ఇన్ఫోసిస్ సహ వ్యవస్థాపకుడు క్రిస్ గోపాలకృష్ణన్, బెంగళూరులోని ఐఐఎస్‌సి మాజీ డైరెక్టర్ బలరామ్, మరో 16 మంది మీద ఎస్సీ ఎస్టీ అత్యాచార నిరోధక చట్టం ప్రకారం కేసు నమోదయింది. కర్ణాటక రాజధాని బెంగళూరులోని 71వ సివిల్ అండ్ సెషన్స్ కోర్టు ఆదేశాల మేరకు ఆ కేసు నమోదు చేసారు.
బెంగళూరు ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ సైన్సెస్ (ఐఐఎస్‌సి)లోని సెంటర్ ఫర్ సస్టెయినబుల్ టెక్నాలజీ కేంద్రంలో ఫ్యాకల్టీ మెంబర్‌గా పనిచేసిన దుర్గప్ప అనే వ్యక్తి ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా ఆ కేసు నమోదయింది. దుర్గప్ప బోవి అనే గిరిజన కులానికి చెందినవారు. తనను 2014లో ఒక తప్పుడు హనీట్రాప్ కేసులో ఇరికించారని, దానివల్ల ఐఐఎస్‌సి బెంగళూరులో తన ఉద్యోగం పోయిందని ఆరోపించారు.
దుర్గప్ప ఫిర్యాదులో ఇన్ఫోసిస్ సహవ్యవస్థాపకుడు, ఐఐఎస్‌సీ ధర్మకర్తల మండలి సభ్యుడు అయిన క్రిస్ గోపాలకృష్ణన్, ఐఐఎస్‌సీ డైరెక్టర్ గోవిందన్ రంగరాజన్, ఇంకా పలువురు ఫ్యాకల్టీ సభ్యులపై ఆరోపణలు చేసారు. క్రిస్ గోపాలకృష్ణన్ గతంలో ఇన్ఫోసిస్ సీఈఓగా పనిచేసారు, కాన్ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఇండస్ట్రీస్ (సీఐఐ) మాజీ అధ్యక్షుడు, పద్మభూషణ్ పురస్కార గ్రహీత.
క్రిస్ గోపాలకృష్ణన్ సహా నిందితులందరూ తమ అధికారాన్ని, స్థాయిని దుర్వినియోగం చేసి తనపై తప్పుడు ఆరోపణలు చేసారని, తప్పుడు కేసులో తనను ఇరికించారని, తద్వారా ఐఐఎస్‌సీ నుంచి తనను తొలగించారనీ దుర్గప్ప తన ఫిర్యాదులో ఆరోపించారు.