తోలు పరిశ్రమ, బొమ్మల తయారీ రంగానికి ప్రోత్సాహం
కేంద్ర బడ్జెట్-2025లో షెడ్యూల్ కులాలు, తెగల మహిళలకు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ శుభవార్త చెప్పారు. ఎస్సీ, ఎస్టీ మహిళల కోసం టర్మ్ లోన్ పథకాన్ని ప్రవేశపెట్టనున్నట్లు తెలిపారు. ఈ పథకంలో భాగంగా వచ్చే ఐదేళ్లలో రూ. 2కోట్ల వరకు రుణాలు అందించనున్నారు.
ఈ పథకం ద్వారా మొత్తం 5 లక్షల మందికి మేలు జరగనున్నట్లు మంత్రి వివరించారు. కొత్త వ్యాపారాలు, విస్తరణకు ఈ పథకం దోహదపడనుంది. ఈ పథకం కింద ఎస్సీ, ఎస్టీ వర్గాలకు చెందిన వారికి ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పిస్తామని నిర్మలా సీతారామన్ బడ్జెట్ ప్రసంగంలో తెలిపారు.
చెప్పులు, తోలు పరిశ్రమకు మద్ధతు ఇచ్చే ప్రక్రియలో భాగంగా కేంద్రీకృత ఉత్పత్తుల పథకాన్ని కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తుందని ఆర్థికమంత్రి వెల్లడించారు. పాదరక్షలు, తోలు పరిశ్రమలో ఉత్పాదకత, నాణ్యత, పోటీతత్వాన్ని పెంపొందించవచ్చని చెప్పారు. ఈ పథకం ద్వారా 22 లక్షల మందికి ఉపాధి అవకాశాలు దొరుకుతాయన్నారు. రూ.400 కోట్లకుపైగా ఆదాయం, రూ.11 లక్షల కోట్లకుపైగా ఎగుమతులు జరుగుతాయని అంచనా వేశారు. బొమ్మల తయారీ రంగాన్ని ప్రోత్సహిస్తామని ఆర్థికమంత్రి చెప్పారు.