పేదలకు మూడు సెంట్ల ఇంటి స్థలం : మార్గదర్శకాలు విడుదలదారిద్ర రేఖకు దిగువనున్న పేదలకు ఉచితంగా ఇంటి స్థలాలు ఇవ్వాలని కూటమి ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. గ్రామాల్లో అయితే 3 సెంట్లు, పట్టణాల్లో అయితే 2 సెంట్లు ఉచితంగా ఇవ్వాలని నిర్ణయించింది. ఇంత వరకు ప్రభుత్వం నుంచి ఇంటి స్థలం, గృహనిర్మాణానికి సహాయం పొందని వారు ఈ పథకానికి అర్హులు.
పదేళ్లపాటు లబ్దిదారుడికి కన్వేయన్స్ డీడ్ ఇస్తారు. స్థలం పొందిన లబ్దిదారులు రెండేళ్లలో ఇళ్లు నిర్మించాలి. పదేళ్ల తరవాత హక్కులు కల్పిస్తారు. ఉచిత ఇంటి స్థలం పొందాలనుకునే వారు కేంద్ర ప్రభుత్వం నుంచి కూడా గృహ నిర్మాణానికి ప్రయోజనం పొంది ఉండరాదనే నిబంధన చేర్చారు. ఇందుకు సంబంధించిన మార్గదర్శకాలను ప్రభుత్వం విడుదల చేసింది. అర్హతలు ఉన్న వారు గ్రామ సచివాలయాలు, వార్డు సచివాలయాల్లో దరఖాస్తులు పెట్టుకోవచ్చని మంత్రి అనగాని సత్యప్రసాద్ వెల్లడించారు.
రాష్ట్ర వ్యాప్తంగా వచ్చిన దరఖాస్తుల పరిశీలనకు కమిటీని నియమించారు. పేదలకు మాత్రమే ఇంటి స్థలాలు ఇవ్వాలని నిర్ణయించారు. స్థలం పొందిన వారికి తరవాత దశలో ఇంటి నిర్మాణానికి కూడా ప్రభుత్వం సాయం చేయనుంది.