దేశీయ స్టాక్ మార్కెట్లు మరోసారి భారీ నష్టాలను చవిచూశాయి. అంతర్జాతీయగా అందిన ప్రతికూల సంకేతాలు, త్రైమాసిక ఫలితాలు నిరాశకు గురిచేయడం, అమెరికాలో ట్రంప్ ప్రభుత్వం తీసుకుంటోన్న నిర్ణయాలతో విదేశీ పెట్టుబడిదారులు పెద్ద ఎత్తున స్టాక్స్ అమ్మకాలకు దిగారు. దీంతో దేశీయ స్టాక్ మార్కెట్లో ఒక్క రోజే రూ.10 లక్షల కోట్ల సంపదను కోల్పోయాయి. అటు ఆసియా, ఐరోపా మార్కెట్లు కూడా భారీ పతనాలను చవిచూశాయి.
సెన్సెక్స్ ఉదయం 75700 పాయింట్ల వద్ద లాభాలతో మొదలైంది. చివరకు 824 పాయింట్లు కోల్పోయి 75366 వద్ద ముగిసింది. నిఫ్టీ 263 పాయింట్లు కోల్పోయింది. 22829 పాయింట్ల వద్ద స్థిరపడింది. రూపాయి మరింత బలహీన పడింది. అమెరికా డాలరుతో రూపాయి విలువ 86.33కు పడిపోయింది.
సెన్సెక్స్ 30 ఇండెక్సులో జొమాటో, పవర్ గ్రిడ్ కార్పొరేషన్, టాటా మోటార్స్, టెక్ మహీంద్రా, హెచ్‌సిఎల్ నష్టాల్లో ముగిశాయి. హిందూస్థాన్ యూనిలీవర్, ఐసీఐసీఐ బ్యాంక్, మహీంద్రా అండ్ మహీంద్రా, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, మారుతీ సుజుకీ షేర్లు లాభాలు ఆర్జించాయి.
అంతర్జాతీయ మార్కెట్లో ముడిచమురు ధరలు పరుగులు పెడుతున్నాయి. బ్యారెల్ క్రూడాయిల్ 78.74 డాలర్లుకు పెరిగింది. బంగారం ధర స్వల్పంగా తగ్గింది. ఔన్సు స్వచ్ఛమైన బంగారం 5 డాలర్లు తగ్గి 2769 వద్ద ట్రేడవుతోంది. కిలో వెండి రూ.94 వేలకు దిగివచ్చింది.