ప్రపంచంలోనే అతిపెద్ద ధార్మిక కార్యక్రమంగా జరుగుతున్న మహాకుంభమేళాలో మౌని అమావాస్య నాడు జరిగిన తొక్కిసలాట ఘటనపై ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం విచారణకు ఆదేశించింది. ముగ్గురు సభ్యుల జ్యుడీషియల్ కమిషన్‌ను ఏర్పాటు చేసింది. ఆ దుర్ఘటన గురించి నిన్న రోజంతా ఎన్నో సమావేశాలు నిర్వహించామని, అధికారులకు నిరంతరం సమాచారం అందిస్తూ ఉన్నామనీ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ చెప్పారు.
‘‘జస్టిస్ హర్షకుమార్ జ్యుడీషియల్ కమిషన్‌కు నాయకత్వం వహిస్తారు. మాజీ డీజీపీ వీకే గుప్తా, మాజీ ఐఏఎస్ అధికారి డీకే సింగ్ సభ్యులుగా ఉంటారు. దుర్ఘటన జరిగినప్పటి నుంచీ సీఎం, సీఎస్, డీజీపీ కంట్రోల్ రూంల నుంచి మేము నిరంతరాయంగా పర్యవేక్షిస్తూ ఉన్నాము. రోజంతా చర్చలు నిరంతరాయంగా కొనసాగాయి. సమాచార వినిమయం కొనసాగింది. ప్రధానమంత్రి, కేంద్ర హోంమంత్రి, రైల్వే మంత్రి, మా పార్టీ జాతీయ అధ్యక్షుడు, తదితరుల నుంచి ఎప్పటికప్పుడు అవసరమైన మార్గదర్శకాలు వచ్చాయి’’ అని యోగి వివరించారు.
తొక్కిసలాటలో మరణించిన వారి కుటుంబాలకు ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ రూ.25 లక్షల పరిహారం ప్రకటించారు. ‘‘ఈ మత్తం వ్యవహారంపై జ్యుడీషియల్ కమిషన్ దర్యాప్తు చేస్తుంది, నిర్దిష్ట కాలావధి లోపు తమ నివేదికను రాష్ట్ర ప్రభుత్వానికి అందజేస్తుంది. ఈ విషయంలో అవసరమైతే రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, డీజీపీ ప్రయాగరాజ్ వెడతారు’’ అని యోగి చెప్పారు.