దేశంలో మొదటిసారిగా ఉత్తరాఖండ్లో ఉమ్మడి పౌరస్మృతి అమల్లోకి వచ్చింది. సోమవారం నుంచి ఉత్తరాఖండ్లో యూసీసీ అమల్లోకి వస్తోందని సీఎం పుష్కర్ సింగ్ ధామి ప్రకటించారు. దీని ద్వారా చాలా విషయాల్లో ఏకరూకత వస్తుందని వ్యాఖ్యానించారు. యూసీసీ ద్వారా పౌరులందరికీ సమానమైన హక్కులు దక్కేలా చూస్తామని ధామి స్పష్టం చేశారు.
యూసీసీ అమలు ద్వారా వివాహం, విడాకులు, ఆస్తి వీలునామా, ఆస్తుల వారసత్వంలాంటి అంశాల్లో సమానత్వం వస్తుంది. మతాలతో సంబంధం లేకుండా అందరికీ ఒకే చట్టం వర్తిస్తుంది. ఇందుకు అధికారులకు అవసరమైన శిక్షణ పూర్తి చేసినట్లు సీఎం ధామీ వెల్లడించారు. యూసీసీ ద్వారా సహజీవనం చేసే వారు కూడా
తప్పనిసరిగా రిజిస్ట్రేషన్ చేయించుకోవాల్సి ఉంటుంది. ఇందుకు ప్రభుత్వం ప్రత్యేక విభాగాన్ని ఏర్పాటు చేసింది.
యూసీసీ అమలు ద్వారా హలాల్ విధానంపై నిషేధం అమల్లోకి వచ్చింది. వివాహ వయస్సు అన్ని మతాల వారికి ఒకే విధంగా ఉంటుంది. బహుభార్యత్వం నిషేధం అమల్లోకి తీసుకువచ్చారు.
యూసీసీ ముసాయిదా తయారీకి ఉత్తరాఖండ్ పెద్ద కసరత్తు చేసింది. సుప్రీంకోర్టు విశ్రాంత న్యాయమూర్తి జస్టిస్ రంజనా ప్రకాశ్ దేశాయ్ నేతృత్వంలో నిపుణుల కమిటీని ఏర్పాటు చేసింది. ఏడాదిన్నర పాటు అధ్యయనం చేసిన తరవాత ముసాయిదా బిల్లు తయారు చేశారు. 2024 ఫిబ్రవరిలో కమిటీ ముసాయిదాను రాష్ట్ర ప్రభుత్వానికి సమర్పించింది. ఈ బిల్లు 2024 ఫిబ్రవరి 7న అసెంబ్లీ ఆమోదం పొందింది. తరవాత నెల రోజులకు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆమోద ముద్ర వేశారు. అది నేటి నుంచి అమల్లోకి వచ్చింది.