అమెరికా సంయుక్త రాష్ట్రాల 47వ అధ్యక్షుడిగా ప్రమాణం చేసిన కేవలం ఆరు రోజుల తర్వాత డొనాల్డ్ ట్రంప్, బంగ్లాదేశ్‌లో అమెరికా కార్యకలాపాలు అన్నింటినీ నిలిపివేస్తూ ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ జారీ చేసారు. గత శుక్రవారం విడుదలైన ఆ ఉత్తర్వు పర్యవసానంగా బంగ్లాదేశ్‌లో అన్ని కాంట్రాక్టులు, గ్రాంటులు, సహాయక కార్యక్రమాలను తక్షణం నిలిపివేయాలంటూ యునైటెడ్ స్టేట్స్ ఏజెన్సీ ఫర్ ఇంటర్నేషనల్ డెవలప్‌మెంట్ (USAID) సంస్థ తమ భాగస్వామి సంస్థలకు జనవరి 25న లిఖితపూర్వకంగా తెలియజేసింది.
రోహింగ్యా సంక్షోభాన్ని ఎదుర్కోడానికి బంగ్లాదేశ్‌కు మానవతా సహాయం పేరిట భారీయెత్తున సహకరించిన దేశం అమెరికాయే. 2017 నుంచీ సుమారు 2.4 బిలియన్ డాలర్ల మొత్తాన్ని విరాళంగా అందజేసింది. అలాంటి సహాయ కార్యక్రమాలను ఉన్నవి ఉన్నట్లుగా నిలిపివేయడం బంగ్లాదేశ్ ప్రస్తుత ప్రభుత్వానికి తీవ్ర శరాఘాతమే. మొహమ్మద్ యూనుస్ నేతృత్వంలోని బంగ్లాదేశ్ ఇప్పటికే తీవ్రమైన ఆర్థిక కొరతతో అవస్థలు పడుతోంది.
అమెరికా కొత్త ప్రభుత్వం తీసుకున్న ఈ చర్య విదేశాలకు నిధుల కేటాయింపులపై జరిపిన విస్తృత సమీక్ష ఫలితంగా తీసుకున్న నిర్ణయమని తెలుస్తోంది. ఆ సమీక్ష తర్వాత అమెరికా ప్రభుత్వం ‘స్టాప్ వర్క్’ అంటూ సమగ్ర ఆదేశాలు జారీ చేసింది. అమెరికా విదేశాంగ శాఖలోని ఫారిన్ అసిస్టెన్స్ కార్యాలయం ఆ ఆదేశాలకు ముసాయిదా తయారు చేయగా విదేశాంగ మంత్రి మార్కో రూబియో ఆమోదముద్ర వేసారు. దాని ప్రకారం ఇజ్రాయెల్, ఈజిప్టు దేశాలకు మిలటరీ ఫైనాన్సింగ్ మినహా మిగతా అన్ని దేశాలకూ ఆర్థిక సహకారాన్ని తక్షణమే నిలిపివేసారు. ఇంతకీ ఈ నిర్ణయం తీసుకోడానికి నిర్దిష్టమైన కారణమేమీ వెల్లడించలేదు.
జనవరి 20న ట్రంప్ అధ్యక్ష బాధ్యతలు స్వీకరించగానే విదేశాలకు అభివృద్ధి పేరిట చేస్తున్న సాయంపై 90 రోజుల మారటోరియం విధించారు. ఆ అభివృద్ధి సహాయం పథకం సమర్ధత, తన విధానాలకు అది అనుకూలంగా ఉందా లేదా అన్న విషయాలపై ట్రంప్ ఇంకా సమీక్ష జరపాల్సి ఉంది.
ఈ ఆదేశం ఫలితంగా పలు దేశాలకు వందల కోట్ల డాలర్ల సహాయం నిలిచిపోతుంది. ఒక్క 2023లోనే అమెరికా 7వేల 2వందల కోట్ల డాలర్ల సాయం అందించింది. అయితే ఈ సమయంలో ఈ ఆర్థిక సహాయం నిలుపుదల అనే చర్య బంగ్లాదేశ్‌ను చావుదెబ్బ తీసింది.