ఆన్‌లైన్ గేమ్స్ వద్దన్నందుకు అమ్మనే చంపేశాడు ఓ శాడిస్టు కుమారుడు. ఈ ఘటన విశాఖ నగరంలో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.
బల్బీర్ సింగ్ విశాఖ నేవీలో విధులు నిర్వహిస్తున్నారు. ఆయన కుటుంబం నేవీ క్వార్టర్స్‌లో నివాసం ఉంటోంది. బల్బీర్ సింగ్‌కు భార్య అల్కాసింగ్, కుమారులు అన్‌మోల్ సింగ్,ఆయుష్మాన్ సింగ్ ఉన్నారు. పెద్ద కుమారుడు అన్‌మోల్ సింగ్ హైదరాబాదులో బీ.టెక్ మూడో సంవత్సరం చదువుతున్నారు. ఇటీవల సెలవులు రావడంతో ఇంటి వద్దనే ఉంటున్నాడు. రోజూ గంటల కొద్దీ ఆన్‌లైన్ గేమ్స్ ఆడుతున్నాడని తల్లి అల్కాసింగ్ ల్యాప్ ట్యాప్, ఫోన్ స్వాధీనం చేసుకుంది.
నిన్న సాయంత్రం ఫోన్ ఇవ్వాలంటూ అన్‌మోల్ సింగ్ తల్లితో గొడవపడ్డాడు. అయినా ఆమె ఇవ్వకపోవడంతో ఇంట్లోని కత్తితో విచక్షణా రహితంగా పొడిచి చంపాడు. తల్లిని బెడ్ రూములో ఉంచి తాళం వేశాడు. బయటకు వెళ్లివచ్చిన తమ్ముడు తల్లి గురించి అడగ్గా అన్‌మోల్ సింగ్ ఆందోళనకు గురయ్యాడు. అనుమానం రావడంతో ఆయుష్మాన్ సింగ్ ఇరుగుపొరుగువారిని పిలుచుకు వచ్చాడు. గది తలుపులు తెరచి చూడగా తల్లి చనిపోయిఉంది. ఆయుష్మాన్ సింగ్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు.