చేశారు. సుంకాల పెంపు వెంటనే అమల్లోకి వచ్చింది.
వలసదారుల కారణంగా అమెరికా మాదకద్రవ్యాల భారిన పడిందని ట్రంప్ ఆందోళన వ్యక్తం చేశారు. తమ దేశాన్ని, తమ పౌరులను రక్షించుకునే బాధ్యత తమపై ఉందన్నారు. డ్రగ్స్ కారణంగా ఏటా 2 లక్షల మంది చనిపోతున్నారని, నేరాలు పెరిగాయని ఇటీవల ట్రంప్ వ్యాఖ్యానించారు. విదేశాల నుంచి దిగుమతులపై భారీగా సుంకాలు పెంచుతానంటూ ఇచ్చిన హామీని నిలబెట్టుకున్నారు. అయితే సుంకాలు పెంచిన దేశాల జాబితాలో ప్రస్తుతానికి భారత్‌ను చేర్చలేదు.