కేంద్ర బడ్జెట్ మధ్యతరగతికి ఊహించని ఊరట కల్పించింది. ఇవాళ పార్లమెంటులో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ 2025-26 బడ్జెట్ (Union Budget 20245-26) ప్రవేశపెట్టారు. మధ్యతరగతి, వేతన జీవులకు భారీ ఊరటనిచ్చే శుభవార్త ప్రకటించారు. రూ.12 లక్షల వరకు ఆదాయపన్ను మినహాయింపు ఇచ్చారు. స్లాబులను మార్చారు. రూ. 4లక్షల వరకు నిల్, రూ.4 నుంచి రూ.8 లక్షల వరకు 5 శాతం, రూ.12 లక్షల వరకు 10 శాతం, రూ.12 నుంచి 16 లక్షల వరకు 15 శాతం, రూ.16 నుంచి 20 లక్షల వరకు 20 శాతం, రూ. 20 లక్షల నుంచి రూ.24 లక్షల ఆదాయం దాటిన వారిపై 25 శాతం పన్ను విధించారు. రూ.24 లక్షల ఆదాయం దాటిన వారిపై 30 శాతం పన్ను వేయనున్నారు.
బడ్జెట్ విశేషాలు
కేంద్రబడ్జెట్లో కొత్త పథకాలకు రూ.10 లక్షల కోట్లు ప్రకటించారు. ముఖ్యంగా మధ్యతరహా పరిశ్రమలకు వరాల జల్లు కురిపించారు. ఒక్కో ఎంఎస్ఎంఈకి రూ.10 కోట్ల వరకు రుణాలు ఇవ్వాలని నిర్ణయించారు. తయారీ రంగానికి భారత్‌ను హబ్‌గా మార్చాలని భావిస్తున్నట్లు ప్రకటించారు. కోటి మంది గిగ్ వర్కర్లకు బీమా సదుపాయం కల్పించారు.
రైతులకు ఇప్పటి వరకు రూ.3 లక్షల వరకు రుణాలు తీసుకునే సదుపాయం ఉంది. తాజాగా కిసాన్ క్రెడిట్ కార్డు పరిమితిని రూ.5 లక్షలకు పెంచారు. ఈ ఏడాది అధికదిగుబడులిచ్చే 100 నూతన వంగడాలను విడుదల చేయనున్నారు. పప్పు దినుసుల పంటల్లో స్వయం సమృద్ధి సాధించే దిశగా మిషన్ ఏర్పాటు చేయనున్నారు.
రాష్ట్రాలకు కేంద్ర బడ్జెట్ ఊరట నిచ్చింది. రాష్ట్రాలకు 50 ఏళ్లకు వడ్డీలేని లక్షన్నర కోట్ల రుణం ఇవ్వడానికి బడ్జెట్ ఆమోదం తెలిపింది. మూలధన వ్యయం చేసేందుకు మాత్రమే వడ్డీలేని రుణాలు ఇవ్వనున్నారు. దేశంలో 40 వేల మధ్యతరగతి వారికి ఇళ్లు నిర్మించనున్నారు. 3 కోట్ల మంది పేదలకు పీఎం ఆవాస్ యోజన కింద సాయం అందించనున్నారు.
నేషనల్ మారిటైమ్ ఫండ్ కోసం రూ.25 వేల కోట్లు కేటాయించారు. పెట్టుబడుల ఉపసంహరణ కొనసాగనుంది. బీమా రంగంలో నూరు శాతం విదేశీ పెట్టుబడులను అనుమతిస్తారు. కొత్త ఐటీ చట్టం వారంలో అందుబాటులోకి రానుంది. రూ.6 లక్షల వరకు అద్దె ఆదాయంపై టీడీఎస్ మినహాయింపునిచ్చారు.
దేశంలో కొత్తగా యూరియా తయారీ పరిశ్రమలు నెలకొల్పి, ఈ రంగంలో స్వయం సమృద్ధి సాధించాలని నిర్ణయించారు. అణురంగంలో ప్రైవేటు పెట్టుబడులను ప్రోత్సహించాలని నిర్ణయించారు. మౌలిక సదుపాయాల వృద్ధికి రూ.4 లక్షల కోట్లు వ్యయం చేయనున్నారు.
మరో ఏడాదిలో బిహార్ ఎన్నికల నేపథ్యంలో ఆ రాష్ట్రానికి వరాల జల్లు కురిపించారు. మఖాన్ బోర్డు ఏర్పాటు చేయనున్నారు. దీని ద్వారా రైతులకు ప్రయోజనం దక్కనుంది. కోసి కెనాల్ ఏర్పాటుకు కేంద్రం సాయం చేయనుంది. పాట్నా ఐఐటి అభివృద్ధికి ప్రత్యేక నిధులు కేటాయించనున్నారు. బిహార్‌లో ఒక అంతర్జాతీయ గ్రీన్ ఫీల్డ్ ఎయిర్‌పోర్టు రానుంది.
ఏడాది కాలంలో కొత్తగా 75 వేల మెడికల్ సీట్లు అందుబాటులోకి రానున్నాయి. ప్రతి ఇంటికి స్వచ్ఛమైన తాగునీరు అందించేందుకు 2028 వరకు జల్ జీవన్ పథకాన్ని పొడగించనున్నారు. ఉడాన్ పథకం ద్వారా 125 రూట్లలో 4 కోట్ల మందికి ప్రయోజనం కల్పించనున్నారు.
కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలాసీతారామన్ ప్రవేశపెట్టిన బడ్జెట్‌కు పార్లమెంట్ ఆమోదం తెలిపింది. బడ్జెట్ సమావేశాలను స్పీకర్ ఓం బిర్లా రేపటికి వాయిదా వేశారు.